Yakamma
-
Writers Meet 2022: కొత్త రచయితల గట్టి వాగ్దానం
‘తెలుగులో ఇంత వరకూ బెస్తవారి మీద మంచి నవల లేదు. ఆ నవల బెస్త సమూహంలోని రచయిత నుంచే రావాలి. నేను ఆ వెలితిని పూడ్చాలనుకుంటున్నాను’ అన్నాడు ప్రసాద్ సూరి. ఇతను హైదరాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. ఇప్పటికే రెండు నవలలు రాశాడు. ‘మా చిత్తూరులోని బహుదా నది ఎండిపోతే ఏడుస్తాను. ప్రవహిస్తే నవ్వుతాను. దాని చుట్టుపక్కల జీవితాలను కథలుగా రాస్తాను’ అన్నాడు సుదర్శన్. ఇతనికి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ‘బహుదా కథలు’ అనే పుస్తకం వెలువరించాడు. ‘మా పార్వతీపురంలో నా వయసు రచయితలు ఎవరూ లేరు. ఇప్పటి కాలంలో నాతోనే మా ప్రాంతంలో మళ్లీ కథలు మొదలయ్యాయి’ అంటాడు భోగాపురం చంద్రశేఖర్. ‘రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, కరువు అనుకోవద్దు. ఆకాశం ఉంది. ప్రేమ ఉంది. ఆప్యాయతలు ఉన్నాయి. అవి నేను రాస్తు న్నాను’ అన్నాడు సురేంద్ర శీలం. రెండు రోజుల ‘శీతాకాల కథా ఉత్సవం’లో యువ రచయితల మాటలు ఇవి. ప్రతి ఏటా జరుగుతున్న ట్టుగానే ఈ సంవత్సరం ‘రైటర్స్ మీట్’ ఆధ్వర్వంలో హైదరాబాద్ సమీపాన శామీర్‌పేటలో ‘ల్యాండ్ ఆఫ్ లవ్’ సౌందర్య క్షేత్రంలో నవంబర్ 26, 27 తేదీలలో 50 మంది రచయితలు, విమర్శకులు, పాఠకులు ‘శీతాకాల కథాఉత్సవం’లో పాల్గొన్నారు. వీరిలో అందరినీ ఆకట్టున్నది యువ రచయితలే. ఐటీ రంగంలో పని చేస్తూ కథలు రాస్తున్న శ్రీ ఊహ, అంట్రప్రెన్యూర్‌గా ఉంటూ కథను ప్రేమించే రుబీనా పర్వీన్, స్త్రీల సమస్యలను ప్రస్తావించే నస్రీన్ ఖాన్, విజయవాడ కథకుడు అనిల్ డ్యాని, తెలంగాణ కథను పరిశోధించిన దేవేంద్ర... ఇక కుల వివక్షను, పేదరికాన్ని అధిగమించి రచయితగా ఎదిగిన యాకమ్మ ప్రయాణం అందరి చేత కంటతడి పెట్టించింది. స్పార్క్ ఉన్న వర్ధమాన రచయితలను వెతికి ఆహ్వానాలు పంపడం రైటర్స్ మీట్ ప్రత్యేకత. వారిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయటంతో పాటు సీనియర్ రచయితలచే కథారచనలో మెళకువలను నేర్పుతారు ఈ శిబిరంలో. రచయితల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించి ఒకరికి ఒకరు దోహదపడేలా చేయడం కూడా రైటర్స్ మీట్ ఉద్దేశాలలో ఒకటి. ఈ సంవత్సరం జరిగిన రైటర్స్ మీట్లో ప్రముఖ రచయితలు వి.రాజా రామమోహనరావు, వాడ్రేవు చినవీరభద్రుడు, అయోధ్యా రెడ్డి కథా రచనలో తమ అనుభవాలను పంచారు. ఖాన్ యజ్దానీ, జి.వెంకట కృష్ణ, రమణమూర్తి, ఆదిత్య కొర్రపాటి కథావిమర్శ చేశారు. మలయాళ భాష రచయితలు బుకర్ ప్రైజ్ వరకూ ఎదుగుతుంటే తెలుగులో ఎవరూ అంతవరకు ఎందుకు పోవడం లేదన్న ప్రశ్న వచ్చింది. ‘కథను ఏ రచయితైనా చదివిస్తాడు. కానీ రెండోసారి పాఠకుడు ఆ కథను చదవాలంటే అందులో ఏం ఉండాలి’ అనే ప్రశ్న ఆలోచనల్లో పడేసింది. కథకులకు ఉండాల్సిన దృక్పథం గురించి ఖాన్ యజ్దానీ మాట్లాడితే, ‘కథలు రాయండి. ప్రవక్తలుగా మారకండి. రాస్తూ వెళ్లడమే మీ పని’ అన్నారు అయోధ్యా రెడ్డి. వి.రాజా రామమోహనరావు యువతరాన్ని భయపడవద్దనీ, నచ్చినట్టు రాయమనీ సలహా ఇచ్చారు. పాల్గొన్న ప్రతివారు తమ రచనల నేపథ్యాన్నో, రాయవలసిన కథాంశాలనో స్పృశించారు. కరుణ కుమార్, మహి బెజవాడ, సాయి వంశీ తదితరులు తాము ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారో తెలియ చేశారు. చాలా ఆలస్యంగా కథా రచన ఆరంభించిన మారుతి పౌరోహిత్యం, చిలు కూరు రామశర్మ తమ రచనలను చెప్పిన తీరు ఆకర్షణీయమే. పాఠకులుగా విచ్చేసిన శుభశ్రీ, దేవిరెడ్డి రాజేశ్వరి లోతు తక్కువ కథలు రావడానికి రచయితలు తగినంతగా చదవకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) శీతాకాల కథా ఉత్సవాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించడంలో భాగంగా ఈసారి రఘు మందాటి ఫొటో ఎగ్జిబిషన్ ‘థండర్ డ్రాగన్’, శ్రీపాల్ సామా దర్శకత్వం వహించిన ‘హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే’ సినిమా ప్రదర్శన, రచయిత్రి ఝాన్సీ పాపుదేశి కథల పుస్తకం ‘దేవుడమ్మ’ ఆవిష్కరణ ఆకర్షణలుగా నిలిచాయి. కథా రచన పట్ల కొత్త కమిట్మెంట్ను, కథకుల మధ్య కొత్త బాండింగ్‌ను ఏర్పరచిన ఈ రైటర్స్ మీట్ సమావేశాలు కొత్త తరానికి నూతనోత్సాహాన్ని పంచే కాంతిపుంజాలు. (చదవండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - సి.ఎస్. రాంబాబు ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి, రచయిత -
యాకమ్మ ఒక గొప్ప వెలుగు
తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. ఎం.ఏ సంస్కృతం చేసింది. ఆ సమయంలో కథలు చదివి తన బతుకు గోస కూడా కథలుగా రాయాలనుకుంది. రెండు కథాసంపుటాలు, ఒక నవల వెలువరించింది. ‘చదువుకుంటే ఏమవుతుందో నన్ను చూసైనా నా జాతి ఆడపిల్లలు తెలుసుకోవాలని నా తపన’ అంటున్న యాకమ్మ పరిచయం. ‘దళిత ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆర్థికంగా గట్టిగా నిలబడాలి. ఆ తర్వాత రాజకీయ అధికారం కోసం ప్రయత్నించి పదవులు పొంది దళితుల కోసం, పేదల కోసం పని చేయాలి’ అంటారు యాకమ్మ. ఆమె ‘కెరటం’ అనే దళిత నవల రాశారు. అందులోని మల్లమ్మ అనే దళిత మహిళ పాత్ర అలాగే ప్రస్థానం సాగిస్తుంది. కష్టపడి చదువుకుని, ఉద్యోగం పొంది, ఆ తర్వాత సవాళ్లను ఎదుర్కొని సర్పంచ్ అయ్యి, ఆ తర్వాత ఎం.ఎల్.ఏ. అవుతుంది. ‘ప్రజలు’ ఎప్పుడూ ప్రజలుగానే ఉండిపోవడం ఏ కొద్దిమంది మాత్రమే ఎం.ఎల్.ఏనో ఎం.పినో అవ్వాలనుకోవడం ఎందుకు అని యాకమ్మ ప్రశ్న. యాకమ్మది వరంగల్ జిల్లా మహబూబాబాద్. అక్కడికి దగ్గరగా ఉన్న అన్నారంలోని యాకూబ్ షా వలీ దర్గాలో మొక్కుకుంటే పుట్టిందని తల్లిదండ్రులు యాకమ్మ అని పేరు పెట్టారు. ఇంటికి పెద్ద కూతురు యాకమ్మ. ఇంకో చెల్లి. తండ్రి మాదిగ కులవృత్తిని నిరాకరించి దొర దగ్గర జీతానికి పోయేవాడు. తల్లి కూలి పని చేసేది. ఇద్దరూ కూడా తమకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమలాంటి జీవితం కాకుండా మంచి జీవితం చూడాలని అనుకునేవారు. ముఖ్యంగా తల్లి అబ్బమ్మ తన కూతుళ్లను బాగా చదివించాలనుకునేది. యాకమ్మ కూడా అందుకు తగ్గట్టే చదువును ఇష్టపడేది. అక్కడ పదోతరగతి దాటితే పెళ్లి చేయడం ఆనవాయితీ. యాకమ్మ ఇంటర్‌కు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. యాకమ్మ తల్లిదండ్రులను, భర్తను అడిగింది ఒక్కటే– పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వమని. మంచినీళ్లు తాగి పెళ్లయ్యాక అత్తగారింట యాకమ్మకు చదువు వీలయ్యేది కాదు. భర్త వీరాస్వామి డ్రైవర్‌గా పని చేసేవాడు. అతని తోబుట్టువుల రాకపోకలు ఉండేవి. సంపాదన చాలక తినడానికి కూడా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన రెండు జతల బట్టలతోనే కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది యాకమ్మ. లంచ్బెల్లో స్నేహితురాళ్లు లంచ్ చేస్తుంటే దూరంగా చెట్టు కింద కూచుని మంచినీళ్లు తాగి మళ్లీ తరగతులకు వచ్చేది. ఆకలి ఉన్నా చదువు ఆపలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా చదువు ఆపలేదు. తెలుగులో పీహెచ్డీ యాకమ్మ కాకతీయ యూనివర్సిటీలో పి.జి. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. చేసింది. తెలుగు పండిట్‌గా ఉద్యోగం రావడంతో పిల్లలకు పాఠాలు చెప్పాలంటే సంస్కృతం కూడా తెలిసి ఉండాలని సంస్కృతంలో పి.జి. చేసింది. ఆ సమయంలోనే తన గైడ్ బన్న ఐలయ్య ద్వారా సాహిత్యం తెలిసింది. కథలు చదివే కొద్దీ తన జీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి ఎందుకు రాయకూడదు అనిపించింది. కాని ఎలా రాయాలో తెలియదు. అయినా సరే ప్రయత్నించి రాసింది. ‘కథలు రాస్తున్నాను’ అని వారికీ వీరికీ చెప్తే ‘ఈమె కూడా పెద్ద రచయితనా? ఈమెకు ఏం రాయవచ్చు’ అని హేళన చేశారు. కానీ వాళ్లే ఆ తర్వాత ఆమె రచనలను అంగీకరించారు. యాకమ్మ కుమార్తె ఎం.బి.బి.ఎస్ చేస్తోంది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. భర్త అనారోగ్యం వల్ల పని తగ్గించుకున్నాడు. ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటూనే కథను విడవకుండా సాధన చేస్తోంది యాకమ్మ. చదువుకుంటే జీవితాలు మారతాయని తనను చూసి తెలుసుకోండి అని అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు ఆమె మాటల ద్వారానో కథల ద్వారానో చెప్తూనే ఉంటుంది. ‘ఆడపిల్లలు చదువుకోవాలి. సమాజాన్ని మార్చాలి. పెళ్లి పేరుతోనో డబ్బులేదనో వారిని చదువుకు దూరం చేయొద్దు’ అంటుంది యాకమ్మ. ఆమె చీకట్లను తరిమికొట్టడానికి విద్యను, సాహిత్యాన్ని ఉపయోగిస్తోంది. యాకమ్మ ఒక గొప్ప వెలుగు. రెండు సంపుటాలు యాకమ్మ 2018 నుంచి రాయడం మొదలుపెట్టింది. కథ వెంట కథ రాసింది. ‘మమతల మల్లెలు’, ‘రక్షణ’ అనే రెండు సంపుటాలు వెలువరించింది. ఆ తర్వాత దళిత నవల ‘కెరటం’ రాసింది. తన జీవితం నుంచి తాను చూసిన జీవితాల నుంచి కథలను వెతికింది. వెతలు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో వరుసపెట్టి కథలు రాసి ‘దుఃఖ నది’ అనే సంకలనం తెచ్చింది. వెక్కిరించిన వాళ్లు, వివక్ష చూపిన వారు మెల్లగా సర్దుకున్నారు. వరంగల్ జిల్లా మొత్తం ఇప్పుడు యాకమ్మ అంటే ‘కథలు రాసే యాకమ్మేనా’ అని గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ఇదీ యాకమ్మ ఘనత. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నమ్మి ఆశ్రయమిస్తే.. నడిరాత్రి దోచుకెళ్లింది
14 తులాల బంగారం, 90 తులాల వెండి ఆభరణాల అపహరణ హసన్‌పర్తి : వృద్ధురాలు నమ్మి ఓ యువతికి తన ఇంట్లో ఆశ్రయమిస్తే.. అర్ధరాత్రి వేళ ఆ అగంతకురాలు సొత్తు దోచుకెళ్లింది. కొద్దిసేపు తలదాచుకుంటానని ఇంట్లోకి వచ్చి వృద్ధురాలికి సంబంధించిన సుమారు 14 తులాల బంగారం, 90 తులాల వెండి, రూ.12,500 నగదు ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన ఉప్పుల యాకమ్మ, ముత్తయ్య దంపతులు హసన్‌పర్తిలోని కేశవాపూర్ రోడ్డులో నివాసముంటున్నారు. వారిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఓ యువతి ఇద్దరు పిల్లలతో వారింటికి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగింది. ఇల్లు ఖాళీ లేదని యూకమ్మ చెప్పడంతో ఆ యువతి వెళ్లిపోరుుంది. ఆ యువతి తిరిగి రాత్రి 8 గంటలకు మళ్లీ వారింటికి చేరుకుంది. అప్పడు మాత్రం ఆమెతో ఇద్దరు పిల్లలు లేరు. ఆమె తలుపు తట్టడంతో యాకమ్మ తలుపు తెరిచి ఎవరని ప్రశ్నించగా తనకు అద్దెకు ఇల్లు దొరికిందని, సామాను కూడా రూమ్‌కు తీసుకొచ్చానని చెప్పింది. అయితే తన భర్త వచ్చేవరకు ఆలస్యమవుతుందని, ఇక్కడికి వచ్చానని నమ్మిం చింది. తన భర్త వస్తే వెళ్లిపోతానని, లేదంటే పొద్దున్నే వెళ్తానని చెప్పడంతో ఆ వృద్ధురాలు సరేనంది. రాత్రి 11 గంటల వరకు మాట్లాడిన యూకమ్మ తన సంచిని తీసి పక్కన పెట్టి నిద్రించింది. అదే సమయంలో ఆ యువతి కూడా నిద్రపోతున్న ట్లు నటించింది. అర్ధరాత్రి 12.30 గంటలకు యూకమ్మకు మెలకువ వచ్చి చూడగా అక్కడ ఆ యువతి కనిపించలేదు. పక్కనే బంగారం, వెండి, డబ్బులు దాచ్చుకున్న డబ్బా తాళం తెరిచి ఉంది. దీంతో ఆందోళనకు గురైన యాకమ్మ డబ్బాను పరిశీలించగా బంగారం, వెండి, డబ్బులు కనిపించలేదు. ఒక్కసారిగా షాక్‌కు గురైన వృద్ధురాలు లబోదిబోమంటూ బోరున ఏడుస్తుండగా చుట్టుపక్కల వారు విని అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిం చారు. బుధవారం ఉదయం ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై ఉపేందర్‌రావు సంఘటన స్థలాన్ని చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వృద్ధురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం హసన్పర్తికి చెందిన ఓ విద్యార్థినికి సంబంధించిన బంగారు గొలుసును ఈ యువతే తస్కరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అద్దె ఇల్లు కోసం సంచరించిన యువతి సదరు యువతి మూడు ప్రాంతాల్లో అద్దె ఇల్లు కావాలని తిరిగి నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ప్రాంతంలోని పావుశెట్టి సాంబయ్య ఇంటికి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగినట్లు వారు తెలిపారు. అలాగే వీసం వాడకు వెళ్లి అద్దె ఇల్లు కోసం వెతికినట్లు ఆ కాలనీవాసులు వివరించారు. గాంధీనగర్‌లో కూడా ఆ యువతి సంచరించినట్లు చెప్పారు.