డాక్టర్ శాంతి నారాయణ
జీవితాన్ని వెతుక్కునే దశ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకునే దశకు శాంతి నారాయణ ఎదగడం నల్లేరు మీద బండి నడకలా సాగలేదు. ‘నీ కొడుక్కి చదు వెందుకు, కూలికి పంపించు’ అనిపించుకున్న దశ నుంచి ఎంఏ, పీహెచ్‌డీ చేసే దశకు శాంతి నారాయణ ప్రయాణం సునాయాసంగా జరగలేదు. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమా నతలను అనుభవించే దశ నుంచి, వాటిని నిర్మూలించాలనే రచనలు చేసే దశకు ఆయన చేరడం చిన్నపని కాదు. అదొక సంఘర్షణ. అదొక సమరం. బాల్యంలో తగిలిన గాయాలను స్వయంకృషితో, సహృదయుల చేయూతతో మాన్పుకుంటూ, మాన్పుకుంటూ గాయాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా సాహిత్య సృష్టి చేస్తున్న రచయిత డాక్టర్ శాంతి నారాయణ.
డెబ్భై అయిదేళ్ళ వయసుగల (1946) శాంతి నారాయణకు 50 ఏళ్ళ సాహిత్య జీవితం (1972–2022) ఉంది. ఆయన కవి, కథా రచయిత, నవలా రచయిత, ఫీచర్ రచయిత. జీవితాన్ని వెతు క్కుంటూ, 50 ఏళ్ళలో అనేక సామాజిక, సాహిత్య కార్యకలాపాల్లో నిమగ్నమౌతూ, యాభై ఏళ్ళలో అసంఖ్యాక రచనలు చేసిన నిబద్ధత, నిమగ్నత గల రచయిత. శాంతి నారాయణ జీవితం మూడు ముఖాలుగా సాగుతున్నది. 1. వ్యక్తిగత జీవితం. 2. సామాజిక జీవితం. 3. సాహిత్య జీవితం. శాంతి నారాయణ వ్యక్తిగత జీవితంలో కుల వ్యతిరేకి. లౌకిక వాది. భౌతికవాది. తాను కులాంతర వివాహం చేసుకోవడమేగాక, తన సంతానానికీ కులాం తర వివాహాలు చేశారు. ఈ విషయంలో ఆయన చాలామంది మహా మహులను వెనక్కి నెట్టేశారు. రచయితగా శాంతినారాయణ గత అయిదు దశాబ్దాలలో 16 పుస్తకాలు ప్రచురించారు. ఆయన అవధాని కాబోయి ఆధునిక రచయిత కావడం గుర్తించదగిన విశేషం.
1972లో ‘రక్తపు ముద్ద పిలిచింది’ అనే కథా సంపుటి ప్రచురణతో ఆయన సాహిత్య జీవితం మొదలై, 2022లో ‘ముడి’, ‘సాధన’ అనే రెండు నవలల ప్రచురణ దాకా వచ్చింది. ఈ మధ్యలో ‘నడిరేయి నగరం’(1978), ‘కొత్త అక్షరాలమై’ (2017) అనే కావ్యాలూ; ‘రస్తా’ (1976), ‘పల్లేరు ముళ్ళు’ (1998), ‘నమ్ముకున్న రాజ్యం ’(2004), ‘కొండచిలువ’ (2016), ‘బతుకుబంతి’ (2017) కథల సంపుటాలు; ‘మాధురి’ (1980), ‘పెన్నేటి మలుపులు’ (2001) వంటి నాలుగు నవలలు; ‘నాలుగు అస్తిత్వాలు–నాలుగు నవలికలు’ అనే గ్రంథం; ‘నాగల కట్ట సుద్దులు’ అనే ఫీచర్ రచన రెండు సంపుటాలు ప్రచురించారు.
శాంతి నారాయణ అనంతపురం జిల్లా సామాజిక రంగంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 1989కి ముందు రాయదుర్గంలో పనిచేస్తున్నప్పుడు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురంకు బదిలీ అయ్యాక 1989–2002 మధ్య ‘జిల్లా రచయితల సంఘం’ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఆయన అనేక విలువైన కార్యక్రమాలు నిర్వహించారు. ఏళ్ళతరబడి నిద్రా వస్థలో ఉండిపోయిన జిల్లా రచయితల సంఘాన్ని పునరుజ్జీవింప జేయడంలో శాంతినారాయణ చురుకైన పాత్ర నిర్వహించారు. తెలుగు నవల వచ్చి 116 ఏళ్ళ చరిత్ర పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సు చరిత్రాత్మకమైనది.
2002–2004 మధ్య అనంతపురం జిల్లాను కరువు అతలాకుతలం చేసినప్పుడు అనంతపురం జిల్లా రచయితలు, కళాకారులు, మేధావులు చేసిన కరువు అధ్యయన యాత్ర, రైతు ఆత్మవిశ్వాస యాత్రల్లో శాంతి నారాయణ భాగస్వామి అయ్యారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం తరఫున ‘వొరుపు’ అనే కవిత్వ సంకలనాన్నీ, ‘ఇనుప గజ్జెల తల్లి’ అనే కథల సంకలనాన్నీ సంపా దకత్వం వహించి ప్రచురించారు. అలాగే అనంతపురం జిల్లాలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు దళిత సంఘీభావం సమితి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలలో ఆయన పాల్గొన్నారు.
తాను రచనలు చేయడమే కాకుండా, ‘విమలా శాంతి సామాజిక సాహిత్య సేవా సమితి’ స్థాపించి 2006 నుండి, 17 ఏళ్ళుగా, కవులు, కథా రచయితలకు పురస్కారాలిస్తున్నారు. ఇవాళ ప్రసిద్దిగాంచిన రచయితలుగా పేరు పొందిన వాళ్ళలో చాలామంది ఆయన పురస్కారాలు తీసుకున్నవారే. అంతేగాక, విమలా శాంతి జీవిత సాఫల్య పురస్కారం స్థాపించి మొదటిసారిగా, 2021లో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డికి ఇచ్చారు. ఇది శాంతి నారాయణ బహుముఖీన జీవితం. (క్లిక్ చేయండి: తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!)
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు
(నవంబర్ 1న డాక్టర్ శాంతి నారాయణకు‘వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార’ప్రదానం)
Comments
Please login to add a commentAdd a comment