
గ్రేట్ రైటర్
ఇంగ్లండ్‌లో జన్మించాడు చాల్స్ డికెన్స్ (1812–1870). తల్లిదండ్రులకున్న ఎనిమిది మంది సంతానంలో రెండోవాడు. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. ఆయన జైలుపాలవడంతో చిన్నతనంలోనే డికెన్స్ చదువుకు
దూరమయ్యాడు. అయినా చదువు మీద అనురక్తి పోగొట్టుకోలేదు. బయట బాగా తిరిగేవాడు. ఇంట్లోని బొమ్మల పుస్తకాలు బాగా చదివేవాడు. ప్రత్యేకించి అరేబియన్ నైట్స్ ఆయన్ను బాగా ప్రభావితం చేసింది. ప్రత్యేకంగా పాఠశాల విద్యను అభ్యసించకపోయినప్పటికీ సహజ పండితుడిలాగా చదువుకున్నాడు. 15 నవలలు, 5 నవలికలు, వందలకొలదీ కథలు, వ్యాసాలు రాశాడు. ఒక వారపత్రికకు 20 ఏళ్లపాటు సంపాదకత్వం వహించాడు.
విక్టోరియన్ ఇరా(విక్టోరియా రాణి శకం)లో పుట్టిన గొప్ప నవలాకారుడిగా కీర్తి ప్రతిష్ఠలు గడించాడు. బాల్య జ్ఞాపకాలను అత్యంత స్పష్టంగా కాగితం మీద నెమరేసుకున్న డికెన్స్ మరిచిపోలేని పాత్రల్ని సృష్టించాడు. ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్, గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్, డేవిడ్ కాపర్‌ఫీల్డ్, ఆలివర్ ట్విస్ట్, ఎ క్రిస్‌మస్ కరోల్, హార్డ్ టైమ్స్, ద సిగ్నల్–మాన్ లాంటివి ఆయన ప్రసిద్ధ రచనల్లో కొన్ని.