మాతృవందనం | jeevana kalam by gollapudi marutirao | Sakshi
Sakshi News home page

మాతృవందనం

Published Sun, May 10 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

మాతృవందనం

మాతృవందనం

(జీవన కాలం)
 - గొల్లపూడి మారుతిరావు


ప్రపంచంలో అన్ని దేశాల జాతీయ గీతాలలోనూ భారత దేశపు జాతీయ గీతం గొప్పగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి సంస్థ (యునెస్కో) ప్రకటించింది. ఇది గర్వకారణం. క్రికెట్ ధర్మమా అని దాదాపు సంవత్సరం పొడుగునా అన్ని దేశాల జాతీయ గీతాలను వినే అవకాశం మనందరికీ కలిసొచ్చింది. తప్పనిసరిగా యునెస్కోకి అనిపించిన ఆలోచన మనకి వస్తూనే ఉంటుంది. ‘జనగణమన’ నిస్సందేహంగా గొప్ప గీతం. గొప్ప బాణీ. గీతంలో గాంభీర్యం, బాణీలో ఉద్ధతి ఉంది. అయితే మన మాతృవందనం ‘వందేమాతరం’ కానీ, జాతీయగీతం ‘జనగణమన’ కానీ దేశం కోసం రాసినవి కావు. అదే విచిత్రం. వందేమాతరం బంకించంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠ్’ నవలలో బ్రహ్మచారుల మఠం ప్రార్థ్ధన గీతం.

 

నేను మద్రాసు రేడియోలో పని చేసే రోజుల్లో ‘వందేమాతరం’ గీతం శత జయంతికి ‘ఆనందమఠ్’ నాటకాన్ని ప్రొడ్యూస్ చేశాను. బెంగాలీ రచన కనుక మద్దిపట్ల సూరి గారిని నాటకం రాయమన్నాను. నాటకాన్ని చదవకుండానే 18 కాపీలు రాయించి - నటుల్ని బుక్ చేశాం. దేవిక, అట్లూరి పుండరీకాక్షయ్య, పట్టాభిరామిరెడ్డి, రావి కొండలరావు, మమత - ఇలాగ. వందేమాతరం బృందగానానికి బాలసుబ్రహ్మణ్యాన్ని బుక్ చేశాం. పుండరీకాక్షయ్యగారు తమ ఆఫీసులో రిహార్సల్స్ చేద్దామన్నారు. తీరా స్క్రిప్టు చదవడం ప్రారంభిస్తే - ఒక్కొక్కరికీ రెండేసి డైలాగులు వచ్చాయి. నాటకాన్ని రాసిన మద్దిపట్ల సూరిగారు - మూలాన్ని అనుసరించి రాశారేగానీ నటులని దృష్టిలో పెట్టుకు రాయలేదు. అది ఆయన తప్పుకాదు. నాకు మతిపోయింది. 18 మందితో గంట నాటకం. అందరూ పెద్ద నటులు. స్క్రిప్టు ఇలా కొంపముంచింది.

ఆ రోజుకి రిహార్సల్స్ చాలించి - ఇంటికొచ్చి రాత్రికి రాత్రి గంట నాటకం తిప్పి రాశాను - ఈసారి నటులను దృష్టిలో పెట్టుకుని. మళ్లీ ఈ రచనకు కాపీలు రాయాలి. మర్నాడు రోజంతా మా ఆవిడా, మా ఇంటి ఎదురుగా ఉన్న అనిశెట్టి సుబ్బారావుగారి భార్యా 18 కాపీలు తయారు చేశారు. ఈసారి నటులంతా తృప్తిపడ్డారు. ఈలోగా బాలు రికార్డింగుకి రాలేకపోతున్నానని చిన్న చీటీ పంపారు. ఏం చెయ్యాలి? ‘ఎస్. జానకి చేత పాడించేస్తాను’ అన్నారు అనౌన్సర్ మల్లంపల్లి ఉమామహేశ్వరరావుగారు. రిహార్సల్స్ హడావుడిలో ఉన్నానేమో - సరేనన్నాను. స్టూడియోలో పాట  రికార్డు అయిపోయింది.

 

నాటకం బాగా వచ్చింది. కాని పెద్ద పొరపాటు - నాటకంలో బ్రహ్మచారుల సంస్థ ప్రార్థనా గీతాన్ని స్త్రీ పాడటం. ఆఫీసులో దుమ్ము లేచింది. నాకు పచ్చివెలక్కాయ నోట్లో పడింది. అయితే సందర్భం ‘వందేమాతరం’ శత జయంతి కనుక, అది మన జాతి గీతం కనుక - నవలలో భాగంగా కాక - జాతి వందనంగా స్త్రీల బృందగానంతో దాన్ని జనరలైజ్ చేశానని అన్నాను. ఇది నిజానికి బుకాయింపే. కాని పబ్బం గడిచిపోయింది!

 

ఇక - జనగణమన. 1911లో మన దేశంలో జరిగిన 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా రవీంద్రుడు మదనపల్లి థియోసాఫికల్ వసతి గృహంలో కూర్చుని రాసిన గీతం - చక్రవర్తికి నివాళులర్పిస్తూ. మొన్న 2011లో కొన్ని వందల మంది మదనపల్లిలో ఈ గీతాన్ని శతజయంతి సందర్భంగా పాడారు. గీతం ‘అధినాయకుని’ ఉద్దేశించి రాసినది. మనది మాతృదేశం. నిజానికి ‘అధినాయకి’ అని ఉండాలి కదా? మిగతా చరణాలలో ఒకచోట ‘తవ సింహాసన పాషే’ అంటారు కవి - ఆయన సింహాసనాన్ని అధిష్టించే సందర్భం కనుక. ‘జయ జయ రాజేశ్వర’ అంటారు మరొకచోట.


మన దేశంలో జాతీయగీతం స్థాయికి రాగల గొప్ప రచనలున్నాయి. ‘సారే జహా సె అచ్చా హిందూ సితా హమారా’ అన్న ఇక్బాల్ గీతం గొప్పది. కాని ‘హిందుస్తాన్ మనదే’ అంటూ ఆయన పాకిస్తాన్‌కి తరలిపోయారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి’ అన్నగీతం ఏ జాతీయ గీతానికీ తీసిపోదు. జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం పాపులర్ చేసిన ‘జయతి జయతి భారతమాతా’ అన్న మాయవరం విశ్వనాథశాస్త్రి గీతం అపూర్వమైనది.


చిన్నప్పుడు మన నోళ్లలో కదిలే మరో గొప్ప గీతం: ‘నమో హిందు మాతా - సుజాతా - నమో జగన్మాతా! విపుల హిమాద్రులె వేణీ భరముగ, గంగా యమునలె కంఠహారముగ, ఘన గోదావరి కటి సూత్రమ్ముగ, కనులకు పండువు ఘటించు మాతా - నమో హిందు మాతా’. రచయిత గరిమెళ్ల సత్యనారాయణ. ఆయన పేరు చాలా మందికి వెంటనే గుర్తురాకపోవచ్చు- ‘మాకొద్దీ తెల్లదొరతనమూ’ రాసిన కవి.


మహాత్మాగాంధీ, నెహ్రూ గార్లకు అత్యంత ఆప్తులు రవీంద్రులు. కాగా - దక్షిణ భారతదేశపు ఆణిముత్యాలు వారి చెవుల దాకా ప్రయాణం చేసి ఉండవు. ఏమయినా - యునెస్కో వంటి సంస్థలు మన జాతీయ గీతానికి కితాబులిచ్చినప్పుడు, బ్రిటిష్ మహారాజు గారిని పొగుడుతూ రాసినా - 36 సంవత్సరాల తర్వాత ‘అమ్మ’కి నివాళిగా జాతీయగీతం చేసుకున్నందుకు గర్వంగానే ఉంటుంది - ‘అయ్యో - ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా!’ అని ఒక పక్క మనసులో అనిపిస్తున్నా.
 (ఈ కాలమ్ ఇకపై ప్రతి గురువారం వస్తుంది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement