రైటర్స్ మీట్‌లో పాల్గొన్న రచయితలు
‘తెలుగులో ఇంత వరకూ బెస్తవారి మీద మంచి నవల లేదు. ఆ నవల బెస్త సమూహంలోని రచయిత నుంచే రావాలి. నేను ఆ వెలితిని పూడ్చాలనుకుంటున్నాను’ అన్నాడు ప్రసాద్ సూరి. ఇతను హైదరాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. ఇప్పటికే రెండు నవలలు రాశాడు. ‘మా చిత్తూరులోని బహుదా నది ఎండిపోతే ఏడుస్తాను. ప్రవహిస్తే నవ్వుతాను. దాని చుట్టుపక్కల జీవితాలను కథలుగా రాస్తాను’ అన్నాడు సుదర్శన్. ఇతనికి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ‘బహుదా కథలు’ అనే పుస్తకం వెలువరించాడు. ‘మా పార్వతీపురంలో నా వయసు రచయితలు ఎవరూ లేరు. ఇప్పటి కాలంలో నాతోనే మా ప్రాంతంలో మళ్లీ కథలు మొదలయ్యాయి’ అంటాడు భోగాపురం చంద్రశేఖర్. ‘రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, కరువు అనుకోవద్దు. ఆకాశం ఉంది. ప్రేమ ఉంది. ఆప్యాయతలు ఉన్నాయి. అవి నేను రాస్తు న్నాను’ అన్నాడు సురేంద్ర శీలం. రెండు రోజుల ‘శీతాకాల కథా ఉత్సవం’లో యువ రచయితల మాటలు ఇవి.
ప్రతి ఏటా జరుగుతున్న ట్టుగానే ఈ సంవత్సరం ‘రైటర్స్ మీట్’ ఆధ్వర్వంలో హైదరాబాద్ సమీపాన శామీర్‌పేటలో ‘ల్యాండ్ ఆఫ్ లవ్’ సౌందర్య క్షేత్రంలో నవంబర్ 26, 27 తేదీలలో 50 మంది రచయితలు, విమర్శకులు, పాఠకులు ‘శీతాకాల కథాఉత్సవం’లో పాల్గొన్నారు. వీరిలో అందరినీ ఆకట్టున్నది యువ రచయితలే. ఐటీ రంగంలో పని చేస్తూ కథలు రాస్తున్న శ్రీ ఊహ, అంట్రప్రెన్యూర్‌గా ఉంటూ కథను ప్రేమించే రుబీనా పర్వీన్, స్త్రీల సమస్యలను ప్రస్తావించే నస్రీన్ ఖాన్, విజయవాడ కథకుడు అనిల్ డ్యాని, తెలంగాణ కథను పరిశోధించిన దేవేంద్ర... ఇక కుల వివక్షను, పేదరికాన్ని అధిగమించి రచయితగా ఎదిగిన యాకమ్మ ప్రయాణం అందరి చేత కంటతడి పెట్టించింది.
స్పార్క్ ఉన్న వర్ధమాన రచయితలను వెతికి ఆహ్వానాలు పంపడం రైటర్స్ మీట్ ప్రత్యేకత. వారిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయటంతో పాటు సీనియర్ రచయితలచే కథారచనలో మెళకువలను నేర్పుతారు ఈ శిబిరంలో. రచయితల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించి ఒకరికి ఒకరు దోహదపడేలా చేయడం కూడా రైటర్స్ మీట్ ఉద్దేశాలలో ఒకటి.
ఈ సంవత్సరం జరిగిన రైటర్స్ మీట్‌లో ప్రముఖ రచయితలు వి.రాజా రామమోహనరావు, వాడ్రేవు చినవీరభద్రుడు, అయోధ్యా రెడ్డి కథా రచనలో తమ అనుభవాలను పంచారు. ఖాన్ యజ్దానీ, జి.వెంకట కృష్ణ, రమణమూర్తి, ఆదిత్య కొర్రపాటి కథావిమర్శ చేశారు. మలయాళ భాష రచయితలు బుకర్ ప్రైజ్ వరకూ ఎదుగుతుంటే తెలుగులో ఎవరూ అంతవరకు ఎందుకు పోవడం లేదన్న ప్రశ్న వచ్చింది. ‘కథను ఏ రచయితైనా చదివిస్తాడు. కానీ రెండోసారి పాఠకుడు ఆ కథను చదవాలంటే అందులో ఏం ఉండాలి’ అనే ప్రశ్న ఆలోచనల్లో పడేసింది.
కథకులకు ఉండాల్సిన దృక్పథం గురించి ఖాన్ యజ్దానీ మాట్లాడితే, ‘కథలు రాయండి. ప్రవక్తలుగా మారకండి. రాస్తూ వెళ్లడమే మీ పని’ అన్నారు అయోధ్యా రెడ్డి. వి.రాజా రామమోహనరావు యువతరాన్ని భయపడవద్దనీ, నచ్చినట్టు రాయమనీ సలహా ఇచ్చారు. పాల్గొన్న ప్రతివారు తమ రచనల నేపథ్యాన్నో, రాయవలసిన కథాంశాలనో స్పృశించారు. కరుణ కుమార్, మహి బెజవాడ, సాయి వంశీ తదితరులు తాము ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారో తెలియ చేశారు. చాలా ఆలస్యంగా కథా రచన ఆరంభించిన మారుతి పౌరోహిత్యం, చిలు కూరు రామశర్మ తమ రచనలను చెప్పిన తీరు ఆకర్షణీయమే. పాఠకులుగా విచ్చేసిన శుభశ్రీ, దేవిరెడ్డి రాజేశ్వరి లోతు తక్కువ కథలు రావడానికి రచయితలు తగినంతగా చదవకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..)
శీతాకాల కథా ఉత్సవాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించడంలో భాగంగా ఈసారి రఘు మందాటి ఫొటో ఎగ్జిబిషన్ ‘థండర్ డ్రాగన్’, శ్రీపాల్ సామా దర్శకత్వం వహించిన ‘హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే’ సినిమా ప్రదర్శన, రచయిత్రి ఝాన్సీ పాపుదేశి కథల పుస్తకం ‘దేవుడమ్మ’ ఆవిష్కరణ ఆకర్షణలుగా నిలిచాయి. కథా రచన పట్ల కొత్త కమిట్మెంట్‌ను, కథకుల మధ్య కొత్త బాండింగ్‌ను ఏర్పరచిన ఈ రైటర్స్ మీట్ సమావేశాలు కొత్త తరానికి నూతనోత్సాహాన్ని పంచే కాంతిపుంజాలు. (చదవండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!)
- సి.ఎస్. రాంబాబు
ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి, రచయిత
Comments
Please login to add a commentAdd a comment