పత్రికా సంపాదకులు నార్ల వేంకటేశ్వరరావు గంభీర స్వభావులన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ సంభాషణా చతురులనీ, హాస్య కుశలురనీ తెలిసినవాళ్లు కొద్దిమందే. నార్ల వారి ఉత్తరాల్లో ఆయన హాస్య చమత్కారాలు మబ్బుల చాటున మెరుపుతీగల్లాగా మెరిసిపోతుంటాయి. 1981లో ఆయన సీతజోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. నేను ఆ పుస్తకం గురించి వ్యాసం రాస్తున్నాననీ, వారి జీవిత రచనా విశేషాలు తెలపమని ప్రార్థిస్తూ వారికి ఓ ఉత్తరం రాశాను. మరుటపాలో ఓ చిన్న ఇంగ్లిష్ పుస్తకంతో పాటు ఓ టైపు చేయబడ్డ ఉత్తరం వచ్చింది. నార్ల ఇలా రాశారు:
‘‘నాకు ఐదుమంది కొడుకులు. ఐదుగురూ డాక్టర్లే. ఐదుమంది కోడళ్లు కూడాడాక్టర్లే. వీళ్లంతా విదేశాల్లో స్థిరపడ్డారు. నా ముగ్గురు కుమార్తెలూ, అల్లుళ్లూ డాక్టర్లే. ఒక్క కూతురూ, అల్లుడు మాత్రమే ఇక్కడ వున్నారు. మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతావారంతా డాక్టర్లే. ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే బావుంటుంది. అప్పుడు మా ఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు. కాని ఇంతమంది డాక్టర్లున్నా నేనెప్పుడూ పేషెంటునే. తల నుంచి కాలు దాకా నేనో రోగాల పుట్ట.’’ నార్ల వారి అరుదైన చమత్కార మాటలివి.
-పినాకిని
Comments
Please login to add a commentAdd a comment