
పక్కకి ఒత్తిగిలితే
పుస్తక సమీక్ష
ముందుగా, శివారెడ్డి కవిత్వం గురించి రెండు మాటలు చెబుతాను-
చిన్న నీటి కుంటలో ఒక గులకరాయిని వేస్తే, అది నీటిలో వలయాలు సష్టిస్తుంది. ఆ దశ్యం చూడ్డానికి అందంగా ఉంటుంది. అయితే ఆ వలయాలు గట్టు వరకు సాగి ఆగిపోతాయి. కానీ ఒక పెద్ద బండరాయిని కుంట మధ్యలో పడవేస్తే ఆ ఒత్తిడికి నీళ్లు చెల్లాచెదురై ఎగిసి గట్టును దాటి బయటకు దూకుతాయి-
గట్టును ఆనుకొని విశ్రమించేది కాదు, గట్టును దాటి చేలల్లో పారే మహోద్రిక్త చైతన్యం శివారెడ్డి కవిత్వం!
శివారెడ్డి కొత్త కవితా సంపుటి ‘పక్కకి ఒత్తిగిలితే...’లో వందకు పైగా వచన కవితలున్నాయి. ఎన్నెన్ని సంఘటనలు, ఎన్నెన్ని సందర్భాలు, ఎంత జీవితం, ఎన్నెన్ని సమస్యలు... పొంగి పొంగి గుండెల వరకు ఎగిసి ముంచేసే ఆవేదన.. ఆవేశం. ఎంతో సున్నితంగా మరెంతో ప్రభావం చూపేదిగా చెప్పడానికి చేసిన ప్రయత్నం పాఠకుణ్ణి ఉద్రిక్తం చేస్తుంది. సునిశితమూ చేస్తుంది.
తొలి కవిత ‘పక్కకి ఒత్తిగిలితే’లో శివారెడ్డి ఇంతకు ముందు అనుసరించని ఒక ధోరణి ప్రవేశపెట్టడం చూస్తాం. అది కవిత్వంలో జానపద కథలను సందర్భోచితంగా చొప్పించడం. జీవితాన్ని గ్రహించడానికి, అనుభవించడానికి, లోలోపలికి ప్రసరించడానికీ ‘కల్పన’ ముఖ్యమవుతుంది. పైగా ఒక అందమైన పొందిక వస్తుంది.
ఆ కవిత ఇది-
‘‘పూర్వం
ఒక రాజు
తనకీ తన పెళ్లానికి మధ్య
కత్తినాటాడట పక్క మధ్యలో...
ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది
..........................
కవిత్వం రాయటమంటే
ఖడ్గంతో సహజీవనం చెయ్యటం!
- ఈ కవితలోని జానపద కథను అటుంచితే కవి చెప్పదల్చుకున్న సారాంశం స్పష్టమైంది కదా!
మీరంతటికి అనే కవితలో-
మీరంతటికి మీరే..
దేశమొదలి పోనక్కర్లేదు
వాళ్లే పంపిస్తారు
పొగ బెడతారు
కలుగుల్లో నీళ్లు నింపుతారు
..............
ఇక ఒకటే రంగు మిగుల్తుంది
ఎండిన రక్తం గుర్తు చేసే
కాషాయరంగు!
ఈ కవిత చదువుతుంటే, ముఖ్యంగా గత మూడేండ్ల కాలంలో మన దేశంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలు గుర్తొస్తాయి. పాలస్తీనా కవి మహమ్మద్ గార్విష్ 2006లో ఇజ్రాయెల్ అరబ్బు దేశాలపై దాడిచేసి బీభత్సాన్ని సష్టించిన సందర్భంగా అనుభవించిన క్షోభ, సంక్షోభం శివారెడ్డి అనుభవించినట్టు అవగతమవుతోంది.
శివారెడ్డి కవిత్వం గురించి మరొక్కమాట-
శివారెడ్డి కవిత్వం చదువుతుంటే... మంచి మిలిటరీ హోటల్‌లో అప్పటికప్పుడు కాల్చిన పరోటాను తింటున్నట్టుగా.. పొరలు పొరలుగా పరోటా విడిపోతూ ఉంటుంది! ఈ పరోటా రుచి పిండిలోనా, పిండి కలపటంలోనా, కాల్చడంలోనా, కాల్చిన పరోటాను తీసి పక్కనున్న బండపై రెండు అరచేతులతో పొరలు పొరలుగా విడిపోయేట్టు దగ్గరగా నొక్కడంలోనా? ఎందులో ఉంది రుచి? అంటే, పరోటా మాస్టర్ నైపుణ్యంలో అని ఎవరైనా ఠక్కున చెపుతారు.
శివారెడ్డి కవిత్వమూ అంతే. చదువుతుంటే పొరలు పొరలుగా విడిపోతూ ఉంటుంది. ఎక్స్‌టెండ్ అవుతుంది. లోలోపలికి తీసుకెళుతుంది. ఎలా? అద్భుత కవిత్వంగా ఒక వస్తువును ఎలా మౌల్డ్ చేయాలో తెలిసిన కవి. అపార అనుభవం, దక్షత. అందుకు కారణం.
రచయిత:ఎం.కె.సుగమ్ బాబు
8096615202