gollapudi marutirao
-
హనుమంతుని తోక
ఈ మధ్య ‘హిందు త్వం’కు పట్టినంత దుర్గతి మరి దేనికీ పట్టలేదు. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ దగ్గర్నుంచి, నవలా రచయిత్రి అరుం ధతీ రాయ్ దగ్గర్నుంచి, నేలబారు రాజకీయ నాయ కులు, కొందరు పాత్రి కేయుల దాకా అంతా ‘హిందుత్వా’న్ని వాడటం పేషన్. ఆ మధ్య దేవుడికి కనకాంబరం పువ్వులు ఎవరో అలంకరించారు. ఒకాయన అడిగాడు: ‘ఏం బాబూ.. మీరు హిందుత్వ ప్రచారకులా?’ అని. ఒక్క విషయం చెప్పుకోవాలి– మతానికీ, హిందు త్వానికీ ఎట్టి సంబంధమూ లేదు. అయితే ఎన్నిక లకు ‘హిందుత్వ’ ఓటరుని లొంగదీసుకోవడమే ఒడుపు. ఆ పని మన రాహుల్ గాంధీ గారికి తెలిసినట్టు, చేస్తున్నట్టు మోడీగారికి తెలియదని నా ఉద్దేశం. ఈసారి ఎన్నికలు హిందుత్వానికి మతాతీతమైన సిద్ధాంతాలకీ పోటీ. ఒకరు హిందుత్వానికి ప్రతినిధి. మరొకాయన ఇటలీ తల్లి సుపుత్రుడు. కానీ ఓటరుకి ఆయనా తాము ‘హిందుత్వా’నికి వ్యతిరేకి కాదని ఎలా నిరూపించాలి? (ఎందుకూ!) రాహుల్ గాంధీని కొట్టిపారేయడానికి వీలులేదు. వారు ఈ మధ్యనే హిందువులంతా కలలు గనే కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్లారు. (వాటికన్‌కి ఎందుకు వెళ్లి రాలేదు?) కర్ణాటక విమాన ప్రమాదం తప్పాక దేవునికి కృతజ్ఞతా సూచకంగా హిమాలయాలను ఎక్కారు. గుజరాత్లో ఎన్నో దేవాలయాలకు వెళ్లి, నెత్తినిండా విబూతి రాసుకుని దేవుళ్లకి మొక్కారు. మధ్య మధ్య భగవద్గీత పురాణాల గురించి తమ ప్రసంగాలలో గుప్పిస్తున్నారు. ఇప్పుడు వారికి తమమీద ‘హిందుత్వం’ఎంతో కొంత ఆవహించిం దని నమ్మకం కుదిరింది. మొన్న ఒకానొక సభలో మోదీ గారిని ఉద్దేశించి ‘ఆయన ఏం హిందూ’ అని ఎద్దేవా చేశారు. మోదీగారు వెనుకంజ వేసి ‘నిజమే నాకు హిందుత్వం గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. అయితే మహామహులైన మత గురువులకే హిందుత్వమంటే ఏమిటో ఈ దేశంలో అవగాహన కాలేదు. నేను కేవలం ‘కార్యకర్త’ని, రాహుల్ గాంధీ గారు కుటుంబ ‘వ్యవహర్త’ అన్నారు. తెలుగులో ఈ మాటకి ‘రుచి’ రాలేదు. నేను ‘కామ్దార్’ని ఆయన ‘నామ్‌దార్’ అన్నారు.అయ్యా మోదీగారూ! తరతరాల జాతి విశ్వా సాలకు కొత్త అర్థాలను వెతుకుతూ, మన పురాణా లకూ, దేవుళ్లకూ, పురాణ ఇతిహాసాలకూ కొత్త అన్వయాలను చెప్పగల మహానుభావులు తమ పార్టీలోనే ఉన్నారు. నమూనాకు రెండు నామధే యాలు. ఉత్తర ప్రదేశ్‌లో బైరిక్ పార్లమెంట్ సభ్యు రాలు సావిత్రిబాయి పూలే ఒకరు. మరొకరు ఈ జాతికి విజ్ఞానాన్ని పంచే రచయిత.లక్నోలో ఒకానొక సభలో లక్ష్మణ్ గైక్వాడ్ అనే మరాఠీ రచయిత ఒక భాషణ చేశారు. గైక్వాడ్ అన్నారు: ‘‘రామాయణంలో హనుమంతుడు దళి తుడు. ఆయనకి ఒక తోకపెట్టి, వ్యక్తిని నల్లగా తయారుచేసి దళితుల్ని వెనుకబడినవారిగా ఉంచా లని ఈ పురాణ కవుల కుట్ర.హనుమంతుడు తన ప్రభువైన రాముడికి తన భక్తిని, విశ్వాసాన్ని చూపడానికి రొమ్ము చీల్చి చూపవలసి వచ్చింది. ఇది దళితుల ‘పీడన’కి నిదర్శనం. ప్రతీసారి ఈ విధంగా తమ ఉనికి ‘దళితులు’ నిరూపించుకోవలసి వచ్చింది. దళితులని నిజంగా హిందువులు గౌరవిస్తున్నా రని నిరూపించదలచుకుంటే ఓ దళితుడిని– ఓ చర్మ కారుడిని– ‘శంకరాచార్య’ని చేయండి. లేదా బాలాజీ గుడిలో అర్చకుడిని చేయండి. చేయలేక పోతే ముందు దేవాలయాలను జాతీయం చెయ్యండి. ప్రపంచం ఒక పక్క అంతరిక్షంలోకి పోతుంటే సంస్కృతి, మతం పేరిట భారతదేశం వెనక్కి పోతోంది.ఈ హిందువులే దళితులను ‘వానర సేన’ అన్నారు. మేం ఎల్లకాలం ఈ వానర సేనగానే ఉండాలా? ఎప్పటికయినా ‘పాలకులం’ కావద్దా? రామాయణం కూడా ఈ మత విచక్షణనే ప్రచారం చేసింది. రాముడు– ఒక బ్రాహ్మణుడు నింద వేశా డని శూద్రుడయిన ‘శంభుకుడు’ని చంపాడు. హను మంతుడిని భక్తుడనకండి. రాముడిని దేవుడనకండి. అందరూ సమానంగా ఉండాలి’’.అయితే గైక్వాడ్ గారికి నాదొక విన్నపం. దళితుల్ని చిన్నచూపు చూసే మత పీఠాధిపతి ‘శంక రాచార్య’ పదవి మళ్లీ దళితునికి ఎందుకు? మతాన్ని దుర్వినియోగం చేసిన ఈ దిక్కుమాలిన దేవుళ్ల ఆల యాలలో మళ్లీ దళితులకి అర్చకత్వం ఎందుకు? ఈ రామాయణాన్ని రచించిన కవి కూడా ఒక దళితుడే నని వారు మరిచిపోయారా? గైక్వాడ్‌గారూ! హిందుత్వం అంటే గుడులూ, గోపురాలూ, దేవుళ్లూ కాదు. ఒక జీవన విధానం. వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, పురా ణాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా– మానవుని జీవన విధానాన్ని గురించే వేదం చదువుకున్న ఒక మేధావి అన్నాడు. Vedas are highly secular. Because they propound a way of life. చిత్రం బాగులేకపోతే రంగు తప్పుకాదు. గొల్లపూడి మారుతీరావు -
నివాళి ఆకాశం
జీవన కాలమ్ నాకు చాలా ఇష్టమైన ఫొటోలలో ఇది మొదటిది. మా శ్రీనివాస్ స్మారక పురస్కార సభకి కచ్చేరీ చెయ్యడానికి పద్మవిభూషణ్ అంజాద్ అలీ ఖాన్ని ఆహ్వానించాం. అదొక అపూర్వమైన సాయంకాలం. సభాసదుల్ని మైమరపించిన కచేరీ. అంతకు ముందు ఆయన్ని ఆహ్వానించడానికి కామరాజ్ హాలు ముందు మా అబ్బాయిలతో నిలబడ్డాను. కారాగింది. అంజాద్ అలీఖాన్ దిగారు. ముందుగా అనుకుని చేసినది కాదు. వారిని చూడగానే ముందుకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించబోయాను. ఆయనా ఊహించి ఉండరు. కానీ ఆయనా అంతే హఠాత్తుగా నా పాదాలకు వంగారు. ఒక మహా సంగీతకారుడి పట్ల నా గౌరవం అలా ఉండగా – ఒక మహా సంగీతకారుడి ‘వినయ సంపద’కి అది మచ్చు తునక. మా పిల్లలూ, మనుమడూ అంతా అబ్బురంతో ఈ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. ఇదీ ఈ అరుదయిన ఫొటో కథ. కాశీ వెళ్లినప్పుడు–రెండే దర్శనాలు నా మనసులో ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుడు. భారతరత్న బిస్మిల్లాఖాన్. మొదటి దర్శనం అందరూ చేసుకునేదే. చల్లా లక్ష్మణరావుగారు బిస్మిల్లాఖాన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు. కాశీ విశ్వవిద్యాలయంలో నా ఉపన్యాసాన్నీ ఏర్పాటు చేశారు. అప్పుడు కాశీ విశ్వవిద్యాలయం కులపతి సింహాద్రి అనే తెలుగాయన. ఇప్పుడది కష్టమూకాదు. కారణం– నా అభిమాని, నన్ను గురువుగా భావించే బూదాటి వేంకటేశ్వర్లుగారు అక్కడి తెలుగు విభాగానికి అధ్యక్షులు. సరే, బిస్మిల్లాఖాన్ దర్శనానికి నేనూ, మా ఆవిడా బయలుదేరాం. మాకు ఫొటోలు తీయడానికి మా ఇంటి పురోహితులు గోరంట్ల లక్ష్మీనారాయణశాస్త్రి గారు వచ్చారు. వెళ్తూ సరాసరి దంపతులం ఇద్దరమూ ఆయనకి పాదాభివందనం చేశాం. మేమెవరమో ఆయనకు తెలీదు. నా పేరు చెప్పినా తెలుసుకునే అవకాశం లేదు. మా ఆవిడని పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణిగారి అమ్మాయిగా పరిచయం చేశాను. అప్పుడూ ఆయన స్పందించలేదు. గంట తర్వాత లేచి బయలుదేరబోతూంటే–ఇబ్బందిగా మరోసారి నాపేరు అడిగారు. మేం బిస్మిల్లాఖాన్కి పాదాభివందనం చేయడం శాస్త్రి గారికి ఇష్టం లేదు. ఆయన ఎరికలో నా పరపతి గొప్పది. నా మనస్సులో బిస్మిల్లాఖాన్ ఆకాశం. చాలా సంవత్సరాల కిందట– నేనూ, మిత్రులు శోభన్‌బాబూ తణుకులో ‘బలరామ కృష్ణులు’ షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలోనే మన ప్రధాని పీవీ నరసింహారావుగారు పుట్టపర్తి వెళ్లారు. సభలో సత్యసాయిబాబాకు పాదాభివందనం చేశారు. అది పేపర్లో వచ్చింది. శోభన్‌బాబుకి ఈ దేశపు ప్రధాని బహిరంగ సభలో బాబా గారికి అలా పాదాభివందనం చేయడం నచ్చలేదు. ఆ మాట నాతో అన్నారు. ప్రణామానికి పునాది మన విశ్వాసం, సంస్కారం, సౌజన్యం, కర్తవ్యం, నివాళి. ఈ దేశానికి జ్ఞాన బిక్షను పెట్టిన ఆది శంకరులు ఒక మ్లేచ్చుడికి పాదాభివందనం చేసి– ‘జ్ఞానానికీ, విజ్ఞతకీ’ కులం లేదని నిరూపించారు. ఎంత మహానుభావుడైనా– సన్యసించాక లోకమంతా ఆయనకి పాదాభివందనం చేస్తుంది. చెయ్యాలి– తండ్రి అయినా సరే. కానీ అతను పాదాభివందనం విధిగా చెయ్యాల్సిన ఒక రుణం ఆ బొంది ఉన్నంతవరకూ ఉంటుందట. తన మాతృమూర్తికి ఆ రుణం ఆ జన్మకి తీరేది కాదు. మరి భగవంతుడికి? కనీసం తను విశ్వసించే భగవంతుడికి? మరునాడు కాలమ్ రాసి శోభన్ బాబుకి చదివి వినిపించాను. ‘ఇలా చూసినప్పుడు– ఆయన చర్య సబబుగానే ఉంది’ అన్నారు. సంస్కారానికి ఎల్లలు లేవు. వినయానికి షరతులు లేవు. ఎదిగినకొద్దీ ఒదగడమే సంస్కారం. జీవితమ్మెల్ల బహు శాస్త సేవలందు గడిపితిని; రహస్యములు చాలా గ్రాహ్యమయ్యె, ఇప్పుడు వివేకనేత్రమ్ము విప్పి జూడ, తెలిసికొంటి నాకేమి తెలియదంచు– ఇది దువ్వూరి రామిరెడ్డిగారి మాట – ‘పానశాల’లో. 1952–53లో కాకినాడ సరస్వతీ గానసభ స్వర్ణోత్సవాలకు బడేగులాం ఆలీఖాన్ని ఆహ్వానించారు. ఉత్సవాల కన్వీనర్ ఎమ్.వి. శాస్త్రిగారు, మహా గాయకుడు, వాగ్గేయకారుడూ జీఎన్ బాలసుబ్రహ్మణ్యం క్లాస్మేట్స్. బడే గులాం కచ్చేరీకి కొన్ని షరతులు పెట్టారు: పోల్సన్స్ బట్టర్తోనే వంట చెయ్యాలి. రోజూ చికెన్ ఉండాలి. క్రేవెన్ ‘ఏ’ సిగరెట్లు, స్కాచ్ ఉండాలి–అని. బడే గులాం ఆలీ ఖాన్ కచ్చేరి అయ్యాక–సభలో ఆయన రెండు పాదాలమీదా తల ఆనించి పాదాభివందనం చేశారు జీఎన్బి.. రోజూ విధిగా మాంసాహారం, స్కాచ్ ఉండాలన్న బడేగులాంని, వారి సిబ్బందినీ రోజుల తరబడి తమ ఇంట్లో ఉంచుకుని సేవించారు ఘంటశాల. బిస్మిల్లా ఖాన్ మీద కాలమ్ రాసి ముగిస్తూ ఓ మాట అన్నాను, నా పేరే గుర్తు లేని ఆ మహా విద్వాం సుని గురించి: గంగానదిలో లక్షలాదిమంది రోజూ స్నానం చేసి తరిస్తారు. వారెవరో గంగానదికి తెలియనక్కరలేదు–అని. ఈ ఫొటో చూసినప్పుడల్లా–నా అభినందన కాదు. ఆ మహా వృక్షం తలవొంచడం అపురూపంగా, అపూర్వంగా అనిపిస్తూంటుంది. గొల్లపూడి మారుతీరావు -
‘‘పదుగురాడు మాట’’
జీవన కాలమ్ సంప్రదాయాలు జాతి మనుగడలో, సంవత్సరాల రాపిడిలో క్రమంగా రూపు దిద్దుకుంటాయి. వీటికి నిబంధనలు ఉండవు. ఆచారమే ఉంటుంది. కొండొకచో అర్థం కూడా ఉండదు. అనుభవమే ఉంటుంది. దశాబ్దాల కిందట–రాజారామమోహన్‌రాయ్– సతీసహగమనాన్ని ఎదిరించినప్పుడు–కొందరు షాక య్యారు. కొందరు అడ్డం పడ్డారు. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే–ఆ దురాచారం ఎంత అర్థరహి తమో, దురన్యాయమో అందరికీ అవగతమౌతుంది. ఆచారం ఆ కాలానిది. మనిషి తన సంస్కారంతో, సహేతుకమైన విచక్షణతో తనని తాను సంస్కరించు కుంటూ పోతాడు. పోవాలి. అదీ నాగరికత మనకి ఇచ్చిన సంపద. ఒకప్పుడు ఆదిమానవుడు పచ్చి మాంసం తిన్నాడు. నిజానికి తోటి మనుషుల్నే తిన్నాడు. ఇప్పటికీ కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాల్లో cannibals ఉన్నారంటారు. అయితే ఈనాటి మాన వుడు తన అవసరాలకి, ఆహారానికి ఎంత గొప్ప పరిణతిని సాధించాడు? జల్లికట్టు నాయకరాజుల కాలంలో ప్రారంభమ యిందని చరిత్ర. ‘జల్లి’ అంటే నాణాలు. ‘కట్టు’ అంటే కట్టడం. ఎద్దు కొమ్ములకి నాణాల సంచీని కట్టేవారట. ధైర్యం ఉన్న కుర్రాళ్లు దాని వెంటబడి మూపును కరుచుకుని–సంచీని దక్కించుకోవడం క్రీడ. నిజానికి సింధు నాగరికత నాటి చెక్కడాలలో ఈ క్రీడ ఛాయలు కనిపిస్తాయి. జల్లికట్టు బహుశా–ఆ రోజుల్లో సంక్రాంతికి పంట ఇంటికి వచ్చినప్పుడు–ఆ ఆనందాన్ని అనుభ వించడానికి పొగరుబోతు గిత్తలతో–కుర్రాళ్లు విశాల మైన మైదానాల్లో ఆటలాడేవారేమో! అప్పుడు గిత్తలు తిరగబడేవి. కొందరికి దెబ్బలు తగిలేవి. అయినా అదొక క్రీడగా చెల్లుబాటయి ఉండేది. ఆ రోజుల్లోనూ పిల్లల్ని వారించే పెద్దలు ఉండి ఉండొచ్చు. అయినా ఉడుకు రక్తంతో ‘మా సర దాలకు అడ్డురాకండి’ అన్న కుర్రకారు ఉండి ఉండ వచ్చు. అంతవరకే. కాలం మారింది. ఒకప్పటి అహింసాయుతమైన ఆచారం ముమ్మరమయి, ఎద్దులకు సారా పట్టి, కళ్లల్లో కారం జల్లి, తోకలు కత్తిరించి, కొరికి, రెచ్చ గొట్టి–వందలాది మందిని చూసి బెదిరి పరిగెత్తే ఎద్దును వెంటాడి–దాని పరుగు ‘ఆత్మరక్షణ’ కన్న విషయం మరిచిపోయి–‘జల్లికట్టు’ మా జాతికి ప్రతీక అని పంజా విప్పే ‘పార్టీ’ల చేతుల్లోకి ఉద్యమం వెళ్లి పోయింది. మొన్న మెరీనా బీచ్‌లో ఉద్యమం చేసిన వందలాది యువకులకు ‘జల్లికట్టు’ అంటే ఏమిటో తెలియదని ఓ పత్రిక స్పష్టంగా రాసింది. 2010–2014 మధ్య కనీసం 11 వందల మంది ఈ క్రీడల్లో గాయపడ్డారు. కనీసం 17 మంది చచ్చి పోయారు. ఇవి పత్రికలకు అందిన లెక్కలు. అసలు నిజాలు ఇంకా భయంకరంగా ఉండవచ్చు. 2014లో సుప్రీం కోర్టు జీవకారుణ్య సంస్థ ప్రమేయంతో ఈ క్రీడని నిషేధించింది. 2017లో ఆ తీర్పుని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జాతిగా తమిళులు ఆవేశపరులు. ఆవేశానికి ఏనాడూ ‘విచక్షణ’ చుక్కెదురు. ‘జల్లికట్టు’ అహిం సాయుతంగా జరిగే క్రీడ–అని వాక్రుచ్చిన నేప థ్యంలో రెండురోజుల క్రితం పుదుక్కోటై్టలో ఇద్దరు చచ్చిపోయారు. 28 మంది గాయపడ్డారు. తన మీద దూకే వందలాది మంది నుంచి నిస్స హాయంగా తప్పించుకుపోవాలనే జంతువు కళ్ల నుంచి కారే కారం నీళ్లూ, ముక్కు నుంచి కారే రక్తమూ, కడుపులో కలవరపెట్టే మాదక ద్రవ్యాలూ మెరీనా బీచ్‌లో ‘జాతి గర్వకారణమ’ని గగ్గోలు చేసే ప్రజానీకానికి ఎందుకు కనిపించడం లేదో, ఒక్క సుప్రీంకోర్టుకే ఎందుకు కనిపిస్తున్నాయో మనకు అర్థమౌతుంది. తమిళనాడులో సమర్థమయిన నాయకత్వం ఉంటే ఏమయేదో మనకు తెలీదు. ఇవాళ ఉన్న నాయ కత్వాన్ని నిలుపుకోవడానికి రాష్ట్రానికి కేంద్రం మద్దతు కావాలి. కేంద్రానికి–మారిన నాయకత్వంతో పొత్తు కావాలి. ఫలితం–జల్లికట్టుని చట్టబద్ధం చేసిన ఆర్డినెన్స్. సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టే మార్గం దొరికింది కనుక–ఇప్పుడిక కర్ణాటకలో కంబాల క్రీడకి (అప్పుడే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యగారు, సదా నందగౌడ నోరు విప్పారు), ఆంధ్రప్రదేశ్‌లో కోడి పుంజుల ఆటకి, అస్సాంలో బుల్బుల్ పందాలకు, మహారాష్ట్రలో ఎద్దుబళ్ల పందాలకూ, ఉత్తరాఖండ్‌లో గేదెల్ని పరిగెత్తించి వేటాడే సంబరాలకూ–కనీసం ఐదారు ఆర్డినెన్సుల కోసం ఎదురుచూడవచ్చు. ప్రజాభిప్రాయానికి తరతరాల సంప్రదాయం పెట్టుబడి. చట్టానికి–కేవలం జరిగే అనర్థమే కొలమానం. ‘విచక్షణ’ క్రూరమయిన నిర్ణయాలు చేస్తుంది. ప్రజాభిప్రాయం దానికి దొంగదారులు వెదుకుతుంది. ‘‘శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానూ’’ చెప్తుంది అన్నారు పింగళి నాగేంద్ర రావుగారు ‘మాయాబజార్’లో. శాస్త్రం స్థానంలో ‘చట్టం’ అన్న మాటని చదువుకుని మనం నోరు మూసుకోవడం తక్షణ కర్తవ్యం. గొల్లపూడి మారుతీరావు -
వ్యక్తి-వ్యవస్థ-అవ్యవస్థ
జీవన కాలమ్ ``మారే వ్యవస్థతోపాటు కాలానుగుణంగా వ్యక్తి తనని తాను అన్వయించుకుంటా డని, అన్వయించుకోవాలని - ఈ పరిణామశీలాన్ని ‘అరాచకం’గా కాక ‘పరి ణతి’గా గ్రహించాలని పాకిస్తాన్‌లోని మత వ్యవస్థ గుర్తించకపోవడం దురదృష్టం. ఈ మధ్య పేపర్లో ఒక వార్త వచ్చింది. పాకిస్తాన్లో ఇస్లాం మతానికి సంబంధించిన విష యాల మీద ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే ‘మత సంస్థ’ మహిళా సంక్షేమ సూత్రాలను ప్రకటించింది. ఈ సంస్థ సూచనల ప్రకారం భర్తలు అప్పుడప్పుడు భార్యల్ని ‘సున్నితంగా’ కొట్టవచ్చునట. రకరకాల కారణాలను సూచిస్తూ - భర్తల మాటలను లక్ష్య పెట్టని భార్యల్ని కొట్టే హక్కు, అవసరం ఉన్నదని ఈ సంస్థ వక్కాణిం చింది. అయితే ఇందులో చిన్న సందిగ్ధత ఉంది. ‘సున్ని తంగా’ అంటే ఎలా? ఏఏ కారణాలకు ఎంతెంతగా కొట్ట వచ్చు, అన్న విషయాన్ని ఈ సంస్థ తేల్చలేదు. కేవలం చెంపదెబ్బతో సరిపెట్టుకోవచ్చునా, చిన్న కర్రతో కొడితే చాలునా, లేదా మొట్టికాయ, తొడపాశం, జెల్లకాయ వంటివి సరిపోతాయా? చెవి పిండటం, ముక్కు కొర కడం, బుగ్గ పాశం వంటివి చెయ్యవచ్చునా? ఎక్కువ కోపం వచ్చినప్పుడు కాలుని వాడవచ్చునా, లేదా చేతిలో ఉన్న వస్తువుతో ముఖం మీద కొట్టవచ్చునా - ఇలాంటి విషయాలను నిర్దుష్టంగా ఈ సంస్థ తేల్చి చెప్పలేదు. స్త్రీలు వినోద స్థలాలకు వెళ్లడం, విహార యాత్రలకు వెళ్లడాన్ని ఈ మత సంస్థ తిరస్కరించింది. కళ పేరిట నాట్యం, సంగీతం, శిల్పం - వంటివి నిషిద్ధం. భర్తల అనుమతి లేకుండా భార్యలు కుటుంబ నియంత్రణ మాత్రలు కూడా వేసుకోకూడదు. స్త్రీలు ముఖాన్ని భర్తకి తప్ప ఎవరికీ చూపకూడదు. చదువుకోకూడదు. పరాయి మగాళ్ల ముందు పళ్లు కనిపించేలాగ నవ్వరాదు. హాస్యాన్ని చెప్పరాదు. కొత్తవారితో మాట్లాడినా, అసలు గట్టిగా మాట్లాడినా, భర్త అనుమతి లేకుండా పరాయి పురుషుడికి ఆర్థిక సహాయం చేసినా - ‘సుతారంగా’ భార్యల్ని కొట్టవచ్చు. అయితే ఎలా కొట్టాలో ఆయా భర్తలు ఆయా సందర్భాలను బట్టి నిర్ణయించు కోవలసిందే. పురుషాధిక్యతకు, నిరంకుశమయిన పురు షుల జులుంకు సాధికారక చట్రాన్ని తయారు చేసిన మతపరమైన శాంక్షన్ ఇది. ఒక్క చదువు విష యంలోనే అవ్యవస్థని ఎదిరించి మలాలా యూసఫ్ జాయ్ వంటి అమ్మాయిలు దాదాపు మృత్యువు ఎదు టనే నిలిచారు. ఈ సందిగ్ధాన్ని పోగొట్టడానికి, ఈ అవ్యవస్థనుంచి తమ మతాన్ని, మతం నిర్దేశించిన నియమాలను, మహి ళల్ని కొట్టే పురుషుల హక్కులను కాపాడడానికి హఫీజ్ సయీద్ వంటి నాయకులు, సయ్యద్ గిలానీ వంటి హురియత్ నాయకులు కొన్నాళ్లు కశ్మీర్ పోరాటానికి శెలవుని ప్రకటించి పోరాడాలని నాకనిపిస్తుంది. ముస్లిం సోదరులు, సోదరీమణులు మన దేశంలో ఎంత స్వేచ్ఛగా, ఎంత హుందాగా ఉండగలుగుతు న్నారో ఈ ఒక్క వార్తే రుజువు చేస్తుంది. ఇలాంటి అవ్యవస్థ బారిన పడకుండా మనం భారతరత్న బిస్మిల్లా ఖాన్, బడే గులాం ఆలీఖాన్, మహమ్మద్ రఫీ, తలత్ మహమ్మద్, నౌషాద్, పర్వీన్ సుల్తానా వంటి వారి అమోఘమయిన సంగీతాన్ని, నర్గీస్, దిలీప్‌కుమార్, మీనాకుమారి, మధుబాల వంటి వారి అమోఘమైన నటనా కౌశలాన్ని, మెహబూబ్ ఖాన్, కె.అసిఫ్ వంటి నిర్మాతల్నీ కాపాడుకోగలిగినందుకు గర్వపడవచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛని మతంతో ముడిపెడితే, రాజకీ యాల్ని మతంతో అనుసంధిస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో- ఆప్గానిస్తాన్ బామియన్ బుద్ధుని విగ్రహాల విధ్వంసం, నేటి కశ్మీర్ సమస్య మనల్ని హెచ్చరిస్తుంది. ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు పాకిస్తాన్ వంటి దేశాలకు ఇంకా ఇంకా ఎంతమంది మలాలాలు కావాలా అనిపిస్తుంది. వ్యక్తి శీలం వ్యవస్థ ధర్మాన్ని కాపాడుతుంది - అన్నది ఆర్యోక్తి. కానీ మారే వ్యవస్థతోపాటు కాలాను గుణంగా వ్యక్తి తనని తాను అన్వయించుకుంటాడని, అన్వయించుకోవాలని - ఈ పరిణామశీలాన్ని ‘అరాచ కం’గా కాక ‘పరిణతి’గా గ్రహించాలని ఆ వ్యవస్థ గుర్తిం చకపోవడమే ఈ దురదృష్టానికి కారణం. మతం పేరిట ఇంత కాకపోయినా, కొంతవరకూ తిరోగమన ధోరణిని మన ఛాందసులు ఆశ్రయించడం ఈ దేశంలోనూ జరు గుతోంది. ఈ మధ్యనే ‘తలాఖ్’ గురించి మన టీవీల్లో చర్చల్నీ, మత గురువులు వాటి ఆవశ్యకతని ఆవేశంగా సమర్థించడాన్నీ చూశాం. దాదాపు 50 ఏళ్ల కిందట ఇలాంటి విషయం మీదే నేను నాటిక రాశాను. దాని పేరు ‘రెండు రెళ్లు ఆరు’. తండ్రి మూర్ఖపు విశ్వాసాలకు తలవొంచడం, వ్యవస్థ క్రమశిక్షణకు కొలబద్ధ కాదు. అరా చకం కాదు. కొండొకచో తప్పుడు విశ్వాసాలను ఎదిరించడం కూడా క్రమశిక్షణే - అన్నది ఆ నాటిక మూల సూత్రం. సంగీతాన్ని నెత్తిన పెట్టుకోవడం అపూర్వమయిన వరమని రుజువు చేసే గాన గంధర్వులు పాకిస్తాన్లో ఉన్నారు. నూర్జహాన్, షంషాద్ బేగమ్, మెహదీ హస్సన్, గులాం ఆలీ చాలు ఈ నిజాన్ని రుజువు చేయ డానికి. మతం పేరిట ఆ దేశం ముందు ముందు ఇంకా ఎందరు అద్నాన్ సమీ, సల్మా ఆగాలను నష్టపోతుందో! గొల్లపూడి మారుతీరావు -
మార్గదర్శి-మణిపూస
జీవన కాలమ్ సరిగ్గా 19 సంవత్సరాల కిం దట దత్తా సోదరులు-అంటే పెద్దాయన శివ శక్తిదత్తా, విజ యేంద్ర ప్రసాద్ దర్శకత్వం వ హించిన చిత్రం ‘అర్థాంగి’లో మంచి పాత్రలో నటించాను. ఆ చిత్రానికి కో డెరైక్టర్ రాజ మౌళి. వారిద్దరి మధ్య ఆయన కాశీవిశ్వేశ్వరరావు నాకు చాలా ఆత్మీయ మిత్రులు. చివరి రోజుల్లో ఒక రోజంతా మా ఇంట్లో ఉండినా ‘సాయంకాలమైంది’ నవల చదివారు. శివశక్తిదత్తా గొప్ప కవి. విజయేంద్ర ప్రసాద్ మంచి కథా రచయిత. ఇది నేపథ్యం. ఇప్పటి ‘భజరంగీ భాయిజాన్’ చిత్రం ఒక మణి పూస- ఏ విధంగా చూసినా. హీరోని ధీరోదాత్తుడిగా, సర్వ శక్తిసంపన్నుడిగా చూసి చూసి విసిగిపోయిన ప్రేక్ష కులకి - ఎక్కువ చేతకాని, చాలా విషయాలు తెలియని, అబద్ధం చెప్పకూడదని నేర్చుకున్న ఓ నేలబారు పాత్ర గొప్ప రిలీఫ్. అతను ఆంజనేయభక్తుడు. రామభక్తుడు కావచ్చు కదా! సాయిభక్తుడు కావచ్చు కదా! ముందు సీనుల్లో తాలింఖానాలో కుస్తీలు చూసి మురిసిపోయే (పాల్గొనే కాదు) హీరోని పరిచయం చేశారు. ఓ మూగ పిల్ల కనబడింది. విచిత్రంగా అతనికి ముడిపడింది. వదిలించుకోవాలనుకున్నాడు. సాధ్యం కాలేదు. ఆమెను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి. ఎలాగో తెలియని అమాయకుడు. కానీ రాజీలేని నిజాయితీపరుడు. ఆ పిల్ల తల్లిదండ్రులు పాకిస్తాన్లో ఉన్నారని తెలిసింది. పాకి స్తాన్ ఎలా వెళ్లాలో తెలీదు. డబ్బు పుచ్చుకున్న ఏజెంటు ఆ పిల్లని వ్యభిచార గృహానికి అమ్మి చేతులు కడుక్కో వాలనుకున్నాడు. ఒక్కసారి- ఒకే ఒక్కసారి (కనీసం మొదటిభాగంలో) హీరో చెయ్యి చేసుకున్నాడు. తాలిం ఖానా అనుభవాన్ని, ఆంజనేయభక్తుడిని ఇక్కడ వాడా రు రచయిత. తన శక్తి చూపడానికి కాదు. కేవలం తన కోపాన్ని ప్రదర్శించడానికి. హీరో మాటలు రాని పసి పిల్లని పక్క దేశానికి తీసుకువెళ్లడానికి ప్రేక్షకులంతా ఒకటై నిలిస్తే అతని అశక్తతలోంచి క్షణక్షణం బయటపడు తున్న కొద్దీ ఆనందంతో తన్మయులయ్యారు. ఒక గొప్ప ఆదర్శం అసమర్థతని జయించడం ప్రేక్షకులకి ఆకర్షణ, ఈ చిత్రం విజయ రహస్యం. క్లైమాక్స్‌లో హీరో గారు ధీరోదాత్తులై దుర్మార్గుల్ని చావగొట్టడం ఫార్ములా. కాని ఇక్కడ పోలీసుల చేతుల్లో హీరో చిత్తుగా దెబ్బలు తిన్నా డు. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తృప్తి అత నిది. అంటే ప్రేక్షకులది. పాత్రీకరణా, నటుడూ ఏకమై లక్ష్యాన్ని సాధించిన పాత్ర. మూగపిల్ల నిస్సహాయత, అతి పవిత్రంగా, వికసించిన పువ్వులాగా మెరిసిన హర్షా లీ మల్హోత్రా హీరోకి దీటుగా కథని అలంకరించింది. పొరుగు దేశానికి అన్ని రంగాలలోను చుక్కెదురవు తున్నా- పాక్ నాయకులు పదవిలోకి వచ్చాక ప్రజల్ని మెప్పించే నినాదం, పోరాటం - కశ్మీర్. ఇది అక్కడి రాజ కీయ నాయకుల వైఫల్యాలను కప్పిపుచ్చే మలామా. కాని ప్రజల స్థాయిలో, వారి మనస్సులలో, వారి జీవన విధానంలో - మానవీయ విలువల పతనం లేదని నిరూ పించిన చక్కటి కథ ఇది. ఈ కారణానికే ఈ కథ రెండు దేశాలనూ ఆకర్షించింది. దౌత్యవర్గాలు, రాజకీయ నాయకులు, తుపాకులు, హింసాకాండ, మతం సాధించలేని అతి పెద్ద సమస్యని కేవలం మానవత్వం జయించగలదని, జయించి చూపించిన చిత్రం ‘భజరంగీ భాయిజాన్’. హ్యాట్సాఫ్ టు విజయేంద్రప్రసాద్. స్క్రీన్‌ప్లే, దర్శకుడు కబీర్ ఖాన్. మతాలకు అతీతంగా మానవత్వ విలువలకు అద్దం పట్టే ఈ చిత్రంలో మరిచిపోవాలన్నా మరిచి పోలేని గొప్ప ఆకర్షణ - హనుమంతుడి భక్తుడిగా చేసిన హీరో ముస్లిం. ముస్లిం అమ్మాయిగా చేసిన నటి- హిందువు. ఖీజిజీట జీట ్చ జట్ఛ్చ్ట ట్ట్చ్ట్ఛఝ్ఛ్ట. ఈ కథకి కొసమెరుపు- ఇలాంటి పరిస్థితులలోనే 15 సంవత్సరాల కిందట పాకిస్తాన్లో ఉండి పోయిన మరో మూగ, చెవిటి పిల్ల కథ బయటికి రావడం. ఆ అమ్మాయి రెండు దశాబ్దాలుగా మాతృదేశాన్ని గురించి కలలు కంటూ మరో భజరంగీ కోసం ఎదురుచూడడం. అయితే ఈసారి భజరంగీ అక్కరలేదు. ప్రభుత్వమే మేలుకుంది. విదేశాంగ మంత్రి స్పందించారు. మంచి సినీమా మార్గదర్శి, సూచన. ఇందులో వినో దం ఉంది. హాస్యం ఉంది. తగు మాత్రపు రొమాన్స్ ఉం ది. ఫైట్స్ ఉన్నాయి. గేలరీస్ని లొంగదీసుకోవాలన్న ప్రలోభం లేదు. అన్నిటికన్నా ముఖ్యం- ఒక గొప్ప దృశ్య ప్రక్రియ చేయవలసిన, చేయగలిగిన గొప్ప సామా జిక స్పృహ ఉంది. సినీమా సుమతీ శతకం కానక్కర లేదు. కేవలం ఊసుపోయే వినోదమూ కానక్కరలేదు. ప్రయోజనం ప్రక్రియకి రేంజ్నిస్తుంది. పెద్దరికాన్ని ఇ స్తుంది. బాధ్యతని ఇస్తుంది. జాతికి ఉపకారం చేస్తుంది. ఇంత గొప్ప ప్రయోజనాన్ని సినీమా మరిచిపోయి ఎన్నాళ్లయింది!! - గొల్లపూడి మారుతీరావు -
మాతృవందనం
(జీవన కాలం) - గొల్లపూడి మారుతిరావు ప్రపంచంలో అన్ని దేశాల జాతీయ గీతాలలోనూ భారత దేశపు జాతీయ గీతం గొప్పగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి సంస్థ (యునెస్కో) ప్రకటించింది. ఇది గర్వకారణం. క్రికెట్ ధర్మమా అని దాదాపు సంవత్సరం పొడుగునా అన్ని దేశాల జాతీయ గీతాలను వినే అవకాశం మనందరికీ కలిసొచ్చింది. తప్పనిసరిగా యునెస్కోకి అనిపించిన ఆలోచన మనకి వస్తూనే ఉంటుంది. ‘జనగణమన’ నిస్సందేహంగా గొప్ప గీతం. గొప్ప బాణీ. గీతంలో గాంభీర్యం, బాణీలో ఉద్ధతి ఉంది. అయితే మన మాతృవందనం ‘వందేమాతరం’ కానీ, జాతీయగీతం ‘జనగణమన’ కానీ దేశం కోసం రాసినవి కావు. అదే విచిత్రం. వందేమాతరం బంకించంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠ్’ నవలలో బ్రహ్మచారుల మఠం ప్రార్థ్ధన గీతం. నేను మద్రాసు రేడియోలో పని చేసే రోజుల్లో ‘వందేమాతరం’ గీతం శత జయంతికి ‘ఆనందమఠ్’ నాటకాన్ని ప్రొడ్యూస్ చేశాను. బెంగాలీ రచన కనుక మద్దిపట్ల సూరి గారిని నాటకం రాయమన్నాను. నాటకాన్ని చదవకుండానే 18 కాపీలు రాయించి - నటుల్ని బుక్ చేశాం. దేవిక, అట్లూరి పుండరీకాక్షయ్య, పట్టాభిరామిరెడ్డి, రావి కొండలరావు, మమత - ఇలాగ. వందేమాతరం బృందగానానికి బాలసుబ్రహ్మణ్యాన్ని బుక్ చేశాం. పుండరీకాక్షయ్యగారు తమ ఆఫీసులో రిహార్సల్స్ చేద్దామన్నారు. తీరా స్క్రిప్టు చదవడం ప్రారంభిస్తే - ఒక్కొక్కరికీ రెండేసి డైలాగులు వచ్చాయి. నాటకాన్ని రాసిన మద్దిపట్ల సూరిగారు - మూలాన్ని అనుసరించి రాశారేగానీ నటులని దృష్టిలో పెట్టుకు రాయలేదు. అది ఆయన తప్పుకాదు. నాకు మతిపోయింది. 18 మందితో గంట నాటకం. అందరూ పెద్ద నటులు. స్క్రిప్టు ఇలా కొంపముంచింది. ఆ రోజుకి రిహార్సల్స్ చాలించి - ఇంటికొచ్చి రాత్రికి రాత్రి గంట నాటకం తిప్పి రాశాను - ఈసారి నటులను దృష్టిలో పెట్టుకుని. మళ్లీ ఈ రచనకు కాపీలు రాయాలి. మర్నాడు రోజంతా మా ఆవిడా, మా ఇంటి ఎదురుగా ఉన్న అనిశెట్టి సుబ్బారావుగారి భార్యా 18 కాపీలు తయారు చేశారు. ఈసారి నటులంతా తృప్తిపడ్డారు. ఈలోగా బాలు రికార్డింగుకి రాలేకపోతున్నానని చిన్న చీటీ పంపారు. ఏం చెయ్యాలి? ‘ఎస్. జానకి చేత పాడించేస్తాను’ అన్నారు అనౌన్సర్ మల్లంపల్లి ఉమామహేశ్వరరావుగారు. రిహార్సల్స్ హడావుడిలో ఉన్నానేమో - సరేనన్నాను. స్టూడియోలో పాట రికార్డు అయిపోయింది. నాటకం బాగా వచ్చింది. కాని పెద్ద పొరపాటు - నాటకంలో బ్రహ్మచారుల సంస్థ ప్రార్థనా గీతాన్ని స్త్రీ పాడటం. ఆఫీసులో దుమ్ము లేచింది. నాకు పచ్చివెలక్కాయ నోట్లో పడింది. అయితే సందర్భం ‘వందేమాతరం’ శత జయంతి కనుక, అది మన జాతి గీతం కనుక - నవలలో భాగంగా కాక - జాతి వందనంగా స్త్రీల బృందగానంతో దాన్ని జనరలైజ్ చేశానని అన్నాను. ఇది నిజానికి బుకాయింపే. కాని పబ్బం గడిచిపోయింది! ఇక - జనగణమన. 1911లో మన దేశంలో జరిగిన 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా రవీంద్రుడు మదనపల్లి థియోసాఫికల్ వసతి గృహంలో కూర్చుని రాసిన గీతం - చక్రవర్తికి నివాళులర్పిస్తూ. మొన్న 2011లో కొన్ని వందల మంది మదనపల్లిలో ఈ గీతాన్ని శతజయంతి సందర్భంగా పాడారు. గీతం ‘అధినాయకుని’ ఉద్దేశించి రాసినది. మనది మాతృదేశం. నిజానికి ‘అధినాయకి’ అని ఉండాలి కదా? మిగతా చరణాలలో ఒకచోట ‘తవ సింహాసన పాషే’ అంటారు కవి - ఆయన సింహాసనాన్ని అధిష్టించే సందర్భం కనుక. ‘జయ జయ రాజేశ్వర’ అంటారు మరొకచోట. మన దేశంలో జాతీయగీతం స్థాయికి రాగల గొప్ప రచనలున్నాయి. ‘సారే జహా సె అచ్చా హిందూ సితా హమారా’ అన్న ఇక్బాల్ గీతం గొప్పది. కాని ‘హిందుస్తాన్ మనదే’ అంటూ ఆయన పాకిస్తాన్‌కి తరలిపోయారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి’ అన్నగీతం ఏ జాతీయ గీతానికీ తీసిపోదు. జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం పాపులర్ చేసిన ‘జయతి జయతి భారతమాతా’ అన్న మాయవరం విశ్వనాథశాస్త్రి గీతం అపూర్వమైనది. చిన్నప్పుడు మన నోళ్లలో కదిలే మరో గొప్ప గీతం: ‘నమో హిందు మాతా - సుజాతా - నమో జగన్మాతా! విపుల హిమాద్రులె వేణీ భరముగ, గంగా యమునలె కంఠహారముగ, ఘన గోదావరి కటి సూత్రమ్ముగ, కనులకు పండువు ఘటించు మాతా - నమో హిందు మాతా’. రచయిత గరిమెళ్ల సత్యనారాయణ. ఆయన పేరు చాలా మందికి వెంటనే గుర్తురాకపోవచ్చు- ‘మాకొద్దీ తెల్లదొరతనమూ’ రాసిన కవి. మహాత్మాగాంధీ, నెహ్రూ గార్లకు అత్యంత ఆప్తులు రవీంద్రులు. కాగా - దక్షిణ భారతదేశపు ఆణిముత్యాలు వారి చెవుల దాకా ప్రయాణం చేసి ఉండవు. ఏమయినా - యునెస్కో వంటి సంస్థలు మన జాతీయ గీతానికి కితాబులిచ్చినప్పుడు, బ్రిటిష్ మహారాజు గారిని పొగుడుతూ రాసినా - 36 సంవత్సరాల తర్వాత ‘అమ్మ’కి నివాళిగా జాతీయగీతం చేసుకున్నందుకు గర్వంగానే ఉంటుంది - ‘అయ్యో - ఇంకా పరాయి ప్రమేయం మాతృవందనంలోనూ తప్పలేదా!’ అని ఒక పక్క మనసులో అనిపిస్తున్నా. (ఈ కాలమ్ ఇకపై ప్రతి గురువారం వస్తుంది)