నాగీబ్ మహఫూజ్, ఈజిప్ట్ రచయిత
నాగీబ్ మహఫూజ్ (1911–2006) ఈజిప్ట్ దేశానికి చెందిన రచయిత. 22 సంవత్సరాల వయసులోనే రాయడం మొదలుపెట్టాడు. మొదట్లో దేశభక్తితో కైరో గురించి మూడు చారిత్రక నవలలు రాశాడు. నిజానికి భాషా సాహిత్యం చదువుకోవాలి అనుకున్న మహఫూజ్ పెద్దల బలవంతం వల్ల సామాజిక శాస్త్రం చదవవలసి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాడు. గుమస్తాగా చేరిన అతను చివరకు తమ దేశపు సాంస్కృతిక శాఖకు సలహాదారుగా రిటైర్ అయ్యాడు. 70 ఏళ్ల రచనా వ్యాసంగంలో 34 నవలలు రాశాడు. 350 దాకా కథలు రాశాడు. చాలా సినిమాలకు స్క్రిప్టు రాశాడు.
ఈజిప్టులోనూ, మొత్తం అరబ్బు ప్రపంచంలోనూ ఈయన రచనలు ఆధునిక క్లాసిక్స్‌గా గుర్తింపబడ్డాయి. ఆయన రచనల ఆధారంగానే ప్రస్తుత కాలపు అరబిక్ సాహిత్యం నిలబడిందని చెప్పవచ్చు. 1988లో మహఫూజ్ కు నోబెల్ బహుమతి ఇచ్చారు. ‘అరబిక్ సాహిత్యంలో నవల అన్నది 20వ శతాబ్దంలోనే మొదలైంది. అంటే ఇంచుమించు నాగిబ్ మహఫూజ్‌తోనే మొదలయింది అనవచ్చు. అంతకుముందు ఒకరిద్దరు మాత్రమే రచయితలు ఉన్నారు. మహఫూజ్ ఈ రచనా ధోరణిని ప్రామాణికంగా మార్చాడు’ అని ఈ సందర్భంగా స్వీడిష్ అకాడమీ వ్యాఖ్యానించింది.
మొదట్లో చారిత్రక, పౌరాణిక నవలలు రాసిన మహఫూజ్ సమాజాన్ని బాగా పరిశీలించడం నేర్చుకున్నాడు. త్వరలోనే తన రచనా పద్ధతి మార్చుకున్నాడు. నవలలు, కథలు అన్నింటిలోనూ తన చుట్టూ కనిపించే మనుషులు, మనస్తత్వాలు, ప్రదేశాలు మొదలైన వాటి గురించి సూటిగా రాయడం మొదలు పెట్టాడు. ఆయన నవలలు చదువుతుంటే ఒక విచిత్రమైన పరిచిత ధోరణి కనపడుతుంది. మధ్య తరగతి మనుషులు, వాళ్ల మామూలు వాతావరణం కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఖాన్ అల్ ఖలీలీ, మిదాఖ్ అలీ లాంటి నవలలు అన్నీ ఈ ధోరణిలోనే సాగుతాయి. సన్నివేశాలలో మనం ఉన్నామన్న భావన కలుగుతుంది. మామూలు మనుషుల సాయంతో అతను ప్రపంచం మొత్తం గురించి చెపుతాడు. సంప్రదాయంలో పాతుకుపోయిన అరబ్ సమాజానికి, ముఖ్యంగా రచయితలకు సమకాలీన సమాజం మీద ప్రగతి మార్గంలో చర్చించడం, పాలకులకు ధిక్కార స్వరం వినిపించడం నేర్పిన రచయిత మహఫూజ్.
సల్మాన్ రష్దీ విషయంగా ఇతను అనుసరించిన ధోరణి అప్పటికే అతని రచనలతో విసిగిన ఛాందసవాదులకు నచ్చలేదు. మహఫూజ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. దేశంలోని పరిస్థితులను విమర్శిస్తూ వ్యాసాలు మాత్రమే కాక, అదే అంశంతో కథలు, నవలలు కూడా రాశాడు. చివరికి ఇతడిని రాజకీయాల గురించి రాస్తాడు, అనే దాకా పరిస్థితి వచ్చింది.
మహఫూజ్ సుమారు 94 సంవత్సరాలు బతికాడు. మరణానంతరం కూడా ఆయన రచనలు అయిదు అచ్చయ్యాయి. వాటిలో ద క్వార్టర్ అన్నది మరీ ప్రత్యేకమైన రచన. అది 18 చిన్న కథానికల సంకలనం. 1994లో అచ్చు కావాలి అని మహఫూజ్ దాన్ని దాచుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. అరబ్ భాషలోనే ఆ రచన అతని మరణం తరువాత అచ్చయింది.
- డాక్టర్ కె.బి.గోపాలం
Comments
Please login to add a commentAdd a comment