విమర్శ
ప్రపంచ చరిత్రలోనే అఖండ భారత విభజన అత్యంత విషాదకర, హింసాత్మక సంఘటన. హిందూ-ముస్లిం సమాజాలకే కాదు, కొందరికి వ్యక్తిగతంగా కూడా ఆ విభజన చేదు అనుభవాలను మిగిల్చింది. అందుకే ఆ అంశం మీద ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. భీష్మ సహానీ, అమృతా ప్రీతమ్, గుల్జార్, కుష్వంత్ సింగ్, సాదత్ హసన్ మంటో వంటి ఎందరో విభజన విషాదం గురించి గొప్ప రచనలు చేశారు. ఇవికాక డామినిక్ లాపిరె, ల్యారీ కోలిన్స్ వంటి విదేశీయుల ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ వంటి పుస్తకాలు కూడా కోకొల్లలు. ఈ విభజన విషాదంలో హైదరాబాద్ పాత్ర ప్రత్యేకమైనది. ఆ అంశాన్ని చర్చించేదే ‘హైదరాబాద్ విషాదం’. పుస్తక రచయిత మీర్ లాయక్ అలీ (అను: ఏనుగు నరసింహారెడ్డి) ఆ ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి. ఆయన హైదరాబాద్ సంస్థానానికి ప్రధాని. జిన్నా, నిజాం సంబంధాల గురించి పూర్తిగా తెలిసినవారు.
పుస్తకంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన చివరి రెండేళ్లు, భారత విభజన, శరణార్థులు, విభజన తరువాత మహ్మదలీ జిన్నా (ఖాయిద్ ఏ ఆజమ్) వైఖరి, ఆఖరి నిజాం, రజాకార్లు వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు వస్తాయి. గాంధీ హత్య, నిజాం లొంగుబాటు వంటి అంశాలను ఈ చరిత్ర నుంచి మినహాయించడం సాధ్యంకాదు. కాబట్టి రచయిత ఆ అంశాలను కూడా విశేషంగా చర్చించారు. చరిత్ర రచన పద్ధతికీ, చరిత్ర ఇతివృత్తంగా వచ్చిన సృజనాత్మక రచనా విధానానికీ మధ్య సాగే లాయక్ అలీ శైలి గురించి మొదట ఎవరైనా చెప్పుకోవాలి. గొప్ప భాషతో, గొప్ప శైలితో నడిచినా, చరిత్ర రచనలో వాస్తవాలదే ప్రధాన పాత్ర కావాలి. ఆ విధంగా చూసినప్పుడు అలీ కొన్నిచోట్ల పాక్షిక దృష్టి బారిన పడ్డారని (చాలామంది ఇతర రచయితల మాదిరిగానే) అనుకోవలసివస్తుంది. హైదరాబాద్ సంస్థానంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ పాలకులు మహమ్మదీయులు. ఈ రాజ్యం స్వతంత్రంగా ఉండదలిచింది. అయినా ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఆయన అనుమానపడటం గమనార్హం. ముస్లింలీగ్లో కంటే ఎక్కువ మంది ముస్లిం సభ్యులను కలిగి ఉన్న జాతీయ కాంగ్రెస్ను ఆయన హిందూమత సంస్థగానే పేర్కొనడం మరొకటి. అలాగే ఖాయిద్ ఏ ఆజమ్ (జాతిపిత) జిన్నా జీవితంలోని దశలను గురించి చెప్పి ఉంటే ఆయన మొత్తం వ్యక్తిత్వం ఆవిష్కృతమై ఉండేది.
ఈ పుస్తకంలో (264వ పేజీ, మరికొన్ని చోట్ల) ‘జిన్నా శ్రీమతి’ అని పేర్కొన్నారు. 1947-48 నాటి కాలానికి సంబంధించిన చరిత్రలో ఆమెకు స్థానం లేదు. జిన్నా భార్య రతన్బాయి పెటిట్ 1929లోనే మరణించారు. ముంబై నుంచి జిన్నా వెంట పాకిస్తాన్ వెళ్లి, అక్కడే చివరి వరకు ఆయనను వెన్నంటి ఉన్న మహిళ ఫాతిమా. ఆమె జిన్నా చెల్లెలు. ‘మై బ్రదర్’ పేరుతో జిన్నా జీవిత చరిత్ర కూడా రాశారు. ఆమె దంత వైద్యురాలు. ఇక్కడ లాయక్ అలీ పొరబడి ఉంటాడని అనుకోలేం. తరువాతి ముద్రణలో ఇది సరిచూడడం అవసరం. ఈ పుస్తకంలోని అంశాలతో విభేదించడానికి చాలా ఆధారాలు దొరుకుతాయి. హైదరాబాద్లో ముస్లింలు, హిందువుల మనస్తత్వాల గురించి అలీ ప్రతిపాదించిన వాదన సంపూర్ణం కాదు. ఇది పీవీ నరసింహారావు ‘ఇన్సైడర్’ స్పష్టం చేస్తుంది కూడా. కానీ విభజన, పాక్-హైదరాబాద్ సంబంధాలు, విలీనం వంటి చారిత్రక చిత్రాలు ఎంతో అద్భుతంగా కళ్లకు కట్టారు రచయిత. అనువాదం కూడా అంతే రమణీయంగా ఉంది.
-కల్హణ
హైద్రాబాద్ విషాదం
Published Mon, Jun 6 2016 12:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement