పుస్తక నేపథ్యం
చారిత్రక ఘట్టాలను నవలీకరించే ప్రయత్నం మనకు తక్కువ. స్వాతంత్య్రోద్యమం ఇతివృత్తంగా ‘తమస్’(భీష్మ సహానీ), ‘కొల్లాయి గట్టితేనేమి..!’ (మహీధర), ‘ప్రజల మనిషి’ (వట్టికోట) వంటి నవలలు; మంటో, గుల్జార్, ఇస్మత్ చుగ్తాయ్, కుష్వంత్‌సింగ్ వంటి వారి కథలైనా వచ్చాయి. ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగినదని చెప్పే మన స్వరాజ్య పోరాటం మీద అసాధారణమైన నవలేదీ అంటే సమాధానం రాదు. అలాగే వెయ్యేళ్ల దాస్యం తరువాత స్వాతంత్య్రం తెచ్చుకున్న జాతి తొలి అడుగులలో తడబాటు, సంఘర్షణ కనిపిస్తాయి. స్వతంత్ర భారత రాజకీయ నాయకత్వం భ్రమలలో గడిపేయడం ఆ దశలో చేదు నిజం. ఘనమైన స్వాతంత్య్ర పోరాటం ద్వారా సంక్రమించాయనుకున్న విలువలు తొలి ఎన్నికలలోనే వలువలు విప్పేసుకోవడం వంటి వాస్తవాలను రచయితలు స్వీకరించలేదు. ఆ విజయాలనూ, ఈ వైఫల్యాలనూ కళ్లకు కట్టే నవల పీవీ నరసింహారావు ‘ది ఇన్‌సైడర్’ (‘లోపలి మనిషి’; అనువాదం: కల్లూరి భాస్కరం). కానీ ఈ నవలకు తెలుగునాట రావలసినంత ఖ్యాతి రాలేదు; 20వ శతాబ్దంలో అనువాదకులు తెనిగించిన గొప్ప గ్రంథాలలో ఇదొకటని నా నమ్మకం. మరికొద్దిమందినైనా ఆ నవల చదివేలా పురిగొల్పేందుకు అందులోని భిన్న కోణాల్ని ఏడు వ్యాసాలుగా మలిచాను.
పీవీ ఈ నవలలో స్పృశించిన అంశాలు ఎన్నో. నేను పరిశీలించినవి కేవలం ఏడు. రైతాంగ పోరాట తెలంగాణ, అందులోని వైరుధ్యాలు, హిందూ-ముస్లిం సంబంధాలు చెప్పే వ్యాసం ‘లోపలి మనిషిలో తెలంగాణ సామాజిక దృశ్యం’. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తినీ, గాంధీజీ ప్రవచనాలనీ భారతజాతి ఎంత త్వరగా మరచిపోయిందో చెప్పేదే ‘లోపలి మనిషిలో ఎన్నికల చిత్రం’. గొప్పనేతలే అయినా నెహ్రూ, ఇందిరలకీ పరిధులు ఉన్నాయని తీర్పు చెప్పే అంశం ‘లోపలి మనిషి బోనులో నెహ్రూ- ఇందిర’. రాష్ట్రాలు బలహీనపడితే నక్సలిజం వంటి పరిణామాలు తప్పవని సశాస్త్రీయంగా (‘లోపలిమనిషిలో నక్సల్‌బరీ జాడలు’) చెప్పారు పీవీ. ఇలాంటి మలుపులను చారిత్రకంగా అంచనా వేసిన విశిష్ట నవల ఇది. ఈ నవల మీద పరిచయ వ్యాసాలు వెలువరించే అవకాశం నాకు వచ్చింది.
- డాక్టర్ గోపరాజు నారాయణరావు
9849325634