ప్రజల మనిషికి బహువచనమే లోపలి మనిషి
ఏ సాహిత్య ప్రక్రియ అయినా శూన్యం నుంచి రాదు. అది చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూనే, వర్తమానంతో ప్రభావితమవుతూ ఉంటుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’ నవల (ఆంగ్లంలో ‘ది ఇన్సైడర్’, తెలుగు ‘లోపలి మనిషి’, అనువాదం: కల్లూరి భాస్కరం). గాఢమైన జీవితానుభవం, ఇతివృత్తంగా స్వీకరించిన చారిత్రక ఘటనల నుంచి ఉన్మీలనమైన తాత్త్విక కాంతిధార వెంటాడుతూ ఉంటే పీవీ ఈ నవల రాసి సాంత్వన పొందారనిపిస్తుంది. రాజకీయ సంస్థ పరిధిలో ఆయన లోపలి మనిషి. రాజకీయ వంచనతో, విలువల శైథిల్యంతో జాతి కన్న కల భగ్నమైపోతుంటే నిరసన గళం విప్పిన ప్రజల మనిషి కూడా.
శతాబ్దాల పరాయి పాలన నుంచి విముక్తం కావడానికి ఎన్నో స్రవంతులనూ, పంథాలనూ కలుపుకుని పోరాడి గెలిచిన ఒక పురాతన జాతి తొలి అడుగులే తడబడుతుంటే, సంకెళ్లు తెగిపడ్డాయన్న స్పృహ లుప్తమై, కొత్త చరిత్ర నిర్మాణం వైపు కాకుండా, మళ్లీ బానిసత్వ చిహ్నాలను ముద్రించుకోవడానికి తహతహలాడుతూ ఉంటే సహించలేని లోపలి మనిషి, వాటి గురించి ప్రజల మనిషి చేత పలికించడమే ఈ నవల విశిష్ట శైలి. స్వేచ్ఛాభారతంలోనూ దగా పడుతున్న ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్న లోపలి మనిషి, ప్రజల మనిషికి బహువచనంలా వినిపిస్తాడు. లోపలి మనిషి పీవీ. ప్రజల మనిషి ఆనంద్, ఈ నవలానాయకుడు.
ఆగస్ట్ 15, 1947 అనే ఆ ఒక్క తేదీతో సమాన చారిత్రక ప్రాధాన్యమున్న తేదీగా మరొకదానికి పట్టం కట్టడం అసాధ్యం. అదే, అఫ్రోజాబాద్ సంస్థానమైతే ‘1948’ కాలచక్రంలోని ఒకానొక సంవత్సరం కాదు, కొత్త ఉషోదయం. ఈ ఉషస్సుకు ముందుటి అంధకారంలోనే ‘లోపలి మనిషి’ ప్రస్థానం ఆరంభమవుతుంది. భారతదేశమంతటా గాంధీజీ అహింసా సిద్ధాంతంతో భారత జాతీయ కాంగ్రెస్ పరాయి పాలన పునాదులు కదిలిస్తున్నది. అఫ్రోజాబాద్ సముద్రంలో దీవిలా మిగిలింది (562 స్వదేశీ సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్‌కు రచయిత పెట్టిన పేరు). అక్కడ నవాబు ప్రపంచ కోటీశ్వరుడు. కానీ ఒంటి నిండా గుడ్డ ఉన్న పౌరులు అతి తక్కువ. వార్తాపత్రిక, రేడియో నిషిద్ధం.
అయినా కాంగ్రెస్ ఉద్యమ ప్రభావమే కాదు, ఆయుధాన్ని నమ్మిన తీవ్ర జాతీయోద్యమ సెగ సైతం సంస్థానంలోకి ప్రవేశించింది. హఫీజ్ అనే విప్లవకారుడు అందించిన విప్లవ సాహిత్యం, భగత్‌సింగ్ తండ్రికి రాసిన చరిత్రాత్మక లేఖ ఆనంద్‌ను అప్పటికే నిజాం మీద ఆరంభమైన సాయుధపోరు వైపు అడుగులు వేయించాయి.
స్వతంత్ర భారతంలో తొలిపొద్దు సందేశం– దేశానికి స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయనే. ఆపై గాంధీజీ హత్య. తరువాత గొడ్డలి పిడి తత్త్వాన్ని గుర్తు చేస్తూ కశ్మీర్ కోసం పాకిస్తాన్ మొదటి దాడి. నలభై ఆరుశాతం భూభాగంలో విస్తరించి ఉన్న సంస్థానాల విలీనంతో విశాల భారత ఆవిష్కరణ... వరుసగా జరిగాయి.
తరువాత– తొలి సార్వత్రిక ఎన్నికలు. ‘టికెట్లు కోరుకునేవారిలో చాలామందిని ఆకర్షించేది అధికారమే కానీ, మరొకటి కాదని సాధారణ పరిశీలకులకు సైతం తెలిసిన వాస్తవం’(పే 98) అనతికాలంలోనే ఆవిర్భవించింది. పాతికేళ్ల స్వతంత్ర భారత ఉత్థానపతనాల మీద వ్యాఖ్య ఈ నవల. అందులో ఎన్నికలకి ఇచ్చిన స్థానం చాలా పెద్దది. ఎన్నికలలో రచయిత మహా పతనమే చూశారు. దేని పతనం? ప్రజాస్వామ్య పతనం. ‘దేశ పరిపాలన విషయంలో ప్రజాభిమతాన్ని ప్రతిబింబించడమనే వాస్తవిక ప్రయోజనాన్ని క్రమంగా ఎన్నికలు కోల్పోతూ వస్తున్నాయ’ (పే. 324)ని నిర్ధారణకొస్తాడతడు. దేశంలో సగం ఉన్న మహిళ ఎన్నికలలో పోటీ చేయాలంటే, మొదట జాతీయ కాంగ్రెస్ శల్యపరీక్షలో, ‘నా పడకగదిలోంచి ఆమె నడవనప్పుడు ఎన్నికల్లో కూడా ముందుకు సాగలేదు’ (పే. 221) అని చెప్పే పరిశీలకుల దగ్గర ఎలా నెగ్గాలి? లాల్‌బహదూర్ శాస్త్రి వంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కలగచేసుకోవడంతో పరిశీలకుడు అప్పటికి (ఆనంద్ సన్నిహితురాలు అరుణ టికెట్టు రగడ) ఓడిపోయాడు.
ప్రథమ ప్రధాని నెహ్రూ గురించీ, వ్యక్తిత్వం గురించీ ఇంతటి సమదృష్టితో పరిశీలించిన రచన మరొకటి ఉండదేమో! నెహ్రూ అంటే ఒక మహావృక్షం. అలీనవాదం, మిశ్రమ ఆర్థికత, సోషలిజం, ప్రభుత్వ రంగం, పంచవర్ష ప్రణాళికలు, నిరాయుధీకరణ, అకాడమీల స్థాపన, ఫెడరలిజం, సెక్యులరిజం – ఆ మహావృక్షం శాఖలే. అయినా, ‘నెహ్రూ అనే దేవత లక్షల మంది దెయ్యాలున్న పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడన్నదే’ (పే 284) ఆనాటి అభిప్రాయం. నెహ్రూ ఆదర్శాలకీ, సమకాలిక సమాజానికీ మధ్య ఇంత దూరం! ‘ఎంతో తలపండిన రాజకీయవాదులు కూడా అలీన విధానాన్ని తేలికగా జీర్ణించుకోలేకపోయారు’ (పే 343). సోషలిజం నెహ్రూ స్వప్నం. కానీ అది వేదికలకీ, ఉపన్యాసాలకీ పరిమితం కావాలన్నదే కాంగ్రెస్ పెద్దల అభిమతం.
లౌకికవాదం విషయంలో నెహ్రూ ఏకాకి. ‘భారతదేశంలో జాతీయవాది అనదగిన ఏకైక ముస్లిం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ’ (పే 400) అని ఆయన వ్యతిరేకులు ఎత్తి పొడిచేవారు. 1962 నాటి చైనా యుద్ధంలో భారత్ ఓటమి దరిమిలా ఆయన తన ఈ పాత ప్రపంచం నుంచి తనను తానే బలవంతంగా బయటకు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆనంద్ ఆరోపణ ఏమిటి? ‘నెహ్రూ మహాత్మా గాంధీని, ఆయన ఆదర్శాలను ముందుకు సాగించినట్టు నెహ్రూను, నెహ్రూ ఆదర్శాలను సాగించేవారు ఒక్కరూ లేరు’ (పే 386). ఆఖరికి నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కూడా అందుకు మినహాయింపు కాదన్నదే అతడి నిశ్చితాభిప్రాయం.
ఇందిర పాత్ర చిత్రణ దగ్గర పీవీలోని స్వరాజ్య సమరయోధుడు, స్వతంత్ర భారత రాజకీయాల ప్రత్యక్ష సాక్షి మరింత కఠినంగా మారిపోవడం గమనిస్తాం. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక, అందులో ఇందిర పాత్ర (పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, లోపాయికారిగా ఉపరాష్ట్రపతి వివి గిరిని అభ్యర్థిగా నిలిపి గెలిపించారు, దానికి అంతరాత్మ ప్రబోధం అని పేరు పెట్టారు) భారతీయులు రెండుగా చీలిపోయారన్న అపోహకు బీజం వేశాయని (ప్రపంచం దృష్టిలో, ముఖ్యంగా పాక్ దృష్టిలో) ఆనంద్ అభిప్రాయపడతాడు. ఆమె హయాంలో సాగిన అసమ్మతి రాజకీయాలు, ముఖ్యమంత్రుల మార్పు దేశ ప్రతిష్టకే భంగకరమని ఆనంద్ బాధ. ‘ఎంతో గొప్పవాడైన తన తండ్రిని కూడా జనం మరచిపోయేంత ఘనకీర్తిని సంపాదించాలన్న తపనతో ఆమె వేగిపోతోంది’ (పే 454) అనుకుంటాడు లోపలి మనిషి. తన తరువాత ఈ వైభవం కొడుకు సంజయ్‌కి సంక్రమించాలన్న తపననూ ఆమెలో గమనిస్తాడు.
భూమి సమస్య; ప్రాధాన్యం, రాష్ట్రాల పునర్విభజన,రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భారత జాతీయ కాంగ్రెస్‌కు కాంగ్రెస్ (ఐ) అనే ‘తోక’, పత్రికారంగం పతనం, నక్సల్బరీ, పాక్, చైనా సంబంధాలు, కామరాజ్ పథకం, హిందూ ముస్లిం సమస్య .... ఇలా నవలలో ఆనంద్ చేత లోపలి మనిషి మాట్లాడించిన చారిత్రకాంశాల జాబితా విస్తారమైనది. ఆ జాబితా స్వతంత్ర భారతదేశ చరిత్ర పుటలలోని ప్రతి అధ్యాయపు ఛాయే. చరిత్రకు ఛాయ సాహిత్యమే. ‘లోపలి మనిషి’ నవలాకారుడు సాహిత్యం లోతులు తెలిసినవారు. బహుభాషా పండితుడు. అందుకే పత్రికారంగం, భాషా వివాదాలు ఆయన దృష్టిపథం నుంచి తప్పించుకోలేదు. స్కూప్, స్పెషల్ కరస్పాండెంట్లు, కొసన ప్రశ్నార్థకం ఉన్న శీర్షికలతో వెలువడే వార్తలు, అవి సృష్టించే కృతక వాతావరణం వంటి అంశాలను పీవీ చిత్రించారు. నెహ్రూ వారసులెవరు అంటూ డజన్ల కొద్దీ పుస్తకాలు వెలువడుతుంటే, కొన్ని ప్రమాదకర సమస్యలు దేశంలో ఉద్యమ రూపంలో వీధులకెక్కాయి. అవి ప్రాంతీయమైనవి, భాషాపరమైనవి, మతపరమైనవి. నిజానికి అంతా రాజకీయమే.
అస్సాం సాహిత్య సభ 1959లో వారి భాషను అధికార భాషగా ప్రకటించాలని కోరింది. అక్కడ బెంగాలీ మాట్లాడేవారు ఉన్నారు. ఇది హింసాత్మకమైంది. ఇంతకంటే దారుణం– తమిళనాడు హిందీ వ్యతిరేకాందోళన. ‘తమిళతల్లి’ కోసం ఆత్మాహుతులు జరిగిపోతున్న కాలం. ఒక మంత్రి ఇంట జరిగిన పెళ్లిలో ఉత్తర భారత నర్తకుడు బిర్జూ మహరాజ్ కార్యక్రమం ఏర్పాటయిందని తెలిసి తెలుగుప్రాంతం నుంచి వెళ్లిన ఆనంద్ తదితర నేతలు కంగుతిన్నారు. ఈ హిందీ వ్యతిరేకోద్యమ ఘట్టానికి కొసమెరుపు– ఎంపీ అయిన ఓ హిందీ వ్యతిరేకోద్యమ నేత ఆనంద్‌కు పరిచయం. ఒక విమానాశ్రయంలో ఇద్దరూ తారసపడ్డారు. తమిళ ఎంపీ వెంట కొడుకు ఉన్నాడు. వారి మధ్య సంభాషణ ఇది. ‘మీకు తెలుసో లేదో, మావాడు ఢిల్లీలో చదువుతున్నాడు. హిందీలో వీడిక్లాసులో ఎప్పుడూ వీడే ఫస్టు’ అన్నాడు ఎంపీ. ‘మీకు హిందీ రాదు. పైగా ఆ భాషకు వ్యతిరేకం. ఎప్పుడూ ఆందోళన చేస్తూనే ఉంటారు’ విస్మయంతో అడిగాడు ఆనంద్. ఇందుకు మరింత విస్మయం కలిగించే జవాబు, ‘చూడండి, అవి రాజకీయాలు...’ (పే. 321).
సమాఖ్య వ్యవస్థలో కేంద్రం బలహీనంగా ఉందన్న అభిప్రాయం బలపడినప్పుడూ, తమను పట్టించుకునే వెసులుబాటు ఢిల్లీకి లేదు కాబోలునని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిరాశ పడినప్పుడు నక్సలిజం వంటి సమస్యలు అనివార్యమనే పీవీ చెబుతారు. ‘భూస్వామ్య వ్యవస్థ వైఫల్యాలను మీ పార్టీ (కాంగ్రెస్) వాడుకుంటే, ఇప్పుడు నక్సలైట్లు మీ విధానంలోని వైఫల్యాలను వాడుకుంటున్నారు. అవి మరింత కొట్టొచ్చినట్టు కనిపించే వైఫల్యాలు’ అని బలరాం అనే పాత్ర (భూస్వామి) వ్యక్తం చేసిన అభిప్రాయంలో ప్రతిబింబించేది ఇదే. భూమి సమస్యకు కొనసాగింపుగానే పీవీ నక్సల్ సమస్యను చూశారు. అయినా ఆయన దృష్టిలో భారతీయతకు ఆకృతిని ఇచ్చినదే భూమి. సోషలిజం కాంగ్రెస్ పార్టీ నినాదం. కానీ భూసంస్కరణలు తేవడానికి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆనంద్ చేసిన ప్రయత్నం భంగపడింది. చివరికి అది అతడి పదవిని బలిగొన్నది(వాస్తవంలో ఇందుకు బలిపశువైనవారు పీవీయే). ఇదే ఈ నవలకు ముగింపు.
‘లోపలి మనిషి’ పీవీ ఆత్మకథాత్మక నవలగా చెబుతున్నారు. కానీ ఇది నాటి ఎందరో విజ్ఞుల ఆత్మావలోకనం. దానికి అక్షరరూపం ఇచ్చినవారు దాదాపు పీవీ ఒక్కరే. ఎంతటి చరిత్రపురుషులనైనా దేవుళ్లుగా ప్రతిష్టించవద్దంటుందీ నవల. చరిత్రను మింగే స్థాయిలో చరిత్ర పురుషులను ఆరాధించకూడదని ఘోషిస్తుంది.
- డా‘‘ గోపరాజు నారాయణరావు