సమీక్షణం: సాఫల్య జీవన దృశ్యాలు | Funday Review of the Week | Sakshi
Sakshi News home page

సమీక్షణం: సాఫల్య జీవన దృశ్యాలు

Published Sun, Feb 9 2014 3:33 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి ఫన్‌డేలో ‘రాలిన మొగ్గలు’ పేర ధారావాహికంగా ప్రచురింపబడిన యాభై రెండు జీవితాల చెరగని ముద్రలు ఈ వ్యాసాలు. జీవితం ఎంత చిన్నదైనా దానికొక అర్థం, పరమార్థం, లక్ష్యం ఉన్నవాళ్లు మరణానంతరం కూడా జీవిస్తారు.

పుస్తకం    :    చెరగని ముద్రలు (వ్యాసాలు)
 రచన    :    ఆకెళ్ల రాఘవేంద్ర
 పేజీలు: 168 (హార్డ్‌బౌండ్); వెల: 249
 ప్రతులకు: నవోదయా, ఇతర ప్రధాన పుస్తకకేంద్రాలు

 
విషయం    :    సాక్షి ఫన్‌డేలో ‘రాలిన మొగ్గలు’ పేర ధారావాహికంగా ప్రచురింపబడిన యాభై రెండు జీవితాల చెరగని ముద్రలు ఈ వ్యాసాలు. జీవితం ఎంత చిన్నదైనా దానికొక అర్థం, పరమార్థం, లక్ష్యం ఉన్నవాళ్లు మరణానంతరం కూడా జీవిస్తారు. ఈ సంపుటిలో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచంలో జీవితాన్ని ఆదర్శవంతంగా, స్ఫూర్తిప్రదాయకంగా గడిపినవారి జీవన దృశ్యాలు కనిపిస్తయి. సాహిత్యం, సంగీతం, చిత్రకళ నటనా రంగాలకు చెందినవారితో పాటు, సుప్రసిద్ధులైన ఆధ్యాత్మిక, తాత్విక వేత్తలు, చారిత్రక వ్యక్తులు, దేశభక్తులు ఈ సంపుటిలో ఉన్నారు. పదహారు సంవత్సరాల వయసులోనే ఈ విశ్వం మీద చెరగని సంతకం చేసి వెళ్లిపోయిన జోన్ ఆఫ్ ఆర్క్, యాన్ ఫ్రాంక్‌లతో పాటు మనకు పేర్లు మాత్రమే తెలిసిన ధన్యజీవుల జీవన గమనాన్ని చదువుతూ మన జీవితాన్ని యే విధంగా ఉపయోగిస్తున్నామని ప్రశ్నించుకుంటాం. ప్రతి వ్యాసంలో ఒక రాలిన మొగ్గ ఫొటో, ఆ వ్యక్తి గడిపిన కాలం, భౌతికంగా మరణించిన వయసుతో పాటు, పరిచయం, ప్రభావం, ఘనత, వేషభాషలు తెలిపే సంక్షిప్త వ్యాసాలున్నాయి. కవయిత్రి తోరుదత్ జీవితం ‘ముహుర్తా జ్వలితం శ్రేయో, నతు ధూమాయితం చిరం’ (పే.73)తో మొదలైతే, విప్లవ వనిత ప్రీతిలత వడేదార్ జీవితం క్లైమాక్స్‌తో మొదలవుతుంది.
 
  స్వామి వివేకానంద జీవిత చిత్రం ‘స్వామీ! ఈ దేశంలోని యువతీ యువకుల కండరాల్లోని ప్రతి కణంలోనూ నీ దేహపు ప్రత్యణువునీ ప్రవహించనీ. నిప్పుకణికలై ప్రజ్వరిల్లనీ’ (పే.38) అనే వాక్యాలతో పూర్తయితే, ఇరవై నాలుగేళ్ల వయసులో ఉరితీయబడ్డ భగత్‌సింగ్ జీవితం ‘ఈ వయసువాళ్లు ఈనాడు ఏం చేస్తున్నారు?’ అన్న వాక్యంతో పూర్తవుతుంది. వైవిధ్యం ఉన్న ప్రారంభం, ముగింపుల మధ్య ఆయా జీవితాలలో మలుపులు, సంఘటనలు వివరించిన విధానం ఆసక్తిని, కుతూహలాన్ని కలిగిస్తుంది.
 - చింతపట్ల సుదర్శన్
 
 
 కథకుడు చెప్పిన చరిత్ర
 పుస్తకం    :    తొలి తెలుగు శాసనం
 రచన    :    డా. వేంపల్లి గంగాధర్
 విషయం    :    తెలుగు భాష ప్రాచీనతను తెలియచేసే శాసనం కాబట్టి ఒక కథా రచయితను ఈ అంశం ఆకర్షించి ఉంటుందని ఈ పుస్తకం చూడగానే అనిపిస్తుంది. కానీ పుస్తకం తెరిచిన తరువాత చెప్పదలుచుకున్న ప్రతి అంశం మనకి కూడా ఆసక్తి కలిగిస్తుంది. డాక్టర్ వేంపల్లి గంగాధర్ ఈ చక్కని పుస్తకాన్ని అందించారు. రేనాటి చోళులు కడప జిల్లా కలమళ్ల గ్రామంలోని చెన్నకేశవాలయంలో వేయించిన శాసనమిది. చారిత్రకాధారాలను చరిత్రకారుడు పలికించినపుడే చరిత్ర రూపొందుతుందని చెబుతుంది చరిత్ర రచన పద్ధతి. కానీ ఒక కథకుడు చారిత్రకాధారాలను పలకరిస్తే ఆ కథ వేరుగా ఉంటుంది. చరిత్రలో, భాషా చరిత్రలో, సంస్కృతిలో ఈ శాసనం స్థానం గురించి చాలా ఆసక్తిగా రచయిత ఆవిష్కరించారు. ప్రతి రచయిత ఇలాంటి అభిరుచిని పెంచుకుంటే చరిత్ర రచనకు జరిగే ఉపకారం ఎంతో ఉంటుంది. ఈ శాసనం వివరాలు సేకరించడానికి జరిగిన కృషి వివరాలు, చోటు కల్పించిన ఫోటోలు విశిష్టంగా ఉన్నాయి.
 - కల్హణ
 
 
 రెక్కల్లో గీతాంజలి
 పుస్తకం    :    రెక్కల్లో టాగోర్ గీతాంజలి
 అనుసృజన    :    డి.హనుమంతరావు
 విషయం    :    అక్షరాల్ని అమృత పుష్పాలుగా మార్చిన విశ్వకవి టాగోర్. ‘గీతాంజలి’కి అనువాదాలు అనుసృజనల్ని పద్య, గేయ, వచన కవితా రూపాల్లో ఎందరో కవులు తెలుగులో వెలువరించారు.
 డి.హనుమంతరావు ‘గీతాంజలి’ని రెక్కల ప్రక్రియలో అనుసృజన చేశారు. నాలుగు లైన్లు ఒక స్టేట్‌మెంటును, చివరి రెండు లైన్లు వాటికి తగిన తాత్వికతను చెప్పే ప్రక్రియ ఇది. చివరి రెండు లైన్లు ‘రెక్కలు’గా చెప్పుకోవచ్చు.
 
 పేజీలు: 102; వెల: 60
 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో.
 
 ‘ఏదో ఆనందం
 నాలో తెలియని అలజడి
 నాలో - నీ సమక్షం
 ఓ మధుర పరిమళం!’
 భగవంతుణ్ని ప్రియునిగా భావించి ఆయన ఎదురుపడ్డప్పుడు ఆనందంతో కూడిన అలజడిని ఎంతో గొప్పగా కవి రెక్కల మూసలో ఒదిగిస్తాడు రచయిత.
 - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
 
 పేజీలు:  104; వెల: 100
 ప్రతులకు: కవి, జి-2, పోలీస్ మంగారెడ్డి రెసిడెన్సీ, సూరారం గ్రా., కుత్బుల్లాపూర్ మం., హైదరాబాద్-55. ఫోన్: 8186915342
 
 కొత్త పుస్తకాలు
 పొడిచే పొద్దు (కథానికలు)
 రచన: కన్నెగంటి అనసూయ
 పేజీలు: 152; వెల: 150
 ప్రతులకు: రచయిత్రి, విల్లా నం.17ఎ, వెర్టెక్స్ లేక్‌వ్యూ, నిజాంపేట్, హైదరాబాద్-90. ఫోన్: 9246541249
 
 నేలకు దిగిన నక్షత్రం (కథలు)
 రచన: డా.ఎమ్.సుగుణరావు
 పేజీలు: 280; వెల: 150
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
 
 కాలుతున్న కట్టెలు (కథలు)
 రచన: కూతురు రాంరెడ్డి
 పేజీలు: 188; వెల: 120
 ప్రతులకు: రచయిత, ప్లాట్ నం.11, ఇం.నం. 6-67, సుప్రభాత్ వెంచర్-2, కాచవానిసింగారం పోస్టు, ఘట్‌కేసర్ మం. రంగారెడ్డి జిల్లా-500088. ఫోన్: 9000415353
 
 జ్ఞానసుధ
 రచన: వి.శ్రీరామరెడ్డి
 పేజీలు: 120; వెల: 80
 ప్రతులకు: రచయిత, మర్రిపల్లి, ఓబుళరెడ్డిపల్లి పోస్టు, వి.ఎన్.పల్లి మండలం, వైఎస్‌ఆర్ జిల్లా- 516321. ఫోన్: 8008372218
 
 ప్రథమ బాలశిక్ష-2
 (ఆరోగ్య సూక్తిసుధ)
 రచన: భాగవతుల శ్రీనివాసరావు
 పేజీలు: 144; వెల: 90
 ప్రతులకు: భాగవతుల సామ్రాజ్యలక్ష్మి, 23-23-52, శివరావు వీధి, సత్యనారాయణపురం, విజయవాడ-11.
 ఫోన్: 9618165402
 
 గ్లోబల్ వార్మింగ్
 రచన: టి వి సుబ్బయ్య
 పేజీలు: 134; వెల: 75
 ప్రతులకు: దీప్తి బుక్ హౌజ్, మ్యూజియం రోడ్, విజయవాడ-2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement