అదృశ్యమైన నిప్పుపిట్ట, ఎర్రకుందేలు | katragadda dayanand writes on doctor v.chandrasekhar | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన నిప్పుపిట్ట, ఎర్రకుందేలు

Published Mon, Jul 10 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు (13 ఏప్రిల్‌ 1959 – 8 జూలై 2017)

డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు (13 ఏప్రిల్‌ 1959 – 8 జూలై 2017)

నల్లమిరియం పంట ఆశల్ని ఆకుపచ్చని దేశంలో వెదజల్లి అదృశ్యమైపోయింది నిప్పుపిట్ట!
ఆప్తుల్నీ, ఆత్మీయుల్నీ, నమ్ముకున్న తెలుగు కథనీ, నవలనీ రెండు మూడు రోజులలో కోలుకొని గుంటూరొచ్చి కలుస్తానని నమ్మబలికి అదే సమయానికి అదృశ్యమైపోయింది ఎర్రకుందేలు. అనారోగ్యంతో యుద్ధం చేసి చేసి మహాయోధుడై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు డాక్టర్‌ వి.చంద్రశేఖర రావు.

హితుడా! నేస్తుడా! మహాకథకుడా! మోహనా! కన్నీటితో ఎలిజీలు రాయటం ఎంత కష్టమో నీకు తెలీదా? మాకందరికీ ఎంత శిక్షని విధించి వెళ్లిపోయేవు! నువ్విక కనబడవని గుంటూరు వెక్కి వెక్కి ఏడుస్తోంది. మహాకథవై తిరిగిరా!

మూడు దశాబ్దాల క్రితం బెజవాడలో ఉన్పప్పుడు రైల్వే ఆఫీసు నుంచి ఒక మధ్యానం ఫోను. ‘‘నేను డాక్టర్‌ వి.చంద్రశేఖర రావుని. కథలు రాస్తాను. ఆంధ్రజ్యోతిలో రామకృష్ణారెడ్డిగారు మీ అడ్రసు చెప్పా’’రంటూ. అప్పటికే ఆయనకు రైల్వేలో పెద్ద పోస్టు. ఐఆర్‌ఎస్‌ ఆఫీసరు. నన్ను వెదుక్కుంటూ నిరాడంబరంగా మా ఆఫీసుకొచ్చేడు. నా కథ ‘కర్రావు’ ‘కథ–90’లో చదివానని చెప్పేడు. ఆయన కథ ‘నైట్‌ డ్యూటీ’కి 1990 ఏప్రిల్‌లో రామకృష్ణారెడ్డిగారే జ్యోతిలో పురుడు పోసేరు. 91లో ‘జీవని’ వచ్చింది. అదొక దయగల తల్లి కథ. మానవ సంబంధాల్ని స్త్రీ వాద దృక్పథం నుంచి ఒక మానసిక వికలాంగ బాలిక నేపథ్యంలో వ్యాఖ్యానించిన కథ.

అట్లా మొదలైన మా స్నేహం సాహిత్య పరిధి దాటి వ్యక్తిగత విషయాలు వెళ్లబోసుకునేదాకా– బెజవాడలో ఏదో ఒకటి చెయ్యాలన్న తపన– ఇద్దరం కల్సి సాహితీ మిత్రులు పేరుతో మధురాంతకం రాజారాం గార్ని, మునిపల్లె రాజు గార్ని, శ్రీపతి గార్ని ఆహ్వానించి రామ్మోహన గ్రంథాలయంలో కథ మీద సభ పెట్టేం. ఒక్క సభతోటే ఎంతో అనుభవం– ఆ తర్వాత మరో రెండు చిన్న సభలు– తర్వాత నాకు కలిచేడుకి బదిలీ– 94లో ఆయన జీవని కథల పుస్తకం వచ్చింది. కథావస్తువుతో పాటు రూపం మీద శ్రద్ధ చూపిన కథకుడిగా వల్లంపాటి వెంకటసుబ్బయ్య గుర్తించారు. లెనిన్‌ ప్లేస్‌ 98లో వచ్చింది. మాయ లాంతరు, ద్రోహవృక్షం– వెనక్కి తిరిగి చూడలేదు చంద్రశేఖర

రావు. నూట ఇరవైకి పైగా కథలు రాశారు. తెలుగు కథకు తనదైన రాతను రుచి చూపించాడు. తనదంటూ ఒక కథాభాషను సృష్టించుకున్నాడు. ఉద్యమాల పట్ల గాఢ అనురక్తి, ప్రగతిశీల వాదుల పట్ల ప్రేమ, ఉద్యమ విద్రోహుల పట్ల ప్రచండమైన ఆగ్రహం ప్రకటించేడు. తెలుగు కథకు ఒక మార్మిక సొబగును అలంకరించాడు.

కవిత్వానికే కాదు, కథకు కూడా స్పాంటేనిటీ ఉంటుందనీ, సమకాలీన సమస్యలకు తక్షణ స్పందన కథకుడి బాధ్యత అనీ గుర్తు చేసేడు. కళలన్నీ వ్యాపార మాయలో చిక్కుకున్న సందర్భాన్ని చిట్టచివరి రేడియో నాటకంగా రాసేడు. బెల్లి లలిత, కలేకూరి ప్రసాద్, రోహిత్‌... ఒక్కో దుఃఖ రుతువును కథల్లోకి అనువదించాడు. తెలుగు కథను వర్తమాన చరిత్రకు చిరునామా చేసిన ఏకైక కథకుడయ్యాడు. పోస్ట్‌ మోడ్రనిస్ట్‌ నవలగా ఐదు హంసలు రాసేడు. నల్లమిరియం చెట్టు, ఆకుపచ్చని దేశం నవలలు రాసేడు.

శ్రీరామకవచం, మూర్తీ, నేనూ, చంద్రశేఖరరావూ కల్సి నల్లమల చెంచు గూడేలకు వెళ్లేం. కొండలు, గుట్టలు ఎక్కి దిగేం. చెంచుల మాటలు విన్నాం. పాటలు పాడేం. వాళ్ల విల్లంబులు ఎత్తిపట్టేం. ఉడుముల బయ్యన్న, పెద్ద గురయ్య, మంతయ్య– అన్నీ సజీవ పాత్రలే. ఆకుపచ్చని దేశం ఒక కథాకావ్యం. చెంచుల రాజ్యంలో విత్తనం మొలకెత్తుతుందనీ, పంట నిలుస్తుందనీ గొప్ప ఆశను వెదజల్లాడు.

ఉద్యోగ జీవితంలో అత్యంత నిక్కచ్చి మనిషి. నిఖార్సైనవాడు. ఐఆర్‌ఎస్‌ ఉద్యోగంలో అవినీతితో కోట్లకు పడగలెత్తిన వాళ్లున్నారు. తండ్రి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. ‘ఇప్టా’లో ఉంటూ కొన్నాళ్లు నాటకాలు ఆడేడు. ఆ వారసత్వం చంద్రశేఖరరావుది. నిజాయితీ ఊపిరిగా బతికినవాడు. కనీసం బదిలీలు కూడా ఆపుకోవటం తెలీనివాడు. ఆ బదిలీలే చంద్రశేఖరరావు ఆరోగ్యాన్ని బలిగొన్నాయి.

భువనేశ్వర్‌ వెళ్లినప్పుడు తిండి పడక జీర్ణ వ్యవస్థ, ప్యాంక్రియాటైటిస్‌ సమస్య వచ్చి దాదాపు మృత్యువు ఒడిదాకా వెళ్లి వచ్చేడు. హుబ్లీలో డయాబెటిస్‌ ఒంటినంతా స్వాధీనం చేసుకుంది. దాదాపు సంవత్సరం పాటు పోరాడాడు. నరక యాతన అనుభవించేడు. కంటిచూపు మందగించినా కలం వదల్లేదు. మూడో నాలుగో కథలు రాసేడు. చిత్తుగా ఉన్న వాటిని సాఫు చేసి రాయడానికి వీలు కాలేదన్నాడు. చినుకు ప్రత్యేక సంచికకు ఒక కథ పంపాలన్నాడు. సాహిత్య గోదావరికి కథ పంపలేక పోయానని బాధపడ్డాడు. పాలపిట్టకు ఒక కథ ఇచ్చానని తృప్తి పడ్డాడు.

తన కథల్నీ, నవలల్నీ ప్రమోట్‌ చేసుకోవటం ఇష్టం లేని వ్యక్తిత్వం గలవాడు. దానికితోడు ఇప్పుడున్న సామాజిక సమీకరణాలు సరేసరి. ఆయన కథన శక్తికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. అయినా ఎప్పుడూ లొంగిపోలేదు. కుంగిపోలేదు. చివరి నిమిషం వరకూ సాహిత్య శ్వాస పీలుస్తూనే ఉన్నాడు.

కథను రూప సౌందర్యంగానూ, మార్మిక శక్తిగానూ, సమకాలీనంగానూ, ప్రాచీన స్మృతిగానూ, వినిర్మాణ రూపంగానూ మార్చుకున్నానని ప్రకటించాడు. సత్యాన్వేషణ గురించిన ఒక ఎరుకను తన కథల ద్వారా చెప్పాలని భావించాడు.

సామాజిక సూత్రాలు పనికిరాని కాలంలో, నమ్ముకున్న ఉద్యమాలు, విప్లవాలు తెరలు దించేసి మహాభినిష్క్రమణ చేసిన కాలంలో కథకుడు ఉండాలని నమ్మినవాడు... రైతులు రేపటి పంటకు విత్తనాలు దాచిపెట్టినట్లుగా కథకుడు తన పాఠకుడిలో ఒక ఆశను దాచిపెడతాడని గాఢంగా విశ్వసించినవాడు డాక్టర్‌ వి. చంద్రశేఖరరావు. మా కాలం మహామాంత్రిక కథకుడు. అతడితోపాటు కల్సి నడిచినందుకు గర్వంగానూ ఉంది, దుఃఖభరితంగానూ ఉంది.

ఎన్నో పర్యాయాలు తెలుగు కథకోసం ఒక పత్రిక తీసుకురావాలన్న కోర్కెను వెలిబుచ్చేవాడు. ప్రత్యేకంగా కథల పత్రిక. కథకుడు ముఖచిత్రంగా గల పత్రిక. అదీ రంగులతో తేవాలన్నది ఆయన స్వప్నం. ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ అయిన తర్వాత గుంటూరులో ఉంటూ రోజూ అందరం కలుసుకోవాలనీ, ఇటువంటి స్వప్నాలను సాకారం చేసుకోవడానికి మిత్రులం చర్చించాలనీ అనేవాడు. జూలై కూడా వచ్చింది. ఎనిమిదో తారీఖు ఎంతో నిర్దయగా తెలుగు కథమీంచి నడిచి వెళ్లింది. ఒక మేధోకథకుడ్ని ఎత్తుకెళ్లిపోయింది.

ఆయన తోడూనీడా డాక్టర్‌ ప్రసూన గారినీ, అనారోగ్యం పొడుగునా తల్లిలా వెంట నడిచిన కూతురు డాక్టర్‌ ప్రణవినీ, కుమారుడు రిత్విక్‌నూ, వృద్ధాప్యంలో ఉన్న తల్లినీ వదిలి మహాకథకుడు కానరాని మాంత్రిక లోకాలకు తరలి వెళ్లిపోయాడు.
తెలుగు కథ ఉన్నంతవరకూ డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు అజరామరుడు. అ మహాకథకుడికి, మంచి మనిషికి నా కన్నీటి వీడ్కోలు.
    
- కాట్రగడ్డ దయానంద్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement