nandini siddareddy
-
అందరూ ఆహ్వానితులే..
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సారస్వత పరిషత్తు తదితర వేదికలు తెలుగు వెలుగులతో జిగేల్ మంటున్నాయి. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో తళుకులీనుతున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి తెలిపారు. గురువారం వారు ‘తెలంగాణ సాహిత్య వైభవం’పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిధారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు రోజుల తెలుగు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, తెలుగు వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటే సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం అవుతాయన్నారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంను తెలుగుదనం ఉట్టిపడేలా కళాత్మకంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అలంకరించినట్లు చెప్పారు. ప్రాంగణానికి నలువైపులా ఎనిమిది ద్వారాల్లో ప్రముఖులకు, ప్రతినిధులకు, సాధారణ ప్రజలకు విడివిడిగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. రవీంద్రభారతిలో కిట్ల పంపిణీ.. హైదరాబాద్‌కు చెందిన ప్రతినిధులకు గురువారం మహాసభల కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే అతిథులు, ప్రతినిధులకు హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు నేతృత్వంలోని ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిట్లను అందజేస్తారు. ఇందుకోసం అన్ని చోట్లా ఆహ్వాన కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారని, వారందరినీ ఆహ్వాన కమిటీ సాదరంగా ఆహ్వానించి వారి బస కేంద్రాలకు తోడ్కొని వెళుతోందని చెప్పారు. సుమారు 6,000 మంది ప్రతినిధులకు వివిధ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. భోజనం, వసతి అన్నీ అక్కడే ఉంటాయి. మహాసభలకు వెళ్లేందుకు, తిరిగి వారిని హోటళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా శాఖ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇందుకు 150 బస్సులను సిద్ధంగా ఉంచారు. అలాగే ఎల్బీ స్టేడియం వద్ద 60 ఆహార విక్రయ శాలలు, 25 పుస్తక ప్రదర్శన శాలలు సిద్ధమయ్యాయని చెప్పారు. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్, వరంగల్, జనగామ తదితర సమీప జిల్లాలకు చెందిన ప్రతినిధులు కిట్ల కోసం రవీంద్రభారతికి రావలసిన అవసరం లేదని సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. వారికి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. -
సృజన, పరిశోధన సమాంతరంగా జరగాలి
హైదరాబాద్: తెలంగాణ సాహిత్యంలో సృజనాత్మకత, పరిశోధన రెండూ సమాంతరంగా జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కవులు, రచయితలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. తెలంగాణలో సాహిత్యం ప్రజల సాహిత్యంగా వచ్చిందని ఆ వైభవాన్ని ప్రపంచానికి సాక్ష్యాధారాలతో నిరూపించబోతున్నామని సిధారెడ్డి అన్నారు. ప్రతి ఏటా తెలంగాణ తెలుగు ప్రపంచ మహా సభలను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో నిరంతరం కవిత్వం పరవళ్ళు తొక్కుతుందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. కథా సాహిత్యం, నవల, నాటకం తదితర ప్రక్రియలు ప్రభావవంతంగా వస్తున్నాయన్నారు. ఒకే వేదికపై మొత్తం 11 కవితా సంపుటాలు ఆవిష్క రణకు నోచుకోవడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ...తెరసం ప్రజల సాహిత్య సంఘ మని, తెలంగాణ ఆత్మను పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సంపాదకులు కె.శ్రీనివాస్, కట్టా శేఖర్‌రెడ్డి, తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్, ఉపాధ్యక్షుడు ఘనపురం, తెరసం హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు పాల్గొన్నారు. -
ఈ ఐదు పంచప్రాణ ప్రేరణలు
నాకు నచ్చిన 5 పుస్తకాలు పుస్తక పఠనం గొప్ప అనుభవం. అనేక జీవితాల్ని కనుల ముందు నిలుపుతుంది. వివరిస్తుంది. విశ్లేషిస్తుంది. వికసింప జేస్తుంది. మనసును శుభ్రపర్చి ఎప్పటికప్పుడు తాజాకాంతితో పరిమళింప జేస్తుంది. వ్యక్తిత్వంతో, కవిత్వంతో నిలదొక్కు కోవటానికి ప్రేరణ పుస్తకాలే. వేల పుస్తకాల సారం నేను. ఐదు పుస్తకాలు పంచప్రాణ ప్రేరణలు. శిథిల విపంచి: తీగలు తెగిన వీణ స్వరాక్షరాలు. అష్టకాల నరసింహ రామశర్మ పద్య ఖండికల సంపుటి. దుఃఖపు తెరల్ని, ఆర్ద్ర సన్నివేశాల్ని పంచి హృదయాన్ని సున్నితంగా మలిచింది. భావోద్వేగాలు నాలో రేకెత్తించి కవిత్వం వైపు నడిపించింది. మహాప్రస్థానం: కొత్త ప్రపంచపు సింహద్వారం తెరిచింది. మహాకవి శ్రీశ్రీ ఘోష. శ్రమైక జీవన సౌందర్య దృక్పథాన్ని పాదుకొల్పింది. నాలో కవిని కదిలించి, బతికించి, బలమిచ్చి సమాజబాధ్యత వైపు మళ్లించింది. అగ్నిధార: ఉద్యమ ఉద్వేగాలకు ఊపిరి పోసింది. విప్లవాగ్ని, ప్రణయాగ్ని కలెగలిసిన సమర రసధార. మహాకవి దాశరథి ఆవిష్కరించిన బడబానలం. తెలంగాణ పదం, ఉద్యమ పథం పెనవేసిన పేగుబంధం అందమైన పద్యం. కమ్యూనిస్టు ప్రణాళిక: నడిచిన, నడుస్తున్న చరిత్రకు నవదర్శనం. మార్క్స్, ఎంగెల్స్ రూపకల్పనం. మార్క్స్ తత్వాన్ని లోలోపలికి ఎక్కించి మానవత్వాన్ని పదునుపెట్టిన రచన. వర్గస్పృహను పెంచి ప్రజాపోరాటాల వైపు నడిపించిన సమాజశాస్త్రం. ప్రణాళికాశాస్త్రం. రక్తం సూర్యుడు: కవిత్వానికి వచనలయ జోడించిన నేర్పు. కూర్పు. కె.శివారెడ్డి అభివ్యక్తి, భావావేశం నవనవోన్మేషంగా పొడిచిన రక్తగానం. సరికొత్త పదజాల ప్రభంజనాలు సృష్టించి నిత్య కవిత్వమయం చేసి నిరంతర ప్రవాహధారగా మలిచింది. - నందిని సిధారెడ్డి