
పి.రామకృష్ణ రచనా సర్వస్వం
పుస్తక సమీక్ష
పి.రామకృష్ణ సమగ్ర సాహిత్య సంపుటి ఇది. ఇందులో మూడు నవలలూ, ముప్పయి ఐదు కథలూ, వ్యాసాలూ, పుస్తక సమీక్షలూ, కాలమ్స్ రాతలూ, కవితలతో పాటు, ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టిన ‘పెన్నేటి కత’లూ ఉన్నాయి. ఆయన యాభై ఏళ్ల సాహిత్య కృషినంతా ఈ సమగ్ర సంపుటి ద్వారా పాఠకుడికి అందించే ప్రయత్నం ఇది!
పెన్నానది ఒడ్డున ఉన్న ఒకప్పటి పల్లె జీవితాన్ని గురించి, నిసర్గమైన ఆ ప్రాంతపు మాండలీకంలో, సహజమైన వాస్తవికమైన పాత్రలతో, నిర్దిష్ట స్థలకాలాల స్పృహతో చిత్రిక పట్టిన ‘పెన్నేటి కతలు’ ఇప్పుడు కూడా చదివి, ఆనందించటమే గాదు, గుండెల్లో నింపుకోవచ్చు!
ఈ కతలే గాక, ఆయన రాసిన మరో 35 కథల్లో కూడా, ప్రాంతీయ ముద్ర, ప్రాదేశిక చిత్రణ కలిగిన ‘నీళ్లు’, ‘తేడా’, ‘కర్రోడు చచ్చిపోయినాడు’, ‘ఎలిగే పెద్దోళ్లు నలిగే సిన్నోళ్లు’ ‘మనిషీ - పశువూ’, ‘కరువు పీల్చిన మనుషులు’ ‘బండ కోడెలూ- బక్కెద్దులూ’ లాంటివి రాయలసీమ ప్రాంతపు జీవితాన్ని రికార్డు చేసిన సాంఘిక చరిత్రల్లాంటివే!
ఆయన తొలి రోజుల్లో ‘తులసీకృష్ణ’ కలం పేరుతో రాసిన ‘రుతుపవనాలు’ మాత్రం పేలవమైన నవల! పేరుకు రుతుపవనాలే అయినా, అందులో రుతువులూ లేవూ, పవనాలూ లేవూ. ఆయన ఈ నవల రాసిన కాలంలో వచ్చిన చచ్చు ప్రేమ నవలల బలహీనతలన్నీ ఈ నవలలో కనిపిస్తాయి. ఏడు జంటల ప్రేమలు ఉన్నాయి మరి!
ఆయన ‘లోకవృత్త పరిశీలన’కు నిదర్శనం లాంటి మంచి నవల ‘నత్తగుల్లలు’! సగటు మధ్యతరగతి జీవన విలాసాల్నీ, గమనాల్నీ, మిధ్యా విలువల్నీ నిర్మమకారంగా నిర్దాక్షిణ్యంగా విమర్శకు పెట్టిన ఈ నవలకు సాహిత్య చరిత్రలో సముచిత స్థానం ఎప్పటికీ ఉంటుంది. ‘‘ప్రపంచం పది కిలోమీటర్ల దూరం ముందుకు నడిస్తే, నత్తగుల్ల నాలుగడుగులు వెయ్యడానికి భయపడుతుంది’’ అని మధ్యతరగతిని పరిహసించిన నవల ఇది!
‘ఉదయమూ- సాయంకాలమూ’ వృద్ధాప్య సమస్యను కొత్తకోణంలో చూపెట్టాలని రాసిన నవల. ‘‘సుదీర్ఘ జీవితం ముందున్నవారి కన్నా కొద్దిపాటి జీవితం మిగిలివున్న వాళ్లకు జీవితం ఇంకా వాంఛనీయంగా ఉండాలి’’ అని చెప్పిన నవల! వృద్ధాప్యం ఒక సామాజిక సమస్యగా మారిన వర్తమానంలో ఈ నవల చాలా అంశాల్ని, సామాజిక ఆర్థిక కోణాలలో చర్చకు పెట్టింది. ఇందులో అంగీకరించే అంశాలే గాక, విభేదించే అంశాలు కూడా లేకపోలేదు.
కథా నవలా రచయితే కాదు, రామకృష్ణ మంచి సాహిత్య విమర్శకుడు కూడా అనటానికి ఈ సంపుటిలోని సమీక్షలూ, వ్యాసాలూ సాక్ష్యమిస్తాయి. నిర్మొహమాటమూ, నిర్భీకతా, నిజాయితీ గల వీరి సాహిత్య వ్యాసాలూ, పుస్తక సమీక్షలూ ఇప్పటి విమర్శకులు జాగ్రత్తగా పరిశీలించదగ్గవి. చలం, రావిశాస్త్రి, చాసో, కేశవరెడ్డి, గోపీచంద్, రా.రా. లాంటి ప్రముఖుల గురించి రాసిన సాహిత్య వ్యాసాలూ, భాషా వ్యాసాలూ కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. కథ గురించి రామకృష్ణ ఇంటర్వ్యూ చాలా చర్చలు చేసింది. కథకులు గమనించాల్సిన అంశాలెన్నో ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి.
- సింగమనేని నారాయణ