ఈ ఐదు పంచప్రాణ ప్రేరణలు
నాకు నచ్చిన 5 పుస్తకాలు
పుస్తక పఠనం గొప్ప అనుభవం. అనేక జీవితాల్ని కనుల ముందు నిలుపుతుంది. వివరిస్తుంది. విశ్లేషిస్తుంది. వికసింప జేస్తుంది. మనసును శుభ్రపర్చి ఎప్పటికప్పుడు తాజాకాంతితో పరిమళింప జేస్తుంది. వ్యక్తిత్వంతో, కవిత్వంతో నిలదొక్కు కోవటానికి ప్రేరణ పుస్తకాలే. వేల పుస్తకాల సారం నేను. ఐదు పుస్తకాలు పంచప్రాణ ప్రేరణలు.
శిథిల విపంచి:
తీగలు తెగిన వీణ స్వరాక్షరాలు. అష్టకాల నరసింహ రామశర్మ పద్య ఖండికల సంపుటి. దుఃఖపు తెరల్ని, ఆర్ద్ర సన్నివేశాల్ని పంచి హృదయాన్ని సున్నితంగా మలిచింది. భావోద్వేగాలు నాలో రేకెత్తించి కవిత్వం వైపు నడిపించింది.
మహాప్రస్థానం:
కొత్త ప్రపంచపు సింహద్వారం తెరిచింది. మహాకవి శ్రీశ్రీ ఘోష. శ్రమైక జీవన సౌందర్య దృక్పథాన్ని పాదుకొల్పింది. నాలో కవిని కదిలించి, బతికించి, బలమిచ్చి సమాజబాధ్యత వైపు మళ్లించింది.
అగ్నిధార:
ఉద్యమ ఉద్వేగాలకు ఊపిరి పోసింది. విప్లవాగ్ని, ప్రణయాగ్ని కలెగలిసిన సమర రసధార. మహాకవి దాశరథి ఆవిష్కరించిన బడబానలం. తెలంగాణ పదం, ఉద్యమ పథం పెనవేసిన పేగుబంధం అందమైన పద్యం.
కమ్యూనిస్టు ప్రణాళిక:
నడిచిన, నడుస్తున్న చరిత్రకు నవదర్శనం. మార్క్స్, ఎంగెల్స్ రూపకల్పనం. మార్క్స్ తత్వాన్ని లోలోపలికి ఎక్కించి మానవత్వాన్ని పదునుపెట్టిన రచన. వర్గస్పృహను పెంచి ప్రజాపోరాటాల వైపు నడిపించిన సమాజశాస్త్రం. ప్రణాళికాశాస్త్రం.
రక్తం సూర్యుడు:
కవిత్వానికి వచనలయ జోడించిన నేర్పు. కూర్పు. కె.శివారెడ్డి అభివ్యక్తి, భావావేశం నవనవోన్మేషంగా పొడిచిన రక్తగానం. సరికొత్త పదజాల ప్రభంజనాలు సృష్టించి నిత్య కవిత్వమయం చేసి నిరంతర ప్రవాహధారగా మలిచింది.
- నందిని సిధారెడ్డి