ఒక కళాకారుడి జీవన లాలస | the longing of an artist, Vincent van Gogh | Sakshi
Sakshi News home page

ఒక కళాకారుడి జీవన లాలస

Published Mon, Jan 25 2016 3:51 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

వ్యాన్గో చిత్రించిన స్టారీ నైట్ (1889) (ఇన్ సెట్: విన్సెంట్ వ్యాన్గో) - Sakshi

వ్యాన్గో చిత్రించిన స్టారీ నైట్ (1889) (ఇన్ సెట్: విన్సెంట్ వ్యాన్గో)

విన్సెంట్ వ్యాన్గో, జీవితాన్ని ఊపిరాడనంత మోహంతో కౌగిలించుకున్న ఒక వెర్రి డచ్చివాడు. రంగులే శ్వాసగా బతికినవాడు..

బ్లాగు కాచిన వెన్నెల

 

విన్సెంట్ వ్యాన్గో, జీవితాన్ని ఊపిరాడనంత మోహంతో కౌగిలించుకున్న ఒక వెర్రి డచ్చివాడు. రంగులే శ్వాసగా బతికినవాడు. కళ్లు చెదిరే మాస్టర్ పీస్‌లతో జనం కంటికి కొత్త రంగుల భాషను నేర్పిన గ్రేట్ మాస్టర్. అంతేనా! తమ్ముడికి రాసిన వందలాది లేఖల్లో తన అంతర్ బహిర్ రణఘోషను ఉద్వేగభరితంగా బొమ్మకట్టిన అపురూప లేఖాసాహిత్యకారుడు కూడా.

 

కళతోపాటు జీవితంలోనూ అలుపెరగకుండా పోరాడిన ఆ కళాయోధుడి జీవితాన్ని వర్ణకావ్యంలా పరిచయం చేస్తుంది ‘లస్ట్ ఫర్ లైఫ్’ నవల. రచయిత, జీవితచరిత్రా నవలల్లో కాకలు తీరిన ఇర్వింగ్ స్టోన్. ఎనభయ్యేళ్ల కిందట వెలువడిన ఈ తీరని జీవన లాలస నేటికీ వన్నె తగ్గని పెయింటింగులా పాఠకులనూ, కళాప్రియులనూ ఆకర్షించి వ్యాన్గో రసోన్మాద జగత్తులోకి లాక్కెళ్తోంది.

 

బొమ్మలు వేయడం తప్ప తన బతుక్కి మరో అర్థం లేదని చాటిన వ్యాన్గో నడిచిన పూలబాటల్లో, ముళ్లబాటల్లో స్టోన్ మనల్ని వేలుపట్టుకు నడిపిస్తాడు. ఆ వర్ణకారుడి ఫలించని తొలిప్రేమ, బెల్జియం బొగ్గుగనుల్లో మతబోధన, చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయే రంగులతో అనుదిన పోరాటం, ఆత్మను అరగదీసే సంశయాలు, సాటి మనిషి కష్టానికి చెరువయ్యే గుండె, పతితజనంతో సహవాసం, సంఘ బహిష్కారం... అన్నింటిని జీవం తొణకిసలాడే చిత్రాల్లో పరిచయం చేస్తూ వెళ్తాడు. పోరాటంలో మనోదేహాలు ఛిద్రం చేసుకుని, తను చేయాల్సింది చేశానన్న తృప్తితో హాయిగా నవ్వుతూ ముప్ఫై ఏడేళ్లకే ప్రాణాన్ని తూటాకి అర్పించుకున్న ఆ అమర కళావేత్త బలిదానాన్నీ కళ్లముందు పరచి గుండెను తడిచేస్తాడు.

 

ఈ నవలను పదమూడేళ్ల కిందట తొలిసారి చదివినప్పుడు కదలిపోయాను. అప్పట్నుంచి వ్యాన్గో కళాజీవితాలను మరింత తెలుసుకోవాలనే ఆరాటం ఆరని జ్వాలలా ఎగసిపడుతూనే ఉంది. దాని వెలుగును ఇంకొందరికి పంచుదామని అనువాదం మొదలుపెట్టాను. కళాసాహితి http://kalasahiti.blogspot.in బ్లాగులో దీన్ని అందిస్తున్నాను. ఒక చిన్న భాగం ఇది...

 

అనుకోకుండా అలా...

వేసవి వెళ్లిపోయి శిశిరం మొదలైంది. ఉన్న కాసింత పచ్చదనమూ కనుమరుగైంది. అయితే విన్సెంట్‌లో ఏదో నూతన జీవశక్తి పురులు విప్పింది. తన జీవితాన్నే దీటుగా ఎదుర్కోలేని అతడు ఇప్పుడు ఇతరుల జీవితాలపైకి మళ్లాడు. తిరిగి పుస్తకాలు పట్టుకున్నాడు. పఠనం అతనికి ఎప్పుడూ ఇష్టమైన వ్యాపకమే. ఇతరుల జయాపజయాలు, సుఖదుఃఖాల గాథల్లో అతడు తనను వెంటాడుతున్న తన జీవిత వైఫల్యపు రక్కసి బారినుంచి రక్షణ పొందుతున్నాడు.

 

వాతావరణం బాగున్నప్పుడు మైదానంలోకి వెళ్లి పగలంతా అక్కడే చదువుకుంటున్నాడు. వానపడితే గదిలోని చూర్లకిందున్న తన మంచంలో పడుకునో, లేకపోతే డెనిస్‌ల వెచ్చని వంటగది గోడపక్కన కుర్చీలో కూర్చునో గంటలకొద్దీ చదువుకుంటున్నాడు. గోరంత విజయాన్ని, కొండంత అపజయాన్ని మూటగట్టుకునే  తనలాంటి అతి సామాన్య మానవుల జీవితగాథలతో మమేకమైపోతున్నాడు. వాళ్లు చూపిన బాటలో తన జీవితాన్ని సరైన రీతిలో దర్శించుకోగలుగుతున్నాడు. నెమ్మదిగా అతని మనసులో ఒక నవ్యభావన సుళ్లు తిరగసాగింది. ‘‘నేను పరాజితుణ్ని, పరాజితుణ్ని’’ అనే కుంగుబాటు స్థానంలో, ‘‘ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకేది తగింది? ఈ ప్రపంచంలో నాకు సరైన స్థానమేది?’’ అనే ఆరాటం మొదలైంది. తను చదివే ప్రతి పుస్తకంలోనూ తన జీవిత గమనాన్ని నిర్దేశించే దిక్సూచి కోసం తపనతో అన్వేషిస్తున్నాడు.

 

తను ఎందుకూ పనికిరాడని తిడుతూ ఇంటి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. సోమరిగా తిరుగుతూ, సభ్యతాసంస్కారాలను, సంఘపు కట్టబాట్లను అతిక్రమిస్తున్నావంటూ తండ్రి నిందిస్తున్నాడు. మళ్లీ నీ కాళ్లపై నువ్వు నిలబడి, సమాజానికి నీ వంతు ఉపకారం ఎప్పుడు చేస్తానని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం విన్సెంట్ కూడా ఎదురుచూస్తున్నాడు. దొరికితే అతనికీ సంతోషమే.

 

చివరికి, అతనికి పుస్తక పఠనంతోనూ విసుగెత్తింది. పరాజయం తర్వాత కొన్నాళ్లు అతడు దేన్నీ స్వీకరించనంతటి ఉద్వేగరాహిత్యంలోకి జారిపోయాడు. తర్వాత మనశ్శాంతి కోసం పుస్తకాలు చదివాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కానీ కొన్ని నెలలుగా అణచిపెట్టుకున్న తీవ్రవేదన ఇప్పుడు కట్టలు తెంచుకుని అతణ్ని దుఃఖంలో ముంచెత్తింది. పుస్తకాలతో సాధించిన మనోస్థిమితం ఆ ప్రవాహానికి ఏ మాత్రం అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. అతడు జీవిత పతనావస్థకు చేరాడు. ఆ సంగతి అతనికి బాగా ఎరుకే. అయితే తనలో ఎంతో కొంత మంచి ఉందనీ, తను మరీ అంత మూర్ఖుణ్నీ, వ్యర్థజీవిని కాననీ, లోకానికి తను పిసరంతైనా మేలు చేయగలననీ అతడు అనుకుంటున్నాడు. మరి ఆ మేలేమిటి? తను వ్యాపారానికి పనికిరాడు. తనకు ఏది సరిపోతుందో దాంట్లో తప్ప మిగిలిన అన్ని వ్యవహారాల్లో ప్రయత్నించి ఓడిపోయాడు. కానీ తనెప్పుడూ ఇలా పరాజయానికి, వేదనకు గురికావాల్సినంత శాపగ్రస్తుడా? తన జీవితం పరిసమాప్తమైపోయిందా?

 

అన్నీ ప్రశ్నలే. సమాధానాల్లేవు. రోజులు దొర్లిపోతున్నాయి. శీతాకాలం ప్రవేశించింది. తండ్రి విసుగెత్తిపోయి డబ్బు పంపడం మానేశాడు. విస్సెంట్ డెనిస్‌ల ఇంట్లో భోజనం మానుకుని పిడికెడు బ్రెడ్డుతో కడుపు నింపుకుంటున్నాడు. తమ్ముడు థియో బాధపడిపోయి కాస్త డబ్బు పంపుతున్నాడు. అతనికీ సహనం నశిస్తే తండ్రి తన బాధ్యత గుర్తెరిగి మళ్లీ కాస్త డబ్బు పంపుతున్నాడు. రివాజుగా మారిన ఆ ఇద్దరి సాయంతో విన్సెంట్ అరకడుపుతో రోజులు నెట్టుకొస్తున్నాడు.

 

నవంబర్‌లో వాతావరణం తేటగా ఉన్న ఓ రోజున విన్సెంట్ మార్కాస్ బొగ్గు గనుల వద్దకు వెళ్లాడు. మనసులో ఏ ఆలోచనలూ లేవు. గోడపక్కనున్న ఓ తుప్పు పట్టిన ఇనుప చక్రమ్మీద కూర్చున్నాడు. గేట్లోంచి ఓ ముసలి కార్మికుడు బయటికొచ్చాడు. తలపైని నల్లటోపి కళ్లను కప్పేస్తోంది. భుజాలు కుంగిపోయాయి. చేతులు జేబుల్లో పెట్టుకున్నాడు. మోకాళ్ల చిప్పలు బయటికి పొడుచుకొచ్చాయి. అతని రూపంలో ఏదో మాటలకందనిది విన్సెంట్‌ను అమితంగా ఆకర్షించింది. తనకు తెలియకుండానే అలవోకగా జేబులోంచి పెన్సిల్ ముక్కను, ఇంటినుంచి వచ్చిన ఉత్తరాన్ని బయటికి తీశాడు. బొగ్గునుసితో నలుపెక్కిన మైదానంలోంచి వెళ్తున్న ఆ శల్యావశిష్టుని రూపాన్ని కవరు వెనకవైపు వేగంగా గీశాడు.

 

తర్వాత ఆ కవర్లోని తండ్రి ఉత్తరాన్ని తీసి చదివాడు. ఒకే ఒక ముక్క రాసి ఉంది. కాసేపయ్యాక గేటుగుండా మరో కార్మికుడు బయటికొచ్చాడు. పదిహేడేళ్ల కుర్రాడు. పొడవుగా, నిటారుగా ఉన్నాడు. నడుస్తోంటే భుజాలు చూడముచ్చటగా కదులుతున్నాయి. ఎత్తయిన రాతిగోడపక్క నుంచి రైలుపట్టాలవైపు కదలిపోతున్నాడు. విన్సెంట్ అతడు కనుమరుగయ్యేంతవరకు చూసి అతని బొమ్మ గీశాడు.

 

- పి.మోహన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement