తొలి తెలుగు దళిత మహిళా కావ్యం
విమర్శ
1934 దాకా గుర్రం జాషువ పౌరాణిక చారిత్రక రచనలే చేశారు. 1934లో ఆయన ‘స్వప్నకథ’, ‘అనాథ’ అనే రెండు సాంఘిక కావ్యాలు రచించారు. ఈ రెండూ పేద స్త్రీల జీవితాలను ప్రతిబింబించే కావ్యాలు. మొదటిది ఒక పేద రెడ్డి మహిళ మానవీయ జీవితాన్ని ఆవిష్కరించగా, రెండవది ఒక పేద దళిత మహిళ దైన్య జీవితాన్ని ప్రతిఫలించింది. 1934 నాటికి గాంధీజీ స్వాతంత్య్రోద్యమంలో భాగమైన నిర్మాణ కార్యక్రమాలలో హరిజనోద్ధరణ ఒకవైపూ, బి.ఆర్.అంబేడ్కర్ దళితోద్యమాలు మరొకవైపూ కొనసాగుతున్నాయి. తెలుగులో ఒకవైపు భావ కవిత్వం, మరోవైపు స్వాతంత్రోద్యమ కవిత్వం ముమ్మరంగా వస్తున్నాయి. అభ్యుదయ కవిత్వం పురుడుపోసుకుంటున్నది. ఈ సంధి దశలో జాషువ ‘అనాథ’ రచించారు.
ఉత్పత్తి రంగంతో సంబంధం లేని భావకవులు విశ్రాంతి వర్గ స్త్రీలను ప్రణయమూర్తులుగా చిత్రిస్తూ ఉంటే, జాషువ వాళ్లకు భిన్నంగా శ్రామిక దళిత స్త్రీ జీవితం వస్తువుగా, వాస్తవిక దృక్పథంతో ‘అనాథ’ రచించారు. ఇది తెలుగులో తొలి దళిత మహిళా కావ్యం. ఈ కావ్యం రావడానికి 25 ఏళ్ళు ముందు నుంచే దళిత కవిత్వం వస్తున్నది. మాలవాండ్ర పాట (1909, అజ్ఞాత కర్తృకం) తొలి తెలుగు దళిత కవిత. ‘లవణరాజు కల’ (గురజాడ, 1910) తొలి తెలుగు దళిత కథాకవిత. నిరుద్ధ భారతము (1915, మంగిపూడి వెంకటశర్మ) తొలి తెలుగు పద్యమహాకావ్యం. ‘మాకొద్దీ నల్ల దొరతనము’ (కుసుమ ధర్మన్న, 1921) దళితుడైన కవి రాసిన తొలి కవిత. హరిజన శతకము (కుసుమ ధర్మన్న, 1933) తొలి తెలుగు దళిత శతకం. ఈ మధ్య కాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ, జాలా రంగస్వామి వంటివారు దళిత కవితలు రచించారు. అయితే దళిత మహిళ జీవితాన్ని కావ్యంగా రాసిన తొలి కవి గుర్రం జాషువ.
ఈ కావ్యంలో స్త్రీ వస్తువుగా వచ్చే భావ కవిత్వ ధోరణి, ఆర్థిక అసమానతను ప్రశ్నించే అభ్యుదయ కవిత్వ ధోరణి, భారతీయ సామాజిక నిర్దిష్టతకు చెందిన అట్టడుగువర్గ చిత్రణ చేసే దళిత కవిత్వ ధోరణి – ముప్పేటగా పెనవేసుకొని ఉన్నాయి.
అనాథ 72 పద్యాల ఖండ కావ్యం. ఒక పేద దళిత వితంతువు. ఆమెకు ఆరుగురు సంతానం. అందరూ ‘నేదరులు’. ‘నడచు పీనుగులు’ లాగా ఉన్నారు. ఆమెకు కట్టుకున్న బట్టలు తప్ప ఇంకే ఆస్తి లేదు. భిక్షాటన తప్ప మరో బ్రతుకుతెరువు లేదు. బిచ్చమెత్తుకోవడంలో ఆమె పడిన బాధలే ఈ కావ్యం. ఇది మూడు విషయాలను ప్రతిపాదించింది. 1. మన సమాజం ధనిక పేద వర్గాల సమాజం. ‘‘సుఖమొకచోట గడగండ్లొకచోట గదా వసుంధరన్’’ 2. దళితుల పేదరికానికి కారణం ఎవరు? అన్న ప్రశ్న.
ఎవడారగించు నమృత భోజనంబున
గలిసెనో యీలేమా గంజిబువ్వ....
ఎవడపహరించె నేమయ్యె నీమె సుఖము
కలుషమెరుగని దీని కొడుకుల సుఖము?
3. సాంఘిక, ఆర్థిక అసమానతలు గల సమాజమే అయినా, అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఈ మూడింటితో పాటు, కావ్యంలో నాలుగో అంశాన్నిగూడ గుర్తించవచ్చు. ఇది ముఖ్యమైంది కూడా. ఇది 1934 నాటికి జాషువ భావజాలానికి సంబంధించినది. సాంఘిక, ఆర్థిక అసమానతలతో కూడిన సమాజంలో భగవంతుడు పేదలవైపే ఉన్నాడన్నది నాల్గవ అంశం.
ఈ కావ్యంలో ‘అనాథ’ దారిద్య్రాన్ని చిత్రిస్తూ, భర్త మరణంతో ఆమెకు మిగిలింది ‘పిత్య్రమగు ధనము జోలెసంచి’ అన్నారు జాషువ. ఈ అనాథకు బిచ్చమెత్తడ మొక్కటే మిగిలిన దారి. ఆ క్రమంలో దళితేతర సంపన్నులు ఆమె పట్ల ప్రవర్తించే తీరును చిత్రించడం ద్వారా జాషువ సమాజంలోని ఆర్థిక అంతరువులను, వాటి మధ్య బతుకుతున్న మనుషులలోని మంచి చెడ్డలను ఆవిష్కరించారు. దీనికోసం ఆయన మూడు సంఘటనలను చిత్రించారు.
మొదటిది: అనాథ ఒక రాత్రి పూట ఒక ఇంట వసారాలో తలదాచుకుంటుంది. తెల్లవారగానే ఆ యింట్లోంచి ఒకమ్మాయి కళ్ళాపు చల్లడానికి బయటకు వస్తుంది.
ఓసీ యెవ్వతెవీవు? నీ మగని సొమ్మన్నట్లు
పాపిష్ఠు రా
లా! సంసారము బెట్టినావు మొగసాలన్ లేచి
పొమ్మంచు
ఆమె నీటి చెంబును కాలితో తన్ని తరిమేస్తుంది. ఆమె వెళ్ళి ఒక చెట్టుకింద కూర్చుంటుంది. అప్పుడు పక్కింటి స్త్రీ వచ్చి, ఒక పెళ్ళి ఉందనీ, ఆక్కడికి పోతే బాగా తిండి దొరుకుతుందనీ చెప్పి, తన దగ్గరున్న చద్దన్నం కొంచెం పెడుతుంది.
రెండవది: ఆమె పెళ్ళి జరిగే చోటికి బయలుదేరుతుంది. అప్పటికే పంగనామాలు పెట్టుకొని, పట్టు పంచెలు కట్టుకున్న వాళ్ళు వెళ్తూ వుంటారు. వాళ్ళు అనాథను చూచి చీదరించుకుంటారు. ఆమె వాళ్ళకు దండంబెట్టి పక్కకు తప్పుకుంటుంది. పెండ్లి ఇంటి దగ్గర ఒక చెట్టుకింద కూర్చుంటుంది. ఆ సమయంలో ఒక సైకిల్ కుర్రాడు వచ్చి ఆమెను, ఆమె చంక బిడ్డను దొర్లించేసి, ఆమెను తిట్టి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు గానీ ఒక్కరూ దగ్గరికి వచ్చి ఆమెను లేవనెత్తే ప్రయత్నం చేయలేదు. ఒక మేడమీద సరసాలాడుకుంటున్న దంపతులు, ఆ దృశ్యాన్ని చూచి తమకేమీ పట్టనట్టు తమ ఆనందంలో మునిగిపోతారు. అప్పుడు ఒక యువకుడు వచ్చి ఆమెను లేపి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. దీనిని గమనించిన అమ్మలక్కలు అతని భార్యకు చెప్పి దెప్పిపొడుస్తారు.
ఓ లలనా! నీ మగండొక
మాలది పడిపోవ నంటి మైలవడియె వై
ద్యాలయము జేర్చినాడిక
నీలాగున నయిన గుడియనెడమయు లేదె?
అని వ్యాఖ్యానించి ఆమెకు ‘‘త్రాపి రెలమి క్రోధరసము’’. ఆ యువకుడు ఇంటికి రాగానే ఆమె స్నానం చేసి గాని ఇంట్లోకి రావద్దంటుంది. ఆయన స్నానం చేసి, భార్యను సమీపించి
అలుక శమించెనా జలకమాడిన యంతనె?
మాలదాని పిల్లల కడగండ్లు చూచి బహుళంబుగ
దాప్తమునందు నామనో
జలజము మైలవడ్డదాది స్నానము చేసెనె?
వెఱిదాన! యీ
వెలుపలి శుద్ధి జీవులకు బెట్టునె? పోయునె?
ముక్తినిచ్చునె?
అని తీవ్రంగా ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు అంటు జాడ్యంతో బాధపడుతున్న అతని భార్య దగ్గర సమాధానం లేదు.
అతను మరునాడు పోయి అనాథ పిల్లల్ని అనాథ శరణాలయంలో చేర్పిస్తాడు.
మూడవది: ఒక రోజు బాగా వర్షం కురుస్తున్నది. అనాథ ఒక చావడిలోకి వెళ్తుంది. అక్కడ ఒకడు తన పెంపుడు కుక్కను పెట్టుకొని ఉన్నాడు. అనాథను చూడగానే ‘పంచనంటుకొన్నావటే’ అని అరచి వెళ్లమంటాడు. అప్పుడు అతని భార్య వస్తుంది. ఆమె దయాళువు.
ఎవరైననేమి? రక్షణ
మవశ్య కర్తవ్యమే కదా? నరులకు, ధ
ర్మువునకు గలుగునే కుల
వివక్షతము జిన్నపెద్ద భేదము నాథా!
అని బుద్ధి చెబుతుంది. ఈ మూడు సందర్భాలలో దళితేతరులు అనాథ పట్ల కొందరు మానవత్వంతోనూ, మరికొందరు అమానుషంగానూ ప్రవర్తించినట్లు చిత్రించారు జాషువ. ఈ కావ్యం రాసేనాటికి జాషువ భావవాదిగానే ఉన్నాడు. భగవంతుడు పేదవాళ్ళ వైపే ఉంటాడు అన్న అవగాహనతో ఉన్నాడు.
పరుల దుర్గతిగని గుండెగఱిగి వగచు
సదాయసహృదయుల వీక్షణాంచలమునందు
బుట్టుచుండును కన్నీటి బొట్టు్టవోలె
ఏడి భగవంతుడని సంశయింతు వేల?’’
ఈ అంశాన్ని చెప్పడానికి జాషువ ఈ కావ్యం రాశాడేమో అనిపిస్తుంది.
అనాథకు ఆరుగురు పిల్లలనీ, ఆమె భర్త చివరి బిడ్డ పురిటిలో ఉండగానే మరణించాడనీ చెబుతూ, అది ‘నలువ సేయు విలాసమేమొ’ అని వ్యాఖ్యానించారు. సైకిల్ కుర్రాడు అనాథనూ, ఆమె చంకలో బిడ్డనూ దొర్లించి, ఆమెను తిట్టి వెళ్ళిపోతాడు. అనాథకు దెబ్బలు తగిలి రక్తం కారుతుంది, కాని చిన్న బిడ్డకు ఏమీ కాదు. ఈ సందర్భంలో కూడా కవి దేవుడి ఉనికిని చాటి చెప్పాడు.
ఓయి నాస్తికుడా! వినుమొక్కమాట
అరసి యుందువు ఘోర దృశ్యంబు నిచట
మృత్యుదేవత కోఱలు మెఱయునపుడు
శిశువునేమహాశక్తి రక్షించెనోయి!
గబ్బిలం కాలం నాటికి ఈ విశ్వాసాల పట్ల జాషువకు అనుమానాలు మొలకెత్తాయి. సాంఘిక, ఆర్థిక అసమానతలను గుర్తించాడు జాషువ ఇందులో. అయితే, ఇందుకు కారణాలను, ఆ అసమానతలను నడిపిస్తున్న తాత్విక విశ్వాసాలను అనుమానించే దశకు చేరలేదు. అప్పటికి జాషువ పరిమితి ఇది!
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
9440222117