ప్రతి చర్యా, ఏమాత్రం ప్రత్యేకత లేనిది కూడా ఒక కొత్త విలువను సంతరించుకుంది. నాకు తెలుసు, ఈ త్యాగం అవసరమేననీ, వివిధ స్థాయిల్లో ఇది మంచికే దారితీస్తుందనీ. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి అంతా దాటిపోయాక, మనం ప్రాథమికంగా దుర్బలులమనీ మన చర్యలకు పర్యవసానాలుంటాయనీ మనం మరచిపోనప్పుడు మాత్రమే.
‘‘మీకు వీలైతే ఇంట్లోనే ఉండండి’’ వాళ్ళు మొదట్లో చెప్పిందిదే. నేను ఉండగలిగాను. ఇంటినుండే ఒక చిన్న ప్రచురణ సంస్థని నడుపుతున్నాను కాబట్టి ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతాను. నేనేం భయపడలేదు. నేనిది చేయగలనని నాకు నేనే చెప్పుకున్నాను. ఇది దేన్నీ మార్చదు. తర్వాత ఆ సలహా ఒక ఆజ్ఞ అయింది. ‘ఇంట్లోనే ఉండండి!’ అని వాళ్ళు చెప్పారు. మొత్తం మారిపోయింది.
ఇంటిబయటేదో జంతువు వేటకోసం తిరుగుతున్నట్లుగా మేం జీవిస్తున్నాం. ఎప్పుడది వేటలో అలసిపోయి వెనుతిరిగిపోతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే మా ప్రియమైన ఫ్లోరెన్స్ నగర వీధులు ఇప్పుడు పూర్తి ఖాళీగా ఉన్నాయి. ఈ హఠాత్ నిశ్శబ్దానికి ఖంగుతిన్న పావురాలు, గువ్వపిట్టలు, కారునల్లని కాకులు, నమ్మలేనట్టుగా ఒకదాన్నొకటి చూసుకుంటున్నాయి. వసంతకాలం వస్తోంది కాని, దాన్ని ఆస్వాదించే స్థితిలో లేమని మాకు తెలుసు. పార్కులో నడవడమో స్నేహితులింటికి వెళ్ళిరావడమో వంటి ఇంతకుముందు పెద్దగా విలువనివ్వని పనులన్నీ ఇప్పుడు మాకందుబాటులో లేనంతటి విలాసవంతమైనవిగా తోస్తున్నాయి. నిజానికిది సమావేశాలను స్వాగతించే సమయం; కానీ మనం ఒకరికొకరు దూరంగా ఉండాలనీ, దగ్గరగా వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలనీ చెప్తున్నారు. ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో, మనం మళ్ళీ సురక్షితంగా ఉన్నామని భావించేందుకూ, చెంప మీద ముద్దుపెట్టుకొని ఒకరినొకరం పలకరించుకోవడానికీ ఎంత సమయం పడుతుందో? ఇంట్లో ఉండటం విసుగు పుట్టిస్తోందంటూ మనం గులుగుతున్నప్పుడు నిరాశ్రయులైన జనమంతా ఎక్కడికి వెళ్ళుంటారు?
రోజురోజుకీ ఎంతగా మరింతగా బిగిసిపోతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ కనీసం మాకు ఇల్లంటూ ఒకటుంది. ఆ వారానికవసరమైన ఆహార పదార్థాల్ని పక్కకు తీస్తూ నాతో నేనే చెప్పుకున్నాను: సూపర్ మార్కెట్ల వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎంత తక్కువ సమయం గడిపితే అంతమంచిదని, ఎట్టి పరిస్థితులలోనూ కుటుంబం నించి ఒక్క సమయంలో ఒక్క సభ్యుడు మాత్రమే ఆహార పదార్థాలను కొనేందుకు అనుమతించబడాలని, అలా వెళ్ళేవారు తాము బయటకు వచ్చిన కారణాన్ని తెలిపే పత్రాన్ని తప్పకుండా తమతో తీసుకెళ్లాలనీ, ఆ కారణం తప్పుగా తేలితే వారిపై చర్యలు తప్పవనీ.
మేమేమీ యుద్ధకాలంలో జీవించడంలేదు, మాకు అవసరమైనవన్నీ– ఆహారం, ఆటవిడుపులు, పుస్తకాలు, సంగీతం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కమ్యూనికేట్ చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం– ఉన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా నేను చెవుల్లో ఏదో బయ్యిమంటున్న శబ్దంతో మేల్కొంటున్నాను. నిద్రలేస్తాను, కాఫీ తాగుతాను, కంప్యూటర్ వద్ద కూర్చుంటాను, నా భర్తతో పిచ్చాపాటీ మాట్లాడతాను, లంచ్ తయారు చేస్తాను, ఇంకాస్త ఎక్కువ పని చేస్తాను, రాత్రి భోజనం ముగిస్తాను– ఇన్ని వేళల్లోనూ ఆ బయ్యిమనే శబ్దం అలాగే ఉంటుంది– నేనింకా చూడగలిగిన తాకగలిగిన వాటిని నా నుంచి వేరుచేసే ఒక సన్నని తెరలాగా. నాకోసమని నిర్దేశించిన ఒక నిర్దిష్ట ప్రణాళికను అమలు చేస్తున్న మరమనిషిని నేను. నా మనస్సు ఒక క్రొత్త, చలనం లేని శరీరంతో – మాకిప్పుడు ఇంట్లోంచి బయటకొచ్చి ఇంటికి మరీ దూరంపోకుండా ఒంటరిగా నడిచేందుకు అనుమతి ఉంది – తాను ఒకప్పుడు చేసిన పనులేవీ ఇప్పుడు చేయలేని స్థితిలోవున్న ఒక శరీరంతో– సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఒంటరితనం, నాలో నేననుకున్నాను. రేపటి గురించిన అనిశ్చితి. ఆక్సిజన్ లేకపోవడం.
వాస్తవమేమిటంటే, ఈ శ్మశాన నిశ్శబ్దంలో –నగర ధ్వనులు సద్దుమణిగిపోయాయి, శాన్తా క్రోచె కొట్టే గంటలు మాత్రమే నా రోజులను వినిపిస్తాయి – ఇప్పుడు మనం మన ఆలోచనల పూర్తి బరువును అనుభూతి చెందుతున్నాము. ‘నాకింక వేరే మార్గం లేదు, నేను నిన్ను ఆపవలసి వచ్చింది’ అని చెప్తోన్న ఒక స్వరం నా వెనుకనేవుంది. ఇదీ దాటిపోతుంది, కానీ దీన్ని మర్చిపోవద్దు. అందువల్లనే నేను అనారోగ్యం వల్లనో, ఆర్థిక సంక్షోభం వల్లనో, నిర్దేశిత సూచనలను కోల్పోవడం ద్వారా కలిగే భయంవల్లనో మరణించను. ఆ స్వరం నిజమే చెప్తుందని నాకు తెలుసు, ఈ త్యాగం అవసరమేననీ, వివిధ స్థాయిల్లో ఇది మంచికే దారితీస్తుందనీ. అదెలాగంటే, ఇప్పుడున్న పరిస్థితి అంతా దాటిపోయాక, మనం ప్రాథమికంగా దుర్బలులమనీ మన చర్యలకు పర్యవసానాలుంటాయనీ మనం మరచిపోనప్పుడు మాత్రమే.
బహుశా నేను అదృష్టవంతురాలినవడం వల్లనే నేనిలా మాట్లాడుతున్నాను: మొదటి సంగతి, నాకో ఇల్లుంది. రోజంతా నా డెస్క్ ముందు కూర్చొని ప్రచురించాల్సిన కథలను అధ్యయనం చేస్తాను. ఇది నా పని. కథలు. ఇప్పటికే నేను వాటిని చదివే విధానానికి ఈ వైరస్ సోకింది. రాబోయే సంవత్సరంలో, నా పాఠకులు ఈ అఘాతాన్నుండి కోలుకొని ముందుకు సాగిపోవడం అవసరమయినప్పుడు, ఏ కథలు ప్రచురించాలో అది నాకు చెప్పింది. శుభ్రమైన లినెన్ వస్త్రాన్ని అసాధరణమైన జాగ్రత్తతో శ్రద్ధగా మడతపెడుతూ – ఇదేమీ ప్రపంచానికి అంతం కాదు– అనుకున్నాను. ఎందుకంటే ఇది మరొక ఊహించని పరిణామం: ప్రతి చర్యా, ఏమాత్రం ప్రత్యేకత లేనిది కూడా ఒక కొత్త విలువను సంతరించుకుంది. నేను పిల్లికి ఇచ్చే ప్రతి కౌగిలింతనీ నాకు నేను ఇచ్చుకుంటాను. ప్రతి శుభరాత్రి సందేశాన్నీ కూడా ఇప్పటికే మనం జీవిస్తున్న పీడకలల రాత్రిలాంటిది కాకూడదనే హృదయపూర్వకమైన ఆశతోనే చెప్పుకుంటాను.
తెల్లవారుఝామున కొన్నిసార్లు నా కళ్ళింకా మూసుకునీ, శరీరం విశ్రాంతిగా, మనసు అప్పటికే అలసిపోయీ ఉన్నప్పుడు, వైరస్ మనకు నేర్పిస్తున్న ఈ కొత్త నెమ్మదితనం బాగుందనీ, సహనానికి సంబంధించిన ఈ పాఠం కూడా ఆరోగ్యకరంగా ఉందనీ అనుకుంటాను. అంతకుముందున్న – మన ఊపిరి తీసేసి, మనల్ని ఎన్నడూ దేన్నీ ఆస్వాదించనివ్వని – ఆ వెర్రి బలం – ఆ శక్తంతా ఇప్పుడు సోషల్ మీడియాలోకి ప్రవహించి, మనల్ని మాటలు కలబోసుకునేలా, ఒకరినొకరు హెచ్చరించుకునేలా, సంఘీభావాన్ని తెలుపుకునేలాంటి శక్తిగా రూపాంతరం చెందింది. మనం ఒకరిలోనొకరిగా చుట్టుకుపోయాం. ఈ నిశ్శబ్దం కేవలం ఒక అద్దంలా మారకుండా ఆపేందుకు మనం శబ్దాలు చేద్దాం. వైరస్ మనల్ని ఒంటరులం కావాలని కోరుకునివుంటే, అందుకో కారణం ఉంది. మన జీవనశైలిని ఎలా మారాల్సివుందో ప్రతిబింబించేలా మనం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటూ, నిశ్శబ్దాన్ని హత్తుకోగూడదూ?
ఇంట్లోనే ఉండండి, పుస్తకం చదవండి! ప్రతిఒక్కరూ ఇలా ఎలుగెత్తి చెప్తారు. కానీ, తమ స్వంత గుర్తింపునూ అభిరుచులనూ వేరెవరిపైననో రుద్దడానికి చేసే మరో ప్రయత్నంలా అనిపిస్తూండే ఈ సూచనల అరుపుల మధ్యనుంచి నాకు ఏ పుస్తకం అవసరమో తెలుసుకోవడం ఎలా? నేను చేసే పనిని పరిగణనలోకి తీసుకుని ఒక నిబిడాశ్చర్యంతో ఇలా చెప్తున్నాను, ఈసారి కేవలం పుస్తకాలు సరిపోవు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం కంపించిపోతూన్నప్పుడు చదవడంపై దృష్టి పెట్టడం అంత సులభం కాదు. బహుశా మార్పుకు మనం పూర్తిగా అలవాటుపడిన తర్వాత తిరిగి మనకు అవసరమైన ప్రశాంతతను కనుక్కోగలుగుతాము. కాని ఇదింకా ప్రారంభమే. మనకు ఉపశమనం కలిగించేందుకు సంగీతమే ఇప్పటి అవసరం.
అహంభావం ఇంకా పుష్కలంగానే ఉంది, కానీ ఇక్కడ కూడా మనకు నేర్పేందుకు వైరస్‌కు ఒక పాఠం ఉంది. తగిన కారణం లేకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారెవరైనా ఇప్పుడు తమ పొరుగువారిని కేవలం దగ్గుతోనే చంపేసే ప్రమాదం ఉంది. కొంతమంది భయపడతారు, స్పృహలోకి వస్తారు– లేదా శిక్ష పడుతుందని భయపడతారు. ఇంకొందరిలో మాత్రం చలనముండదు. అయితే మనిషి ఎప్పుడూ మనిషే. అదంతా మరో కథ.
నేను నా తల్లిదండ్రులను చూసి ఇప్పటికి నెలలు గడిచాయి. వారు ఇప్పటికీ నేను పుట్టిపెరిగిన మార్షెలోని పెసారో నగరంలోనే నివసిస్తున్నారు. అంటువ్యాధి అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో అదీ ఒకటి. కాని మనం ఒక్క రోజులో ఇప్పుడు మాట్లాడుతున్నన్ని సార్లు ఇంతకుముందెన్నడూ మాట్లాడి ఎరుగం. వారికి 70 సంవత్సరాల వయసు. ఇలాంటివి అనుభవంలోకి వస్తాయని వారెన్నడూ ఊహించలేదు. ‘నేనేం భయపడటంలేదు,’ అంది మా అమ్మ రాత్రి నాతో. ‘నేను చలించని తేనెటీగలా ఉన్నాను, కాని నేను భయపడను.’ చలించని తేనెటీగ! అయితే అదన్నమాట నా తలలో ఉన్న బయ్యిమనే శబ్దం. నేనింకా పాత నేనుగానే ఉన్నాను, పరిస్థితులకు అనుగుణంగా గట్టిపడకుండా. కానీ అలా ఉండే ప్రయత్నంచేస్తే ఎలా ఉంటుంది?
Comments
Please login to add a commentAdd a comment