రాయల స్వర్ణయుగాన్ని దాటి చక్రవర్తుల కోటల మీదుగా, జమీందార్ల సంస్థానాలను స్పృశిస్తూ పురోగమించినది తెలుగు భాష. వందల ఏళ్ల బానిసత్వాన్ని ఎదిరించి కవుల కలాల్నే ఖడ్గంగా మార్చుకుని పోరాడింది మన భాష.
ఈ నెలలో తెలంగాణ రాష్ట్రంలో వైభవంగా జరుగుతున్న ప్రపంచ తెలుగు సభలకు విచ్చేస్తున్న దేశ విదేశ తెలుగు ప్రముఖులందరికీ సాదర స్వాగతం. తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు.
పాశ్చాత్య భాషా పండితులు కూడా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ఎందుకు ప్రశంసించారంటే, ఏ భాషలో లేని అందం చందం, కమనీయత, రమణీయత మన తెలుగు భాషకే సొంతం. అన్ని భాషలను అవలీలగా కలుపుకు పోగల గొప్ప సాంప్రదాయిక సౌగంధం, విశ్వజనీనమైన విశాలభావం మన భాషకు సహజంగా అబ్బిన లక్షణం. ఏ భాషా పదమైనా మన తెలుగు భాషలో హాయిగా ఒదిగించుకోగలిగిన సంస్కారం దీని సొంతం. మనకు తెలియకుండానే మనం ప్రతిరోజూ మాట్లాడే తెలుగు భాష ద్వారా.. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, పారశీక, సంస్కృత, ప్రాకృత పదాలను అలవోకగా ఉచ్చరిస్తుంటాం.
తెలుగు, హిందీ, సంస్కృత భాషలు మొత్తం 56 అక్షరాలను ఉపయోగించడం వల్లనే భాషకు అంత పరిపుష్టి కలిగిందని పండితుల వాదం. దానికి కారణం సమగ్రత్వమే. 2,500 సంవత్సరాల నాటి ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర ప్రసక్తి ఉండటం వల్ల దీని ఆధారంగానే తెలుగుభాష మొన్ననే ప్రాచీనహోదాను దక్కించుకున్నది.
మొదట్లో గాలిపాటగా, మాటగా పుట్టిన తెలుగు భాష ఎప్పటికప్పుడు గాలిలో కలిసిపోతుండేది. అయితే హాలుడు ప్రాకృత భాషలో రాసిన గాథాసప్తశతిలో తెలుగు పదాలు వాడినందువల్ల అప్పటికి కొంత జానపదుల వ్యవహారంలో ఉన్నట్లు అర్థమౌతుంది. ‘గాధాసప్తశతి’ రాసిన హాల చక్రవర్తి, ‘బృహత్కథామంజరి’ రచిం చిన గుణాఢ్యుడు ఆంధ్రులని చెబుతున్నా, వీరి రచనలు ప్రాకృతంలోనే ఉండేవి. అప్పటికి తెలుగు భాష కవిత్వ భాషగా ఎదగకపోవడమే దీనికి కారణం.
ఆ తర్వాత వెయ్యేళ్లపాటు జానపదుల గీతాల్లో, శాసనాల్లో, ఆస్థానాల్లో, అంతఃపురాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ, రాజరాజనరేంద్రుడి కాలం నాటికి కావ్యభాషగా అవతరించింది. ఆనాడు వాడుకలో ఉన్న సంస్కృతం, ప్రాకృతం, పాళీ మొదలైన భాషల పదాలను తనలో విలీనం చేసుకుని, విస్తృతి చెందింది. బౌద్ధ, జైన మతాల ప్రచారం కూడా ఈ భాషాభివృద్ధికి దోహదం చేసింది. ఇలా ద్రావిడ భాషా కుటుంబం నుంచి పుట్టిన తెలుగు సంస్కృత భాషా సంగమంలో పరిపుష్టి చెంది, ఆర్య ద్రావిడ భాషల సమ్మిళితమైన తియ్యని తేనెలూరు తెలుగు భాషగా అవతరించింది.
శాతవాహనుల తర్వాత కొంతకాలానికి తెలుగుదేశాన్ని పాలించిన రేనాటి చోళులు మొట్టమొదటిసారిగా తెలుగుభాషను శాసనాలలో వాడటం మొదలెట్టారు. అప్పటినుంచి దినదినాభివృద్ధి చెందుతూ పల్లవులు, చాళుక్యులు, చోళులు మొదలైన రాజుల ప్రాపకంలో రాజ భాషగా ఎదిగి 11 వ శతాబ్దం నాటికి సర్వాంగసుందరంగా రూపొంది, గ్రంథ రచనకు అనువైన భాషగా మన తెలుగు భాష అవతరించింది.
11వ శతాబ్దంలో తెలుగుదేశాన్ని పరిపాలించిన తెలుగు రాజు రాజరాజనరేంద్రుడు మాతృభాషలో గ్రంథరచనకు ప్రోత్సహించడంతో ప్రపంచ సాహిత్యంలోనే అతి పెద్దగ్రంథంగా పంచమవేదంగా ప్రశంసలందుకున్న మహాభారత రచన నన్నయచేతిలో అక్షరరమ్యతతో మొదలైంది. నాటి ఆదికావ్యం నుంచి నేటి ఆధునిక కావ్యాల వరకు శాఖోపశాఖలుగా విస్తరించిన మన తెలుగు సాహిత్యానికి అక్షర రమ్యతతో అందాలు పొదిగాడు నన్నయ్య. తేటతెలుగుల నాటకీయతతో నాణ్యాలుదిద్దాడు తిక్కన. ప్రబంధకవితా రసాలతో రంగులద్దాడు ఎర్రన. పలుకు పలుకులో జాను తెలుగుల కులుకులు నేర్పాడు సోమన్న. భక్తిరసంతో మోక్షానికి సోపానాలు పరిచాడు పోతన.
ఇక తెలుగు సాహిత్యానికి పట్టం కట్టిన వారుగా శ్రీకృష్ణదేవరాయలు, గణపతి దేవుడు చరిత్రలో మిగిలిపోతారు. ఎందరో మహాకవులు ఈ భాషా వృక్షాన్ని ఆశ్రయించి చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాచన సోముడు, గోనబుద్ధారెడ్డి, వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, పింగళి, అల్లసాని మొదలైన కవులు, మొల్ల, రంగాజమ్మ వంటి కవయిత్రుల లేఖిని నుంచి రమణీయ ప్రబంధ సాహిత్యరూపంలో అవతరించింది మన తెలుగు భాష.
రాయల స్వర్ణయుగాన్ని దాటి చక్రవర్తుల కోటల మీదుగా, జమీందార్ల సంస్థానాలను స్పృశిస్తూ, పురోగమించినది తెలుగు భాష. వందల ఏళ్ల బానిసత్వాన్ని ఎదిరించి కవుల కలాల్నే ఖడ్గంగా మార్చుకుని పోరాడింది మన భాష. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో విజయకేతనం ఎగురవేస్తున్నది. ఎందరో విదేశీయులు తెలుగు భాషలోని తియ్యందనానికి ముగ్ధులై ఈ భాషను నేర్చుకోవడమే కాకుండా దీని గొప్పతనాన్ని కీర్తిస్తూ అనేక వ్యాసాలు రాశారు. పరిశోధనలు చేశారు. నిఘంటువులు వెలువరించారు. వారిలో ముఖ్యులు సీపీ బ్రౌన్, డా. కార్వే, డా. కాంప్‌బెల్, డా. కాల్డ్‌వెల్ మొదలైనవారు.
ఆధునిక కవులు గురజాడ, కందుకూరి, జాషువా, రాయప్రోలు, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె లాంటి అభ్యుదయవాదులు, ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి తెలుగుతల్లి ముద్దుబిడ్డలు ఈ జాతికి, భాషకు పోరాటాలు నేర్పారు. ఆత్మగౌరవాన్ని అందించారు. వారి బాటలో రెండు తెలుగు రాష్ట్రాలు భాషా వికాసానికి కృషి చేయాలి. అప్పుడే తెలుగు రాష్ట్రాల ఔన్నత్యాన్ని కాపాడుకోగలుగుతాం.
(డిసెంబర్ 15–19 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా)
- డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్‌సీపీ నాయకురాలు
Comments
Please login to add a commentAdd a comment