లియూ జియాబో (1955–2017)
నివాళి
చైనా దేశపు ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కుల పోరాటంలో అహింసాత్మక ఉద్యమకారుడు, నిరంకుశాధికార వ్యతిరేకి, సాహిత్య విమర్శకుడు, కవి, 2010లో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత లియూ జియాబో ప్రభుత్వ నిర్బంధంలోనే జూలై 13న కాలేయ కేన్సర్‌తో కన్నుమూశారు.
అయిదుగురు సోదరులలో మూడవవాడు జియాబో. తండ్రి గ్రం«థాలయంలోనే బాల్యంలో మార్క్స్, లెనిన్ రచనల్ని చదివాడు. కాఫ్కానీ, దోస్తోవ్‌స్కీనీ ఎదుగుతున్న ప్రాయంలో చదివాడు. విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు కవిత్వం పట్ల ఆసక్తి మొదలైంది. సాహిత్య ఆచార్యుడుగా చేరాక, తత్వశాస్త్రం, మానవ స్వేచ్ఛ రచనలు చేయడం మొదలెట్టాడు.
1989 జూన్ 4న తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన విద్యార్థుల ప్రజాస్వామ్య ఆందోళనలో జియాబో ప్రముఖ పాత్ర వహించి, నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. యుద్ధ ట్యాంకుల బీభత్సంలో వందలకొద్దీ విద్యార్థుల ప్రాణాలు పోవడం చూసి చలించి, మిగిలిన వేలమందిని ముందు ప్రాణాల్ని రక్షించుకోమని ఒప్పించి, సైన్యంతో రాయబారం నడిపి, రెండు వేలమంది ప్రాణాల్ని కాపాడగలిగాడు. తియాన్మెన్ సంఘటనల ఫలితంగా ప్రజాజీవనాన్ని భంగపరుస్తున్నాడన్న కారణంతో 1989– 1991 వరకూ మొదటిసారి ఆయనను నిర్బంధించారు.
1995లో ఏ విచారణా లేకుండా నిర్బంధించి, 1996 – 1999 వరకూ శ్రామిక శిబిరంలో ఉంచారు. ప్రాథమిక మానవ హక్కుల కోసం 2008లో ‘చార్టర్ 08’గా పిలవబడ్డ కార్యాచరణ పత్రం రూపొందించడంలో ముఖ్య భూమిక వహించిన కారణంగా, ‘రాజ్యాధికారాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నా’డన్న నేరారోపణతో 2009లో 11 ఏళ్ల కారాగారాన్ని విధించారు. ఆయన భార్య లియూ జియా(కవయిత్రి)ను గృహ నిర్బంధంలో ఉంచి, బయటి ప్రపంచంతో పరిమిత సంబంధాల్ని కలిగించి, నిఘా పెట్టారు. పోలీసుల కనుసన్నలలో నెలకొకసారి కొద్ది సమయం మాత్రం భర్తను చూసేందుకు అనుమతించారు.
2010లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన విషయం భార్య నోట విన్నప్పుడు భోరున ఏడ్చి, ఆ బహుమతిని తియాన్మెన్‌లో ప్రాణాల్ని కోల్పోయిన విద్యార్ధులకు అంకితమిచ్చాడు జియాబో. బహుమతి తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించని కారణంగా, ప్రదానోత్సవాన, ఆ బహుమతిని ఆయన పక్షాన ఒక ఖాళీ కుర్చీలో ఆయన ఫొటో ముందు పెట్టారు. 2009లో ఆయన్ను విచారిస్తున్నప్పుడు చేసిన ప్రకటననే స్వీకారోపన్యాసంగా, నార్వే నటి, దర్శకురాలు లివ్ ఉల్ల్మన్ చదివారు. ‘నా చివరి ప్రకటన ఇది: నాకు శత్రువులు లేరు’ అని చెప్తూ, భార్య జియా పట్ల ప్రేమనీ, పోలీసు విచారణాధికారుల పట్ల శత్రుత్వ లేమినీ, చైనా రాజకీయ సరళీకరణం తప్పకుండా జరిగి తీరుతుందన్న నమ్మకాన్నీ వ్యక్తపరిచాడు.
తియాన్మెన్ స్క్వేర్ మృతుల జ్ఞాపకార్థం రాసినవాటితో బాటు, తన సహచరికి రాసిన కవితలతో ‘జూన్ నాలుగు నాటి విషాదగీతాలు’గా 2011లో జియాబో మిత్రులు సంకలనం తెచ్చారు. దలైలామా ముందుమాట రాశారు. ఒకటైనా వేరుగా జీవితం గడపాల్సి వస్తున్నందుకు తాను ప్రేమించిన భార్యను ఓదారుస్తూ– ‘నీ ప్రేమ సూర్యకాంతిలా ఎల్తైన గోడల్ని గెంతి, నా జైలు ఇనుప ఊచల్ని దాటుకుంటూ, నా చర్మం ప్రతీ అంగుళాన్ని లాలిస్తుంది, నా శరీరపు ప్రతీ కణాన్ని వెచ్చబరుస్తుంది... జైలులో నా సమయపు ప్రతి నిమిషాన్ని అర్థవంతం చేస్తుంది’ అంటూ రాశాడు.
‘నన్ను ముక్కలు ముక్కలు చేసి చూర్ణం చేసేసినా, నిన్ను నా చితాభస్మంతో హత్తుకుంటాను. జైలు గోడలు శరీరాన్ని నిర్బంధించగలవేమో కానీ, ఏ జైలు గోడలూ ఆత్మని నిరోధించ లేవు’ అన్నాడు.
- ముకుంద రామారావు
9908347273