నాగరిక కాటు | a summary of the story Nallajerla road which was written by Tilak | Sakshi
Sakshi News home page

నాగరిక కాటు

Published Mon, Feb 12 2018 12:57 AM | Last Updated on Mon, Feb 12 2018 12:57 AM

a summary of the story Nallajerla road which was written by Tilak - Sakshi

ఏలూరులో చూసుకోవాల్సిన పని అయిపోయింది.
ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక కారు స్టార్టు చేశాడు రామచంద్రం. రాత్రి పది దాటింది. సరిగ్గా తొక్కితే గంటన్నరలో తణుకులో ఉండొచ్చు.
కలెక్టరు గారింట్లో పెళ్లి సరీగా ఉదయం ఏడు గంటలకి. నాగభూషణం మీదా, రామచంద్రం మీదా భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టరు గారు.  కలెక్టరు గారింట్లో శుభకార్యమంటే వేరే చెప్పాలా!
రామచంద్రం పెద్ద టెన్నీస్‌ చాంపియన్‌. కాలవ ఒడ్డున పెద్ద మేడవుంది. నాగభూషణం కలప వ్యాపారం నడుపుతున్నాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరే. భూషణం అల్లుడు అవధాని కూడా వాళ్లెంబడి వున్నాడు. ఇంకా కుర్రాడు.

ఆరుమైళ్లు వచ్చేప్పటికి కారు ఆగిపోయింది. రామచంద్రం దిగి బానెట్‌ తీసి చూశాడు. ‘వెధవ కారులా ఉంది. నడచి వెనక్కి పోదాం పద’ అన్నాడు నాగభూషణం.
‘అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగానీ యీ కారుని తిడితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు రామచంద్రం. కారు కిందా మీదా ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్‌రైట్‌ అంటూ కారులో కూర్చున్నాడు.
ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళుతూంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాల లాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి.

మళ్లీ కారు సడెన్‌గా ఆగిపోయింది. రామచంద్రం విసుగ్గా దిగాడు. బానెట్‌ తీసి పరీక్షించాడు. ‘సరిగ్గా కనపడడం లేదు యీ గుడ్డి వెన్నెలలో’ అన్నాడు. అంతవరకూ వెన్నెల ఉన్నట్టు అవధానికి అనిపించలేదు. ఆకాశం కేసి చూశాడు. జేగురు రంగుగా ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. దారి వెంట వెళ్తున్న ఆసామీలు గీసిన అగ్గిపుల్లల వెలుగులో ఏదో మరమ్మత్తు చేశాడు రామచంద్రం. బయలుదేరుతుండగా, ఆసాములు ‘జాగ్రత్త బాబూ. అడవిలో ఏదో చిరుతపులి’ ఉందన్న కబురును చెవిన వేశారు. దాన్ని కొట్టేస్తూ, ఏక్సిలేటర్‌ మీద కాలు నొక్కాడు రామచంద్రం. కారు రయ్యిమని దూసుకుపోయింది. ‘అడవి వచ్చేసింది. ఇది దాటితే యింక పదిహేను మైళ్లు తణుకు’ అన్నాడు రామచంద్రం. నాగభూషణం వెనక్కి జేర్లబడి నిద్దరోతున్నాడు. అవధాని దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తున్నాడు. అంతా కటిక చీకటి.

ఇంజన్‌లో ఏదో ఠప్‌మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతు వేసి ఆగిపోయింది. రామచంద్రం దిగి పనిముట్లు టిక్‌టిక్‌మనిపించాడు. ‘వద్దురా యీ కార్లో ప్రయాణం అంటే విన్నావు కాదు’ అన్నాడు భూషణం. ‘అబ్బ చంపకు, వెధవ గోలా నువ్వూ’ రామచంద్రం సహనం కోల్పోయాడు. ‘ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్రవుంటే చూడాలి. కారును పైకి ఎత్తి పట్టుకోవాలి’ అంటూ రోడ్డు వారకు పోయి కర్ర కోసం వెదుకుతున్నాడు.
రోడ్డు వారనే చింతచెట్లూ రావిచెట్లూ ఉన్నాయి. ఒక పెద్ద మర్రిచెట్టు ఊడలతో భయంకరంగా వుంది. చెట్టుచెట్టుకీ మధ్య యీత ముళ్ల పొదలు, బ్రహ్మచెముడు డొంకలు, రకరకాల తీగలూ అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి.

హఠాత్తుగా ‘భూషణం పాము పాము’ అన్న కేక నిశ్శబ్దాన్ని చీలుస్తూ వినపడింది. ‘రామచంద్రం’ అంటూ భూషణం పరుగెత్తుకెళ్లాడు. పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్లిపోయింది. అవధాని ప్రాణాలు బిగుసుకుపోయాయి. రామచంద్రం వణికిపోతున్నాడు. రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని రామచంద్రాన్ని తీసుకువచ్చాడు భూషణం. అవధాని కారు తలుపు తీశాడు. వెనుక సీటులో పడుకోబెట్టారు. కండువా తీసి కాలిమీద గట్టిగా బిగించి కట్టారు. రామచంద్రం కళ్లల్లో విపరీతమైన భయం సుళ్లు తిరిగింది. పెదవుల చివరి నుండి నురగ కక్కుతున్నాడు. ‘మనకెంత గతి పట్టిందిరా’ ఏడుస్తున్నాడు భూషణం.

ఇంతలో ఏదో మువ్వల చప్పుడు. ఒక ముసలివాడు రోడ్డు మీద నున్న పొదలను తప్పించుకుని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన ఒళ్లు. భూషణం తడబడుతూ అన్నాడు: ‘ఎ ఎ ఎవరది?’
‘సిద్దయ్యని బాబూ పాములవాణ్ణి’ అన్నాడు ముసలాయన.
‘పాములవాడివా?’ దైవసంకల్పం వుంటే కానీ యీ అడవిలో యిటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడు. భూషణం కారులోంచి దూకి సిద్దయ్య రెండు చేతులూ పట్టుకున్నాడు. రామచంద్రాన్ని సిద్దయ్య పరీక్షగా చూశాడు. ‘ఇంకా బతికే వున్నారు బాబయ్యా’ అన్నాడు బాధతో తోక తెగిన బల్లిలా గిజగిజలాడుతూన్న ప్రాణిని చూసి. ‘మంత్రం వేసి బతికించావా సగం ఆస్తి నీకు రాయిస్తాను’ అన్నాడు భూషణం.

‘అదృష్టం వుంటే బతకొచ్చును బాబయ్యా, అక్కడ పాకలోకి తీసుకురండి. వేరు ముక్కతో మంత్రం వెయ్యాలి’.
రామచంద్రాన్ని గుడిసెలోకి మోసుకెళ్లారు. నులకమంచంలో పడుకున్న యువతిని ‘సూరీడు లే లే’ అంటూ ముసలాయన తట్టి లేపాడు. దానిమీద రామచంద్రాన్ని పడుకోబెట్టారు. సిద్దయ్య రెండు మూడు సంచీలలో చెయ్యి పెట్టి వెదికాడు. పూసలూ పెంకులూ వేర్ల ముక్కలూ రాళ్లూ ఏవేవో ఉన్నాయి. కావాల్సిన వేరు ముక్కలేదు. దూరంగా వెలగచెట్టు అవతల పొదల కాడ ఆ వేరుగల మొక్కలున్నాయి. అక్కడ పాముపుట్టలూ ముళ్లపొదలూ జాస్తి. ముసలాయనకు చీకటిపడితే చూపు సరీగా ఆనదు. భూషణం పర్సులోంచి డబ్బు తీయబోయాడు. ‘నీ డబ్బుకి ఆశపడ్డానా మంత్రం పనిచెయ్యదు’ కఠినంగా అన్నాడు సిద్దయ్య.

‘ఈ అయ్యకి పెదవులు నల్లపడి పోతున్నాయి’ అంది సూరీడు. భూషణం అదిరిపడ్డాడు. ఇంతకుముందు రేగిన ఆశ గప్పున ఆరిపోయినట్టయింది. ‘పోనీ నేను వెళ్లి తీసుకురానా’ అంటూ సూరీడు పరుగెత్తింది. రామచంద్రం చివరి ఘడియల్లో ఉన్నాడు. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఇంతలో సూరీడు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. చేతిలో అయిదారు మొక్కలున్నాయి. సిద్దయ్య సంజ్ఞతో గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అరిపాదాల్ని ఒళ్లో పెట్టుకుని రాసింది.

అరగంట తర్వాత, రామచంద్రం మొహంలో చావునీడలు తప్పుకున్నాయి. శ్వాస యథాస్థితికి వస్తోంది. ‘ఇదంతా నీ చలవ సూరీడు’ అంటూ ఆమె కాళ్లమీద పడ్డాడు భూషణం. ‘తప్పండి బాబూ’ అంటూ సూరీడు సిగ్గు పడింది. ఆమె నవలావణ్యంతో ఆకర్షణీయంగా వుంది. అప్పుడు సమయం మూడు గంటలవుతోంది. అందరూ నడుం వాల్చారు.
సుమారు వో గంటకు భూషణం లేచి సూరీడు వొంటి మీద చెయ్యి వేసి లేపాడు. జేబులోంచి డబ్బు ఇస్తూ, ‘నా మనసు తీర్చు’ అన్నాడు. ‘అందుకు డబ్బెందుకు బాబూ’ అంది సూరీడు. మరి? ‘నేనలాంటిదాన్ని కాను. పోయి పడుకో అయ్యా’ అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. అవధాని నవ్వాపుకున్నాడు.

తెల్లారి అంతా నిద్రలేచారు. ఆరు గంటల బస్సు వచ్చే వేళయింది. కలెక్టర్‌ గారింట్లో పెళ్లికి సమయానికి వెళ్లొచ్చు! రోడ్డు వైపు నడుస్తున్నారు. రామచంద్రం ఉత్సాహంగా ఉన్నాడు. మళ్లీ శ్రీమంతుడూ టెన్నీస్‌ చాంపియనూ అయిపోయాడు. ‘ఎపుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్దయ్యా’ అన్నాడు కృతజ్ఞతగా. ‘చిత్తం’ అని ముసలాయనా, సూరీడూ వెనక్కి వెళ్లిపోయారు.
కారు తడిసిపోయింది మంచులో. తణుకు వెళ్లగానే దీన్ని తీసుకువచ్చే ఏర్పాటు చేయాలనుకున్నారు.

ఇంతలో ‘బాబయ్యా’ అని కీచుగా కేక వినపడింది. సూరీడు పరుగెత్తుకొస్తోంది. ‘బాబూ, మా అయ్యని పాము కరిచింది. ఒక్కసారి రండి బాబూ’. అరెరెరె! ‘సగం దూరం వెళ్లగానే వేరు ముక్క కోసం పొదలో చెయ్యిపెట్టి మొక్క పీకబోయాడు. బుస్సున లేచి కాటు వేసింది బాబూ తాచుపాము’. అయ్యో! ఈ బస్సు దాటితే ఎలాగ? ‘మీరుంటే ధైర్యం బాబూ’ సూరీడు ఏడుస్తోంది. ‘కలెక్టర్‌ గారింట్లో పని అంతా నేను చూసుకుంటానని మాట ఇచ్చానే’ రామచంద్రానికి సమస్య వచ్చి పడింది. అదిగో బస్సు వచ్చేస్తోంది. అవధాని నిశ్చేష్టుడై చూస్తున్నాడు. బస్సు ఆగింది. రామచంద్రం గబుక్కున రెండు పదిరూపాయల నోట్లు సూరీడు చేతిలో పెట్టి బస్సు ఎక్కేశాడు. అవధానిని బస్సులోకి తోసి, భూషణం కూడా ఎక్కాడు. బస్సు బర్రున సాగింది. సూరీడు గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. పది రూపాయల నోట్లు గాలిలో పల్టీలు కొట్టుతున్నాయి.

బాలగంగాధర తిలక్‌ (1921–66) ‘నల్లజర్ల రోడ్డు’ కథ సారాంశం ఇది. ఈ కథ ఆంధ్రపత్రిక ప్లవ సంవత్సరాది సంచిక (1961)లో ప్రచురితం. కథకుడు కూడా అయిన తిలక్‌ కవిగా మరింత ప్రసిద్ధుడు.
‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. ‘అమృతం కురిసిన రాత్రి’ ఆయన కవితల సంకలనం.

బాలగంగాధర తిలక్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement