ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే | Nandini Sidda Reddy interview on World Telugu Conference | Sakshi
Sakshi News home page

ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే

Published Mon, Nov 27 2017 2:21 AM | Last Updated on Mon, Nov 27 2017 2:21 AM

Nandini Sidda Reddy interview on World Telugu Conference - Sakshi - Sakshi

తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ స్థానాన్ని సుస్థిరం చేయడం, ఇప్పటి తరాన్ని తెలుగు భాష పట్ల ఆకర్షితులను చేయడమనే రెండు ప్రధాన లక్ష్యాలు ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా నెరవేరగలవని  మహాసభల కోర్‌ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి చెబుతున్నారు. డిసెంబర్‌ 15–19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఉత్సవం నేపథ్యంలో సిధారెడ్డితో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన ప్రత్యేక సంభాషణ:

ఇప్పటికిప్పుడు మీ మనసుకు ఎలావుంది?
కొంత ఇబ్బందిగానేవుంది. చేయబోయే పనిలో సాహిత్య ప్రధానమైనదానికంటే నిర్వహణ ప్రధానమైనది ఎక్కువ. ఇలాంటిది నాకు కొత్త. పైగా ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపిన అనుభవం లేదు. అందుకే నా కవిహృదయానికి కొంచెం ఇబ్బందిగానేవుంది.

మరి దీన్ని ఎలా అధిగమిస్తున్నారు?
మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం నడిపిన అనుభవం ఉన్నది కాబట్టి, సభలు  నిర్వహించడం నాకు మరీ దూరమైన పనేమీ కాదు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు. కోర్‌ కమిటీలోని దేశపతి (శ్రీనివాస్‌)గానీ, రమణాచారిగానీ, మిగతా సభ్యులుగానీ అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి మహాసభలను విజయవంతం చేయగలమనే నమ్మకం ఉంది.

1975లో మొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో జరిగిన నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు  హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. వీటిని వాటికి కొనసాగింపుగా చూడాలా?
వాటికి కొనసాగింపు అనవలసిన అవసరం లేదు. ఇవి తెలంగాణలో జరుగుతున్న తొలి మహాసభలుగానే చూడాలి. ఎందుకంటే ఆ మహాసభలను జరపడంలో అంతర్లీనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం అనే ప్రత్యేకమైన మోటిఫ్‌ ఉంది. 1969, 70ల నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972,73 నాటి జై ఆంధ్ర ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడు ప్రాంతీయ భేదాలు సమసిపోవాలనే ఉద్దేశంతో వాటి నిర్వహణ జరిగింది. అది తప్పా ఒప్పా అన్న చర్చలోకి ఇప్పుడు వెళ్లడం లేదు. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ లాంటి సినిమా పాటలు కూడా దాన్ని ప్రతిబింబిస్తూనే వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే పాట రాసిన సినారెను ‘ఇప్పుడు మీ అభిప్రాయం ఏమైనా మారిందా సార్‌?’ అని నేను అడిగాను: ‘తెలుగు జాతి మనది రెండుగ వెలుగు జాతి మనది’ అన్నారు. తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి తెలంగాణ వైపు నుంచి కూడా గణించదగిన కృషి జరిగింది; తెలుగుకు తొలి ప్రాతిపదిక, భూమిక తెలంగాణ నుంచి వచ్చాయన్న విషయాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో నమోదు చేయడమనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన మహాసభలివి.

ప్రాతిపదిక, భూమిక గురించి మరింత చెప్పండి...
కరీంనగర్‌ జిల్లా రామగిరి ఖిల్లాలో నారన, గోపన అనే గోపరాజుల నాణేలు దొరికాయి. వీళ్లు క్రీ.పూ.600–400 కాలానికి చెందినవారని నాణేల పరిశోధకుడు ఠాకూర్‌ రాజారామ్‌సింగ్‌ నిర్ధారించారు. నారన, గోపనల్లోని అన అన్నది తెలుగు అన్నే. ఇప్పటికీ చూడండి– తిక్కన, పోతన, వేమన పేర్లు మనకున్నాయి. దీనివల్ల మన తెలుగు ఉనికి సుమారు 2,500 ఏళ్ల ముందుకు పోయింది. అలాగే శాతవాహనులు క్రీ.పూ.200– క్రీ.శ.200 కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇందులో హాలుడు క్రీ.శ.2వ శతాబ్దం వాడు. ఆయన ప్రాకృతంలో సంకలనం చేసిన గాథాసప్తశతిలో అత్త లాంటి తెలుగు మాటలున్నాయని తిరుమల రామచంద్ర నిరూపించారు. అగ్గి అనే తెలుగు మాటకు దీర్ఘమిచ్చి అగ్గీ అంటే అది ప్రాకృతం అయినట్టుగా కూడా మనకు ఆధారాలున్నాయి. ఒకవేళ భాష అంతా సాహిత్యం కాదు అనుకున్నా కూడా, క్రీ.శ.947 నాటి జినవల్లభుడు వేయించిన కురిక్యాల శాసనంలో పంపన రాసిన మూడు తెలుగు కందపద్యాలు దొరికాయి. పంపన తెలుగులో జినేంద్ర పురాణం రాశాడు. కన్నడంలో విక్రమార్జున విజయం రాశాడు. దాన్నే పంపభారతం అనీ అంటారు. ఇది 11వ శతాబ్దానికి చెందిన నన్నయ కంటే 150–200 ఏళ్ల ముందు సంగతి! వీటిన్నింటివల్ల కూడా తెలంగాణలో తెలుగు ఉనికి బలంగా ఉన్నదని నిరూపితమవుతోంది. అంతెందుకు, తెలుంగు గణం తెలుంగణం అయ్యి, తెలంగాణం అయ్యిందని ఒక అభిప్రాయం. తెలుంగు ఆణెము(ప్రాంతం) తెలంగాణ అని మరో అభిప్రాయం.

మహాసభల్లో ఎంతమంది పాల్గొంటారని అంచనా?
సుమారు 30 దేశాల నుంచి 500 మంది విదేశీ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్‌ సహా 15 రాష్ట్రాల నుంచి 1,500 మంది తెలుగు సాహిత్యాభిమానులు, తెలంగాణ తో కలుపుకొని మొత్తంగా 6000–8000 మంది ఉండొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యవేత్తలతో ఎలా వ్యవహరిస్తున్నారు? వాళ్ల స్పందన?
వాళ్లు కూడా పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ శషభిషలు లేకుండా భాషాసాహిత్య ప్రేమికులందరూ పాల్గొనబోతున్నారు. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయితలందరూ పాల్గొనేలా చూస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది తెలంగాణ వాళ్ల నుంచే ‘వాళ్లను పిలుసుడు ఏంది’ అన్న వ్యతిరేకత వస్తోంది. కానీ అక్కడి ప్రముఖులందరినీ పాల్గొనేలా చేయాలనే సంకల్పంతో ఉన్నాం.

ప్రతినిధులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
వాళ్లు దిగగానే ఒక కిట్‌ ఇస్తాం. అందులో వాళ్ల పాస్, ప్రోగ్రామ్‌ షెడ్యూల్, ఫుడ్‌ కూపన్స్‌ ఉంటాయి. వచ్చినవారందరికీ భోజనం ఏర్పాటు వేదిక దగ్గరే ఉంటుంది. వాళ్లు రావడానికి, బసకు వెళ్లడానికీ రవాణా సౌకర్యం ఉంటుంది. మొబైల్‌ టాయ్‌లెట్లు కూడా ఉంటాయి. ఇందులో మూడు రకాలవాళ్లున్నారు: ఇన్వైటెడ్‌ గెస్ట్స్‌. వీళ్లు రచయితలు, కళాకారులు. ఇన్వైటెడ్‌ డెలిగేట్స్‌. వీళ్లు సంఘాల ప్రతినిధులు. రిజిస్టర్డ్‌ డెలిగేట్స్‌. వీళ్లు స్వచ్ఛందంగా పాల్గొనేవాళ్లు. వారి వారి స్థాయిని బట్టి, కోరుకున్నదాన్ని బట్టి ఏర్పాట్లు ఉంటాయి.

సామాన్యులు ఎంతమేరకు పాల్గొనవచ్చు? అసలు పాల్గొనవచ్చా?
నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. అయితే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే మంచిది. భోజనానికిగానీ సౌకర్యానికిగానీ బాగుంటుంది. లేకపోయినా గ్యాలెరీల్లో ఉండి వారు అన్ని చర్చలనూ వినొచ్చు, అన్ని ప్రదర్శనలనూ చూడొచ్చు. భోజనం కూడా వేదిక బయట సబ్సిడీకి అందించేలా వ్యాపారస్థులను ఒప్పిస్తున్నాం.

సభల సందర్భంగా జరుగుతున్న ప్రచురణలు?
మరుగునపడిన తెలంగాణ వైతాళికుల మీద తెలుగు అకాడమీ 70 మోనోగ్రాఫ్‌లు ప్రచురిస్తోంది.  భాష, సాహిత్యాలకు సంబంధించి సాహిత్య అకాడమీ 10 పుస్తకాలు వెలువరిస్తోంది. సాంస్కృతిక శాఖ 8 పుస్తకాలు తెస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తోంది. తెలంగాణ, పాలపిట్టలు కూడా ప్రత్యేక సంచికలకు సిద్ధమవుతున్నాయి.

హెల్ప్‌లైన్‌ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా?
ఈ సాహిత్య అకాడెమీ నంబర్లను సందేహాలున్నవారు సంప్రదించవచ్చు. 040–29703142/52. దానికంటే ముఖ్యంగా బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో కియోస్క్‌ మిషన్లు ఉంటాయి. ప్రధాన కూడళ్లలో డిజిటల్‌ డిస్‌ప్లేలు ఉంటాయి. వాటిల్లో జరగబోయే కార్యక్రమాల సమాచారం వస్తుంది. దానికి అనుగుణంగా పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

మహాసభల ఎనిమిది ఆశయాల్లో ఒకటి: ‘ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడతాయి’. ఒకవైపు ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నప్పుడు నిర్మాణాత్మకంగా ఈ సమస్యను ఎట్లా చూడాలి?
ప్రభుత్వం ప్రజానుకూలమైన పాలన చేయాలి. సాధారణ ప్రజానీకం, శ్రామిక వర్గ సంతానం కూడా  ప్రైవేటు ఇంగ్లిష్‌ మీడియం బడుల్లో చదివిస్తున్నారు. అప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థల్ని కాపాడుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. అందరూ ఇంగ్లిష్‌ మీడియం వైపు ఎందుకు మళ్లుతున్నారు? ఇంగ్లిష్‌ వస్తే ఉద్యోగాలు వస్తాయని బలంగా ముద్రపడింది. ఎవరికీ ప్రత్యేకంగా భాష మీద ప్రేమ వుండదు. జీవితం మీద ప్రేమ వుంటుంది. ఆ జీవితాన్ని నిలుపుకోవాలంటే ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కోసం ఇంగ్లిష్‌. వాళ్లకు ఇంగ్లిష్‌ మీద ప్రేమ లేదు, తెలుగు మీద ప్రేమ లేదు. ఐఐటీ పెద్ద చదువు, ఎంఏ తెలుగు పనికిరానిదైంది. ఐఐటీలో పెద్ద శాలరీ వస్తుంది. శాలరీ ఎక్కువున్నవాళ్లు ఎక్కువ గౌరవం పొందుతారు. ఇదంతా కూడా ఉద్యోగ కల్పన మీద ఆధారపడిన అంశం. అందుకే ప్రభుత్వం సాధారణ ప్రజానీకంతో వ్యవహరించే ఉద్యోగులందరికీ తెలుగు రావాలనే నిబంధన పెడుతోంది. అప్పుడే కదా వాళ్ల సమస్యలు బాగా అర్థం చేసుకో గలుగుతారు. రెండోది: తెలుగు పండిత్‌ల కోసం పదివేలకు పైగా ఉద్యోగాల కల్పన చేయబోతోంది. అలాగే, భాష అనేది ఉద్యోగానికి సంబంధించినదే కాదు. భాషతో వ్యక్తిత్వ నిర్మాణం జరగుతుంది. కాబట్టి, తెలుగును రక్షించాలంటే భాషకు సంబంధించిన చైతన్యం కూడా ప్రచారం కావాలి.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తెలుగు వేరే, మిగతా తెలుగు వేరే అన్న వాదనలు, చర్చలు జరిగాయి. ఒకవిధంగా తెలంగాణ తెలుగు వేరే అనే నమ్మించడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఒక అవమానం నుంచి, తృణీకరణలోంచి, మీది తెలుగు కాదు అన్న విపరీతవాదనలోంచి ఉప్పొంగినది తెలంగాణ ఉద్యమం. అలాంటి స్థితిలో ఇంకొక చివరిదాకా వెళ్లి మా భాష వేరే అని మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అదొక భావోద్వేగపూరిత ప్రకటన. ఇప్పడు తెలంగాణ ఏర్పడ్డాక ఎవరూ భాషమీద ఆధిపత్యం చేయడానికి కుదరదు. ఆ ఉద్వేగ దశను దాటిపోయినం కాబట్టి, తెలంగాణలో తెలుగు ముద్రను బలంగా వినిపించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే. తమిళనాడు, మహారాష్ట్ర, కోస్తా, రాయలసీమ అంతటావున్నది తెలుగే. ఇవన్నీ సమన్వయం జరిగితేనే అసలు తెలుగు బయటికి వస్తుంది. ఊదు గాలది పేరు లెవ్వది అని ఒక సామెత. పనిగాదు, అని అర్థం. దీన్ని వ్యాప్తిలోకి తీసుకుపోతే అందరూ వాడుకోగలుగుతారు కదా! తెలంగాణ పదాలు, నుడికారాలు, జాతీయాలు, సామెతలను సముచిత స్థానంలో నిలబెడితే తెలుగు భాష మరింత వికసిస్తుంది.


నలభై ఏళ్ల తర్వాత..
2500 ఏళ్ల ‘తెలుగు వెన్నెల సోన మన తెలంగాణ’ అంటూ హైదరాబాద్‌ వేదికగా 2017 ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్‌ 15–19 వరకు జరగనున్నాయి. 1975లో మొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. తర్వాత 1981లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోనూ, 1990లో మారిషస్‌లోనూ జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో తిరుపతిలో జరిగిన తర్వాత మళ్లీ నలభై ఏళ్లకు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ప్రస్తుత మహాసభలు ప్రకటించుకున్న ఎనిమిది ఆశయాలు:
ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ జాతి ఖ్యాతి ప్రపంచానికి విదితమౌతుంది.
తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహిత్యమూర్తుల కృషికి తగిన గౌరవం లభిస్తుంది. వారి మహత్తర సేవలను ఈ సభలు ప్రపంచానికి చాటుతాయి.
తెలంగాణ కళా వైభవం సభలలో సాక్షాత్కరిస్తుంది.
వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగు భాషాభిమానులందరి మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటాయి. ప్రత్యేక ప్రచురణలు తెలంగాణ దృక్పథంతో నూతన అధ్యాయానికి తెరతీస్తాయి.
సదస్సులు నూతన రీతులకు నాంది పలుకుతాయి.
ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడతాయి.
కొత్త తరానికి సాహిత్య స్ఫూర్తిని అందిస్తాయి.
తెలంగాణ ప్రజలలో సాహిత్య సాంస్కృతిక ఉత్తేజం వెల్లివిరుస్తుంది.

ఎల్బీ ప్రధాన వేదిక
ఎల్బీ స్టేడియం తెలుగు మహాసభల ప్రధాన వేదిక. ఇన్‌డోర్, ఔట్‌డోర్‌ స్టేడియాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. రవీంద్రభారతిలో మూడు వేదికలు. ఇంకా తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంటాయి. అదనంగా లలితకళా తోరణమా? పీపుల్స్‌ ప్లాజా? అన్నది ఇంకా నిర్ణయం జరగాల్సివుంది. లైవ్‌ ప్రదర్శనలకు పీపుల్స్‌ ప్లాజా అయితే బాగుంటుందని అనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement