jeevanakalam
-
నివాళి ఆకాశం
జీవన కాలమ్ నాకు చాలా ఇష్టమైన ఫొటోలలో ఇది మొదటిది. మా శ్రీనివాస్ స్మారక పురస్కార సభకి కచ్చేరీ చెయ్యడానికి పద్మవిభూషణ్ అంజాద్ అలీ ఖాన్ని ఆహ్వానించాం. అదొక అపూర్వమైన సాయంకాలం. సభాసదుల్ని మైమరపించిన కచేరీ. అంతకు ముందు ఆయన్ని ఆహ్వానించడానికి కామరాజ్ హాలు ముందు మా అబ్బాయిలతో నిలబడ్డాను. కారాగింది. అంజాద్ అలీఖాన్ దిగారు. ముందుగా అనుకుని చేసినది కాదు. వారిని చూడగానే ముందుకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించబోయాను. ఆయనా ఊహించి ఉండరు. కానీ ఆయనా అంతే హఠాత్తుగా నా పాదాలకు వంగారు. ఒక మహా సంగీతకారుడి పట్ల నా గౌరవం అలా ఉండగా – ఒక మహా సంగీతకారుడి ‘వినయ సంపద’కి అది మచ్చు తునక. మా పిల్లలూ, మనుమడూ అంతా అబ్బురంతో ఈ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. ఇదీ ఈ అరుదయిన ఫొటో కథ. కాశీ వెళ్లినప్పుడు–రెండే దర్శనాలు నా మనసులో ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుడు. భారతరత్న బిస్మిల్లాఖాన్. మొదటి దర్శనం అందరూ చేసుకునేదే. చల్లా లక్ష్మణరావుగారు బిస్మిల్లాఖాన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు. కాశీ విశ్వవిద్యాలయంలో నా ఉపన్యాసాన్నీ ఏర్పాటు చేశారు. అప్పుడు కాశీ విశ్వవిద్యాలయం కులపతి సింహాద్రి అనే తెలుగాయన. ఇప్పుడది కష్టమూకాదు. కారణం– నా అభిమాని, నన్ను గురువుగా భావించే బూదాటి వేంకటేశ్వర్లుగారు అక్కడి తెలుగు విభాగానికి అధ్యక్షులు. సరే, బిస్మిల్లాఖాన్ దర్శనానికి నేనూ, మా ఆవిడా బయలుదేరాం. మాకు ఫొటోలు తీయడానికి మా ఇంటి పురోహితులు గోరంట్ల లక్ష్మీనారాయణశాస్త్రి గారు వచ్చారు. వెళ్తూ సరాసరి దంపతులం ఇద్దరమూ ఆయనకి పాదాభివందనం చేశాం. మేమెవరమో ఆయనకు తెలీదు. నా పేరు చెప్పినా తెలుసుకునే అవకాశం లేదు. మా ఆవిడని పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణిగారి అమ్మాయిగా పరిచయం చేశాను. అప్పుడూ ఆయన స్పందించలేదు. గంట తర్వాత లేచి బయలుదేరబోతూంటే–ఇబ్బందిగా మరోసారి నాపేరు అడిగారు. మేం బిస్మిల్లాఖాన్కి పాదాభివందనం చేయడం శాస్త్రి గారికి ఇష్టం లేదు. ఆయన ఎరికలో నా పరపతి గొప్పది. నా మనస్సులో బిస్మిల్లాఖాన్ ఆకాశం. చాలా సంవత్సరాల కిందట– నేనూ, మిత్రులు శోభన్‌బాబూ తణుకులో ‘బలరామ కృష్ణులు’ షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలోనే మన ప్రధాని పీవీ నరసింహారావుగారు పుట్టపర్తి వెళ్లారు. సభలో సత్యసాయిబాబాకు పాదాభివందనం చేశారు. అది పేపర్లో వచ్చింది. శోభన్‌బాబుకి ఈ దేశపు ప్రధాని బహిరంగ సభలో బాబా గారికి అలా పాదాభివందనం చేయడం నచ్చలేదు. ఆ మాట నాతో అన్నారు. ప్రణామానికి పునాది మన విశ్వాసం, సంస్కారం, సౌజన్యం, కర్తవ్యం, నివాళి. ఈ దేశానికి జ్ఞాన బిక్షను పెట్టిన ఆది శంకరులు ఒక మ్లేచ్చుడికి పాదాభివందనం చేసి– ‘జ్ఞానానికీ, విజ్ఞతకీ’ కులం లేదని నిరూపించారు. ఎంత మహానుభావుడైనా– సన్యసించాక లోకమంతా ఆయనకి పాదాభివందనం చేస్తుంది. చెయ్యాలి– తండ్రి అయినా సరే. కానీ అతను పాదాభివందనం విధిగా చెయ్యాల్సిన ఒక రుణం ఆ బొంది ఉన్నంతవరకూ ఉంటుందట. తన మాతృమూర్తికి ఆ రుణం ఆ జన్మకి తీరేది కాదు. మరి భగవంతుడికి? కనీసం తను విశ్వసించే భగవంతుడికి? మరునాడు కాలమ్ రాసి శోభన్ బాబుకి చదివి వినిపించాను. ‘ఇలా చూసినప్పుడు– ఆయన చర్య సబబుగానే ఉంది’ అన్నారు. సంస్కారానికి ఎల్లలు లేవు. వినయానికి షరతులు లేవు. ఎదిగినకొద్దీ ఒదగడమే సంస్కారం. జీవితమ్మెల్ల బహు శాస్త సేవలందు గడిపితిని; రహస్యములు చాలా గ్రాహ్యమయ్యె, ఇప్పుడు వివేకనేత్రమ్ము విప్పి జూడ, తెలిసికొంటి నాకేమి తెలియదంచు– ఇది దువ్వూరి రామిరెడ్డిగారి మాట – ‘పానశాల’లో. 1952–53లో కాకినాడ సరస్వతీ గానసభ స్వర్ణోత్సవాలకు బడేగులాం ఆలీఖాన్ని ఆహ్వానించారు. ఉత్సవాల కన్వీనర్ ఎమ్.వి. శాస్త్రిగారు, మహా గాయకుడు, వాగ్గేయకారుడూ జీఎన్ బాలసుబ్రహ్మణ్యం క్లాస్మేట్స్. బడే గులాం కచ్చేరీకి కొన్ని షరతులు పెట్టారు: పోల్సన్స్ బట్టర్తోనే వంట చెయ్యాలి. రోజూ చికెన్ ఉండాలి. క్రేవెన్ ‘ఏ’ సిగరెట్లు, స్కాచ్ ఉండాలి–అని. బడే గులాం ఆలీ ఖాన్ కచ్చేరి అయ్యాక–సభలో ఆయన రెండు పాదాలమీదా తల ఆనించి పాదాభివందనం చేశారు జీఎన్బి.. రోజూ విధిగా మాంసాహారం, స్కాచ్ ఉండాలన్న బడేగులాంని, వారి సిబ్బందినీ రోజుల తరబడి తమ ఇంట్లో ఉంచుకుని సేవించారు ఘంటశాల. బిస్మిల్లా ఖాన్ మీద కాలమ్ రాసి ముగిస్తూ ఓ మాట అన్నాను, నా పేరే గుర్తు లేని ఆ మహా విద్వాం సుని గురించి: గంగానదిలో లక్షలాదిమంది రోజూ స్నానం చేసి తరిస్తారు. వారెవరో గంగానదికి తెలియనక్కరలేదు–అని. ఈ ఫొటో చూసినప్పుడల్లా–నా అభినందన కాదు. ఆ మహా వృక్షం తలవొంచడం అపురూపంగా, అపూర్వంగా అనిపిస్తూంటుంది. గొల్లపూడి మారుతీరావు -
‘‘పదుగురాడు మాట’’
జీవన కాలమ్ సంప్రదాయాలు జాతి మనుగడలో, సంవత్సరాల రాపిడిలో క్రమంగా రూపు దిద్దుకుంటాయి. వీటికి నిబంధనలు ఉండవు. ఆచారమే ఉంటుంది. కొండొకచో అర్థం కూడా ఉండదు. అనుభవమే ఉంటుంది. దశాబ్దాల కిందట–రాజారామమోహన్‌రాయ్– సతీసహగమనాన్ని ఎదిరించినప్పుడు–కొందరు షాక య్యారు. కొందరు అడ్డం పడ్డారు. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే–ఆ దురాచారం ఎంత అర్థరహి తమో, దురన్యాయమో అందరికీ అవగతమౌతుంది. ఆచారం ఆ కాలానిది. మనిషి తన సంస్కారంతో, సహేతుకమైన విచక్షణతో తనని తాను సంస్కరించు కుంటూ పోతాడు. పోవాలి. అదీ నాగరికత మనకి ఇచ్చిన సంపద. ఒకప్పుడు ఆదిమానవుడు పచ్చి మాంసం తిన్నాడు. నిజానికి తోటి మనుషుల్నే తిన్నాడు. ఇప్పటికీ కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాల్లో cannibals ఉన్నారంటారు. అయితే ఈనాటి మాన వుడు తన అవసరాలకి, ఆహారానికి ఎంత గొప్ప పరిణతిని సాధించాడు? జల్లికట్టు నాయకరాజుల కాలంలో ప్రారంభమ యిందని చరిత్ర. ‘జల్లి’ అంటే నాణాలు. ‘కట్టు’ అంటే కట్టడం. ఎద్దు కొమ్ములకి నాణాల సంచీని కట్టేవారట. ధైర్యం ఉన్న కుర్రాళ్లు దాని వెంటబడి మూపును కరుచుకుని–సంచీని దక్కించుకోవడం క్రీడ. నిజానికి సింధు నాగరికత నాటి చెక్కడాలలో ఈ క్రీడ ఛాయలు కనిపిస్తాయి. జల్లికట్టు బహుశా–ఆ రోజుల్లో సంక్రాంతికి పంట ఇంటికి వచ్చినప్పుడు–ఆ ఆనందాన్ని అనుభ వించడానికి పొగరుబోతు గిత్తలతో–కుర్రాళ్లు విశాల మైన మైదానాల్లో ఆటలాడేవారేమో! అప్పుడు గిత్తలు తిరగబడేవి. కొందరికి దెబ్బలు తగిలేవి. అయినా అదొక క్రీడగా చెల్లుబాటయి ఉండేది. ఆ రోజుల్లోనూ పిల్లల్ని వారించే పెద్దలు ఉండి ఉండొచ్చు. అయినా ఉడుకు రక్తంతో ‘మా సర దాలకు అడ్డురాకండి’ అన్న కుర్రకారు ఉండి ఉండ వచ్చు. అంతవరకే. కాలం మారింది. ఒకప్పటి అహింసాయుతమైన ఆచారం ముమ్మరమయి, ఎద్దులకు సారా పట్టి, కళ్లల్లో కారం జల్లి, తోకలు కత్తిరించి, కొరికి, రెచ్చ గొట్టి–వందలాది మందిని చూసి బెదిరి పరిగెత్తే ఎద్దును వెంటాడి–దాని పరుగు ‘ఆత్మరక్షణ’ కన్న విషయం మరిచిపోయి–‘జల్లికట్టు’ మా జాతికి ప్రతీక అని పంజా విప్పే ‘పార్టీ’ల చేతుల్లోకి ఉద్యమం వెళ్లి పోయింది. మొన్న మెరీనా బీచ్‌లో ఉద్యమం చేసిన వందలాది యువకులకు ‘జల్లికట్టు’ అంటే ఏమిటో తెలియదని ఓ పత్రిక స్పష్టంగా రాసింది. 2010–2014 మధ్య కనీసం 11 వందల మంది ఈ క్రీడల్లో గాయపడ్డారు. కనీసం 17 మంది చచ్చి పోయారు. ఇవి పత్రికలకు అందిన లెక్కలు. అసలు నిజాలు ఇంకా భయంకరంగా ఉండవచ్చు. 2014లో సుప్రీం కోర్టు జీవకారుణ్య సంస్థ ప్రమేయంతో ఈ క్రీడని నిషేధించింది. 2017లో ఆ తీర్పుని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జాతిగా తమిళులు ఆవేశపరులు. ఆవేశానికి ఏనాడూ ‘విచక్షణ’ చుక్కెదురు. ‘జల్లికట్టు’ అహిం సాయుతంగా జరిగే క్రీడ–అని వాక్రుచ్చిన నేప థ్యంలో రెండురోజుల క్రితం పుదుక్కోటై్టలో ఇద్దరు చచ్చిపోయారు. 28 మంది గాయపడ్డారు. తన మీద దూకే వందలాది మంది నుంచి నిస్స హాయంగా తప్పించుకుపోవాలనే జంతువు కళ్ల నుంచి కారే కారం నీళ్లూ, ముక్కు నుంచి కారే రక్తమూ, కడుపులో కలవరపెట్టే మాదక ద్రవ్యాలూ మెరీనా బీచ్‌లో ‘జాతి గర్వకారణమ’ని గగ్గోలు చేసే ప్రజానీకానికి ఎందుకు కనిపించడం లేదో, ఒక్క సుప్రీంకోర్టుకే ఎందుకు కనిపిస్తున్నాయో మనకు అర్థమౌతుంది. తమిళనాడులో సమర్థమయిన నాయకత్వం ఉంటే ఏమయేదో మనకు తెలీదు. ఇవాళ ఉన్న నాయ కత్వాన్ని నిలుపుకోవడానికి రాష్ట్రానికి కేంద్రం మద్దతు కావాలి. కేంద్రానికి–మారిన నాయకత్వంతో పొత్తు కావాలి. ఫలితం–జల్లికట్టుని చట్టబద్ధం చేసిన ఆర్డినెన్స్. సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టే మార్గం దొరికింది కనుక–ఇప్పుడిక కర్ణాటకలో కంబాల క్రీడకి (అప్పుడే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యగారు, సదా నందగౌడ నోరు విప్పారు), ఆంధ్రప్రదేశ్‌లో కోడి పుంజుల ఆటకి, అస్సాంలో బుల్బుల్ పందాలకు, మహారాష్ట్రలో ఎద్దుబళ్ల పందాలకూ, ఉత్తరాఖండ్‌లో గేదెల్ని పరిగెత్తించి వేటాడే సంబరాలకూ–కనీసం ఐదారు ఆర్డినెన్సుల కోసం ఎదురుచూడవచ్చు. ప్రజాభిప్రాయానికి తరతరాల సంప్రదాయం పెట్టుబడి. చట్టానికి–కేవలం జరిగే అనర్థమే కొలమానం. ‘విచక్షణ’ క్రూరమయిన నిర్ణయాలు చేస్తుంది. ప్రజాభిప్రాయం దానికి దొంగదారులు వెదుకుతుంది. ‘‘శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానూ’’ చెప్తుంది అన్నారు పింగళి నాగేంద్ర రావుగారు ‘మాయాబజార్’లో. శాస్త్రం స్థానంలో ‘చట్టం’ అన్న మాటని చదువుకుని మనం నోరు మూసుకోవడం తక్షణ కర్తవ్యం. గొల్లపూడి మారుతీరావు -
అనువుగాని చోట్లు
జీవన కాలమ్ ఆ మధ్య పుణేలో ప్రసిద్ధ గాయకుడు సోనూ నిగమ్ తుప్పతల, పిల్లిగెడ్డం పెట్టుకుని వీధిలో ఒక చెట్టు కింద హార్మోనియం పట్టుకుని పాటలు పాడారట. ఒక్కడు కూడా ఆయన సంగీతాన్ని పట్టించుకోలేదట. నాకు బాగా గుర్తు. ఎన్.టి. రామారావు నటించిన పుండరీకాక్షయ్యగారి చిత్రం ‘ఆరాధన’ రజతోత్సవ సభ హైదరాబాద్‌లో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్లో జరిగింది. ఉత్సవానికి లోపలికి వెళుతుండగా గేటు దగ్గర ఎవరో నన్ను ఆపేశారు. నా వెనుకనే వస్తున్న ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చిన్న సత్యంగారు ముందుకు దూకారు. ‘‘ఆయన ఈ చిత్ర రచయిత బాబూ!’’ అని వివరించారు. అప్పటికి నేను నటుడిని కాదు. నా రచయిత పరపతి థియేటర్ గేటు కీపర్ దాకా ప్రయాణం చెయ్యలేదు. 1975 ఏప్రిల్‌లో హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి. మండలి వెంకట కృష్ణారావు విద్యామంత్రి. స్టేజీ మీద టంగుటూరి సూర్యకుమారి ‘మా తెలుగుతల్లికి’ గీతం పాడు తోంది. మాసిన బట్టలతో ఒకాయన గేటు దగ్గరికి వచ్చాడు. గేటు కీపర్లు ఆయన్ని ఆపారు. ‘ఆ పాట రాసింది నేనే’ అన్నాడాయన. అయినా వారు వద ల్లేదు. ఈలోగా ఎవరో ఆయన్ని గుర్తుపట్టి అధికారు లకి చెప్పారు. కార్యకర్తలు పరుగున వచ్చి ఆయన్ని సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. ఆయన శంకరం బాడి సుందరాచారి. మర్నాడు విశ్వనాథ సత్యనారా యణ అధ్యక్షత వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మనకి సామెతలు ఊరికే రాలేదు– ‘వెండి పళ్లానికైనా గోడ చేర్పు కావాలి’. ప్రతీ గొప్ప తనానికీ ‘అనువుగాని చోటు’ ఒకటుంటుంది–అని. దీనిని సోదాహరణంగా నిరూపించిన విచిత్ర మైన, కానీ అపురూపమైన ప్రయోగం జరిగింది. 2007లో వాషింగ్టన్ లెఫెంట్ ప్లాజా మెట్రో స్టేషన్లో ప్రపంచ ప్రఖ్యాత వయొలినిస్ట్, గ్రామీ అవార్డు గ్రహీత జోషువా బెల్ బేస్‌బాల్ ఆటగాడి టోపీ పెట్టుకుని–వీధిలో తిరిగే వాద్యగాడిలాగా కూర్చుని వయొలిన్ వాయించాడట. ఆయన వయొలిన్ ఖరీదు 30 లక్షల డాలర్లు. ప్రపంచ ప్రఖ్యాత మెండల్సన్, బాఖ్ సంగీతాన్ని వాయించాడు. అది నూరు సంవత్స రాలుగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన అపురూపమైన సంగీతం. అయితే ఆనాడు యూనియన్ స్టేషన్లో 1,070 మంది ఆయన సంగీతాన్ని పట్టించుకోకుండా హడావుడిగా తమ తమ గమ్యాలకి పరుగులు తీశారు. కేవలం 27 మంది ఒక్కక్షణం ఆగి ముందుకు తరలి పోయారు. ఆయన బాఖ్ వాయిస్తూ ఉంటే హాలులో ఒక గుండుసూది కిందపడినా శబ్దం మారుమోగుతుందట. ఈ కథ విని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నవ్వుతూ అన్నాడట: ‘‘నాకు తెలిస్తే నేను అక్క డికి వచ్చేవాడిని’’ అని. బెల్ నవ్వి–నిజంగా ఆయన వచ్చి ఉంటే మరో కారణానికి–అంటే అమెరికా మాజీ అధ్యక్షుడిని మెట్రో రైలు స్టేషన్లో చూస్తున్నందుకు తెల్లబోయినవారు–అప్పుడు నా సంగీతాన్ని పట్టించు కునేవారు కాదు–అన్నాడట. ఈ కథని విన్న చాలా మంది నవ్వుతూ తమ ట్వీటర్లలో చమత్కరించారట. ‘‘ఇది ఏసుప్రభువుని మరచిపోయిన క్రిస్టమస్ లాంటిది’’ అని. ఈ ప్రయోగాన్ని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక నిర్వహించింది. దీన్ని చిన్నపిల్లలకు నీతికథగా వ్రాస్తే ఆ పుస్తకానికి పులిట్జర్ బహుమతి లభించింది. ఆయన ప్రముఖ నటీమణి మెరిల్ స్ట్రీప్‌తో ‘సీసేమ్ స్ట్రీట్’లో నటించారు. అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ మహారాణి సమక్షంలో జోషువా బెల్ ప్రత్యేక ప్రదర్శ నలిచ్చారు. ఆ మధ్య పుణేలో ప్రసిద్ధ గాయకుడు సోనూ నిగమ్ తుప్పతల, పిల్లిగెడ్డం పెట్టుకుని వీధిలో ఒక చెట్టు కింద హార్మోనియం పట్టుకుని పాటలు పాడా రట. ఒక్కడు కూడా ఆయన సంగీతాన్ని పట్టించు కోలేదట. ప్రపంచంలో ప్రతి గొప్ప కళకీ చక్కని ఫ్రేమ్ కావాలి. ఆలంబన కావాలి. ఫోకస్ కావాలి. చిన్న ఉపో ద్ఘాతం కావాలి. మన తెలుగు సినిమాల్లో యముడూ, చిత్రగుప్తుడూ కిరీటం, గదతో మన రోడ్ల మీదకు వచ్చి ‘నేను యముండ’ అంటే, ‘మనది ఏ నాటక కంపెనీ బాబూ!’ అని పలకరించడం చూశాం. ఆలయంలో అడుగు పెట్టిన క్షణం నుంచీ మంచి గంధం పరిమళం, గర్భగుడిలో మోగే గంటల రవళి, కర్పూర హారతి, అష్టోత్తర నామావళి–ఇవన్నీ ఒక పవిత్రమైన ఆలోచనా సరళిని ఒక ‘మూడ్’ని ్చఝbజ్చీ nఛ్ఛిని కల్పిస్తాయి. ఊరేగింపుకి స్వామి ఊరికేరాడు. ముందు మేళతాళాలు వస్తాయి. వెనుక భక్త బృందం నడుస్తుంది. తర్వాత ఏనుగులు నడుస్తాయి. తర్వాత పల్లకీ కనిపిస్తుంది–అప్పుడూ స్వామి దర్శనం. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు జోషువా బెల్ని రద్దీగా ఉన్న యూనియన్ స్టేషన్లో కూర్చోబెట్టిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ప్రయోగం ఓ గొప్ప సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రతీక. ఈ వాస్తవం విపర్యాయా నికీ–అంటే ‘అనువుగాని చోట’ ఎంత గొప్ప కళయినా వీగిపోతుందనడానికీ ఈ ప్రయోగం తార్కాణం. గొల్లపూడి మారుతీరావు -
చరిత్రకు రాని హీరోలు
జీవన కాలమ్ మా వాసూ పోయిన 23 సంవత్సరాలలో ఏ ఒక్కసారీ ఇలాంటి కాలమ్ రాయలేదు. 18 సంవత్సరాలుగా వాసూ పోయిన రోజున ఉత్తమ నూత న దర్శకుడిని సత్కరిస్తూ- ఆ రోజు ఎవరి కళ్లూ చెమర్చకుం డా చేసే ప్రయత్నం చెప్పనల వి కాదు. ఈ బహుమతి ఉద్దేశం వాసూని తలుచుకుని కంటతడిపెట్టుకోవడం కాదనీ, ఒక యువదర్శకుని విజయాన్ని పండుగ చేసుకో వడమనీ అతిథులందరికీ చిన్న కాగితాలు పంపేవారం. కానీ జయాబచ్చన్, అపర్ణాసేన్, సునీల్‌దత్ వంటి వారిని ఆపలేకపోయేవారం. అయినా భోరుమన్న కళ్లు తుడుచుకున్న లెస్లీ కెర్వాలో, జానకీ విశ్వనాథన్, ఆమిర్ ఖాన్లు ఎందరో ఉన్నారు- అది మా నిస్సహాయత. ప్రతీ సంవత్సరం ఆనాటి విషాదాన్ని వెనక్కి నెట్టి విజేతను గుండెలకు హత్తుకుంటున్న మమ్మల్ని చూసి ఒక హిందీ మిత్రుడు అడిగాడు: "Tell me, when will this madness end?" అని. "After us" అదీ సమాధానం. ఒక్కరే - మాలతీచందూర్ మా గుండెల్లోంచి దూసుకెళ్లారు, ‘‘...వెలుగులో ఉన్నవాడు చీకటి వస్తుంద ని భయపడతాడు. చీకటిలో ఉన్నవాడు ఏ చిన్న వెలుగు కనిపించినా దాని వెనుక నడిచిపోతాడు....’’ అయితే ఇందుకుకాదు ఈ కాలమ్. ఈ 18 సంవ త్సరాలూ ఏటా ఓ యువదర్శకుడిని గౌరవించినప్పు డల్లా - అలా సత్కారానికి నోచుకోని మరో 20-30 మం ది ఆ సంవత్సరం కనిపిస్తారు. వారి ప్రయత్నంలో లోపం లేదు. వారి జీనియస్‌కి వారు బాధ్యులు కారు. వాళ్లకి తప్పనిసరిగా ఉత్తరం రాస్తాం. ఆ ఉత్తరం మీద నేనే సంతకం చేస్తాను. ఇది బహుమతి కన్నా ముఖ్య మైన పని. ఈ ఉత్తరాన్ని రోజుల తరబడి ఆలోచనల్లో రంగరించి సిద్ధం చేశాం. ఆ యువ దర్శకుని ఉత్సాహాన్ని ఏవిధంగానూ తగ్గించకుండా పునరుద్ధరించే వాక్యాలివి: ‘‘మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించే దర్శ కుని మొక్కవోని లక్ష్యానికి దోహదం చేస్తూ, అతని ఆద ర్శానికి దన్నుకావాలన్నదే మా ఫౌండేషన్ లక్ష్యం. ప్రతీ సంవత్సరం అందరు తొలి దర్శకులను ఆహ్వానించి ప్రోత్సహించాలన్నదే మా ధ్యేయం. ఈ పోటీలో మీ చిత్రం పాల్గొనడమే గొప్ప విజయం. కారణం- ఇలాం టి ప్రోత్సాహానికి మా శ్రీనివాస్ నోచుకోలేదు కనుక. మీ చిత్రం చాలా బాగుంది. అయితే, ఇన్ని చిత్రాల పరిశీ లనలో, తప్పనిసరిగా ఏ ఒక్క చిత్రమో మిగతావాటి కంటే ఒక్క అడుగయినా ముందు నిలుస్తుంది. అయితే అన్నీ గొప్ప ప్రయత్నాలే. సందేహం లేదు. కాని, ఈ బహుమతి ఒక్కరికే దక్కుతుంది. గత్యంతరం లేదు. దర్శకుడిగా ఎన్నో అంగల్లో ముందుకు సాగబో తున్న మీ కెరీర్ సమర్థవంతం, ఫలవంతం కావాలని ఆశి స్తున్నాం. మీలో ఆ సామర్థ్యం ఉన్నదని నమ్ముతున్నాం. ఆగస్టు 12న మీలో ఒకరయిన మీలాంటి దర్శకునికి సత్కారం జరుగుతుంది. మా కుటుంబ సభ్యుడిగా వచ్చి అందులో పాల్గొనండి.’’ ఈ ఉత్తరాన్ని గత 18 సంవత్సరాలుగా దేశం నలు మూలలో ఉన్న 265 మంది యువ దర్శకులకు ఇప్పటి వరకూ పంపాం. ఇప్పుడు ఈ కాలమ్ స్ఫూర్తి. మొన్న ఈ ఉత్తరం అందుకున్న బహుమతి రాని బెంగాలు దర్శకుడు బౌద్ధా యన్ ముఖర్జీ కలకత్తా నుంచి సమాధానం రాశాడు. అది ఇది: ‘‘మీ ఉత్తరానికి ధన్యవాదాలు. అందులో విషయం మనసుని బాధ పెట్టినా బహుమతిని ఒక్కరే అందుకో గలరని అర్థమవుతోంది. న్యాయ నిర్ణేతల నిర్ణయాన్ని నేను మనసారా గౌరవిస్తాను. అయితే అరవిందన్ పుర స్కారం లాగ ఈ బహుమతితో పాటు ఒక ప్రత్యేక ప్రశం సని న్యాయనిర్ణేతలు రెండో స్థానంలో ఉన్న చిత్ర దర్శ కుడికి అందజేయవచ్చు. అందువల్ల మరో చిత్ర దర్శకునికి ఆనందం కలుగుతుంది. ఈ సంస్థకి నా శుభాకాంక్షలు. శ్రీనివాస్ స్ఫూర్తి మా అందరిలో ప్రబలాలని, రాబోయే కాలంలో నిజాయి తీగా మేము చేసే కృషి మరింత ఫలవంతం కావాలని ఆశిస్తాను. శ్రీనివాస్‌కి మేము ఇవ్వగల నివాళి అది. మీ బహుమతి ప్రదానోత్సవం ఘనంగా సాగాలి. మీరు నూతన దర్శకులలో నింపుతున్న ప్రాణవాయు వు- జ్యోతిగా వెలుగొందాలి. ఇది గొప్ప కృషి. ధన్య వాదాలు.’’ ఇది చదువుతూంటే కుటుంబమంతటికీ కళ్లు చెమ ర్చాయి. గుండె గొంతులో కదిలింది. ఇంత ఉదాత్త మయిన యువదర్శకులు ఈ దేశంలో ఎందరు ఈ కళని పరిపుష్టం చేస్తున్నారో! ఆర్ద్రత ఆదర్శాన్ని ఆకాశంలో నిలుపుతుంది. ఇలాంటి స్పందనలు కన్నీటిని కూడా కర్పూరంలాగ వెలి గించి-కాంతిని హృదయాల్లో నింపుతాయి. మా వాసూ ధన్యుడు.