వ్యక్తి-వ్యవస్థ-అవ్యవస్థ
జీవన కాలమ్
``మారే వ్యవస్థతోపాటు కాలానుగుణంగా వ్యక్తి తనని తాను అన్వయించుకుంటా డని, అన్వయించుకోవాలని - ఈ పరిణామశీలాన్ని ‘అరాచకం’గా కాక ‘పరి ణతి’గా గ్రహించాలని పాకిస్తాన్‌లోని మత వ్యవస్థ గుర్తించకపోవడం దురదృష్టం.
ఈ మధ్య పేపర్లో ఒక వార్త వచ్చింది. పాకిస్తాన్‌లో ఇస్లాం మతానికి సంబంధించిన విష యాల మీద ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే ‘మత సంస్థ’ మహిళా సంక్షేమ సూత్రాలను ప్రకటించింది. ఈ సంస్థ సూచనల ప్రకారం భర్తలు అప్పుడప్పుడు భార్యల్ని ‘సున్నితంగా’ కొట్టవచ్చునట. రకరకాల కారణాలను సూచిస్తూ - భర్తల మాటలను లక్ష్య పెట్టని భార్యల్ని కొట్టే హక్కు, అవసరం ఉన్నదని ఈ సంస్థ వక్కాణిం చింది. అయితే ఇందులో చిన్న సందిగ్ధత ఉంది. ‘సున్ని తంగా’ అంటే ఎలా? ఏఏ కారణాలకు ఎంతెంతగా కొట్ట వచ్చు, అన్న విషయాన్ని ఈ సంస్థ తేల్చలేదు.
కేవలం చెంపదెబ్బతో సరిపెట్టుకోవచ్చునా, చిన్న కర్రతో కొడితే చాలునా, లేదా మొట్టికాయ, తొడపాశం, జెల్లకాయ వంటివి సరిపోతాయా? చెవి పిండటం, ముక్కు కొర కడం, బుగ్గ పాశం వంటివి చెయ్యవచ్చునా? ఎక్కువ కోపం వచ్చినప్పుడు కాలుని వాడవచ్చునా, లేదా చేతిలో ఉన్న వస్తువుతో ముఖం మీద కొట్టవచ్చునా - ఇలాంటి విషయాలను నిర్దుష్టంగా ఈ సంస్థ తేల్చి చెప్పలేదు.
స్త్రీలు వినోద స్థలాలకు వెళ్లడం, విహార యాత్రలకు వెళ్లడాన్ని ఈ మత సంస్థ తిరస్కరించింది. కళ పేరిట నాట్యం, సంగీతం, శిల్పం - వంటివి నిషిద్ధం. భర్తల అనుమతి లేకుండా భార్యలు కుటుంబ నియంత్రణ మాత్రలు కూడా వేసుకోకూడదు. స్త్రీలు ముఖాన్ని భర్తకి తప్ప ఎవరికీ చూపకూడదు. చదువుకోకూడదు. పరాయి మగాళ్ల ముందు పళ్లు కనిపించేలాగ నవ్వరాదు. హాస్యాన్ని చెప్పరాదు. కొత్తవారితో మాట్లాడినా, అసలు గట్టిగా మాట్లాడినా, భర్త అనుమతి లేకుండా పరాయి పురుషుడికి ఆర్థిక సహాయం చేసినా - ‘సుతారంగా’ భార్యల్ని కొట్టవచ్చు. అయితే ఎలా కొట్టాలో ఆయా భర్తలు ఆయా సందర్భాలను బట్టి నిర్ణయించు కోవలసిందే. పురుషాధిక్యతకు, నిరంకుశమయిన పురు షుల జులుంకు సాధికారక చట్రాన్ని తయారు చేసిన మతపరమైన శాంక్షన్ ఇది. ఒక్క చదువు విష యంలోనే అవ్యవస్థని ఎదిరించి మలాలా యూసఫ్ జాయ్ వంటి అమ్మాయిలు దాదాపు మృత్యువు ఎదు టనే నిలిచారు.
ఈ సందిగ్ధాన్ని పోగొట్టడానికి, ఈ అవ్యవస్థనుంచి తమ మతాన్ని, మతం నిర్దేశించిన నియమాలను, మహి ళల్ని కొట్టే పురుషుల హక్కులను కాపాడడానికి హఫీజ్ సయీద్ వంటి నాయకులు, సయ్యద్ గిలానీ వంటి హురియత్ నాయకులు కొన్నాళ్లు కశ్మీర్ పోరాటానికి శెలవుని ప్రకటించి పోరాడాలని నాకనిపిస్తుంది.
ముస్లిం సోదరులు, సోదరీమణులు మన దేశంలో ఎంత స్వేచ్ఛగా, ఎంత హుందాగా ఉండగలుగుతు న్నారో ఈ ఒక్క వార్తే రుజువు చేస్తుంది. ఇలాంటి అవ్యవస్థ బారిన పడకుండా మనం భారతరత్న బిస్మిల్లా ఖాన్, బడే గులాం ఆలీఖాన్, మహమ్మద్ రఫీ, తలత్ మహమ్మద్, నౌషాద్, పర్వీన్ సుల్తానా వంటి వారి అమోఘమయిన సంగీతాన్ని, నర్గీస్, దిలీప్‌కుమార్, మీనాకుమారి, మధుబాల వంటి వారి అమోఘమైన నటనా కౌశలాన్ని, మెహబూబ్ ఖాన్, కె.అసిఫ్ వంటి నిర్మాతల్నీ కాపాడుకోగలిగినందుకు గర్వపడవచ్చు.
వ్యక్తిగత స్వేచ్ఛని మతంతో ముడిపెడితే, రాజకీ యాల్ని మతంతో అనుసంధిస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో- ఆప్గానిస్తాన్ బామియన్ బుద్ధుని విగ్రహాల విధ్వంసం, నేటి కశ్మీర్ సమస్య మనల్ని హెచ్చరిస్తుంది. ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు పాకిస్తాన్ వంటి దేశాలకు ఇంకా ఇంకా ఎంతమంది మలాలాలు కావాలా అనిపిస్తుంది.
వ్యక్తి శీలం వ్యవస్థ ధర్మాన్ని కాపాడుతుంది - అన్నది ఆర్యోక్తి. కానీ మారే వ్యవస్థతోపాటు కాలాను గుణంగా వ్యక్తి తనని తాను అన్వయించుకుంటాడని, అన్వయించుకోవాలని - ఈ పరిణామశీలాన్ని ‘అరాచ కం’గా కాక ‘పరిణతి’గా గ్రహించాలని ఆ వ్యవస్థ గుర్తిం చకపోవడమే ఈ దురదృష్టానికి కారణం. మతం పేరిట ఇంత కాకపోయినా, కొంతవరకూ తిరోగమన ధోరణిని మన ఛాందసులు ఆశ్రయించడం ఈ దేశంలోనూ జరు గుతోంది. ఈ మధ్యనే ‘తలాఖ్’ గురించి మన టీవీల్లో చర్చల్నీ, మత గురువులు వాటి ఆవశ్యకతని ఆవేశంగా సమర్థించడాన్నీ చూశాం. దాదాపు 50 ఏళ్ల కిందట ఇలాంటి విషయం మీదే నేను నాటిక రాశాను. దాని పేరు ‘రెండు రెళ్లు ఆరు’. తండ్రి మూర్ఖపు విశ్వాసాలకు తలవొంచడం, వ్యవస్థ క్రమశిక్షణకు కొలబద్ధ కాదు. అరా చకం కాదు. కొండొకచో తప్పుడు విశ్వాసాలను ఎదిరించడం కూడా క్రమశిక్షణే - అన్నది ఆ నాటిక మూల సూత్రం.
సంగీతాన్ని నెత్తిన పెట్టుకోవడం అపూర్వమయిన వరమని రుజువు చేసే గాన గంధర్వులు పాకిస్తాన్‌లో ఉన్నారు. నూర్జహాన్, షంషాద్ బేగమ్, మెహదీ హస్సన్, గులాం ఆలీ చాలు ఈ నిజాన్ని రుజువు చేయ డానికి. మతం పేరిట ఆ దేశం ముందు ముందు ఇంకా ఎందరు అద్నాన్ సమీ, సల్మా ఆగాలను నష్టపోతుందో!
గొల్లపూడి మారుతీరావు