తెలుగు సాహిత్యంలో కరోనా మరో కొత్త విప్లవానికి తెరతీసింది. రాజకీయ, వ్యాపార కార్యక్రమాలకే పరిమితమైన జూమ్ సమావేశాలు కవిత్వం కూడా అందిపుచ్చుకుంది.
‘‘చీకటి రోజుల్లో గానాలుండవా... ఉండకేం... చీకటి రోజుల గురించి గానాలుంటాయి’’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత నాటక కర్త బెరస్తోచ్ బ్రెష్ట్. అలాగే కరోనా రోజుల్లో కరోనా గురించి గానాలు ప్రపంచ వ్యాప్తంగా పోటెత్తాయి. కరోనా పుట్టిందనుకుంటున్న చైనా లోని వూహాన్‌కు చెందిన కవి దగ్గర్నుండి తెలంగాణాలో కరీంనగర్, జమ్మికుంటకు చెందిన ఆదేశ్ రవి వరకూ వున్నారు. తెలుగు కవి జాతీయోద్యమం నుండి అస్తిత్వ ఉద్యమాల కవిత్వం వరకూ ముందుండి గొంతు నినదించాడు. ప్రపంచ యవనిక మీద ఎక్కడ ఏ చీమ చిటుక్కుమన్నా అది తనకే జరిగినట్టు కళవళ పడిపోయాడు. దానికి ఉదంతాలు కోకొల్లలు.
హైదరాబాద్ ఆకాశవాణి ఉద్యోగి అయినంపూడి శ్రీలక్ష్మి ‘రిటన్ గిఫ్ట్ టు కరోనా’ పేరుతో రాసిన కవిత తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి రావటం, ఆయన మీడియా సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించి, కవులందరూ కరోనాపై కలాలు ఝళిపించాలని పిలుపునివ్వడంతో కరోనా కవిత్వం ఊపందుకుంది. రాత్రికి రాత్రే కరోనాపై శతకాలు వెలువడ్డాయి. ‘రిటన్ గిఫ్ట్ టు కరోనా’ పేరుతో ఒక యూట్యూబ్ గ్రూప్‌ని క్రియేట్ చేసి అందులో వందల సంఖ్యలో కవుల వీడియో కవితలను పొందుపరిచారు. ఇటువంటి సందర్భాల్లో రాశి వాసిని మింగేస్తుందన్న విషయం మనందరకు తెలిసిందే! ఒక దశలో తెలుగునాట నాలుగు చెరగులా పోటెత్తిన కరోనా కవితలు చూస్తుంటే కరోనా కంటే కవిత్వమే వేగంగా వ్యాపించిందేమో అనిపించింది.
తెలుగులో అన్ని దినపత్రికలు సాహిత్యానికి ఒక పూర్తి పేజీ కేటాయించిన సమయంలో, అత్యధిక సర్క్యులేషన్ గల ఒక దినపత్రిక తన సర్వేలో సాహిత్యాన్ని చదివే పాఠకులు 0.2 శాతం వున్నారని తేలడంతో సాహిత్యాన్ని దూరం పెట్టింది. ఇప్పుడు కరోనా సమయంలో కవిత్వం గుర్తుకొచ్చి, నగదు బహుమతులతో సహా, కరోనాపై కవితల పోటీని నెలరోజులు నిర్వహించింది. ఈ పోటీలో ప్రముఖ కవుల నుండి కొత్తగా కలం పడుతున్న వారి వరకూ పాల్గొనడం విశేషం.
కవిత్వ ప్రక్రియలైన వచన కవిత, గేయం, పద్యం వంటి అన్ని ప్రక్రియల్లోనూ రచనలు తామరతంపరగా వెలువడ్డాయి. సినిమా సెలబ్రిటీలు పాటల రూపంలో సందేశాలిచ్చారు. కొన్ని టీవీ చానళ్లు యథాశక్తి పాటలను రూపొందించి చైతన్యపరిచాయి.
ఖమ్మం నుండి తోట సుభాషిణి సంపాదకత్వంలో ‘క్రిమి సంహారం’, బిల్ల మహేందర్ సంపాదకత్వంలో ‘వలస దుఃఖం’ కరోనా కవితా సంకలనాలు వెలుగు చూశాయి. అనేక సాహిత్య సంస్థలు కవితా సంకలనాల కూర్పుకు నడుం కట్టాయి. తెలంగాణ ప్రభుత్వం, ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరఫున ఒక కవితా సంకలనం రూపొందిస్తోంది. కరోనా కవిత్వం తెలుగు సాహిత్యంలో కొత్త పోకడలకు దారి తీయగా, పాత ప్రశ్నలే కొత్తరూపంలో ముందుకొచ్చాయి. కరోనా వ్యాధికి సంబంధించిన ఆంగ్ల పదజాలం (జార్గాన్) తెలుగు అనువాదాలపై ఉపయోగకరమైన చర్చ జరిగింది. క్వారంటైన్, ఐసోలేషన్, శానిటైజర్, మాస్క్ వంటి పదాలకు తెలుగు అనువాదాలను అన్వేషించే పనిలో అనువాదకులు పడ్డారు.
మరీ ముఖ్యంగా ‘సోషల్ డిస్టెన్స్’ పదానికి రూపొందించిన ‘సామాజిక దూరం’ పదంపై దళిత స్త్రీవాద సమూహాల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది ఈ దేశ కళంకమైన అంటరానితనాన్ని గుర్తుకు తెచ్చేలా వుందనీ, దాని స్థానంలో ‘భౌతిక దూరం’ పదం వాడటం మంచిదనీ సూచనలు వచ్చాయి. వారి అనుమానాలను బలపరిచేలా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సామాజిక మాధ్యమాల్లో చదివిన పద్యాలు తీవ్ర నిరసనకు గురయ్యాయి. వాటికి ప్రతి రచనలూ వెలువడ్డాయి. సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘ఎవ్వతిరా ఇది ఎవ్వతిరా ఈ కరోనా రక్కసి ఎవ్వతిరా’ అని రాసిన గేయం స్త్రీవాదుల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది. కరోనా వ్యాధిని స్త్రీతో పోల్చటం ఏమిటని ప్రశ్నించారు. అశోక్‌తేజ పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తెలుగు సమాజ, సాహిత్యాలలో దళిత, స్త్రీవాద ఉద్యమాల అవసరం ఇంకా ఉందని ఈ రెండు సంఘటనలు మరోసారి గుర్తు చేశాయి.
కరోనా వ్యాధి నివారణ చర్యలు, మరణాలు ఒక ఎత్తయితే దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా నరకం అనుభవించిన లక్షలాది వలస కూలీల వ్యథలు వర్ణించనలవి కానివి. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయిన వారి కనీన వెతలు గుండె కింద తడి వున్న ప్రతివారికీ కంటనీరు తెప్పించాయి. కవుల కవితలూ, చిత్రకారుల బొమ్మలూ వలస కూలీల పాదాల కింద హృదయాలను పరిచాయి. ఈ సందర్భంలో తెలంగాణకు చెందిన సినీ సంగీత కళాకారుడు ఆదేశ్ రవి రాసిన ‘బస్సులొద్దు, బండ్లువొద్దు అయ్య సారూ! ఇడిసి పెడితే నడిసి నే వోత సారూ!’ గేయం లాక్‌డౌన్‌లో వలన కూలీల వ్యథలకు ఆర్ద్రత నిండిన డాక్యుమెంటరీ రూపం. ఈ పాటపై పత్రికా సంపాదకీయం రావడం విశేషం. ఇంకా అనేకమంది ఔత్సాహికులు కరోనా నేపథ్యంలో వీడియో పాటలను విడుదల చేశారు.
తెలుగు సాహిత్యంలో కరోనా మరో కొత్త విప్లవానికి తెరతీసింది. రాజకీయ, వ్యాపార కార్యక్రమాలకే పరిమితమైన జూమ్ పద్ధతిలో నిర్వహించే సమావేశాలు కవిత్వం కూడా అందిపుచ్చుకోవడం. విజయవాడకు చెందిన సాహితీ మిత్రులు ప్రతీ ఏడాది మేడే సందర్భంగా నిర్వహించే ‘కవిత్వంతో ఓ సాయంకాలం’ కార్యక్రమం ఈ ఏడాది జూమ్ ద్వారా నిర్వహించగా రెండు రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ వున్న కవులు పాల్గొనడం విశేషం. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ‘కవి సంగమం’ అదే పద్ధతిలో ‘యువ కవి సమ్మేళనం’ లెల్లె సురేష్, కలేకూరి వర్ధంతిని, సంతకం గ్రూపు వలస కూలీలపై సదస్సును నిర్వహించడం విశేషం. భవిష్యత్తులో తెలుగు సాహిత్యంలో ఇది ట్రెండ్ సెట్టర్‌గా మారినా ఆశ్చర్య పోనక్కరలేదు. మునుపెన్నడూ లేనంతగా తెలుగు కవులు, రచయితలు యూట్యూబ్ చానెల్స్, తమ ఎఫ్‌బీ గోడల మీద నిర్విరామంగా మాట్లాడుతున్నారు. ఇది మితిమీరితే గతంలో పాఠకులు వదిలేసిన మాధ్యమాల గతే త్వరలో వీటికీ పడితే ఆశ్చర్యం లేదు.
Comments
Please login to add a commentAdd a comment