యాభై ఐదేళ్ల ఏళ్ల గౌరీ లంకేష్, సీనియర్ జర్నలిస్టు, హక్కుల ఉద్యమ కార్య కర్త. ఐదేళ్ల కిందట బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో 2017, సెప్టెంబర్ 5న హత్యకు గురైనారు. అంధత్వాన్ని, మూఢత్వాన్ని నింపు కున్న ముష్కరులు గౌరీ లంకేష్ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఆమె హత్య వెనుక హిందుత్వ శక్తులూ, ఆధిపత్య రాజకీయాలూ ఉన్నాయి.
సమానత్వాన్ని కోరుకుంటూ, లౌకిక వాదానికి కట్టుబడిన ఆమెను భౌతికంగా నిర్మూ లించడం ద్వారా లంకేష్‌లాంటి వారిని హెచ్చ రించాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. కానీ ఆమె హత్య తర్వాత దేశ వ్యాప్తంగా తలెత్తిన తీవ్ర ఆందోళనలు సంప్రదాయ మతతత్వ శక్తు లకు సరైన సంకేతాలనే పంపాయి. ప్రగతివాదు లను అణిచివేయడం సంఘ్ పరివార్ శక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువైంది. ఆ శక్తుల పాశవిక ధోరణికి గౌరీ లంకేశ్ హత్య మరో ఉదాహరణ మాత్రమే.
మూడున్నర దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో కొనసాగారు గౌరీ లంకేష్. ఇంగ్లిష్, కన్నడంలో అనేక స్ఫూర్తివంతమైన రచనలను చేశారు. తండ్రి పేరుతో ‘లంకేష్’ పత్రికను కూడా నడిపి మతవాద శక్తులను దును మాడారు. అందుకే మానవ హక్కుల హననానికి పాల్పడే మనువాదులు కుట్ర చేసి గౌరీ లంకేశ్ ప్రాణాలను హరించారు. గౌరీ లంకేశ్ హత్యకు ముందు ఆగస్టు 20, 2013న నరేంద్ర దబోల్కర్, 2015 ఫిబ్రవరి 20న గోవింద్ పన్సారే, అదే సంవత్సరం ఆగస్టు 30న ఎంఎం కల్బుర్గితో పాటు పదుల సంఖ్యలో దేశవ్యాప్తంగా కవులు, జర్నలిస్టులు హిందుత్వ శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారు. వెలుగులోకి వచ్చినవి కొన్నే, బయటకు తెలియనివి ఎన్నో!
– మామిండ్ల రమేష్ రాజా,
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, పాలకుర్తి
(నేడు గౌరీ లంకేష్ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment