వచన రచన విశిష్టత | Panuganti Laxmi Narsimharao Vachana Rachana In Sahityam | Sakshi
Sakshi News home page

వచన రచన విశిష్టత

Published Mon, Nov 16 2020 12:27 AM | Last Updated on Mon, Nov 16 2020 12:48 AM

Panuganti Laxmi Narsimharao Vachana Rachana In Sahityam - Sakshi

ఇప్పటి వచన శైలి తరచుగ నీరసముగను నిష్ప్రౌఢముగ నున్నది కాని మిగుల సంతుష్టికరముగ నుండలేదు. ఇంకను బలిష్టమై, ధారాళమై, పౌరుషయుక్తమై, ప్రాణదురంధరమైన శైలి బయలుదేరలేదు. క్రమ క్రమముగ బయలుదేరగలదు. పది పద్యములు సులభముగ వ్రాయవచ్చునుగాని యొక పంక్తి వచనము సుష్టుగ వ్రాయుట కష్టము.

పూర్వము సంస్కృతముననేమి యిప్పుడైన నాంధ్రముననేమి వచన ప్రబంధములు మిక్కిలి తక్కువగ నున్నవి. వచనమును వ్రాయువాడు వట్టి తెలివితక్కువవాడని సాధారణ జనాభిప్రాయమై యున్నది. కవితామణి కోటీరమును ధరించుట కర్హుడు కానివాడే యీ కట్టెలమోపు మోయదగిన వాడని జనుల నమ్మకము. ఆడుది తాను మిగుల రూపవతి యని లోకులనుకొనుట కెంత యాత్రపడునో, పురుషుడు తాను మిగుల బుద్ధిమంతుడని జనులనుకొనుట కంత కంటె నెక్కువ యాత్రపడును. అగరు నూనెల మెఱుగులు, నద్దము నెదుటి తిరుగులు, నాభరణముల హొరంగులు, మొగము పొడుముల తెఱగులు, కన్ను త్రిప్పుల వెరగులు మొదలగు సౌందర్య కళా సంపాదన సామగ్రి యాడుది యెంత యాచరించిన నంత యామెకే నష్టము.

ఆపత్కాలములో నసురక్షణముకై పనికిరాదగు ధన మాస్యాళీక శోభకై సబ్బుబిళ్లల క్రింద నరిగి నురుగై కరగిపోవును. పోనిండు. అందువలన నితరుల కేమి నష్టము. వంగని ముంగురుల వంచుటకై కాగిదములనో, కారులనో యుపయోగించి పడరాని పాటుల నామె పడనిండు. ముంగురులు వంగకున్నను నలుగురి నవ్వులాటచే నామె తలయే వంగనిండు. అందువలన నితరుల కేమినష్టము! కాని బుద్ధిమంతుడని యనిపించు కొనదలచిన పురుషుడు వాజ్మయమున జేయు ప్రయత్నమట్టిది కాదు. బాహ్య ప్రపంచ జ్ఞానము లేక యాంతర ప్రపంచ జ్ఞానమంతకంటె లేక కవిత్వ మనగనేమో మొదలే యెఱుగక యతి ప్రాస బద్ధమైనదే కవిత్వమని నిశ్చయ పఱచుకొని పామర జనులనెట్లో యొకట్లు రంజింప జేయుటయే ప్రధానోద్దేశముగ జేసికొని యే పాడు ప్రబంధమో యే పాటల నాటకమో ప్రపంచమున నాతడు మెల్లగ జారవిడుచుట తోడనే – ఇంక భాషకు గల్గు ముప్పెంతో జెప్పదరమా?

దేశమునకు గల్గు నపకీర్తి యెంతయో నిర్వచింప దరమా? జాతికి గల్గు నగుబాటెంతో చెప్ప వశమా? వాఙ్మయమున కింతకంటె పాషాణ ప్రయోగము మరియేది యుండగలదు! అతడు కవి శిఖామణియని యంతకుదగిన విమర్శకులు కొందఱాతనిని స్తుతుల జేయుచు నాతని యష్టావక్ర శిశువు నభినందింపగనే జనులంద ఱాతని దారినే యవలంబింతురు. ఆతనికంటె లఘుతరముగ బ్రకృతిని బహిరంగముగ దల బగులగొట్టి చంపుదురు. ఇక నెక్కడ జూచిన గవితాగళ బంధములే. ప్రపంచ జ్ఞాన జలద జంఝా మారుతములే. ప్రకృతి కాంతా శిరఃకృతకములే!

ఇట్టి గ్రంథములు శీఘ్రముగ నశించిపోక నిలుచునా? నశించును – అట్లే నశింపకుండు నెడల నర ప్రకృతి యట్టె వానర ప్రకృతి లోనికి దిగిపోయి యదియట్టె చతుష్పాత కృతిలోనికి జారిపోయి యదియట్టె యవయవ శూన్య పిండ ప్రకృతి లోనికి గరిగిపోయి జగత్తు వికాస శూన్యమగు ప్రప్రథమావస్థలోనికి వచ్చియుండదా? అట్టి యుపద్రవ మేల సిద్ధింపగలదు. అందుచే నట్టి గ్రంథములు నశించును. కాని చేయదగినంత యపకృతి చేసిన పిదప గదా? ఎల్లకాల మేకీడైన నుట్టి గట్టుకొని యూగులాడునా?
కవులు కానివారు కవితను జెప్పినందువలన గలుగు పుట్టిమునుక యిది! కవితా కాలము గడచిపోయినది. ఇప్పుడైన నట్టి యున్మాదము గలవాడు లక్షకుగోటి కెవ్వడైన నుండిన నతడు కవితాగానము చేయవచ్చును. అంతేకాని కవిత్వమున ఘనత యున్నదని యాసించి యందుకై ప్రయత్నించు జనుల సందర్భ గ్రంథముల çసృజించి యకాలపు వెఱులై ప్రకృతి కాపత్తు తెచ్చి పెట్టుట న్యాయమా!

మనుజుడగు వాడు తన యభిప్రాయములకు గర్త కర్మ క్రియలు గల సందర్భములగు సహేతుకములగు వాక్యములతో వెల్లడించుట యుచితము. అది యత్యావశ్యకము గూడను. అందుచేత వచన రచన యెక్కువ యుపయోగకారి కాదా? ప్రపంచ మందున్న మహానాగరక దేశము లందెల్లడ వచన గ్రంథములే హద్దు లేకుండ వృద్ధి యగుచున్నవి. కవితాభివృద్ధికి ననాగరకత  కెట్టి సంబంధమో గద్యాభివృద్ధికి నాగరకత కట్టి సంబంధము. కావున గాలానుసరణముగ గద్య గ్రంథములే మిక్కిలి యభివృద్ధి నొందవలసినది.

అట్లు వానిసంఖ్య యభివృద్ధి నొందుచున్నదా? లేదని చెప్పుటకు లజ్జ పడక తప్పదు. ఎందుచేత? వచన గ్రంథకర్త వట్టి శుంఠయను వెఱి< లోకము నావరించి యున్నది. వచన రచన వలనే కాని భాష యభివృద్ధి నొందదు. దేశమున్నత దశకు రాదు. మనుజులు జ్ఞానయుక్తులు కారు. శాస్త్రములు వ్యాపింపవు. సత్యము ప్రబలదు. అట్టి వచన రచనను మనవారడుగు దొక్కినారు. దాని ననుసరించిన వానిని దీసివేత మనుజుని క్రింద బరిగణించుచున్నారు. కుక్కమూతి పిందె పండితునిగ భావించి  త్రుంచివైచు చున్నారు. అట్లు త్రుంపకున్న దల్లిచెట్టు నశించునని యాందోళన పడుచున్నారు. వెలుగుచున్న దీపము నార్పుచున్నారు. వెనుకకు నడుచుచున్నారు.
ఇట్లున్నను గాల మాహాత్మ్యముచే కొన్ని వచన గ్రంథములు బయలుదేరక పోలేదు. అవి చాల భాగము నవలలై యున్నవి. వానిలో నితర భాషల నుండి యాంగ్రీకృతములైనవి

కొన్ని యున్నవి. ఇప్పటి వచన శైలి తరచుగ నీరసముగను నిష్ప్రౌఢముగ నున్నది కాని మిగుల సంతుష్టికరముగ నుండలేదు. ఇంకను బలిష్టమై, ధారాళమై, పౌరుషయుక్తమై, ప్రాణధురంధరమైన శైలి బయలుదేరలేదు. క్రమ క్రమముగ బయలుదేరగలదు. పది పద్యములు సులభముగ వ్రాయవచ్చునుగాని యొక పంక్తి వచనము సుష్టుగ వ్రాయుట కష్టము. సందర్భ శుద్ధియు, హేతు కల్పనమును, కార్యకారణ సంబంధ జ్ఞానమును గలవాడే కాని యుత్తమ వచన గ్రంథమును వ్రాయజాలడు. అట్టి శక్తులను వన్నెబెట్టి యభివృద్ధి పరచుట యందు గణితము కంటే గద్య రచనయే యెక్కువ శక్తి కలదియై యున్నది. ఉత్తమ వచన గ్రంథము లింక విరివిగ బయలుదేరుట యావశ్యకమై యున్నది. అట్టిలోపమును దీర్చుటకు బుద్ధిమంతులు ప్రయత్నింతురు గాక.

పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘వచన రచన’ ఇది. అరసున్నాలు తీయడం మినహా య«థాతథ ప్రచురణ. ‘కవిశేఖర’ పానుగంటి (11 ఫిబ్రవరి 1865 – 1 జనవరి 1940) తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో జన్మించారు. బి.ఎ. చదివారు. ‘ఏ ఉద్యోగంలో ప్రవేశించినా తనని పోషించే ప్రభువుకంటే తను చాలా ఎక్కువవాడనని అనుకోవడమే కాకుండా యజమానికి కూడా ఆ భావం కలిగేటట్లు చేసేవారు.’ అందువల్ల ఎన్నోచోట్ల దివానుగా పనిచేశారు, మానేశారు. యువకుడిగా ఆయన్ని షేక్‌స్పియర్‌ ప్రభావితం చేశారు. ఆయనన్ని నాటకాలు రాయాలనుకొని 30 నాటకాలు రాశారు. రామాయణాన్ని పాదుకా పట్టాభిషేకము, విజయ రాఘవము, వనవాస రాఘవము, కల్యాణ రాఘవము పేర్లతో నాలుగు నాటకాలుగా రాశారు. రాధాకృష్ణ, కంఠాభరణం, మణిమాల, విప్రనారాయణ చరిత్రము ఆయన ఇతర నాటకాలు. కథావల్లరి, కథాలహరి, హాస్యవల్లరి, విమర్శాదర్శవిమర్శాదర్శము, ప్రకీర్ణోపన్యాసములు ఇతర రచనలు. తెలుగులో పుష్టి కలిగిన వచనం రాసిన కొద్దిమంది రచయితల్లో పానుగంటి ఒకరు. ఆయన ‘సాక్షి వ్యాసాలు’ తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. అందులోని తొలి వ్యాసం 1913లో  అచ్చయింది. అయితే, ‘నా కీర్తిని ఎప్పటికైననూ నిలుపునది నా నాటకములే. ఎడమ చేతితో వ్రాసి పాఱవైచిన సాక్షి వ్యాసములు కావు’ అని పానుగంటి అనడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement