Liu Xiaobo
-
నన్ను ముక్కలు చేసినా
నివాళి చైనా దేశపు ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కుల పోరాటంలో అహింసాత్మక ఉద్యమకారుడు, నిరంకుశాధికార వ్యతిరేకి, సాహిత్య విమర్శకుడు, కవి, 2010లో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత లియూ జియాబో ప్రభుత్వ నిర్బంధంలోనే జూలై 13న కాలేయ కేన్సర్‌తో కన్నుమూశారు. అయిదుగురు సోదరులలో మూడవవాడు జియాబో. తండ్రి గ్రం«థాలయంలోనే బాల్యంలో మార్క్స్, లెనిన్ రచనల్ని చదివాడు. కాఫ్కానీ, దోస్తోవ్స్కీనీ ఎదుగుతున్న ప్రాయంలో చదివాడు. విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు కవిత్వం పట్ల ఆసక్తి మొదలైంది. సాహిత్య ఆచార్యుడుగా చేరాక, తత్వశాస్త్రం, మానవ స్వేచ్ఛ రచనలు చేయడం మొదలెట్టాడు. 1989 జూన్ 4న తియాన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన విద్యార్థుల ప్రజాస్వామ్య ఆందోళనలో జియాబో ప్రముఖ పాత్ర వహించి, నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. యుద్ధ ట్యాంకుల బీభత్సంలో వందలకొద్దీ విద్యార్థుల ప్రాణాలు పోవడం చూసి చలించి, మిగిలిన వేలమందిని ముందు ప్రాణాల్ని రక్షించుకోమని ఒప్పించి, సైన్యంతో రాయబారం నడిపి, రెండు వేలమంది ప్రాణాల్ని కాపాడగలిగాడు. తియాన్మెన్ సంఘటనల ఫలితంగా ప్రజాజీవనాన్ని భంగపరుస్తున్నాడన్న కారణంతో 1989– 1991 వరకూ మొదటిసారి ఆయనను నిర్బంధించారు. 1995లో ఏ విచారణా లేకుండా నిర్బంధించి, 1996 – 1999 వరకూ శ్రామిక శిబిరంలో ఉంచారు. ప్రాథమిక మానవ హక్కుల కోసం 2008లో ‘చార్టర్ 08’గా పిలవబడ్డ కార్యాచరణ పత్రం రూపొందించడంలో ముఖ్య భూమిక వహించిన కారణంగా, ‘రాజ్యాధికారాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నా’డన్న నేరారోపణతో 2009లో 11 ఏళ్ల కారాగారాన్ని విధించారు. ఆయన భార్య లియూ జియా(కవయిత్రి)ను గృహ నిర్బంధంలో ఉంచి, బయటి ప్రపంచంతో పరిమిత సంబంధాల్ని కలిగించి, నిఘా పెట్టారు. పోలీసుల కనుసన్నలలో నెలకొకసారి కొద్ది సమయం మాత్రం భర్తను చూసేందుకు అనుమతించారు. 2010లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన విషయం భార్య నోట విన్నప్పుడు భోరున ఏడ్చి, ఆ బహుమతిని తియాన్మెన్లో ప్రాణాల్ని కోల్పోయిన విద్యార్ధులకు అంకితమిచ్చాడు జియాబో. బహుమతి తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించని కారణంగా, ప్రదానోత్సవాన, ఆ బహుమతిని ఆయన పక్షాన ఒక ఖాళీ కుర్చీలో ఆయన ఫొటో ముందు పెట్టారు. 2009లో ఆయన్ను విచారిస్తున్నప్పుడు చేసిన ప్రకటననే స్వీకారోపన్యాసంగా, నార్వే నటి, దర్శకురాలు లివ్ ఉల్ల్మన్ చదివారు. ‘నా చివరి ప్రకటన ఇది: నాకు శత్రువులు లేరు’ అని చెప్తూ, భార్య జియా పట్ల ప్రేమనీ, పోలీసు విచారణాధికారుల పట్ల శత్రుత్వ లేమినీ, చైనా రాజకీయ సరళీకరణం తప్పకుండా జరిగి తీరుతుందన్న నమ్మకాన్నీ వ్యక్తపరిచాడు. తియాన్మెన్ స్క్వేర్ మృతుల జ్ఞాపకార్థం రాసినవాటితో బాటు, తన సహచరికి రాసిన కవితలతో ‘జూన్ నాలుగు నాటి విషాదగీతాలు’గా 2011లో జియాబో మిత్రులు సంకలనం తెచ్చారు. దలైలామా ముందుమాట రాశారు. ఒకటైనా వేరుగా జీవితం గడపాల్సి వస్తున్నందుకు తాను ప్రేమించిన భార్యను ఓదారుస్తూ– ‘నీ ప్రేమ సూర్యకాంతిలా ఎల్తైన గోడల్ని గెంతి, నా జైలు ఇనుప ఊచల్ని దాటుకుంటూ, నా చర్మం ప్రతీ అంగుళాన్ని లాలిస్తుంది, నా శరీరపు ప్రతీ కణాన్ని వెచ్చబరుస్తుంది... జైలులో నా సమయపు ప్రతి నిమిషాన్ని అర్థవంతం చేస్తుంది’ అంటూ రాశాడు. ‘నన్ను ముక్కలు ముక్కలు చేసి చూర్ణం చేసేసినా, నిన్ను నా చితాభస్మంతో హత్తుకుంటాను. జైలు గోడలు శరీరాన్ని నిర్బంధించగలవేమో కానీ, ఏ జైలు గోడలూ ఆత్మని నిరోధించ లేవు’ అన్నాడు. - ముకుంద రామారావు 9908347273 -
చైనాకు చావంటే కూడా భయమే
న్యూయార్క్: కొందరు బతికి ఉండడమంటే చైనా ప్రభుత్వానికి భయమన్నది మానవ హక్కుల ఉద్యమాల గురించి తెలిసిన చాలా మందికి తెలుసు. కానీ వారి చావన్న కూడా చైనా ప్రభుత్వానికి భయమన్నది నేడు కొత్తగా తెలిసింది. నోబెల్ బహుమతి అవార్డు పొందిన రచయిత, చైనా మానవ హక్కుల కార్యకర్త లియు జియోబో (61) మరణ వార్త గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకూడదని చైనా ప్రభుత్వం ఎంతో జాగ్రత్త పడింది. ఆయన మరణించారనే వార్త ఎలాగో ప్రపంచానికి తెలియడంతో ఆయన అంత్యక్రియలు గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని చూసింది. ఆయన మరణ వార్త పట్ల ప్రపంచం నలుమూలల నుంచి వెల్లువెత్తుతున్న సంతాప సందేశాలను, నివాళులను అడ్డుకునేందుకు కూడా శతవిధాల ప్రయత్నించింది. ఆయన కొటేషన్లనుకానీ, పోరాటానికి సంబంధించిన అంశాలనుగానీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంది. ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్లను బ్లాక్ చేసింది. చైనాలో కూడా జియోబో మరణవార్త ఎక్కువగా ప్రచారం కాకుండా ఉండేందుకు జాగ్రత్త పడింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, కెనడా అధ్యక్షుడిని కలుసుకున్న విషయాన్ని మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించిన చైనా పీపుల్స్ డెయిలీ పత్రికా జియోబో మరణ వార్తను చిన్నగానైనా ఎక్కడా పేర్కొనలేదు. గ్లోబల్ టైమ్స్‌లాంటి పత్రికలు జియోబో మరణ వార్త గురించి చిన్నగా రాసినప్పటికీ ఆయన పాశ్చాత్య దేశాల చేతుల్లో పావుగా బలయ్యారని పేర్కొంది. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న జియోబో గురువారం నాడు శాన్‌యాంగ్ ఆస్పత్రిలో మరణించారు. చైనాలో మానవ హక్కుల అవసరం గురించి, రాజకీయ సంస్కరణల ఆవశ్యకత గురించి రచనలు చేసినందుకు జియోబోను చైనా ప్రభుత్వం అరెస్ట్‌చేసి ఆయనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వభావాన్ని రెచ్చగొడుతున్నారన్న కేసు పెట్టింది. ఈ కేసులో 2009లో ఆయనకు 11 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయనకు క్యాన్సర్ వ్యాధి రావడంతో ఆయన గత నెలలో మెడికల్ పెరోల్‌పై శాన్‌యాంగ్ ఆస్పత్రిలో చేరారు. విదేశాల్లో చికిత్స చే యించుకుంటానని ఆయన మొరపెట్టుకున్నా అధికారులు అందుకు అనుమతించలేదు. ఆయన ఆరోగ్యం క్షీణించినందునే అనుమతించలేదని ఆస్పత్రి వర్గాలు ఆనక తెలిపాయి. గురువారం మరణించిన జియోబోకు శనివారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఫొటోను, దుస్తులను భార్య లియు జియా (56) అప్పగించిన చైనా జైలు అధికారులు అస్థికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జియోబోకు నోబెల్ బహుమతి వచ్చిన నాటి నుంచి ఆయన భార్య కవి, ఆర్టిస్ట్ లియు జియాను చైనా ప్రభుత్వం గహ నిర్బంధంలో ఉంచింది. చైనాలో మానవ హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం జరుపుతున్నందుకు జియోబోకు 2010లో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. అప్పటికే ఏడాది నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. తమ పరువు తీసేందుకే ఆయనకు నోబెల్ బహుమతిని ప్రకటించారని చైనా ప్రభుత్వం నాడు అంతర్జాతీయ సమాజం ముందు గోల చేసింది. ఇప్పుడు అంతర్జాతీయంగా జియోబోకు వస్తున్న నివాళులను చైనా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న విమర్శలకు ఇప్పుడు కూడా చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎవరికీ హక్కులేదంటూ చైనా విదేశాంగ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. జియోబో భార్యను గహ నిర్బంధం నుంచి విడుదల చేయాలనే డిమాండ్లకు మాత్రం చైనా స్పందించలేదు. ఆమె మిత్రులు చాలా మంది ఆమెను జర్మనీకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. జియోబో మరణించినప్పుడు ఆయన భార్య లియు జియా ఆయన పక్కనే ఉందట. ‘హావ్ ఏ గుడ్ లైవ్’ అని ఆయన విష్‌చేసి కన్నుమూశారట. ఈ సందర్భంగా ఆమె తన భర్త గురించి రాసిన ‘ది విండ్’ కవిత నుంచి కొన్ని పంక్తులను విడుదల చేశారు. ‘నాలుగు గోడలు నిన్ను ఊపిరాడకుండా చేసినప్పుడు బలంగా గాలి వీస్తుంది. ఆ గాలి ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో మీకు తెలియదు’ అన్న ఆ కవితా పంక్తులు మాత్రం చైనా అడ్డు గోడలను దాటి చాలా మంది ఆయన అభిమానులకు ఎలాగో చేరాయి. -
చైనా నోటి దురుసు.. నోబెల్ ఇవ్వడం తప్పట
బీజింగ్: చైనా మరోసారి తన దుష్ప్రవర్తనను బయటపెట్టుకుంది. ఏకంగా అంతర్జాతీయ సంస్థ తమ దేశ పౌరుడికి ఇచ్చిన సత్కారాన్ని తప్పుబట్టింది. ఆ వ్యక్తికి అవార్డు ఇవ్వడం అంటే దైవ దూషణ చేసినట్లేనంటూ తనకి ఇష్టం వచ్చినట్లు ప్రకటన చేసింది. చైనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం పోరాడి జైలు శిక్షకు గురైన ప్రముఖ పోరాటయోధుడు లియు జియాబో గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. అయితే, క్యాన్సర్ బారిన పడిన ఆయనకు మెరుగైన వైద్యం ఇచ్చేందుకు చైనా నిరాకరించడంతోపాటు విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు అంగీకరించలేదు. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి చైనా ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు అప్పుడప్పుడు అమెరికా, జర్మనీ నుంచి వైద్యులకు ప్రత్యేక అనుమతి ఇప్పించి వైద్యం చేయించారు. అయినప్పటికీ, ఆయన కన్నుమూశారు. దీంతో చైనా తీరు వల్లే నోబెల్ పురస్కార గ్రహీత కన్నుమూశాడంటూ తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన తప్పును కప్పి ఉంచుకునేందుకు అసలు ఆయనకు నోబెల్ అవార్డు ఇవ్వడమంటేనే దైవ దూషణ చేసినంత పని అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. -
నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత
-
నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత
కమ్యునిస్టు గడ్డపై ప్రజాస్వామ్యం కోసం శాంతియుతంగా పోరాడిన కిరణం నేలరాలింది. ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు అందాలని చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన ధీశాలి ఇకలేరు. ప్రపంచం ఆయన్ను నోబెల్ శాంతి పురస్కారంతో సత్కరించినా, చైనా ప్రభుత్వం మాత్రం కారాగారంలో పెట్టింది. అయినా వెనక్కు తగ్గకుండా ప్రజల ఆకాంక్ష కోసం కరుడుగట్టిన కమ్యునిస్టు భావాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అస్తమించారు. బీజింగ్ : చైనాకు చెందిన ప్రముఖ నోబెల్ శాంతి పురస్కార గ్రహీత లియూ జియాబావో(61) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. జైలు శిక్ష అనుభవిస్తున్న లియూ జియాబావోను ఈ మధ్యకాలంలోనే పెరోల్‌పై చైనా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజాస్వామ్య సంస్కరణల పేరిట ప్రభుత్వ కూల్చివేతకు కుట్రపన్నారన్న కారణంతో ఆయనకు 2009లో జైలుశిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి అనూహ్యంగా 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆయన నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. అయితే లియూ జైలులో ఉండటంతో అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఖాళీ కుర్చీని ఏర్పాటు చేసి నోబెల్ అందజేశారు. జైలులో ఉండగానే జియాబావో లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే ఇతర మెరుగైన చికిత్సకోసం విదేశాలకు పంపించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరిస్తూ కఠినంగా వ్యవహరించింది. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి రావడంతో అప్పుడప్పుడు జర్మనీ, అమెరికా దేశాల నుంచి ప్రత్యేక అనుమతితో వైద్యులను రప్పించి చికిత్స చేయించారు. అయినప్పటికీ క్యాన్సర్ తీవ్రత అధికమై అవయవాలు పనిచేయకపోవడంతో శరీరం చికిత్సకు సహకరించక అయన కన్నుమూశారు. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.