రావి శాస్త్రి, ఎం.ఎన్.రాయ్
రాచకొండ విశ్వనాథ శాస్త్రి నాకు మంచి మిత్రుడు. ఆయన హైదరాబాదు వచ్చినప్పుడల్లా గోరా శాస్త్రి, సి.ధర్మారావు, నేను కలిసి కబుర్లు చెప్పుకుని ఆయన జోక్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. అయితే, ఆ రోజులలో మా సంభాషణలో ఎప్పుడూ ఎం.ఎన్.రాయ్ ప్రస్తావన రాలేదు. అది తెలిసివుంటే ఆయనను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసేవాడిని.
ఇటీవల ‘రావిశాస్త్రి సర్వస్వం’ తిరగేస్తుంటే, ఆయన డైరీలలో రాయ్ ప్రస్తావన వచ్చి, ఆశ్చర్యపోయాను. 1937లో రాయ్ తొలిసారి విశాఖపట్టణం వచ్చినప్పడు ఆయన్ని రాచకొండ కలిశాడు. అప్పుడు రాచకొండ ఎ.వి.ఎన్. కళాశాల విద్యార్థి. ఆయనా, ఆయన మిత్రుడు వరదరాజేశ్వరరావు కలిసిన వారిలో వున్నారు. రాయ్‌ని వాళ్ళ కాలేజీకి ఆహ్వానించి ఉపన్యసించమన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఈ విషయం తెలిసి, ‘రాయ్ దగ్గర బాంబులు చేయటం నేర్చుకుంటారా?’ అని ఎగతాళి చేశాడు.
విశాఖ బీచ్ ఒడ్డున ఈ ప్రసంగాలు జరిగాయి. 1937 ఆగస్టు 27న రాయ్ ఆ సమావేశంలో మాట్లాడాడు. ఆయన గురించి తమ ప్రిన్సిపాల్ ఎలా అభిప్రాయ పడుతున్నాడో రాయ్‌కు రాచకొండ వివరించాడు. తన ఉపన్యాసంలో ప్రిన్సిపాల్‌ను రాయ్ తీవ్రంగా విమర్శించాడు. సోషలిజం భారతదేశానికి అప్పట్లో సరిపడదని రాయ్ చెప్పాడు. రాయ్ మాట్లాడుతుంటే ఆయనపై జర్మన్ భాష ప్రభావం కనిపించిందని రాచకొండ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి ఆయన రాసిన లేఖావళిని రాచకొండ తార్కికంగా, అర్థవంతంగా వుందని అభిప్రాయపడ్డాడు. ఆ తరువాత రాయ్‌తో ఫొటోలు తీయించుకున్నాడు.
ఆనాడు ఇండిపెండెంట్ ఇండియా అనే పత్రికను రాయ్ నడిపేవారు. అది క్రమం తప్పకుండా రాచకొండ చదవటం మొదలు పెట్టాడు. రాయ్ రాసిన కొన్ని పుస్తకాలు కూడా తెప్పించుకున్నాడు. రాయ్ రాసిన గాంధీయిజం నేషనలిజం సోషలిజం పుస్తకాన్ని చదివి ఆకర్షితుడయ్యాడు. తనకున్న కొన్ని సందేహాలు ఆ పుస్తకం తీర్చిందని చెప్పాడు. ఇవన్నీ కూడా రాచకొండ 1937 నుండి 1941 వరకు డైరీలలో రాసుకున్నాడు. రాచకొండ రచనలపై ఆయన ప్రభావం ఏ మేరకు వున్నదో ఈ విషయాల దృష్ట్యా పరిశీలించవలసి వున్నది.
(మార్చి 21న ఎం.ఎన్.రాయ్ జయంతి)
- నరిశెట్టి ఇన్నయ్య
innaiah@gmail.com