ఎమ్మా క్లెయిన్, ఆమె రాసిన మొదటి పుస్తకం ‘ద గర్ల్స్’.
ఎమ్మా క్లెయిన్ మొదటి పుస్తకం, ‘ద గర్ల్స్’ అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో 1969 సంవత్సరపు వేసవి నేపథ్యంతో రాసినది. మధ్యవయస్కురాలైన ఈవీ తన టీనేజిలో చేసిన తప్పులని తలచుకోవడంతో నవల ప్రారంభం అవుతుంది.
ఈవీ బోయ్ద్ ధనిక కుటుంబపు 14 ఏళ్ళమ్మాయి. స్నేహితులెక్కువ ఉండరు. తల్లిదండ్రులకి విడాకులవుతాయి. పార్క్‌లో విచ్చలివిడిగా తిరుగుతున్న కొందరు యువతులని చూసి ఆకర్షితురాలవుతుంది. ప్రత్యేకంగా, సూసన్ అన్న అమ్మాయి పట్ల. తాముంటున్న రాంచ్‌కి చెత్తబుట్టల్లోంచి తిండి పట్టు్టకెళ్ళడానికి వచ్చే ఆ యువతులు మరోరోజు ఈవీని తమ నాయకుడి వద్దకి, కొండల్లో ఉన్న రాంచ్‌కి తీసుకెళ్తారు. అతడు రసెల్ హేడ్రిక్. అతని పాత్ర ఛార్ల్స్ మాన్సన్ మీద మలచబడినది. హిప్పీ సంస్కృతి పాటిస్తారక్కడ. ఫ్రీ సెక్స్, ఎల్‌ఎస్‌డీ వినియోగం సాగుతుంటాయి. ‘కొండకొమ్ము నుంచి రాలే చెత్తలాగే తన రోజులూ గడుస్తున్నా’యని అనుకున్న ఈవీ, తనూ వారిలో భాగం అవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ‘కల్ట్’కి చెందిన అమ్మాయిలు చిల్లర దొంగతనాలు చేస్తుంటారు. రసెల్–డబ్బూ పరపతీ ఉన్న యువతుల కోసమే వెతుకుతుంటాడు. నిజ జీవితపు మాన్సన్ లాగానే, తన పక్కలోకి వచ్చే అమ్మాయిలనే సమకూర్చుకుంటాడు.
మర్నాడే, ఈవీ తన కొత్త స్నేహితుల కోసం తనింట్లోంచి దొంగిలిస్తుంది. రసెల్‌కి రాక్ స్టార్ అవ్వాలన్న ఆశ. మొదట్లో ఆ గుంపు పట్ల మెచ్చుకోలుండే ఈవీ– రసెల్‌కి ఉన్న మానసిక రుగ్మతనీ, యువతుల మన:స్థితులనీ అర్థం చేసుకుంటుంది. ఆఖరిసారి ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు, రసెల్ గుంపు తినడానికి తిండి కూడా లేక, మత్తు పదార్థాల సేవనలో ములిగుంటారని చూస్తుంది. తెలివి తెచ్చుకుని, ఇవన్నీ వదిలి బోర్డింగ్ స్కూల్లో చేరుతుంది.
నవల– ఛార్ల్స్ మేన్సన్, అతని అనుచరులూ 1969లో చేసిన భీకరమైన హత్యల వల్ల స్ఫూర్తి పొందినదే కానీ కేంద్రీకరణ ఉన్నది మాత్రం ఈవీ మీదే. దీన్లో లైంగిక వివరాలూ చాలానే ఉంటాయి.
మధ్య వయస్కురాలైన ఈవీ ప్రస్తుత జీవితం గురించీ, తను రాంచ్‌కి వెళ్ళినప్పటి గతకాలం గురించీ మార్చి మార్చి రాస్తారు రచయిత్రి. నవల్లో ఆడంబరం కనబడదు. నింపాదితనం ఉంది. అప్రతిష్ఠాకరమైన మాన్సన్ హత్యల గురించి సూచనప్రాయంగా చెప్తారు. ప్రతీ పేజీలోనూ గమనార్హమైన పదబంధమో, రూపకమో, ఉపమానమో ఉంటాయి. నవల కవిత్వ ధోరణిలో ఉంటుంది. ప్రధాన పాత్రలని కథకురాలు బయట ఉండి చూస్తూనే, వాటికి చిన్న చిన్న సంఘటనల ద్వారా ప్రాణం పోస్తారు. ఇక్కడ కథాంశం అప్రధానమైనది. ‘మాన్సన్ యువతులు నన్ను ఆకట్టుకున్నారు. రాత్రంతా మేలుకుని– వారి గురించిన పుస్తకాలూ, యూట్యూబ్ వీడియోలూ చూస్తుండేదాన్ని’ అంటారు రచయిత్రి. మాన్సన్ ఫ్యామిలీ గురించి వచ్చిన అనేకమైన పుస్తకాల్లోకల్లా, ఇదే ఎక్కువ గుర్తింపు పొందినది.
2016లో విడుదల అయిన ఈ నవల 12 వారాలు, న్యూయోర్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ లిస్టులో ఉన్నది. ‘సెంటర్ ఫర్ ఫిక్షన్ నోవెల్’ ప్రైజ్‌కి షార్ట్ లిస్ట్ అయింది. ‘జోన్ లెనార్డ్’అవార్డ్’కి షార్ట్ లిస్ట్ అయింది. లాస్ ఏంజెలెస్ టైమ్స్ బుక్ ప్రైజ్‌కి ఫైనలిస్టు అయింది. 2017లో గ్రాంటా, ‘బెస్ట్ యంగ్ అమెరికన్ నావెలిస్ట్’గా క్లెయిన్‌ని ఎంచుకుంది. ఈ నవల ఆడియో పుస్తకం కూడా ఉంది.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment