narisetti innaiah
-
ఇప్పుడు వీస్తున్న సైన్స్ గాలి
సందర్భం జీవితమంతా పరిశోధనల్లో గడిపిన సైంటిస్టులు శాస్త్ర జ్ఞానాన్ని సామాన్యులకు అర్థం చేయించేందుకు ప్రజలముందుకు రావడం విశేషం. రిచర్డ్ డాకిన్స్, నీల్ డి గ్రాస్, మైకల్ షెర్మర్ ఈ విషయంలో ఆదర్శనీయులు. ఇటీవల సైంటిస్టులు గణనీయమైన ప్రజాసేవ చేస్తున్నారు. జటిలమైన వైజ్ఞానిక పరిశోధనా ఫలితాలు పల్లెటూరి రైతులకు సైతం అర్థమయ్యేటట్టు వివరిస్తున్నారు. పరిశోధనాలయాల్లో జీవితమంతా గడిపిన సైంటిస్టులు ఇలా ప్రజల మధ్యకు రావడం చెప్పుకోదగిన అంశం. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాలో ఈ వినూత్న మార్పు అనుసరించదగింది. ఇందులో ముఖ్యాంశాలు చూద్దాం. రిచర్డ్ డాకిన్స్, నీల్ డి గ్రాస్, మైకల్ షెర్మర్ లను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవచ్చు. కేవలం పుస్తకాలు రాయడం కాక, కేసెట్లు తయారు చేసి వెబ్సైట్లో పెట్టి, యూట్యూబ్‌ల ద్వారా విజ్ఞానాన్ని వెదజల్లుతున్నారు. అది ప్రజాకర్షణగా మారింది. రిచర్డ్ డాకిన్స్ పరిణామ సిద్ధాంతాన్ని పెద్దలతోపాటు పిల్లల దగ్గరకూ తెచ్చారు. ది మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ రాసి, బొమ్మలతో సహా పరిణామ క్రమాన్ని, విశ్వరహస్యాలను తేటతెల్లం చేశారు. విశ్వాన్ని, సృష్టిని వివరించడానికి పూర్వకాలం నుంచీ ప్రయత్నాలు జరి గాయి. వాటినే ఇప్పుడు డాకిన్స్ వైజ్ఞానిక వివరణతో ప్రజల మధ్యకు వచ్చారు. మాజిక్ ఆఫ్ రియాలిటీ అనే గ్రంథం చక్కని బొమ్మలతో ప్రచురించారు. డేవ్ మెకీన్ వీటికి అనుగుణంగా బొమ్మలు సమకూర్చారు. హైస్కూలు పిల్లలకు అరటిపండు ఒలిచిపెట్టినట్లుంది ఈ వివరణ. లోగడ మన పూర్వీకులు కథలుగా రాసి, నమ్మి, ఆచరించిన వాటికే ఇప్పుడు ఆధారాలతో అర్థమయ్యేట్టు చూపారు. అదీ విజ్ఞాన సేవ. పరిణామ సిద్ధాంత నిపుణుడుగా పేరొందిన రిచర్డ్ డాకిన్స్ రచనలన్నీ మనలోని అజ్ఞానాన్ని తొలగించి, వివరణ ఇస్తాయి. పరిణామం అంటే కోతి నుంచి మనిషి ప్రసవించడం కాదని క్రమక్రమంగా అన్ని జీవుల్లో జరిగే మార్పు అని సోదాహరణంగా చూపారు. హైస్కూలు స్థాయి పిల్లలు ఇవి చదివితే అసలు విషయాలు తెలిసి పరిణామ క్రమం తేటతెల్లమవుతుంది. అవి సిలబస్‌లో ప్రవేశపెడితే ఇంకా బాగుంటుంది. మరొక ఖగోళ శాస్త్రజ్ఞుడు నీల్ డి గ్రాస్ ప్రస్తుతం హైడెన్ పరిశోధనాలయం డైరెక్టర్‌గా ఉంటూ, విశ్వ రహస్యాలకు శాస్త్రీయ ఆధారాలతో జనం ముందుకు వచ్చారు. అనేక సభలు పెట్టి ప్రసంగాలు చేస్తున్నారు. వీడియోలు, ఆడియోలు, సౌండ్ ట్రాక్‌లు బయటపెట్టారు. విశ్వం గురించి మనకున్న భ్రమలు తొలగించి, విజ్ఞానం ఏం చెబుతున్నదో వివరిస్తున్నారు. హాస్య పూరితమైన ఆయన ప్రసంగాలు వింటే విశ్వరహస్యాలు సులభంగా ఆకళింపు అవుతాయి. లోగడ కార్ల్ శాగన్ విశ్వం గురించి పరిశోధించి ప్రజలకు చెప్పిన అంశాలనే ప్రస్తుతం నీల్ డి గ్రాస్ కొనసాగిస్తున్నారు. మాకు తీరిక లేదు అనేవాళ్లు గబగబా చదివి అర్థం చేసుకునేటట్టు రాశారు. మరొక ప్రముఖ సైంటిస్టు మైకల్ షెర్మర్ బిలీవింగ్ బ్రెయిన్ (Believing Brain) అనీ, ‘హెవెన్స్ ఆన్ ఎర్త్’ అనీ రాశారు. సర్వసాధారణంగా నమ్మే ఆత్మ గురించి గొప్ప వివరణ ఇచ్చి, విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతున్నదో తెలియపరిచారు. వీరంతా పుస్తకాలు రాసి, క్యాసెట్లతో ఊరుకోక, ఊరూరూ తిరిగి ప్రచారం చేయడం నిజమైన విజ్ఞాన సేవ. ఆత్మ గురించి షెర్మర్ ఇంతగా పరిశీలించి శాస్త్రీయంగా కనువిప్పు కలిగించడం గొప్ప విషయం. ఇవన్నీ మతాలను తిట్టడానికో, మూఢనమ్మకాలను ఖండించడానికో కాదు. జనంలో ఉండే బహుళ ప్రచా రం పొందినవాటిని వైజ్ఞానికంగా విప్పిచెప్పడం వలన చదువుకున్న నమ్మకస్తులకు సైతం కనువిప్పు అవుతుంది. మనలో చాలామంది ఒక్కొక్క రంగంలో ప్రజ్ఞావంతులు కావచ్చు. మిగిలిన శాస్త్ర విభాగాలలో ఏం జరుగుతున్నదో తెలియక మూఢనమ్మకాలకు మొగ్గుతుంటారు. ఆ లోపాన్ని ఈ శాస్త్రజ్ఞులు తొలగించారు. వైజ్ఞానిక రంగంలో ఒక పరిధిలో నిపుణుడు కావడానికే ఎంతో కాలం పడుతుంది. అన్ని రంగాలూ తెలియడం చాలా దుర్లభం. ఆ లోపం పూరించడానికే ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ కావాలి అన్నాడు ఎం.ఎన్. రాయ్ (మానవేంద్రనాథ్ రాయ్). ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు సరిగ్గా అలాంటి కృషే చేస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి కృషి చాలా అవసరం. శాస్త్రజ్ఞులు పి.ఎం. భార్గవ వలే తమకు తెలిసిన విజ్ఞానాన్ని సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. దాన్ని తప్పకుండా సిలబస్‌లోకి తీసుకురావాలి. లోగడ ఐజాక్ అసిమోవ్, కార్ల్ శాగన్, రేనీ డ్యూబా, పాల్ కర్జ్, ఎం.ఎన్. రాయ్ చేసిన కృషి నిజమైన ప్రజాసేవ. కేవలం ఖండన మండనలు గాక, విషయాన్ని పోల్చి చెప్పాలి. ఉదాహరణకు జ్యోతి ష్యాన్ని ఖండించే బదులు, పక్కపక్కనే ఖగోళ శాస్త్రం రుజువులతో ఏమి చెబుతున్నదీ పట్టికవేసి చూపవచ్చు. అలాంటి పని వాస్తుకూ అన్వయించి, భవన నిర్మాణ శాస్త్రంతో పోల్చి చెప్పవచ్చు. విషయం తేటతెల్లమవుతుంది. మొత్తం మీద విజ్ఞానాన్ని రుజువులతో కూడిన పరిశోధనలను సామాన్యులకు అందించడం శాస్త్రవేత్తల కర్తవ్యం. - నరిశెట్టి ఇన్నయ్య వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : innaaiah@gmail.com -
ఇంత వరకూ తెలియని సినారె
వాషింగ్టన్ : తెలుగు వారికి పరిచయం అక్కరలేని పేరు ఆచార్య సి.నారాయణరెడ్డి (సినారె). ప్రముఖ కవిగా, సినీ గీత రచయితగా, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగానే కాక కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను సి.నారాయణరెడ్డి అందుకున్నారు. ఆయన జన్మదినం జులై 29వ తేదీ. ఈ సందర్భంగా సినారెతో తన 50 ఏళ్ల అనుబంధాన్ని మానవతావాది ఆచార్య నరిశెట్టి ఇన్నయ్య తన మనస్సులో నిక్షిప్తమైన జ్ఞాపకాల దొంతరలను ఇలా పంచుకున్నారు.. 1967 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సినారె తెలుగు శాఖలో పని చేస్తుంటే... తాను తత్వశాస్త్ర (ఫిలాసఫీ) శాఖలో ఆచార్యులుగా విధులు నిర్వహించేవాళ్లమని ఇన్నయ్య గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రతి రోజు తాము కలుసుకునే వాళ్లమని చెప్పారు. ఈ సందర్భంగా ఓ రోజు ఎం.ఎన్ రాయ్ రాసిన 'మారుతున్న భారతదేశం' పుస్తకం తెలుగులోకి అనువదించాను. దీనిని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో సినారె ఎడిటర్‌గా ఉన్నారన్నారు. తన పుస్తకం చూసి... జనానికి అర్థమయ్యేలా అనువదించమని సినారె సూచించారని తెలిపారు. అలా నిష్కర్షగా చెప్పడం మా స్నేహానికి నిదర్శనమన్నారు. అంతే కాకుండా ఆయనలోని ఓ ముఖ్య లక్షణం కూడా అని ఇన్నయ్య పేర్కొన్నారు. అలాగే ఎమ్.ఎన్.రాయ్ రచించిన మరో గ్రంథాన్ని వివేచన -ఉద్వేగం - విప్లవం పేరుతో తెనుగులోకి అనువదించానని చెప్పారు. ఈ గ్రంథాన్ని సినారె తన ఉపన్యాసంలో చాలా విపులంగా సమీక్షించారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాత్రికేయుడు వి.సతీష్... సినారె ఉపన్యాసంపై స్పందించి.. నాలుగు పెగ్గులు సేవించినట్లుందని చమత్కరించారని ఇన్నయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుందని ఇన్నయ్య నెమరేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో జోతిష్యం బోధనాంశంగా ఉండటాన్ని మానవవాద సంఘాలు అభ్యంతరం చెప్పాయి... దీనిపై శాస్త్రీయ పరిశీలన జరపాలని సదరు సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై సినారె స్పందించి... వైజ్ఞానికంగా జ్యోతిష్యం నిలబడుతోందా ? అనే అంశం పరిశీలించాలని.. అలాగే ఖగోళ శాస్త్రంతో పోల్చి చూడాలని ఆదేశించారు. అయితే ఈ విషయంపై గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు రామన్...సినారెపై కత్తులు నూరారు. ఆయన్ని వీసీ పదవి నుంచి తొలగించాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు రామన్ లేఖలు కూడా రాశారు. ఈ లోపు సినారె అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వీసీగా వెళ్లిపోయారన్నారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని సినారె ఇంట్లో కొంత కాలం మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆచార్య ఎన్ జి రంగా కొంత కాలం అద్దెకు ఉండేవారని తెలిపారు. అలానే 1948లో ఆలపాటి రవీంద్రనాథ్ సంపాదకత్వంలో వెలువడిన జ్యోతి పత్రికకు సినారె అనేక రచనలు చేశారు. ఈ సందర్భంగా తాను, సినారె, రవీంద్రనాథ్ ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేయడం అనవాయితీగా మరిందన్నారు. మరో మిత్రుడు, పాత్రికేయుడు డి ఆంజనేయులు తెలుగు కవులు, రచయితలను ఇతర రాష్ట్రాల వారికి తెలియజేస్తు అనేక సాహిత్య వ్యాసాలు రాసేవారు అలా రాసిన వాటిలో సినారెపై చాలా చక్కటి వ్యాసం రాశారన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు భాష ప్రచారం కోసం కరీంనగర్ నుంచి శ్రీకాకుళంలోని కథానిలయం వరకు సాహిత్య యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో సినారెతోపాటు తాను పాల్గొన్నాని ఇన్నయ్య చెప్పారు. ఆ క్రమంలో విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఇద్దరం ప్రసంగించామని ఇన్నయ్య వెల్లడించారు. అలానే ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి సూర్యదేవర సంజీవదేవ్ హైదరాబాద్ విచ్చేసేవారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో సినారెను ఆహ్వానించగా... వచ్చి ప్రసంగించేవారని చెప్పారు. సినారెతో తన అనుబంధం గురించి చెప్పుకుంటే ఇంకా చాలా ఉందన్నారు. సినారెకు ప్రస్తుతం 87 ఏళ్లు. జ్ఞాపక శక్తి కించిత్ కూడా తగ్గలేదు. యూఎస్ నుంచి తాను పోను చేసి పలికరిస్తే.. ఆప్యాయంగా మాట్లాడతారని సినారెతో తనకు ఉన్న అనుబంధాలు మధురానుభూతులు చిరస్మరణీయాలని ఇన్నయ్య పేర్కొన్నారు. -
‘రాయ్ దగ్గర బాంబులు చేయటం నేర్చుకుంటారా?’
రాచకొండ విశ్వనాథ శాస్త్రి నాకు మంచి మిత్రుడు. ఆయన హైదరాబాదు వచ్చినప్పుడల్లా గోరా శాస్త్రి, సి.ధర్మారావు, నేను కలిసి కబుర్లు చెప్పుకుని ఆయన జోక్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. అయితే, ఆ రోజులలో మా సంభాషణలో ఎప్పుడూ ఎం.ఎన్.రాయ్ ప్రస్తావన రాలేదు. అది తెలిసివుంటే ఆయనను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసేవాడిని. ఇటీవల ‘రావిశాస్త్రి సర్వస్వం’ తిరగేస్తుంటే, ఆయన డైరీలలో రాయ్ ప్రస్తావన వచ్చి, ఆశ్చర్యపోయాను. 1937లో రాయ్ తొలిసారి విశాఖపట్టణం వచ్చినప్పడు ఆయన్ని రాచకొండ కలిశాడు. అప్పుడు రాచకొండ ఎ.వి.ఎన్. కళాశాల విద్యార్థి. ఆయనా, ఆయన మిత్రుడు వరదరాజేశ్వరరావు కలిసిన వారిలో వున్నారు. రాయ్‌ని వాళ్ళ కాలేజీకి ఆహ్వానించి ఉపన్యసించమన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఈ విషయం తెలిసి, ‘రాయ్ దగ్గర బాంబులు చేయటం నేర్చుకుంటారా?’ అని ఎగతాళి చేశాడు. విశాఖ బీచ్ ఒడ్డున ఈ ప్రసంగాలు జరిగాయి. 1937 ఆగస్టు 27న రాయ్ ఆ సమావేశంలో మాట్లాడాడు. ఆయన గురించి తమ ప్రిన్సిపాల్ ఎలా అభిప్రాయ పడుతున్నాడో రాయ్‌కు రాచకొండ వివరించాడు. తన ఉపన్యాసంలో ప్రిన్సిపాల్‌ను రాయ్ తీవ్రంగా విమర్శించాడు. సోషలిజం భారతదేశానికి అప్పట్లో సరిపడదని రాయ్ చెప్పాడు. రాయ్ మాట్లాడుతుంటే ఆయనపై జర్మన్ భాష ప్రభావం కనిపించిందని రాచకొండ వ్యాఖ్యానించాడు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి ఆయన రాసిన లేఖావళిని రాచకొండ తార్కికంగా, అర్థవంతంగా వుందని అభిప్రాయపడ్డాడు. ఆ తరువాత రాయ్‌తో ఫొటోలు తీయించుకున్నాడు. ఆనాడు ఇండిపెండెంట్ ఇండియా అనే పత్రికను రాయ్ నడిపేవారు. అది క్రమం తప్పకుండా రాచకొండ చదవటం మొదలు పెట్టాడు. రాయ్ రాసిన కొన్ని పుస్తకాలు కూడా తెప్పించుకున్నాడు. రాయ్ రాసిన గాంధీయిజం నేషనలిజం సోషలిజం పుస్తకాన్ని చదివి ఆకర్షితుడయ్యాడు. తనకున్న కొన్ని సందేహాలు ఆ పుస్తకం తీర్చిందని చెప్పాడు. ఇవన్నీ కూడా రాచకొండ 1937 నుండి 1941 వరకు డైరీలలో రాసుకున్నాడు. రాచకొండ రచనలపై ఆయన ప్రభావం ఏ మేరకు వున్నదో ఈ విషయాల దృష్ట్యా పరిశీలించవలసి వున్నది. (మార్చి 21న ఎం.ఎన్.రాయ్ జయంతి) - నరిశెట్టి ఇన్నయ్య innaiah@gmail.com