
సంస్కృతీ సౌరభం
పుస్తక పరిచయం
తనకు ప్రమేయం లేకుండా అనాథగా మారిన లీల అనే అమ్మాయి జీవితంలో వెలుగుల దీపాల్ని వెలిగించి ‘రుణం’ తీర్చుకునేందుకు అబ్బుశాస్త్రి అనే నిష్టాగరిష్టుడైన వటువు కర్మిష్ఠిగా మారిన వైనాన్ని ఆర్ష సంప్రదాయ నేపథ్యంలో చిత్రించిన నవల ఇది. ఇందులో సంప్రదాయ వైభవానికి మేరువు లాంటి పెదచయనుల మూర్తిమత్వం దర్శనమిస్తుంది. సోమిదేవమ్మలోని మూర్తీభవించిన మాతృహృదయం ఆకట్టుకుంటుంది. సర్వమంగళం, రామశర్మ, అనసూయ లాంటి లోకహితం కోరే పాత్రలున్నాయి. లీల, టెడ్డీ, కొండల్రావు, మాళవిక, డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే మెకార్దీ, ముకుల్ శిశోడియా లాంటి నాగరికులూ కనిపిస్తారు. చినజగ్గుబాబు, నాలుగో ఆయన, అమావాస్య రాజు , మందయ్య, సాయిలమ్మ, నరిసిపండు, సోయితా లాంటి గ్రామీణ నేపథ్యమున్న పాత్రలూ వాటికి అవే సాటిగా నిలుస్తాయి.
ఇతివృత్తం అంతా గోదావరి తీర గ్రామాలు, పట్టణాలు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు, నిజామాబాద్ ,హైదరాబాద్ తోపాటు, బొంబాయి, హరిద్వారం చుట్టూ తిరుగుతుంది. లోకస్సమస్తాస్సుఖినోభవంతు అని బోధించే వేదం పరమార్థాన్ని పరమపవిత్రంగా పరిచయం చేసిన తీరు అద్భుతం. ‘పగలు మనుషుల్ని వెదజల్లే నగరంగా , రాత్రివేళ పండి ముదిరిన రాచపుండుగా, ఎదుటివాడి అవసరానికి వెలకట్టే వెలయాలిగా’ బొంబాయి వైకల్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు రచయిత.
పాఠకుడు ఓపికతో చదివినందుకు కృతజ్ఞతగా అన్నట్టు ప్రధాన కథకు సమాంతరంగా, ఎలాంటి విసుగు కలిగించని రీతిలో బోలెడు జ్ఞాన సముపార్జనకు వీలైన సూక్ష్మాతిసూక్ష్మమైన విషయ వివరణ చేశారు గొల్లపూడి. జమ్షెడ్జీ టాటాలోని దార్శనికత, కాళిదాసుకి అమ్మ కటాక్షం, పొలమారినప్పుడు దేవుడి పేరు చెప్పడం, మంత్రాల పరమార్థం, యోగ శాస్త్ర చరిత్ర, సూర్య నమస్కారాల వల్ల లాభాలు, ఆదిశంకరులు, మండనమిశ్రునికి మధ్య జరిగిన వివాదం, చేపల్లో రకాలు, వాటి గుణగణాలు, త్యాగయ్యలోని సైకో ఎనాలసిస్ట్, జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఓరిగామీ హస్తకళ... ఇలా ఎన్నో విషయాల వెనక అంతరార్థాలను అలవోకగా వర్ణించే తీరు హృదయ రంజకం.
కథ రుచించేలా చేసేందుకు గొల్లపూడివారుపడ్డ ఏళ్లనాటి శ్రమకు మనం ‘రుణం’ తీర్చుకోలేం. తెలుగు నుడికారంతో కథను నడపడంలోనూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు సముచిత స్థానం వేయడంలోనూ తాను అందెవేసిన చేయని ఆయన ‘సాయంకాలమైంది’ నవలతో తెలుగు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇది దానికి కొనసాగింపని చెప్పుకోవచ్చు. ఈ నవల చదివితే మానవత్వంపై మమకారం పెరుగుతుంది. మంచితనంపై మక్కువ ఏర్పడుతుంది. సత్ప్రవర్తనపై నమ్మకం పెరుగుతుంది. ఉత్తమాభిరుచి ఉన్నవారు తప్పక చదవాల్సిన సంస్కృతీ సౌరభం ఈ ‘రుణం’ .
రుణం (నవల); రచన: గొల్లపూడి మారుతీరావు; పేజీలు: 288; వెల: 250; ప్రచురణ: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, 1–8–725/ఎ/1, 103 సి, బాలాజి భాగ్యనగర్ అపార్ట్‌మెంట్స్, నల్లకుంట, హైదరాబాద్–44. ఫోన్: 9848065658
- బొబ్బిలి శ్రీధరరావు
7660001271