తొలిసారి రేడియోలో మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగించారు. 'మన్ కీ బాత్' (మనసులో మాట) పేరుతో ఆయన ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చెడుపై మంచి గెలిచిన రోజుగా ఆయన అభివర్ణించారు. నెలకోసారి, లేదా రెండుసార్లు ఆదివారం రేడియోలో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. మన శక్తి సామర్థ్యాలు అపారమైనవని మోడీ పేర్కొన్నారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో లో అందరూ పాల్గొనాలని, ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడే ఖాదీ ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే పేదల ఇళ్లల్లో ప్రగతి దీపం వెలిగించినట్లేనన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రేడియో కేంద్రాల్లో ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని రేడియో కేంద్రాల్లో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారం కానుంది.