సదస్సులో జానకీ రాఘవీయం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న నందిని సిధారెడ్డి. చిత్రంలో కె.రామచంద్రమూర్తి, అయాచితం శ్రీధర్, మామిడి హరికృష్ణ తదితరులు
హైదరాబాద్: తెలంగాణ సాహిత్యంలో సృజనాత్మకత, పరిశోధన రెండూ సమాంతరంగా జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కవులు, రచయితలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో సాహిత్యం ప్రజల సాహిత్యంగా వచ్చిందని ఆ వైభవాన్ని ప్రపంచానికి సాక్ష్యాధారాలతో నిరూపించబోతున్నామని సిధారెడ్డి అన్నారు. ప్రతి ఏటా తెలంగాణ తెలుగు ప్రపంచ మహా సభలను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో నిరంతరం కవిత్వం పరవళ్ళు తొక్కుతుందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. కథా సాహిత్యం, నవల, నాటకం తదితర ప్రక్రియలు ప్రభావవంతంగా వస్తున్నాయన్నారు. ఒకే వేదికపై మొత్తం 11 కవితా సంపుటాలు ఆవిష్క రణకు నోచుకోవడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ...తెరసం ప్రజల సాహిత్య సంఘ మని, తెలంగాణ ఆత్మను పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సంపాదకులు కె.శ్రీనివాస్, కట్టా శేఖర్‌రెడ్డి, తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్, ఉపాధ్యక్షుడు ఘనపురం, తెరసం హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment