
పరిశోధన: నాడు, నేడు, రేపు
108 తెలుగు, ఒక ఆంగ్లం, వెరసి 109 రచనలతో యీ బృహద్గ్రంథం ఫిబ్రవరిలో మద్రాసు యూనివర్సిటీ జరిపిన సదస్సులో వెలువడింది. తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తికి అంకితం,
సదస్సు పత్రాలు
108 తెలుగు, ఒక ఆంగ్లం, వెరసి 109 రచనలతో యీ బృహద్గ్రంథం ఫిబ్రవరిలో మద్రాసు యూనివర్సిటీ జరిపిన సదస్సులో వెలువడింది. తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తికి అంకితం, దాని ప్రక్కనే కీ॥గంధం అప్పారావు గారి తెలుగు తల్లి ప్రార్థన పుస్తకం పుట త్రిప్పగానే కనబడి సహృదయులకు ఆహ్లాదం కలిగిస్తుంది. పామరుడినైనా గురుభక్తి ఎన్నో మెట్లెక్కించగలదు కదా యిక పండితులకేమి!
వెనువెంటనున్న సంపాదకుని పరిచయ వాక్యాలు - పత్రం సమర్పయామి - యీనాటి విశ్వ విద్యాలయంలోని తెలుగు చదువుల గుంటమిట్టలను నిర్భీతిగా, నిస్సంకోచంగా కళ్లక్కట్టిస్తుంది. వెయ్యాలి వీరతాడు!
ఉన్న 109 పత్రాలలో ఒక నలభై కుండలో మెతుకు తడిమినట్లుగా చూశాను. ఇరవై అతి జాగ్రత్తగా చదివాను. దాదాపు పది వరకూ నాకు తెలియని విషయాలు ఆసక్తికరంగా విప్పగలిగాయి. అందులో యివి, పఠితలకు పరిచయదగ్గవిగా ఉన్నవి.
చదువరులలో ఒక ప్రశ్న పొడసూపవచ్చు. ‘అన్నిటిలో యిన్నేనా?’ అని. దీనికి జవాబు చివర లభిస్తుంది.
నా ఉద్దేశంలో ప్రథమ స్థానం తెలంగాణా పద సాహిత్యంపై మొరంగపల్లి శ్రీకాంత్ కుమార్ వ్యాసానికివ్వాలి.
తొలుతనే పదమనే పదానికి నమ్రత చూపవలసిన పెద్దల నిర్వచనాలు ఉటంకించారు. ఈ సాహిత్యంలో ఉన్న వేర్వేరు పాయలు, శైలీ భేదాలు, భిన్న వస్తువులు స్పష్టపరుస్తూ ఆయా కవుల ప్రసక్తి తీసుకువచ్చారు.
నలుగురికీ తెలిసిన తెలుగు వాగ్గేయకారులు యిప్పటి ఆంధ్ర తెలంగాణాలలోనే కాక తమిళ దేశానా ఉన్నారు. (త్యాగయ్య, క్షేత్రయ్య - యీ రెండవ వ్యక్తి ఉనికి మనికి గురించి మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రశ్నలతో ఏనాడో ప్రస్ఫుటపరిచారు)
మాతువంటే మాట, ధాతువంటే సంగీతం, యీ రెంటినీ ఒకే మారు సృష్టించే వాడే వాగ్గేయకారుడు అని చెప్పి, తెలిసిన వారి గురించి టూకీగా ప్రస్తావించి, ప్రధాన వస్తువుకి రాచమార్గంలో వచ్చారు.
తెలంగాణకు చెందిన రామదాసు (కంచెర్ల గోపన్న 1620-1680) తెలుగు దేశాన ఉన్నవారికి ఉగ్గుపాలనాటివాడు. రామదాసు కీర్తనలు వినబడని జనావాసాలుండవు. వీటిని సినిమాలు (దేవత, చరణములే నమ్మితి, గరుడగమన రారా, రెంటచింతల సత్యనారాయణ), నాటికలు, హరికథలు, ఆ తరువాత ఆకాశవాణి, దూరదర్శన్ -అన్నీ ప్రచారంలోకి తెచ్చాయి, పబ్బం గడుపుకొంటున్నాయి.
‘‘అంతకుముందే కాసె గంగాధరయ్యవి (1525-1575) గంగాధరయ్య వచనములు ఉన్నవి. ఇవి పాలమూరు జిల్లా మహ్మదాబాద్‌లో దొరికాయి. ముద్ర ‘కరుణాకటాక్ష గంగాధరయ్య’.
ముష్ఠిపల్లి వేంకట భూపాలుడు (1663-1712) రాజవోలి వేంకటేశ్వర కీర్తనల రచయిత. ఇవి 3476 కీర్తనలనీ, అన్నమయ్య తరువాత అన్నిటి రచయిత యితడేననీ కపిలవాయి లింగమూర్తిగారన్నారు. అయితే యివి అముద్రితాలు.’’
ఈ వ్యాసంలో మరో యిరవై వాగ్గేయకారుల ప్రసక్తి ఉన్నది. ఒకరిద్దరు తప్ప తక్కినవారు సాధారణ పఠితకు అపరిచితులే.
‘ఆధునిక తెలుగు సాహిత్యం- చాకలివారి జీవిత ప్రస్తావన’ పి.దస్తగిరి వ్యాసంలో తెలుసుకోదగిన విషయాలెన్నో ఉన్నవి. ఒక కులం గురించి రచనలు అంటే ఆ కుల ప్రసక్తి మాత్రమే కాదు, ఆయా వృత్తుల వారికి తమ కులాల వలన ఏర్పడిన పరిస్థితులు ఏమిటి, వాటినెలా ఎదుర్కొంటున్నారు, ఎలా అధిగమిస్తున్నారు అన్న పరామర్శ ఉండాలి. అలాంటి వాటి పరిచయం వున్నదిందులో.
ఒక్క వింత కబురు. మానేపల్లి రవిబాబు ‘రజకప్రభ’ కవితలో ‘కవిభాసుడు నీవాడేనని’ చాకలివారి ఘనతను చాటడం వుందట.
భాసుడు చాకలా అని సంస్కృత సాహిత్యవేత్తలను ఒక నలుగురినడిగాను. మేమీ విషయమెక్కడా వినలేదని ముగ్గురు తెలిపితే ఒక్కరిలా (ముళ్లపూడి జయసీతారామ శాస్త్రి) తెలియపర్చారు. ‘‘హర్షవర్ధనుని వద్ద ధావక అని ఘోస్ట్ రైటర్ ఉన్నట్లు కథ. ధావక అన్న పదానికి చాకలి అన్న అర్థం వుంది. కానీ భాసకవికీ దీనికీ సంబంధం లేదు.’’
ఒకవేళ ఆ గేయంలో ఆ విషయం ఎక్కడినుండి సంగ్రహించారో తెల్పకపోయినా దాని గురించి వ్రాసే ఆ వ్యాసకర్త యీ విషయం ఉగ్గడించే ముందు డి.ఎన్.ఎ. పరీక్ష చేసి వుండాలి కదా!
జయదేవుడు నా ముది ముది ముత్తాతకు మేనమామ అని నేనంటే చెల్లునా!
దుంగావత్ నరేష్‌కుమార్ నాయక్ ‘గోర్‌బోలి భాష - వ్యాకరణం’ ఎన్నో తెలియని విషయాలు తెల్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే కొన్ని మాటలు తర్కానికి అందకుండా ఉన్నవి. పదాదిన సంయుక్తాక్షరాలు ఆర్యభాషలలో ఉంటవని చూపిన ఒక్క పదంలోనూ - ఆద్మీ, కోత్రా, టోక్డా - కనబడవు. ఇక వ్యాసమంతటా ‘శబ్ధం’ అని ఉండడం చేత యిది ముద్రారాక్షసం కాదేమో, యిది ఆ పదం సరైన రూపమని వీరి భ్రమేమో అన్న అనుమానం కలుగుతున్నది.
ఈ పుస్తకమంతటా పుటకు నాలుగైదు అచ్చు తప్పులు, అసంతగమైన పదవిభజనలు ఉన్నవి. జాగ్రత్తగా చూస్తే కొందరు రచయితలకు సరియైన వాక్యనిర్మాణం తెలియదన్న విషయం రూఢి అవుతున్నది.
అయితే సంపాదకులు (సహబాధ్యత: డా॥కోదండ లక్షణ) వీటినెలా వదిలారు? ఒకటే జవాబు. ‘పుస్తకం సకాలంలో అందించాలని’. ఈ సోడిపిండి అంబలి, సంకురాత్రి సంజాయిషీ గత పదేళ్లుగా, ఆదరాబాదరాగా జీతభత్యాలు పెరుగుట కోసం చదువుకొన్న వారు వేస్తున్న పుస్తకాలలో చూస్తున్నదే, వింటున్నదే.
ఈ తప్పులన్నీ తొలగించి యీ పుస్తకాన్ని పునర్ముద్రిస్తే కొని, తలెత్తుకొనవలసిన సంపుటి యిది.
ఇక్కడ మాడభూషి సంపత్‌కుమార్ ఆకులో కొన్ని వాక్యాలు చూడాలి.
1. పరిశోధకుల సంఖ్య బాగా పెరిగింది. దాని వలన పరిశోధనలో కొంత శ్రద్ధ తగ్గడం కూడా అనివార్యం!
నిజంగా అనివార్యమా?
2. పర్యవేక్షకులలో ఓపిక తగ్గడం వలన సిద్ధాంత వ్యాసాల మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నవి.
మరి పిల్లికి గంట కట్టేదెవరండి?
3. చేసిన అంశాలపైనే పరిశోధన చేస్తూ ఉండడం మరో పెద్ద సమస్య.
కంప్యూటర్లందుబాటులో ఉన్న యీ రోజుల్లో, అదొక ఎక్కలేని జారుడు బండకాదు!
వెలుదండ నిత్యానందరావు వీటినొక కొలిక్కితెచ్చి వేసిన పుస్తకం చేర్పులతో పునర్ముద్రణం కూడా పొందినది!
సందులు వెతకడం సాకులు చెప్పడం మానితే యివన్నీ సర్దుకొంటాయి. ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ దానికి పూనుకొంటే మంచే జరుగక మానదు. పండితుల మాటేమోగాని (చదివితే, చదువుతున్నప్పుడే తప్పులేవో ఒప్పులేవో గ్రహించగలరు వారు!) భాషయందభినివేశం లేకపోయినా ఆసక్తి వున్న నాలాంటి వారికి సరస్వతీదేవి వరప్రసాదమే కాగలదు.