
అంటరాని దేవతలు
చరిత్రలో కనీవినీ ఎరుగనంతటి ఒక సంక్షోభంలో భారతదేశం నలిగిపోతున్న సమయానికి సంబంధించిన ఇతివృత్తంతో సాగే నవల ‘అంటరాని దేవతలు’.
(అనువాదం)
చరిత్రలో కనీవినీ ఎరుగనంతటి ఒక సంక్షోభంలో భారతదేశం నలిగిపోతున్న సమయానికి సంబంధించిన ఇతివృత్తంతో సాగే నవల ‘అంటరాని దేవతలు’. క్విట్ ఇండియా ఉద్యమం, ప్రపంచాన్ని కుదిపివేస్తున్న రెండో ప్రపంచ యుద్ధం చివరి అంకం కూడా ఇతివృత్తానికి తోడయ్యాయి. అలాంటి సమయంలో దళితుల స్థితిగతులపై రాసిన నవల ఇది. ‘అన్‌టచబుల్ ‘నిర్భయాస్’ ఆఫ్ ఇండియా అండ్ ఒన్ బిలియన్ రైజింగ్’ పేరుతో శామ్ పసుమర్తి రాసిన ఆంగ్ల నవలకు ఇది స్వేచ్ఛానువాదం. ఇది రచయిత జీవితానుభవమని ప్రొఫెసర్ ఎ.ప్రసన్నకుమార్ రాసిన ముందమాట వల్ల అర్థమవుతుంది.
విశాఖపట్నం మీద బాంబుదాడి జరుగుతుందని జనమంతా చుట్టుపక్కల ఊళ్లకు తరలి వెళ్లడంతో నవల ఆరంభమవుతుంది. శివ, నూకి ప్రధాన పాత్రలు. నూకి పారిశుధ్య పనివారి ఇంటిలో పుట్టిన పిల్ల. యుద్ధం నాటి పరిస్థితులు, అప్పటికి విశాఖతో పాటు యలమంచిలి ప్రాంతంలో భయానకంగా ఉన్న అంటరానితనం గురించి బాగా చిత్రించారు. అగ్రకులంలో పుట్టిన శివ, నూకి మధ్య జరిగే శృంగారం మరొక అంశం. మొత్తంగా చూస్తే కులాధిపత్యం మీద తిరుగుబాటుగా ఈ నవల అర్థమవుతుంది. ఇళ్లలోని పాయఖానాల పరిస్థితి, ఆ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత జీవితాలు, శివ తాతగారు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంగతి విని ప్రశాంతంగా కన్నుమూయడం వంటివి నవలకు ప్రత్యేకతను తెచ్చాయి. శివ జీవితంలో జరిగినట్టు చెప్పిన కొన్ని శృంగార సన్నివేశాలను వడగట్టి ఉండవలసింది. స్వేచ్ఛానువాదం బావుంది.
- కల్హణ
అంటరాని దేవతలు; ఆంగ్లమూలం: డాక్టర్ శామ్ పసుమర్తి; తెలుగు: ద్విభాష్యం రాజేశ్వరరావు; పేజీలు: 272; వెల: 200; ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్. విజయవాడ;
ఫోన్: 0866–2430302