అబిదా సుల్తాన్.. నాటిరోజుల్లో భోపాల్ రాచరిక సంస్థానానికి యువరాణి. మన దేశంలో విమానాన్ని నడిపేందుకు పైలట్ లైసెన్స్ పొందిన మొదటి మహిళ. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించకముందే ఆమె మహిళా పైలట్‌గా మారారు. భోపాల్ సంస్థానానికి చెందిన ఈ యువరాణి 1913, ఆగస్టు 28న జన్మించారు. 2002 మే 11న మరణించారు. ఆమె 1942, జనవరి 25న ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు. ఆమె తండ్రి హమీదుల్లా ఖాన్ భోపాల్ రాచరిక సంస్థానానికి చివరి నవాబు.
హమీదుల్లా ఖాన్‌కు అబిదా పెద్ద కుమార్తె. ఆమె చిన్న వయస్సులో డ్రైవింగ్, గుర్రపుస్వారీ మొదలైన వాటిని నేర్చుకోవడంతో పాటు షూటింగ్‌లో నైపుణ్యం సాధించారు. ఆ రోజుల్లో ఆమె ముసుగు వేసుకోకుండానే కారు నడిపారు. భోపాల్ సంస్థానం తండ్రి చేతుల్లో ఉన్నంత కాలం ఆమె తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. అయితే ఆమె ముస్లిం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. కానీ తన తండ్రి మంత్రివర్గంలో చైర్‌పర్సన్, ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. అబిదా ఎంతో ఇష్టంగా పోలో, స్క్వాష్ వంటి క్రీడలను ఆడేవారు. 1949లో ఆమె ఆల్ ఇండియా ఉమెన్స్ స్క్వాష్‌లో ఛాంపియన్‌గా నిలిచారు. ఆమె బాంబే ఫ్లయింగ్ క్లబ్, కోల్‌కతా ఫ్లయింగ్ క్లబ్‌లలో విమానం నడపడం నేర్చుకున్నారు. దేశ విభజన తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టారు.
అబిదాకు 1926 జూన్ 18న కుర్వాయికి చెందిన నవాబ్ సర్వర్ అలీ ఖాన్‌తో వివాహం జరిగింది. 1949లో దేశ విభజన కోసం జరిగిన తిరుగుబాటు తర్వాత నవాబ్ సర్వర్ అలీ ఖాన్ భారతదేశాన్ని విడిచిపెట్టారు. అబిదాకు నాటి రోజుల్లో జిన్నాతో పరిచయం ఉంది. ఆమె తండ్రి భారతదేశ విలీనానికి తన సమ్మతిని తెలియజేస్తూ, విలీన లేఖపై సంతకం చేసినప్పుడు, ఆమె దానిని వ్యతిరేకించారు. అబిదా పాకిస్తాన్‌కు వస్తే అక్కడి రాజకీయాలో ఆమెకు అవకాశం కల్పించడమే కాకుండా ఆ దేశంలో ఆమెకు పూర్తి గౌరవం లభిస్తుందని జిన్నా ఆమెకు హామీ ఇచ్చారు.
పాకిస్తాన్‌కు చేరుకున్న ఆమె కరాచీలోని ఒక విలాసవంతమైన రాజభవనంలో నివసించారు. అక్కడ ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి, పాకిస్తాన్ ప్రభుత్వంలో హోదాను కూడా పొందారు. ఆమె ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆమె చైనాలో అధికారిక పర్యటన కూడా చేశారు. 1960లో పాకిస్తాన్‌లో మార్షల్ లా అమలులోకి వచ్చినప్పుడు జిన్నా సోదరి ఫాతిమాతో కలిసి దానిని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అబిదా తండ్రి మొదట్లో తమ రాచరిక సంస్థానాన్ని భారతదేశంలో కలపడంపై తిరుగుబాటు వైఖరి ప్రదర్శించినప్పటికీ, తరువాత ఆయన తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయవలసి వచ్చింది. అప్పడు అతను మాత్రమే భారతదేశంలో ఉన్నారు. కుమార్తెను ఇండియాకు తిరిగి రమ్మని కోరారు. అయితే దీనికి ఆమె అంగీకరించలేదు. అయితే తండ్రి చనిపోయిన సమయంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె కుమారుడు షహర్యార్ ఖాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు.
2001 అక్టోబర్ నాటికి అబిదాను అనేక వ్యాధులు చుట్టుముట్టాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. అబిదా పాకిస్తాన్‌లో స్థిరపడినందున, ఆమె తండ్రి తన మధ్య కుమార్తె సాజిదా సుల్తాన్‌ను భోపాల్ పాలకురాలిగా నియమించారు. పటౌడీ రాజకుటుంబానికి చెందిన నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్.. సాజిదా బేగంను వివాహం చేసుకున్నారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ వారి కుమారుడు. అనంతర కాలంలో భోపాల్ రాచరిక సంస్థానంలో ఆస్తి వివాదానికి సంబంధించి పలు వివాదాలు చెలరేగాయి. అవి నేటికీ కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: 3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి
Comments
Please login to add a commentAdd a comment