వర్తమానాన్నే కాదు గతాన్ని కూడా చూపించగలిగే అద్దం సాహిత్యం. చూశాక అనుభవాల విభిన్న దృక్పథంతో వాటిని మళ్లీ మళ్లీ దర్శిస్తుంటాం, మరొక అర్థ నిర్ణయమేదో చేయబోతాం. తమిళ శైవ సాహిత్యంలో అలా చూడబడ్దవాడు నందనార్. క్రీ.శ. 660 నుండి 840 మధ్యవాడు. అరవై ముగ్గురు నాయనార్లలో 18వ నాయనార్. నాయనార్లలో ఒకే ఒక్క దళితుడు నందనార్. అసలు పేరు ఎవరికీ తెలియదు. అణకువ, సహనం, నిజాయితీ, పవిత్రత మూర్తీభవించిన పరమ శివభక్తుడు.
శివ దర్శనం తప్పకుండా చేసుకుంటానన్న ‘రేపు’ మీద నమ్మకం, అతన్ని చివరి వరకూ నడిపించింది. నందనార్, తంజావూరు జిల్లాలోని, కొల్లిదం నదీతీరాన ఉన్న ఆదనూరులో జన్మించాడు. డోలు, ఢంకా, మృదంగం లాంటి సంగీత వాయిద్యాలకు పనికొచ్చే, పశువుల చర్మాన్ని సమకూర్చి ఆ వాయిద్యాలను తయారుచేసే వారిని పరయర్లు అంటారు. భిన్నమైన వ్యక్తిత్వం కలవాడైనా, తన కులస్థుల్లో కలిసిపోయేవాడు. పహారా కాయడం, దండోరా వేయడం, చచ్చిన పశువుల్ని పారేయడం మొదలైనవన్నీ చేసేవాడు. ఆ కులంవారు ఆరాధించే కాళి, కాట్టేరి, ముణియాణ్డి, కురుప్పన్, చాముండి లాంటి దేవతలున్నా, బాల్యం నుండీ శివుడే అతనికి ఆరాధ్య దైవం. ఏ కాస్త సమయం దొరికినా శివాలయం ముందు ఏకాంతంగా నిలుచొని, శివగానం చేసుకుంటూ నర్తించేవాడు. ఒక అగ్రకుల భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు.
ఒక రోజు తానున్న తిరుపుంగూరులోని ఇంటికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న శివలోకనాథార్ కోవెలలోని శివుని చూద్దామని వెళ్లాడు. దళితుడు కావడాన మందిరంలోనికి ప్రవేశం లభించలేదు. బయటనుండైనా శివుని చూద్దామన్న కోరిక తీరనివ్వకుండా, పెద్ద నంది విగ్రహం అడ్డుగా ఉంది. అతని ఆరాటం చూసి ఈశ్వరానుగ్రహంతో అది పక్కవాటుగా జరగడంతో, శివుని దర్శనమయింది. అలా పక్కకు జరిగినట్టుగానే ఇప్పటికీ ఆ నంది విగ్రహం ఉండటం విశేషం. ఆ ఆనందంలో గుడి ప్రాంతమంతా తిరుగుతుంటే, ఆ పరిసరాల్లో కూలిపోయే దశలో ఉన్న పాడుపడ్డ గుడిచెరువు కనిపించింది. దానిని పునర్నిర్మించాలన్న తలంపుతో ఒక్కడే పునరుద్ధరణ పనులు మొదలుపెట్టాడు. నందనార్ సేవకు మెచ్చి ప్రభువు వినాయకుని పంపి, ఆ పని జయప్రదంగా పూర్తి చేయించాడని అనుకుంటారు.
ఆదనూరుకు తిరిగొచ్చి, ఎన్ని శివాలయాలు దర్శిస్తూ ఉన్నా, దక్షిణ కాశీగా పిలవబడే చిదంబరంలోని తిల్లయి నటరాజభంగిమలోని శివుడ్ని చూడాలన్న కోరిక ఎక్కువ కావడం మొదలయింది. దళితుడుగా అది సాధ్యం కాదని తెలిసినా, ‘నాలై పోవెన్ (రేపు వెళతాను)’ అని తోటివారికి చెప్పుకుంటూ రోజులు గడిపేవాడు. అందుకని అతని పేరు ‘తిరు నాలై పోవార్ (రేపు వెళ్లే వాడు)’ అని పిలిచేవారు. అక్కడకు పోయేందుకు భూస్వామిని అనుమతి అడుగుతూనే ఉండేవాడు. భూస్వామి ఏదో ఒక నెపంతో అనుమతి నిరాకరిస్తూ పోయేవాడు. ప్రతీ రోజు అలా చేయలేక, రాత్రికి రాత్రి 250 ఎకరాల పొలంలో నారు నాటగలుగుతే ఒప్పుకుంటానని ఒకరోజు వాగ్దానం చేశాడు. మర్నాటికి 250 ఎకరాల పొలం నాటబడి ఉంది.
చివరకు నందనార్ చిదంబరం పొలిమేరల్లోకి వెళ్లగలిగాడు గాని, ప్రవేశం లభించలేదు. దళితుడుగా జన్మించడమే నేరం కావడం అతన్ని మానసికంగా వేధించింది. గుండెలు బాదుకుంటూ రోదిస్తూ గుడి బయట రాత్రులూ పగలూ గడిపాడు. ప్రభువు కలిగించిన ఏర్పాటుగా గుడిలోకి ప్రవేశం కల్పించగలిగాయి. కానీ అగ్ని సంస్కారం పేర శుద్ధి చేసుకునే అగ్నిగుండం గుండా లోనికి పోవడానికి అనుమతిచ్చారు. ఆ మంటల్లో నుండి ఒక పవిత్ర పూజారిలా బయటపడ్డ నందనార్, గర్భగుడిలోని స్వామి సన్నిధికి చేరిన వెంటనే అంతర్ధానమై పోయాడని పెరియ పురాణం చెబుతుంది. లోనికి పోకుండానే ఆ మంటల్లో అతను ఆహుతి అయిపోయి ఉంటాడని మరో కథనం. చిదంబరం నటరాజ మందిరం స్థల పురాణంలో నందనార్ ప్రస్తావన ప్రముఖంగా ఉంది. ప్రముఖ కవి సుందరార్ ప్రస్తావించిన శైవ మునుల జాబితాలో నందనార్ పేరు కూడా ఉంది. రాతలో అతనివి ఏవీ లేవు, అయినా గొప్ప శివ భక్తుడుగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. నందనార్‌ని ప్రశంసించిన వారిలో నారాయణ గురు, మహాత్మా గాంధీ, స్వామీ శివానంద, అంబేద్కర్ లాంటి వారు ఎందరో ఉన్నారు. 1910లో స్వామి సహజానంద చిదంబరంలోనే నందనార్ మఠాన్ని అతని గుర్తుగా స్థాపించారు.
చోళ రాజుల తోడ్పాటు నాయనార్లకు పుష్కలంగా లభించింది. వారి పాలనలోనే దేవాలయాల కట్టడాలు ఎక్కువగా మొదలయాయి. రెండవ కులోత్తుంగ చోళుని దగ్గర మంత్రిగా పనిచేసిన 12వ శతాబ్దపు శెక్కిళార్ ముని అరవైముగ్గురు నాయనార్ల జీవిత చరిత్రలను మూడువందల సంవత్సరాల తరువాత సేకరించి, పెరియ పురాణం పేరన నమోదు చేశాడు. తమిళుల ముఖ్య గ్రంథమైన తేవారంలో, పన్నెండవ సంకలనంగా దానిని చేర్చాక అదే సంపూర్ణ తమిళ శైవ సిద్ధాంతంగా, తిరుముఱై పేర రూపుదిద్దుకుంది. పెరియ పురాణంలో నందనార్ చరిత్ర కూడా ఉంది.
అయితే సంగీత సరస్వతి త్యాగరాజు సన్నిహితుడు, స్వాతంత్య్ర యోధుడు, 19వ శతాబ్దపు గోపాలకృష్ణ భారతియార్ 1861లో రాసి ప్రచురించిన ‘నందనార్ చరిత్రం’ మూలంగా తమిళ జనసమూహానికి నందనార్ మరోకోణం పరిచయమైంది. భారతియార్ కూడా తంజావూరు జిల్లా వాడే కావడం, అతడి కథనం పెరియ పురాణంలోని కథకు భిన్నంగా ఉండటంతో, ఆ జిల్లా వాసుల, అగ్రకులాల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. యజమాని దురాగతాల్ని సహించలేని, బానిస కార్మికుడుగా నందనార్‌ని అతను చూపించాడు. అయినా శివభక్తిలో ఏవిధమైన లోటూ నందనార్ రానియ్యలేదని, ఒక ఆసక్తికరమైన హరికథా కాలక్షేపంలా నందనార్ కథని తీర్చిదిద్దటంతో, దానిపట్ల విమర్శలకు దీటుగా ప్రశంసలతో తమిళ ప్రజలు దానిని ఆదరించారు. హరికథ రూపంలో ఉండటాన ఉండటాన హరికథ భాగవతార్లందరూ దానిని బాగా వ్యాప్తిలోకి తెచ్చారు.
1917లో ‘నందన్’ పేరు మీద గోపాలసామి, ఆరావముద అయ్యంగార్లు రాసిన నవల కూడా వచ్చింది. అదికూడా శెక్కిళార్ కథనానికి భిన్నంగానే వచ్చింది. శ్రీలంకలో కూడా అణగారిన వర్గాలకు దేవాలయంలోకి ప్రవేశం లేదు. అక్కడి అభ్యుదయ రచయిత మురుగయ్యన్ 1969లో రాసిన సంగీత పద్య నాటకం ‘గోపురం ప్రవేశద్వారం’లో నందనార్ కథని మరో రూపంలో చూపించాడు.
తంజావూరు జిల్లాలోని కీలవేణ్మణి గ్రామంలో, హరిజన కూలీలు న్యాయమైన వారి జీతాలు అడిగినందుకు ప్రతిగా, భూస్వామి 25 డిసంబర్ 1968న, 44 మంది హరిజనుల్ని సజీవ దహనం చేసిన ఘటనతో ఉత్తేజితమై 1978లో ఇందిరా పార్థసారథి ‘నందన్ కథ’ ఆధునిక నాటకం తన స్వీయ గూఢార్థాలతో మరీ భిన్నంగా రాసి మెప్పించాడు. నందనార్ శివునితో ఐక్యమయి పోవడం అన్నది నిజానికి తెలివిగా అమలుపరిచిన ఒక పన్నాగం అని, సృజనాత్మక రచయితగా అతను ఊహించి రాసిన మొదటి సంచలనాత్మక కథనం అది.
1982లో తిరునల్వేలి జిల్లా మీనాక్షీపురం హరిజన కాలనీలోని వారిని ఇతర మతంలోకి చేర్పించిన సందర్భంలో మతకలహాలు చెలరేగాయి. ఆ సందర్భంగా కూడా జయప్రకాశం ‘విల్లు పాట’ పేరుమీద ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాడు. పరిశోధించబడ్డ నందనార్ కథగా అది 1984లో ప్రచురించబడింది. సమకాలీన సామాజిక సమస్యలా ఉండి, అది జనరంజకమైన జానపద వినోద కార్యక్రమంలా అందరూ స్వీకరించారు.
తమిళ కథా ప్రపంచంలో ప్రముఖుడు పుదిమిపిత్తన్, ‘కొత్త నమందన్’ పేరున 1948కి ముందే కథ రాశారు. ఒకప్పటి గొప్ప చలనచిత్ర హాస్యనటుడు కలైవాణర్‌గా అందరికీ తెలిసిన ఎన్.ఎస్.క్రిష్ణణ్ కూడా ఒక నవల నందనార్ ఇతివృత్తంతో రాశాడు. ఆ నవల రాకముందే 1933 నుండి పది సంవత్సరాలలోపే, వివిధ నటులతో, వేరువేరు సంఘటనలతో మూడు చలన చిత్రాలు 1933, 1935, 1942లలో నందనార్ కథ నేపథ్యంతో వచ్చాయి.
పన్నెండువందల సంవత్సరాల క్రితపు నందనార్ జీవితం మరణం విషయంలో ఏదో చిదంబర రహస్యం దాగి ఉందన్న ఆసక్తిని, అప్పటికీ ఇప్పటికీ మారని పరిస్థితులు పెంపొందిస్తూనే ఉన్నాయి. ఆ కారణంగా 8వ శతాబ్దం నుండీ ఇప్పటివరకూ అనేక విధాలుగా కవులు, రచయితలు, సంగీతకారులు, నాటకకర్తలు వారిదైన దృష్టికోణాలతో, నందనార్‌ని తిరిగి తిరిగి సృష్టిస్తూనే ఉన్నారు.
అంతకుముందరి కథనంలో ఎదో సందేహాన్ని తీర్చేందుకు చేసే ప్రయత్నాలే నందనార్‌ని చిత్రించడంలో ఎక్కువ. అందరి ముఖ్యమైన సందేహాలు ఇవి – 1. నందనార్ ఎదురుతిరిగే వ్యక్తి కాడా? 2.శివలోకనాథార్ గుడి చెరువుని తానే తిరిగి పునర్నిర్మించాడా లేక అది అతనికి శిక్షగా చేయించిన పనా? 3. అగ్నిగుండంలోకి ప్రవేశించాలని అతనిని ఒప్పించారా లేక ఒత్తిడి చేసి తీసుకు వెళ్లారా? 4.అగ్నిగుండం నుండి బయటపడి అంతర్ధానమయాడా లేక అగ్నిగుండంలో మరణించాడా?
వర్తమానంలో గతం ఉంది. ఆ నేపథ్యం వర్తమానాన్ని మరింత బాగా అర్థం చేసుకొందుకు పనికొస్తుంది. జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుందుకు, గతాన్ని చరిత్ర కాగడా ప్రకాశింపజేసి చూపిస్తుంది.
- ముకుంద రామారావు
Comments
Please login to add a commentAdd a comment