తిలక్ పద్యం గురించి ఎక్కువగా మాట్లాడు కోలేదు సాహిత్య లోకం. కుందుర్తి, సినారె వంటి అప్పటి కొంతమంది కవుల లాగా కాక వచన కవితకు సమాంతరంగా చివరి వరకూ పద్యకవిత కూడా రాస్తూనే ఉన్నాడు. 1966 అంటే తిలక్ చనిపోయిన సంవత్సరం మార్చి నెల భారతిలోకూడా ‘అమృత భావము’(!) అని ఒక పద్యకవితా ఖండిక వచ్చింది. ఆయన పద్యకవిత్వం ‘ప్రభాతము సంధ్య,’ ‘గోరువంకలు’ అని రెండు సంపుటాలుగా అచ్చయింది. ఇవికాక ‘మండోదరి’ అని మూడువందల పద్యాల రచన ఒకటి చేశాడనీ, దాన్ని పోగొట్టుకున్నాడనీ, అందులో 3 పద్యాలు మాత్రం మిగిలాయనీ ఆయన యువమిత్రులు చెబుతున్నారు.
తిలక్‌కి సాహిత్యోహ వచ్చేనాటికి అంటే సుమారుగా 1933 ప్రాంతాలలో తెలుగునాట బలంగా ఉన్న కవిత్వం భావకవిత్వం. ‘ప్రభాతము సంధ్య’ భావకవిత్వం కన్నబిడ్డ. ‘‘ఇప్పుడు దాన్ని చూస్తే నవ్వు వస్తుంది. ప్రతిపంక్తిలోనూ కృష్ణశాస్త్రి ప్రభావం కనిపిస్తుంది’’ అని మిత్రులతో అన్నాడట తిలక్ ఆ పుస్తకాన్ని ఉద్దేశించి. కానీ ఒక పదహారు పదిహేడేళ్ళ కుర్రాడు భావకవిత్వంలో ఆ స్థాయిని అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇందులో పద్యఖండికలు 24. వీటిలో వస్తువు ఏమిటి అంటే ఆర్తి, దుఃఖం, దిగులు, పట్టరాని ఆనందం, ప్రేమ, ఆరాధన... యువ తిలక్ చేసిన కొన్ని ఊహలు, ఆలోచనలు ఆశ్చర్యాన్ని కలగ జేస్తాయి. గృహలక్ష్మి అనే ఖండికలో ఒక పద్యం చూడండి. బాలింతరాలు అయిన భార్యతో అంటు న్నాడు యువభర్త.
పసుపు మోమున నగవు నివాళులెత్త
కక్షమందున పసికందు కలకలమ్ము
మహిత మాతృరాగోజ్వల మండితోరు ఫాలసీమ
నీవు తొలిచూలుకే జగజ్జనని వైతి వమ్మ
బిడ్డతో ఉన్న భార్యను చూసి, ‘నువ్వు తొలి చూలుకే జగజ్జనని వయ్యావు’ అనడం విశాలోదా త్తమైన ఊహ. భార్యని, ఒకానొక బాలింతను మించి చూస్తున్నాడు కవి.
‘ఆహుతి’ ఖండికలో ‘‘స్వామి! అవ్యయ బాష్ప స్రవంతి బతుకు నుప్పగిలచేసె’’ అంటాడు. జీవితం కన్నీళ్ళ వల్ల ఉప్పగా ఉందట.
‘ప్రభాతము సంధ్య’ సంపుటిలో ఉన్నవన్నీ పద్యాలు మాత్రమే కాదు. గేయాలూ, ‘అపద్యాలూ’ కూడా ఉన్నాయి. పై రెండూ అపద్యాలే. భావం పూర్తికాగానే పద్యాన్ని పాదం మధ్యలోనే ఆపేసిన సందర్భాలూ, యతి ప్రాసలు విడిచి పెట్టి రాసిన పద్యాలూ కూడా ఉన్నాయి కానీ అపద్యాలు అని అంటున్నవి వాటిని కాదు. ఇవి పద్యాలలాగా కని పించే పద్యేతర రచనలు. వీటిలో యతి, ప్రాస, గణం ఏమీ లేవు. కానీ రచనా మర్యాద మాత్రం పూర్తిగా పద్యరచనా మర్యాదే. కవి అపరిణతి కారణం అనడానికి వీలులేదు. చక్కగా రాసిన పద్యాలు అనేకం ఉన్నాయి కనక. 1940 తర్వాత రాసిన పద్యాలు తిలక్ మరణానంతరం ‘గోరువంకలు’ అనే సంపుటిగా వచ్చాయి. ఇందులో వృత్త పద్యాలెక్కువ.
తిలక్ పద్యం ప్రాచీన పద్యం కాదు. ప్రాచీన పద్యంలాగా భావకవిత్వ పద్యం ప్రతిపదార్థ తాత్ప ర్యాలకు లొంగదన్న విషయం తెలిసిందే. ప్రాచీన పద్యం కవి వ్యక్త చేతనలో పుడుతుంది. బహిఃప్రపంచాన్ని ఆవి ష్కరిస్తుంది. ఎన్ని కల్పనలు, ఊహలు చేసినా ప్రాచీ నకవి ఒక సరళతర్కం పరిధిలో చేస్తాడు. భావ కవిత్వంలో అలాకాదు. దృశ్యానికి శబ్దంతో పోలిక, శబ్దానికి పరిమళంతో, పరిమళానికి స్పర్శతో పోలిక ఇలా. అందుకు కారణం భావకవిత్వంలో అవ్యక్త చేతన జోక్యం హెచ్చు.
జాలి, వేదన, స్వప్నం వంటి కొన్ని మాటలు తిలక్‌కి ఇష్టం. మాటలు ఎప్పుడూ మాటలు కావు. కాన్‌సెప్ట్స్. ‘‘ఒక్క జాలిమాట ఒక్క నిడుద యూర్పు, విడువడేల నరుడు వింత లోభి, కరకు గుండెకన్న ఇరుకు గుండె అవని, దుఃఖ కారణమ్ము దుర్భరమ్ము ’’అన్నాడు. ఆరుద్ర అన్నట్టు తిలక్ ఉత్త దయామయుడు.
తిలక్ పద్యం అతని వచన కవితా శైలిని ప్రభా వితం చేసింది. తిలక్ వచనకవిత్వం నోటికి రావడానికి ముఖ్యమైన కారణా లలో ఇదొకటి. ‘ఏకాంత కుంతని హతమ్ము రసైక మద్భావనా శకుంతమ్ము.’ ‘హేమంత సమీర పోతమేమింతగా క్రొవ్వి నన్న లయించును.’ ఇటువంటి పంక్తులు వచన కవి రాయడు. అయితే తిలక్ పద్యం మీద వచన కవిత ప్రభావం కన బడదు. దశాబ్దాల తర్వాత కూడా కవుల్ని ప్రభావితం చెయ్యగలి గిన వచనకవిత్వం రాసిన తిలక్, తన పద్య కవిత్వం మీద దాని ముద్ర పడకుండా రాయడం విచిత్రం.
వస్తు సంవిధానంలో తిలక్ వచన కవితలు కొన్ని ఆ ప్రక్రియకు ఒక కొత్త మెలకువను మప్పాయి. ప్రకటన, సీఐడీ రిపోర్టు, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, నిన్న రాత్రి, సైనికుడి ఉత్తరం... ఇలాంటి కవితలు స్థల, కాల, పాత్ర సంఘటనల్ని కూడా నింపుకుని కథాచ్ఛాయతో విశిష్టంగా నడు స్తాయి. ఆలోచనలుగా, సందేశాలుగా, ఊహలుగా నడుస్తున్న వచన కవిత్వానికి కథాస్పర్శ ఇవ్వగలిగిన తిలక్ పద్యాన్ని అబ్‌స్ట్రాక్ట్‌గా వదిలివెయ్యడం విచిత్రం.
వచన కవిత్వంలో యుద్ధం ‘ఒక అనాగరకత’ అన్న తిలక్, ‘ఏ దేశ సంస్కృతి అయినా కాదొక స్థిర బిందువు నైక నదీ నదాలు కలిసిన అంతస్సింధువు’ అన్న తిలక్, పావెల్ శవాన్ని చూపి ‘ప్రతి ఒక్కడూ దీనికి బాధ్యుడు’ అన్న తిలక్, ‘దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుంచి, పతివ్రతల నుంచి’ అన్న తిలక్... ఇలాంటి సారవంతాలయిన కొత్త ఆలోచ నల్ని పద్యంలో చూపించలేదు. పద్యానికి కొత్త రక్తాన్ని ఎక్కించగల సమర్థత ఉండికూడా ఆ పని చెయ్యలేదనిపిస్తుంది. వచన కవిత్వాన్ని ప్రపం చంతో పంచుకుని పద్యకవిత్వాన్ని తనకోసం ఒక ప్రత్యేక ప్రపంచంగా మలుచుకున్నట్టు కనిపిస్తుంది.
‘తనలో తానొక ఏకాంతం రచించుకున్న స్వాప్ని కుడు’ అన్న రాచమల్లు రామచంద్రారెడ్డి వాక్యం తిలక్ పద్యకవిత్వానికి నిస్సందిగ్ధంగా వర్తిస్తుంది. తిలక్ వచన కవిత్వం రాయకుండా పద్యకవిత్వం మాత్రమే రాసి ఉంటే తిలక్ పద్యం గురించి ఇంత కంటే ఎక్కువగా మాట్లాడుకుని ఉండేది సాహిత్య లోకం. బహుశా అచ్చమైన భావకవుల్లో చిట్టచివరి వాడుగా లెక్కవేసి ఉండేది చరిత్ర.
-రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
వ్యాసకర్త సాహిత్య విమర్శకుడు
మొబైల్: 77991 11456
(సాహిత్య అకాడెమీ; తిలక్ వేదిక, తణుకు సంయుక్త నిర్వహణలో బాలగంగాధర తిలక్ శతజయంతి సభ నేడు తణుకు ఐఎంఏ హాల్‌లో)
Comments
Please login to add a commentAdd a comment