
సంఘటనల వెంట సమకాలీన కవి
ప్రసంగం
సమకాలీన తెలుగు సాహిత్యంలో వట్టి వచనం కవిత్వం పేరిట చలామణి అవుతుంది. ఇది అధికశాతం కాబట్టి కవిత్వ ప్రేమికుల దాహం తీరకుంది. కవిత్వానికీ వచనానికీ మధ్య భేదాన్ని కవులు సంకల్పితంగానే విస్మరిస్తున్నారు. కవిత్వానికి ప్రాణప్రదమైన అనుభూతి గాఢత్వం, పద లాలిత్యం, నిర్మాణ కౌశలం పట్ల కవులు కనీస శ్రద్ధాసక్తులు కనబరచడం లేదు. వ్యక్తి స్పృహ నుంచి సామాజిక స్పృహవాదం తెలుగు కవిత్వంలో స్థిరపడిన తర్వాత ఎక్కువ మంది కవులు అలవోక రాతకి అలవాటు పడ్డారు. సాహిత్యంలో ఇతర ప్రక్రియలకంటే కవిత్వ రచన సులభతరమని భావించినట్టున్నారు. లేకుంటే దశాబ్దాల తరబడి ఇంత పెద్ద మొత్తంలో అకవిత్వం వెలువడేది కాదు. ఈ పరిస్థితి మరే భాషలోనూ లేదనుకుంటాను. అయితే ప్రతితరంలో మాదిరి వర్తమానంలో కూడ కొందరు కొత్తకవులు మెరుపువలె, ఉరుముమల్లే వర్షాగమనాన్ని ఊరించక మానడం లేదు.
సమీపగతంలో ప్రజాఉద్యమాలేవీ లేవు. అిస్తిత్వవాద ఉద్యమాలు కూడ అనతి కాలంలోనే సద్దుమణిగిపోయాయి. అక్కడక్కడా ఆ మిణుకుమనే నిప్పురవ్వలను రాజేయాలని నిమగ్న కవులు తమ పరిధిలోనూ, ప్రక్రియల్లోనూ ఊపిరిలూదుతూనే ఉన్నారు. ఇక ‘తాత్కాలికం’ మాత్రమే మిగిలింది. తెలుగు కవి పని, ఒక ఘటన కోసం ఎదురు చూడటంలాగా ఉంది. పంకిలంలోంచి పద్మం వంటి అద్భుతమైన అనుభవం కోసమో లేదా ఛిన్నాభిన్నమైన ప్రతిబింబ శకలాలను అతికే సహానుభూతి కోసమో నిరీక్షించవలసిన కవి సంఘటన వెంటపడి కొట్టుకుపోవడమే బాధాకరం. ఒక ఘటన నుంచి మరొక ఘటనకు ఉరుకడమే దుర్బలం. మన పూర్వకవుల నుంచి మనం ఏ మేరకు ప్రేరణ పొందాలి? ఏయే సుగుణాలను అలవర్చుకోవాలి? ముఖ్యంగా ఓరిమి, సంయమనం, అధ్యయనం అంటాను. నెలవంక నిండుజాబిలిగా వికసించేంత వరకు; చితుకు చితుకు ముక్కున కరచుకొచ్చి పక్షి పదిలంగా గూడు అల్లేంత వరకు; తల్లిగర్భంలోంచి నవజాత శిశువు పొత్తిళ్ళలో కిలకిలమని నవ్వేంతవరకు ఒకింత ఓపిక పట్టితీరాలి. మౌలానా జలాలుద్దీన్ రూమీ అన్నట్టు, ముల్లు సమీపంలో గులాబిపువ్వు చూపే ఓరిమి/దాన్ని సువాసన భరితంగా ఉంచుతోంది.
ఇటీవలి ఉదాహరణలు చూడండి. చెన్నై వరదలు, కల్బుర్గి కాల్చివేత, రోహిత్ ఆత్మహత్య. ఇటువంటి సందర్భాల్లో కవి హుటాహుటిన ఇరవై, ముప్పై పంక్తులు రాస్తున్నాడు. కేవలం వార్త ఆధారంగానే కవిత్వ రచనకు సమాయత్తమవుతున్నాడు. ఉపరితలాంశాలను ఏకరువు పెట్టడంతోనే సరిపెట్టుకొంటున్నాడు. ఆ రచన పత్రికల్లో ప్రకటించుకోవాలని ఉబలాటపడుతున్నాడు. అదే ఘనకార్యంగానూ, సామాజిక బాధ్యతను నెరవేర్చినట్టుగానూ ఆత్మవంచనకు పాల్పడుతున్నాడు. ఈనాటికీ ఒక విలేకరివలె దృశ్యచిత్రణకి, వ్యాఖ్యానానికి పరిమితమవుతున్నాడు తప్ప కవిత్వ ప్రక్రియలో అత్యంత ప్రధానమైన కవి దర్శనం కానరావడం లేదు.
కవి గుప్పిడి తెరిస్తే ఏ చింతనా రహస్యమూ గుసగుసలాడటం లేదు. అతను స్పృశించిన చీకటి నీడలని మన ముందు పొరలుగా వలవడం లేదు. అతని అంతఃసంఘర్షణ గడ్డకట్టిన కన్నీటిచుక్కై మనని కోతపెట్టడం లేదు. ఆఖరికి ఒక అందమైన ఊహ ఎగసివచ్చి మన చేతిని లాలనగా తాకడం లేదు. పాఠకుని అంతర్‌బాహిర్ ప్రపంచాల మధ్య వర్తమాన కవి ఓ దేహళీ దీపమై కాంతిని పంచిపెట్టలేకపోతున్నాడు. కవి జీవితంలో అంతర్భాగం కావలసిన కవిత్వం ఇవాళ అతని ఒంటిమీద ధగధగలాడే నగలాగా తయారయింది. లేదా ఒక పార్టీవేర్‌గా మారిపోయింది.
సంఘటనకు కవి ఎడంగా నిలవాలని నేను కోరడం లేదు. సంఘటనను వస్తువుగా స్వీకరించడంవల్ల కవిత్వం కలుషితమవుతుందనీ అనడం లేదు. సంఘటన పూర్వాపరాలను కవిత్వీకరించడంలో ఎక్కువమంది విఫలమవుతున్నారనే చెబుతున్నాను. సామాజిక స్పృహవాదం కవి మెడకు గుదిబండగా మారిందని సందేహిస్తున్నాను. అతను శిరస్సు ఎత్తి దిక్కులన్నీ పరికించే స్వేచ్ఛని అది కట్టడి చేస్తుందా? వైయక్తిక అనుభవంలో లేకుండా కేవలం సామాజిక స్పృహతో కవిత్వ సృజనకి పూనుకోవడమనేది శక్తికి మించిన బాధ్యతగా పరిణమించిందా? అందుకనే అతను వృత్తాంతంగా మినహా కవిత్వంగా పలుకలేకపోతున్నాడా? ఇవన్నీ ఒక చదువరి ప్రశ్నలుగా సమకాలీన కవులు పరిగణించాలంటున్నాను. వర్తమాన తెలుగు కవిని కవిత్వం నుంచి వేరుపరుస్తున్న బలీయమైన శక్తులేమిటో కానుకోమంటున్నాను. నేను ప్రగతిశీల రాజకీయాల ప్రాముఖ్యం గుర్తెరిగి ఉన్నాను. అదే సమయంలో సాహిత్యంతో రాజకీయాలకి గల సంబంధంలోని పరిమితులను కూడ దృష్టిలో ఉంచుకొన్నాను.
దేశదేశాల కవులు సరే, భారతీయ భాషల్లోని కవులు సైతం ఎంతో వైవిధ్యంతో రాస్తున్నారు. మనకి పూర్తి భిన్నంగా సృజిస్తున్నారు. భావకవిత్వం మొదలుకొని మన ముందుతరం కవులలో అనేకులు కవిత్వం చేజారిపోకుండా కాపాడుకొన్నారు. ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ, తిలక్, బైరాగి, అజంతా, ఇస్మాయిల్, శివసాగర్‌లను మనం మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం కదా! ఎప్పటివాడు రూమీ! ఎక్కడివాడు పాబ్లో నెరూడ! ఎందుకు గుండెలకు హత్తుకుంటున్నాం. కవి, వియత్నాం విప్లవనేత హోచిమిన్ రాసిన ప్రతి కవిత లలిత లలితంగానూ, నిత్యనూతనంగానూ ఉంటుంది. ఎందుకని? అనుభంలోంచి ప్రభవించడం వల్ల. కవిత్వంతో తొణికిసలాడటం వల్ల. అందులో అంతర్లీనంగా సామాజిక స్పృహ కూడ లేకపోలేదు కదా. ‘‘వర్షంలో సూర్యుణ్ణి చూడడం/ అగ్ని లోపల్నుంచి/ శుభ్రజలాన్ని చేదడం’’ అన్నాడొక జపనీయ ప్రాచీన కవి. అదీ కవిదర్శనం.
ప్రసుత్తం అనేకమంది కొత్తగా కవిత్వం రాస్తున్నారు. బ్లాగ్, ఫేస్‌బుక్, కొన్ని అంతర్జాల పత్రికల్లో ప్రతిరోజూ విరివిగా కవితలు ప్రకటిస్తున్నారు. వీరిలో పలువురికి కవిత్వమంటే మౌలిక అవగాహన లేదు. కొందరు సొంత గొంతుతో జీవనానుభవాన్ని అభివ్యక్తీకరిస్తున్నారు. సమకాలీన కవి కవిత్వ ప్రచురణను సమస్యగా ఎదుర్కొంటున్నాడు. తెలుగులో మేలిమి సాహిత్యపత్రిక లేకపోవడం వల్ల దినపత్రికల సాహిత్య పేజీల మీదనే ఆధారపడుతున్నాడు. కవే తన కవిత్వసంపుటం అచ్చు వేసుకొంటున్నాడు, ఉచితంగా పంచిపెడుతున్నాడు. ఈ దుస్థితి మరే భాషలోనూ చూడమనుకుంటాను. బుక్‌షాపుల నిర్వాహకులు కవిత్వ పుస్తకమంటే అయిదు ప్రతులు మించి తీసుకోవడం లేదు. కొందరు విక్రేతలైతే ససేమిరా వద్దంటున్నారు. ఇదీ జీవితాన్ని ఉన్నతీకరించే కవిత్వానికి దీర్ఘకాలంగా లభిస్తున్న ఆదరం! ఈ అంశం కూడ సమకాలీన కవిత్వపు తీరుతెన్నులను రుజువు చేయకమానదు.
దక్షిణకొరియా కవి చోంగ్ హ్యోన్-జోంగ్ అంటారు: జీవితాన్ని జీవితంతో ప్రేమించకపోతే/ విషాదంతో విషాదించకపోతే / కవిత్వంతో కవిత్వాన్ని ప్రేమించకపోతే/ మరి కవిత్వంతో దేన్ని ప్రేమిస్తావు?/ రాత్రి కురిసే హిమాన్ని ఎవరూ చూడరు/ ఎవరూ నడవరు, అడుగుజాడలుండవు/ అది నిశ్శబ్దం, స్పష్టం, స్వయం సుందరం. (‘రెండో ప్రతిపాదన’, అనువాదం: ఇస్మాయిల్). ఏ పాఠకుడూ సమాచారం కోసం కవిత్వాన్ని సమీపించడు కదా! కవి హృదయం పలికే సత్యం వినవస్తుందని మాత్రమే కవిత్వాన్ని ఆశ్రయిస్తాడు. ఆ సత్యమే నిశ్శబ్దం, స్పష్టం, స్వయం సుందరం. దానిని సదా కాపాడుకుందాం!
- నామాడి శ్రీధర్
9396807070
(విజయవాడలో ‘కవిత్వంతో ఒక సాయంకాలం’ మేడే సభలో ‘సమకాలీన కవిత్వం తీరు’పై ప్రసంగం సంక్షిప్త పాఠం)