‘‘పదుగురాడు మాట’’
జీవన కాలమ్
సంప్రదాయాలు జాతి మనుగడలో, సంవత్సరాల రాపిడిలో క్రమంగా రూపు దిద్దుకుంటాయి. వీటికి నిబంధనలు ఉండవు. ఆచారమే ఉంటుంది. కొండొకచో అర్థం కూడా ఉండదు. అనుభవమే ఉంటుంది.
దశాబ్దాల కిందట–రాజారామమోహన్‌రాయ్– సతీసహగమనాన్ని ఎదిరించినప్పుడు–కొందరు షాక య్యారు. కొందరు అడ్డం పడ్డారు. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే–ఆ దురాచారం ఎంత అర్థరహి తమో, దురన్యాయమో అందరికీ అవగతమౌతుంది. ఆచారం ఆ కాలానిది. మనిషి తన సంస్కారంతో, సహేతుకమైన విచక్షణతో తనని తాను సంస్కరించు కుంటూ పోతాడు. పోవాలి. అదీ నాగరికత మనకి ఇచ్చిన సంపద. ఒకప్పుడు ఆదిమానవుడు పచ్చి మాంసం తిన్నాడు. నిజానికి తోటి మనుషుల్నే తిన్నాడు. ఇప్పటికీ కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాల్లో cannibals ఉన్నారంటారు. అయితే ఈనాటి మాన వుడు తన అవసరాలకి, ఆహారానికి ఎంత గొప్ప పరిణతిని సాధించాడు?
జల్లికట్టు నాయకరాజుల కాలంలో ప్రారంభమ యిందని చరిత్ర. ‘జల్లి’ అంటే నాణాలు. ‘కట్టు’ అంటే కట్టడం. ఎద్దు కొమ్ములకి నాణాల సంచీని కట్టేవారట. ధైర్యం ఉన్న కుర్రాళ్లు దాని వెంటబడి మూపును కరుచుకుని–సంచీని దక్కించుకోవడం క్రీడ. నిజానికి సింధు నాగరికత నాటి చెక్కడాలలో ఈ క్రీడ ఛాయలు కనిపిస్తాయి.
జల్లికట్టు బహుశా–ఆ రోజుల్లో సంక్రాంతికి పంట ఇంటికి వచ్చినప్పుడు–ఆ ఆనందాన్ని అనుభ వించడానికి పొగరుబోతు గిత్తలతో–కుర్రాళ్లు విశాల మైన మైదానాల్లో ఆటలాడేవారేమో! అప్పుడు గిత్తలు తిరగబడేవి. కొందరికి దెబ్బలు తగిలేవి. అయినా అదొక క్రీడగా చెల్లుబాటయి ఉండేది. ఆ రోజుల్లోనూ పిల్లల్ని వారించే పెద్దలు ఉండి ఉండొచ్చు. అయినా ఉడుకు రక్తంతో ‘మా సర దాలకు అడ్డురాకండి’ అన్న కుర్రకారు ఉండి ఉండ వచ్చు. అంతవరకే.
కాలం మారింది. ఒకప్పటి అహింసాయుతమైన ఆచారం ముమ్మరమయి, ఎద్దులకు సారా పట్టి, కళ్లల్లో కారం జల్లి, తోకలు కత్తిరించి, కొరికి, రెచ్చ గొట్టి–వందలాది మందిని చూసి బెదిరి పరిగెత్తే ఎద్దును వెంటాడి–దాని పరుగు ‘ఆత్మరక్షణ’ కన్న విషయం మరిచిపోయి–‘జల్లికట్టు’ మా జాతికి ప్రతీక అని పంజా విప్పే ‘పార్టీ’ల చేతుల్లోకి ఉద్యమం వెళ్లి పోయింది. మొన్న మెరీనా బీచ్‌లో ఉద్యమం చేసిన వందలాది యువకులకు ‘జల్లికట్టు’ అంటే ఏమిటో తెలియదని ఓ పత్రిక స్పష్టంగా రాసింది.
2010–2014 మధ్య కనీసం 11 వందల మంది ఈ క్రీడల్లో గాయపడ్డారు. కనీసం 17 మంది చచ్చి పోయారు. ఇవి పత్రికలకు అందిన లెక్కలు. అసలు నిజాలు ఇంకా భయంకరంగా ఉండవచ్చు. 2014లో సుప్రీం కోర్టు జీవకారుణ్య సంస్థ ప్రమేయంతో ఈ క్రీడని నిషేధించింది. 2017లో ఆ తీర్పుని సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
జాతిగా తమిళులు ఆవేశపరులు. ఆవేశానికి ఏనాడూ ‘విచక్షణ’ చుక్కెదురు. ‘జల్లికట్టు’ అహిం సాయుతంగా జరిగే క్రీడ–అని వాక్రుచ్చిన నేప థ్యంలో రెండురోజుల క్రితం పుదుక్కోటై్టలో ఇద్దరు చచ్చిపోయారు. 28 మంది గాయపడ్డారు.
తన మీద దూకే వందలాది మంది నుంచి నిస్స హాయంగా తప్పించుకుపోవాలనే జంతువు కళ్ల నుంచి కారే కారం నీళ్లూ, ముక్కు నుంచి కారే రక్తమూ, కడుపులో కలవరపెట్టే మాదక ద్రవ్యాలూ మెరీనా బీచ్‌లో ‘జాతి గర్వకారణమ’ని గగ్గోలు చేసే ప్రజానీకానికి ఎందుకు కనిపించడం లేదో, ఒక్క సుప్రీంకోర్టుకే ఎందుకు కనిపిస్తున్నాయో మనకు అర్థమౌతుంది.
తమిళనాడులో సమర్థమయిన నాయకత్వం ఉంటే ఏమయేదో మనకు తెలీదు. ఇవాళ ఉన్న నాయ కత్వాన్ని నిలుపుకోవడానికి రాష్ట్రానికి కేంద్రం మద్దతు కావాలి. కేంద్రానికి–మారిన నాయకత్వంతో పొత్తు కావాలి. ఫలితం–జల్లికట్టుని చట్టబద్ధం చేసిన ఆర్డినెన్స్. సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టే మార్గం దొరికింది కనుక–ఇప్పుడిక కర్ణాటకలో కంబాల క్రీడకి (అప్పుడే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యగారు, సదా నందగౌడ నోరు విప్పారు), ఆంధ్రప్రదేశ్‌లో కోడి పుంజుల ఆటకి, అస్సాంలో బుల్‌బుల్ పందాలకు, మహారాష్ట్రలో ఎద్దుబళ్ల పందాలకూ, ఉత్తరాఖండ్‌లో గేదెల్ని పరిగెత్తించి వేటాడే సంబరాలకూ–కనీసం ఐదారు ఆర్డినెన్సుల కోసం ఎదురుచూడవచ్చు.
ప్రజాభిప్రాయానికి తరతరాల సంప్రదాయం పెట్టుబడి. చట్టానికి–కేవలం జరిగే అనర్థమే కొలమానం. ‘విచక్షణ’ క్రూరమయిన నిర్ణయాలు చేస్తుంది. ప్రజాభిప్రాయం దానికి దొంగదారులు వెదుకుతుంది. ‘‘శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానూ’’ చెప్తుంది అన్నారు పింగళి నాగేంద్ర రావుగారు ‘మాయాబజార్’లో. శాస్త్రం స్థానంలో ‘చట్టం’ అన్న మాటని చదువుకుని మనం నోరు మూసుకోవడం తక్షణ కర్తవ్యం.
గొల్లపూడి మారుతీరావు