The girls
-
హిప్పీ సంస్కృతిలోని అమ్మాయి కథ
ఎమ్మా క్లెయిన్ మొదటి పుస్తకం, ‘ద గర్ల్స్’ అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో 1969 సంవత్సరపు వేసవి నేపథ్యంతో రాసినది. మధ్యవయస్కురాలైన ఈవీ తన టీనేజిలో చేసిన తప్పులని తలచుకోవడంతో నవల ప్రారంభం అవుతుంది. ఈవీ బోయ్ద్ ధనిక కుటుంబపు 14 ఏళ్ళమ్మాయి. స్నేహితులెక్కువ ఉండరు. తల్లిదండ్రులకి విడాకులవుతాయి. పార్క్‌లో విచ్చలివిడిగా తిరుగుతున్న కొందరు యువతులని చూసి ఆకర్షితురాలవుతుంది. ప్రత్యేకంగా, సూసన్ అన్న అమ్మాయి పట్ల. తాముంటున్న రాంచ్కి చెత్తబుట్టల్లోంచి తిండి పట్టు్టకెళ్ళడానికి వచ్చే ఆ యువతులు మరోరోజు ఈవీని తమ నాయకుడి వద్దకి, కొండల్లో ఉన్న రాంచ్కి తీసుకెళ్తారు. అతడు రసెల్ హేడ్రిక్. అతని పాత్ర ఛార్ల్స్ మాన్సన్ మీద మలచబడినది. హిప్పీ సంస్కృతి పాటిస్తారక్కడ. ఫ్రీ సెక్స్, ఎల్ఎస్డీ వినియోగం సాగుతుంటాయి. ‘కొండకొమ్ము నుంచి రాలే చెత్తలాగే తన రోజులూ గడుస్తున్నా’యని అనుకున్న ఈవీ, తనూ వారిలో భాగం అవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ‘కల్ట్’కి చెందిన అమ్మాయిలు చిల్లర దొంగతనాలు చేస్తుంటారు. రసెల్–డబ్బూ పరపతీ ఉన్న యువతుల కోసమే వెతుకుతుంటాడు. నిజ జీవితపు మాన్సన్ లాగానే, తన పక్కలోకి వచ్చే అమ్మాయిలనే సమకూర్చుకుంటాడు. మర్నాడే, ఈవీ తన కొత్త స్నేహితుల కోసం తనింట్లోంచి దొంగిలిస్తుంది. రసెల్‌కి రాక్ స్టార్ అవ్వాలన్న ఆశ. మొదట్లో ఆ గుంపు పట్ల మెచ్చుకోలుండే ఈవీ– రసెల్‌కి ఉన్న మానసిక రుగ్మతనీ, యువతుల మన:స్థితులనీ అర్థం చేసుకుంటుంది. ఆఖరిసారి ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు, రసెల్ గుంపు తినడానికి తిండి కూడా లేక, మత్తు పదార్థాల సేవనలో ములిగుంటారని చూస్తుంది. తెలివి తెచ్చుకుని, ఇవన్నీ వదిలి బోర్డింగ్ స్కూల్లో చేరుతుంది. నవల– ఛార్ల్స్ మేన్సన్, అతని అనుచరులూ 1969లో చేసిన భీకరమైన హత్యల వల్ల స్ఫూర్తి పొందినదే కానీ కేంద్రీకరణ ఉన్నది మాత్రం ఈవీ మీదే. దీన్లో లైంగిక వివరాలూ చాలానే ఉంటాయి. మధ్య వయస్కురాలైన ఈవీ ప్రస్తుత జీవితం గురించీ, తను రాంచ్కి వెళ్ళినప్పటి గతకాలం గురించీ మార్చి మార్చి రాస్తారు రచయిత్రి. నవల్లో ఆడంబరం కనబడదు. నింపాదితనం ఉంది. అప్రతిష్ఠాకరమైన మాన్సన్ హత్యల గురించి సూచనప్రాయంగా చెప్తారు. ప్రతీ పేజీలోనూ గమనార్హమైన పదబంధమో, రూపకమో, ఉపమానమో ఉంటాయి. నవల కవిత్వ ధోరణిలో ఉంటుంది. ప్రధాన పాత్రలని కథకురాలు బయట ఉండి చూస్తూనే, వాటికి చిన్న చిన్న సంఘటనల ద్వారా ప్రాణం పోస్తారు. ఇక్కడ కథాంశం అప్రధానమైనది. ‘మాన్సన్ యువతులు నన్ను ఆకట్టుకున్నారు. రాత్రంతా మేలుకుని– వారి గురించిన పుస్తకాలూ, యూట్యూబ్ వీడియోలూ చూస్తుండేదాన్ని’ అంటారు రచయిత్రి. మాన్సన్ ఫ్యామిలీ గురించి వచ్చిన అనేకమైన పుస్తకాల్లోకల్లా, ఇదే ఎక్కువ గుర్తింపు పొందినది. 2016లో విడుదల అయిన ఈ నవల 12 వారాలు, న్యూయోర్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ లిస్టులో ఉన్నది. ‘సెంటర్ ఫర్ ఫిక్షన్ నోవెల్’ ప్రైజ్‌కి షార్ట్ లిస్ట్ అయింది. ‘జోన్ లెనార్డ్’అవార్డ్’కి షార్ట్ లిస్ట్ అయింది. లాస్ ఏంజెలెస్ టైమ్స్ బుక్ ప్రైజ్‌కి ఫైనలిస్టు అయింది. 2017లో గ్రాంటా, ‘బెస్ట్ యంగ్ అమెరికన్ నావెలిస్ట్’గా క్లెయిన్ని ఎంచుకుంది. ఈ నవల ఆడియో పుస్తకం కూడా ఉంది. - కృష్ణ వేణి -
ముగ్గు ముచ్చట్లు
చక్కగా ఆవుపేడతో అలికిన ఇంటి ముందు గుల్లముగ్గులు అంటే బియ్యప్పిండిలో సున్నం పొడి కలిపిన ముగ్గులు పెట్టడం వల్ల క్రిమికీటకాలు ప్రవేశించవని, బ్యాక్టీరియా సోకదని అప్పుడెప్పుడో గడ్డాలు పెంచిన శాస్త్రవేత్తలే తేల్చి చెప్పేశారు. ఓసారి ఆకాశంలో నుంచి కిందికి చూసిన ఓ అనుమానపు తారకకు తమలో కొందరు జారి కిందపడ్డారేమో అనే అనుమానం వచ్చిందట. కంగారు కంగారుగా ఆ విషయం అందరి చెవిలోనూ ఊదేసిందట. తారకలందరూ ఆందోళనగా ఒకరినొకరు లెక్కబెట్టుకుంటే అందరి లెక్కా సరిపోయిందట. దాంతో ‘అసలు నీకెందుకొచ్చిందీ అనుమానం?’ అని నిలదీశారట. ‘అనవసరంగా నన్నాడిపోసుకుంటారేం, మీరోసారి కిందకి చూడండి’అంటూ చికాకుపడిందట ఆ చుక్క. తారామణులందరూ నేలమీద తేరిపార చూస్తే... అందమైన అమ్మాయిలు, పద్ధతి గల గృహిణులు ఎంతో శ్రద్ధాసక్తులతో ఇంటి ముంగిళ్లలో రకరకాల ఆకారాలలో చుక్కలు పెడుతూ, ఆ చుక్కలను కలుపుతూ రంగు రంగుల ముగ్గులు పెడుతూ కనిపించారట. ‘ఇది ధనుర్మాసం కదా... ఈ నెలంతా భూలోకంలో అందరూ ముగ్గులు పెడతారు, ఆ మాత్రం తెలియదా?’ అని దెప్పిపొడిచారట. అప్పుడా తార ‘ఇన్నాళ్లూ మనం ఆకాశంలో ఉన్నామని విర్రవీగుతున్నాం కదా, మనల్ని నేలమీదకు దించేవాళ్లు కూడా ఉన్నారు చూశారా?’ అని ఎదురు పోటు పొడిచిందట. అప్పుడు అందరూ కలసి హాయిగా నవ్వుకున్నారట. వినడానికి సరదాగా ఉన్నా, ముగ్గులు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. ధనుర్మాసంలో అయితే మరీనూ! ఒకప్పుడు సంక్రాంతి సీజన్లో కార్టూనిస్టులందరూ ముగ్గుల మీదనే తమ కుంచెను ఆనించేవారు. చుక్కల్ని కలుపుకుంటూ పక్కూరి పొలిమేర లు దాటేసిన వాళ్ల గురించి, ముగ్గులు పెడుతూ పెడుతూ చుక్కల పేట వరకూ షికారుకెళ్లిన వాళ్లను, ఎంతో కష్టపడి వేసిన తమ ముత్యాల ముగ్గు తొక్కారని పైటకొంగు బొడ్లో దోపి మరీ చావచితక్కొట్టిన వీరనారులను, ముగ్గు తొక్కకుండా లోనికొచ్చి జాబులందించడం కోసం పోస్ట్మెన్లు పడే పాట్ల దాకా కార్టూనిస్టులు దేనినీ వదిలిపెట్టలేదు. చిన్న పిల్లల చేతిని తమ చేతిలోకి తీసుకుని ఇల్లు అలికి ముగ్గుపెట్టి... అని ఆటాడించడం, ఆ తర్వాత అదే ఆటను మనమూ పిల్లల చేత ఆడించడాలు చాలా మంది బుర్రల్లో ఇప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలే. అంతేనా! పిడికిట్లో ఇమిడిపోయే నడుమును విల్లంబులా వంచి, పైటచెంగును బొడ్డులో దోపి, నల్లతాచు లాంటి జడను నాట్యం చేయిస్తూ, పైనున్న చుక్కలతో పోటీ పడుతూ ముగ్గులు పెట్టే ముగ్గుగుమ్మలను ఆరాధనగా చూస్తూ, మనసు పారేసుకోని కుర్రాళ్లుండేవారా, వారి ముగ్గులో పడని పడతులుంటారా? గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి! ముగ్గులు పెట్టడం వల్ల ముంగిలి ముచ్చటగా ఉంటుంది. అందంగా ముగ్గులు తీర్చిదిద్ది ఉన్న ఇంట శుభకార్యం ఏదో జరుగుతోందని అర్థం. ఎవరి వాకిళ్లలో అయినా అసలు ముగ్గుగీతే పడలేదంటే ఆ ఇంట అశుభం అయి ఉండొచ్చేమో అని అర్థం చేసుకుంటారు. అందుకే ఇల్లాళ్లందరూ ముగ్గు వెయ్యడం విధిగా, అదే తమకు నిధిగా భావిస్తుంటారు.ముగ్గులు పెట్టడంలో మీ కారణాలు మీకుంటే ఉండచ్చు గాక చక్కగా ఆవుపేడతో అలికిన ఇంటి ముందు గుల్లముగ్గులు అంటే బియ్యప్పిండిలో సున్నం పొడి కలిపిన ముగ్గులు పెట్టడం వల్ల క్రిమికీటకాలు ప్రవేశించవని, బ్యాక్టీరియా సోకదని అప్పుడెప్పుడో గడ్డాలు పెంచిన శాస్త్రవేత్తలే తేల్చి చెప్పేశారు. పూర్వం ఇల్లు అలికి ముగ్గుపెట్టనిదే వంట చేసేవారు కాదు. అగ్నిని ఆరాధించే వారు కూడా ముందుగా ముగ్గు పెట్టిన తర్వాతనే అగ్న్యారాధన చేసేవారు. అలాగే ఓ యజ్ఞం చెయ్యాలన్నా, హోమగుండం తవ్వాలన్నా, పాలు పొంగించాలన్నా, పూజకు కలశం పెట్టాలన్నా ముత్యాల్లాంటి ముగ్గులు పడాల్సిందే! అందరి లోగిళ్లూ ముగ్గుమందారాలయినప్పుడు ఊరంతా సంక్రాంతే మరి! - డి.వి.ఆర్. భాస్కర్ అతివల అనాది కళ కోడికూతతోనే నిద్రలేచి, వాకిలి చిమ్మి, పేడనీటితో కళ్లాపి చల్లి ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్దడం తెలుగిళ్లలోనే కాదు, దేశవ్యాప్తంగా భారతీయుల ఇళ్లలో ఇదొక అనుదినచర్య. అభివృద్ధి వేగానికి పట్టణీకరణ పెరిగాక, వాకిళ్లు కుంచించుకుపోయాయి. కళ్లాపి చల్లడానికి వీల్లేని సిమెంటు గచ్చులు వచ్చిపడ్డాయి. నయా జమానాలో నగరాల దుస్థితి చెప్పనే అక్కర్లేదు... మనుషుల్లో అనివార్యంగా అపార్ట్‌మెంటాలిటీ పెరిగింది. అపార్ట్మెంట్లలో ఎవరి గూడు వాళ్లదే! ఎవరి గుమ్మం వాళ్లదే! గుమ్మం ముందు ఉండే ఖాళీ జాగా దోసెడంతే! అనివార్య అధునాతన పరిణామాల ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు కళ్లాపి కనుమరుగైనా, ముగ్గులింకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకు చాలామంది రాతిపిండితో రంగవల్లికలను తీర్చిదిద్దేవాళ్లు. కొందరు నేరుగా ముగ్గురాతితోనూ , ఇంకొందరు చీమల వంటి చిరుజీవులకు ఆహారంగా కూడా ఉపయోగపడాలనే భూతదయతో వరిపిండితోనూ ముగ్గులు వేసేవాళ్లు. ఇప్పుడు జమానా బదల్‌గయా! పండుగల సీజన్లలో తప్ప మిగిలిన రోజుల్లో చాక్‌పీసులతో హడావుడి ముగ్గులు గీసి పారేస్తున్నారు. ఎలా గీసినా వాకిళ్లలో ముగ్గులు గీయడాన్ని ముదితలింకా మరచిపోలేదు. ముగ్గూ- దాని పుట్టుపూర్వోత్తరాలు గ్రంథస్థం కాలేదు గానీ, ముగ్గులు పురాణాల కంటే ముందే పుట్టి ఉంటాయనే అంచనా ఉంది. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన ఉంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణగాథ ఉంది. ఎప్పుడో సత్యకాలంలో ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు దగ్గర ఒక రాజగురువు ఉండేవాడు. విధివశాన ఆ రాజగురువు కొడుకు అకాల మరణం చెందాడు. పుత్రశోకంతో ఆ రాజగురువు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమంటే, చనిపోయిన తన కొడుకును బతికించమంటాడు రాజగురువు. అప్పుడు బ్రహ్మదేవుడు... నేలను శుభ్రం చేసి, అక్కడ మనిషి ఆకారంలో ముగ్గు వేయించమని ఆదేశిస్తాడు. అలాగే ముగ్గు వేయడంతో, చనిపోయిన రాజగురువు కొడుకును బతికిస్తాడు. అప్పటి నుంచి ముంగిళ్లలో ముగ్గులు వేయడం ఆచారంగా మారిందని చెబుతారు. ముగ్గులు ఎందుకు వేస్తారంటే, కారణాలను కచ్చితంగా చెప్పలేం. అష్టలక్ష్ములను ఆహ్వానించడానికే కాదు, అతిథులను స్వాగతించడానికి కూడా ముంగిళ్లను ముగ్గులతో అలంకరించడం మన సంప్రదాయం. అతిథులను సాక్షాత్ భగవత్ స్వరూపులుగా గౌరవించే సంప్రదాయం మన దేశంలోనే ఉంది. అందుకే ‘అతిథి దేవో భవ’ అంటారు. తిథి వారాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా వచ్చేవాళ్లే అతిథులు. అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చిన వారిని గుమ్మంలోనే నిలబెట్టి, అప్పుడు స్వాగత సన్నాహాల కోసం తత్తరపడటం సరికాదు. బహుశ ఆ ఉద్దేశంతోనే మనవాళ్లు ముంగిళ్లలో ముగ్గులు వేయడాన్ని దినచర్యగా మార్చుకొని ఉంటారు. - పన్యాల జగన్నాథ దాసు ముగ్గులేసిన ‘మగా’నుభావుడు భారతీయ చిత్రకారుల్లో పురుష పుంగవులెవరూ ముగ్గులు వేయలేదు గానీ, ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సీ మాత్రం ముచ్చటగా ముగ్గులేశాడు. ఇండియన్ ముగ్గుల తీరుతెన్నులు ఈ ఇటాలియన్ చిత్రకారుడికి ఎలా పట్టుబడ్డాయనేది ఆశ్చర్యకరమే! మనవాళ్లు వేసే మెలికల ముగ్గుల్లాంటి డిజైన్లను డావిన్సీ చాలానే వేశాడు. తాను చిత్రించిన చాలా పోర్టరైట్స్లో కూడా దుస్తులపై ముగ్గుల డిజైన్లు వేశాడు. ముగ్గులేసిన ‘మగా’నుభావుడు చరిత్రలో డావిన్సీ ఒక్కడేనేమో! -
క్రేజీగా అమ్మాయిలు... ఈజీగా మోసాలు
ఇంగ్లిష్‌లో కాన్టెస్ట్ అంటే పోటీ. కాన్ అంటే మోసం. కాన్-టెస్ట్ అంటే మరి మోసం చేసే పోటీ అన్నట్టేగా! ఆడపిల్లల్ని బురిడీ కొడుతున్న ఎన్నో కాన్-టెస్ట్‌లు ఉన్నాయి జాగ్రత్త. అందాల వేట జోరు మీదుంది. కళాశాలా, షాపింగ్మాలా అనే తేడా లేదు. పబ్బులా, క్లబ్బులా అనే వ్యత్యాసమూ లేదు. ఎందెందు వెతికినా అందందే అన్నట్టుగా కొనసాగుతోంది అందగత్తెల అన్వేషణ. కిరీట ధారులై కిలకిలమంటున్న కాంతల నవ్వులతో నగరాలు హిస్టీరియా పూనినట్టు ఊగిపోతున్నాయి. ‘బ్యూటీ’ పథం వేగం చూస్తూంటే వీకెండ్స్‌లో ఏ మూవీకి వెళదాం అనేంత సహజంగా ఏ బ్యూటీ పెజెంట్కు వెళదాం అని అడిగే రోజులు వస్తాయేమోననే సందేహం. అయితే లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న అందాల పోటీలన్నీ అందలాలెక్కించేవేనా? అథఃపాతాళానికి తోసేవి ఏమీ లేవా? అంటే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం, సమయం, సందర్భం కూడా వచ్చేశాయి.మిస్ ఢిల్లీ నుంచి మిస్ గల్లీ దాకా రకరకాల టైటిల్స్ అనౌన్స్ చేస్తూ ఎడా పెడా నిర్వహిస్తున్న కాంటెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే విలువైన సమయంతో పాటు మరెన్నో కోల్పోవాల్సి వస్తుందని గ్లామర్ రంగ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. క్రేజీగా అమ్మాయిలు... ఈజీగా మోసాలు ఒకప్పుడు దేశీయంగా తెల్సిన ఏకైక బ్యూటీ కాంటెస్ట్ మిస్ ఇండియా. దాని తర్వాత మిసెస్ ఇండియా, గ్లాడ్రాగ్స్; మిస్ సౌతిండియా నుంచి మిస్ హైదరాబాద్, మిస్ తెలంగాణ మిస్ గుజరాతీ ఇలా ఏరియాల వారీగా, కమ్యూనిటీల వారీగా కూడా వచ్చేశాయి. ఇక్కడే వీటిని మార్కెట్ చేసుకునేవారు అడ్డదారులు తొక్కడానికి అందమైన బాట ఏర్పడింది. ఒకప్పటితో పోలిస్తే సినిమా, మోడలింగ్ రంగాలకు తొలి మెట్టు అని భావించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు యువతులు బాగా ముందుకొస్తున్నారు. బ్యూటీ ఈవెంట్స్ వాణిజ్యపరంగానూ లాభదాయకంగా మారాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచార ం అందించే మార్గాలుగా కూడా ఉపకరిస్తున్నాయి. కాస్తంత ముందస్తు ప్రచారం తోడైతే బోలెడన్ని అప్లికేషన్లు, కోకొల్లలుగా అభ్యర్థులు, ఇబ్బడిముబ్బడిగా స్పాన్సర్లు... దీంతో చిన్నా చితకా ఈవెంట్ మేనేజర్లు అందరూ కాంటెస్ట్ ముసుగులో దోపిడీకి దిగుతున్నారు. బ్యూటీఫుల్...బీకేర్ ఫుల్... అద్దం అబద్ధం చెప్పదు. అందాల కిరీటం అబద్ధం చెప్పొచ్చు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ట్రెండ్స్‌లో అడుగు కలపడంలో తప్పులేకపోయినా, మార్కెట్ మాయలో పావులుగా మారకుండా జాగ్రత్త పడాలి. దశల వారీ పోటీ, గ్రూమింగ్ సెషన్ల పేరుతో కొన్ని రోజుల పాటు యువతులను పూర్తిగా తమ ‘ఆధ్వర్యం’లో ఉండేలా చూసుకుంటున్నారు నిర్వాహకులు. ఆ సమయంలోనే ‘ఫలానా బ్యూటీ పేజెంట్‌లో పార్టిసిపెంట్స్ ఫలానా షోరూమ్‌లో...’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అలా రకరకాల కమర్షియల్ ఈవెంట్స్‌లో అమ్మాయిలను పాల్గొనేలా చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఈ సమయంలో అమ్మాయిలు వీరు చెప్పినట్టు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప మరేమీ చేయలేరు. ఇక టైటిల్స్ మోసాలు సరేసరి. ఇటీవల జరిగిన ఓ కాంటెస్ట్‌లో నిర్వాహకులు తమ స్వంత వారికే టైటిల్‌ను దక్కించుకునేలా చేస్తే, మరో సంస్థ విజేతకు ప్రైజ్‌మనీ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టింది. చాలా రకాల పోటీలు ప్రకటనలకే పరిమితమవుతూ స్పాన్సర్స్ వస్తే ఓకే లేకపోతే లేదు అన్నట్టుంటున్నాయి. అందాల పోటీలో గెలిచినా, ఓడిపోయినా నష్టం లేదు. అయితే చదువు, తెలివితేటలూ ఉండీ వంచనకు గురైతే అది జీవితకాలం వెంటాడే చేదు జ్ఞాపకం అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా అమ్మాయిలు తెలివితేటలతో ముందడుగు వేయడమే నిజమైన గెలుపు. ఆ అమ్మాయిది విజయవాడ. మోడలింగ్‌లో కెరీర్ ఎంచుకుంది. ఓ బ్యూటీ కాంటెస్ట్‌కు అప్లయ్ చేసింది. హైదరాబాద్‌లో ఆడిషన్ల ప్రక్రియ తర్వాత ఆమె ఎంపికయినట్టు ప్రకటించారు. తుది పోటీలలో పొల్గొనేందుకు అర్హత ధ్రువీకరణ పత్రాలు పంపిస్తామన్నారు. సరేనని ఇంటికొచ్చేశాక ఆమెకు వచ్చిన ఫోన్లు ఆమె కంటి మీద కునుకును కరవు చేశాయి. నిర్వాహకుల తరపున ఇద్దరు వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి తమ ‘అవసరాల’ను ఏకరవు పెట్టడం, అవి తీరిస్తే ైటె టిల్ తథ్యమని, ఆ తర్వాత ఏకంగా ఎక్కడికో ఆమె వెళ్లిపోతుందని చెప్పడం మొదలుపెట్టారు. సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆమె మనసును నిభాయించుకుని... ఆ పోటీకి గుడ్‌బై చెప్పేసింది. కాకినాడకు చెందిన మరో అమ్మాయి హైదరాబా ద్‌కు వచ్చి, నాలుగైదు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొ ంది. చివరకి ఒక సంస్థ వారు ఏదో నామ్‌కే వాస్తే టైటిల్ ఆమె చేతిలో పెట్టి, ఏడాది పాటు తమ ఆధ్వ ర్యంలో పనిచేయాల న్నారు. ఆ తర్వాత సిని మాలో ఛాన్స్ అంటూ ‘యువ నిర్మాతల’కు పరిచ యం చేశారు. కొన్ని నెలలు వారి చేతిలో కీలుబొమ్మలా మారాక... కొన్ని రోజులు ఓ రెస్టారెంట్లో సైతం పని చేసిన ఆ యువతి నర్సుగా పనిచేసే తల్లి ఏడ్చి మొత్తుకున్నాక తిరిగి తన ఊరుకు వెళ్లిపోయింది.ఇటీవలే ఒక బ్యూటీ ఈవెంట్లో టైటిల్ సాధించిన అందాల రాణికి ఆర్నెల్లుగా ప్రైజ్‌మనీ సంగతి అటుంచి, ధృవీకరణ పత్రం కూడా ఇవ్వకుండా నిర్వాహకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. అందాల పోటీల్లో పాల్గొనాలకునే అమ్మాయిలకు కొన్ని సూచనలు మోడల్‌గా రాణించాలంటే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఫిజిక్ లేకపోయినా పర్లేదు మా కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు అంటే నమ్మవద్దు.ఎంట్రీ ఫీజు కింద వేల రూపాయలు కట్టమంటే ఆదరబాదరా కట్టనవసరం లేదు.ఈ పోటీలలో అనుమతి, రిజిస్ట్రేషన్ లేనివాటిని గుర్తించాల్సిన బాధ్యత అమ్మాయిలదే.పబ్‌లు, లాంజ్బార్లను వేదికగా చేసుకుని నిర్వహించే పోటీలకు దూరంగా ఉండడమే మేలుటాప్ మోడల్స్‌ను, స్టార్స్‌ను తీసుకొచ్చినంత మాత్రాన గొప్ప సంస్థలు అనుకోవద్దు. సెలబ్రిటీలు తమ రెమ్యునరేషన్ తీసుకుని ప్రకటన వరకూ మాత్రమే పరిమితమవుతారు. ఆ తర్వాత వారికి ఆ ఈవెంట్ బాధ్యత ఉండదు. గ్లామర్ రంగంలో రాణించాలనా? టైంపాస్కా అనేది ముందు నిర్ణయించుకోవాలి.పోటీ నిర్వాహకులు ఎవరు? నిర్వాహక సంస్థ గత చరిత్ర ఏమిటి? ఆ కాంటెస్ట్‌లో గెలిస్తే వారందించే ప్రయోజనాలకు హామీ ఏమిటి? వగైరా విషయాలు సమగ్రంగా తెలుసుకోవాలి.కాంటెస్ట్ నిర్వహణ సందర్భంగా గ్రూమింగ్ సెషన్ల కోసమో, మరొకటో అంటూ నిర్వాహకులు దూరప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్వాహకులపై ఎటువంటి సందేహాలు తలెత్తినా, పోటీలో నిర్ణయాలు సరిగా తీసుకోవడం లేదు అనిపించినా వెంటనే వాటిపై ప్రశ్నించాలి. మౌనం వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువఅప్లయ్ చేసినప్పటి నుంచి ప్రతి దశలో తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తూ, వీలైతే వారిలో ఎవరో ఒకరు మీ వెంటే ఉండేలా చూసుకోవాలి. - ఎస్.సత్యబాబు -
బ్యూటిప్స్
పార్టీలు కానీ పండుగలు కానీ వచ్చాయంటే అమ్మాయిలు వేసుకునే మేకప్‌లో తప్పకుండా లిప్‌స్టిక్ ఉండాల్సిందే. యువత స్మైల్ వెనుక ఉండే కొండంత కాన్ఫిడెన్స్ ఈ లిప్స్టిక్కే అంటున్నారు బ్యూటీషియన్లు. మరి అలాంటి వాటిలో జాగ్రత్తలు, చిట్కాలు పాటించకపోతే ఎలా? అందుకే ఇవి.. -
భరోసా ఏదీ?
పేద తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచే ‘బంగారు తల్లి’కి భరోసా కరువైంది. ఆడపిల్లలపై వివక్షను రూపమాపేందుకు గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి జిల్లాలో ఆదరణ కరువైంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ‘బంగారు తల్లి’ అమలు ఇలా.. దరఖాస్తు చేసుకున్న వారు 32,008 మొదటి విడ త డబ్బులు అందుకున్న వారు 12,942 అర్హులుగా గుర్తించినా డబ్బులు రానివారు 13,799 ఇంటివద్ద ప్రసవం అయినవారు 3,115 సాక్షి, మహబూబ్‌నగర్: జననీ సురక్ష యోజన, సుఖీభవ, రాజీవ్ విద్యాదీవెన వంటి పథకాలతో సంబంధం లేకుండా బంగారు తల్లి పథకాన్ని రూపొందించారు. జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటివరకు 32,008 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో కేవలం 12,942 మందికి జనన నమోదు సమయంలో ఇచ్చే రూ.2,500 మాత్రమే అందాయి. మిగతా పద్దుల మాటే మరిచారు. ఈ పథకానికి అర్హత సాధించిన 13,799 మంది లబ్ధిదారుల జాబితాను సెర్ప్‌కు పంపించారు. వీరికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. అలాగే ఇంటి వద్ద డెలివరీ జరిగిన 3,115 మంది కూడా డబ్బులు రాలేదు. పది నెలలుగా లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపలేకపోతున్నారు. స్పందన కరువు బంగారు తల్లికి దరఖాస్తు చేసుకున్న వారికి అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రావడంలేదు. అయితే ఈ పథకాన్ని ప్రాథమికంగా నమోదు చేసుకునే వారు మండల సమాఖ్య కోఆర్డినేషన్(ఏపీఎం), మండల సమాఖ్య ప్రతినిధి, సీడీపీఓ అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వారేమీ చేయలేకపోతున్నారు. అయితే మరికొన్ని చోట్ల బ్యాంకులతో సమస్య తలెత్తింది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా తల్లి ఖాతాలో జమచేస్తారు. ఈ ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుంది. కొన్నిఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లు అధికారుల రికార్డుల్లో పేర్కొంటున్నా వాస్తవానికి చేరడం లేదు. లబ్ధిపొందే తీరు.. ఆడపిల్ల పుట్టగానే జనన నమోదు సమయంలో నెలరోజుల వ్యవధిలోనే రూ.2,500 బ్యాంకు ఖాతాలో జయచేస్తారు. ఆ తర్వాత 1-2 సంవత్సరాల వరకు టీకాల నిమిత్తం ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అందనున్నాయి. 3- 5 ఏళ్ల మధ్య సంవత్సరానికి రూ.1,500, 6-10 ఏళ్ల వరకు ఏడాదికి రూ.రెండు వేల చొప్పున అందనుంది. 11-13 ఏళ్లవరకు అంటే ఆరు నుంచి 8వ తరగతి వరకు ఏడాదికి రూ.2,500 అందుతుంది. 14-15 ఏళ్ల వరకు అంటే తొమ్మది, పదో తరగతి చదివే సమయంలో ఏడాదికి రూ.మూడువేల చొప్పున అందనుంది. 16-17 ఏళ్ల వరకు ఇంటర్ చదివే వరకు ఏడాదికి రూ.3,500, 18- 21 ఏళ్ల వరకు గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో ఏడాదికి రూ.4వేల చొప్పున అందుతుంది. ఇలా మొత్తం రూ.55,500 బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా రూపొందించారు. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పాసైతే రూ.50,000, గ్రాడ్యుయేషన్ పాసైతే రూ.లక్ష ఇలా మొత్తం రూ.1,55,000 అదనంగా అందనుంది. మొత్తం మీద బంగారు తల్లికి రూ.రెండు లక్షల మేర లబ్ధి చేకూరనుంది. డిసెంబర్లో డబ్బులు వచ్చే అవకాశముంది బంగారుతల్లి పథకం సంబంధించి డబ్బులు అందని మాట వాస్తవమే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు డబ్బులు రావడంలేదు. అర్హులైన 13వేల మందికి కూడా మొదటి విడతగా అందజేయాల్సిన డబ్బులు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత విధివిధానాలు ఖరారు కాలేదు. ప్రస్తుతం సభలో బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో బంగారుతల్లి అర్హులకు వచ్చే నెలలో డబ్బులు వచ్చే అవకాశముంది. - చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎవర్ని అడిగినా సమాధానం లేదు బంగారు తల్లి పథకం కోసం ధరకాస్తులు చేసుకుని నాలుగు నెలలు అ వుతున్నా ఇప్పటివరకు ఒక్కపైసా రాలేదు. కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. పైసలు వస్తాయో రావో కూడా చెప్పడం లేదు. మా మండలంలో 680 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 120మందికి మాత్రమే రూ.2500 చొప్పున అందించారు. - సుమేరా, మానవపాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు బంగారుతల్లి పథకం కింద గ తేడాది నవంబర్ 9న అధికారులు బాండ్ పేపర్ ఇచ్చారు. ఏడాదిగా ఒక్కరూపాయి కూడా అందలేదు. ఐకేపీ అధికారులు బ్యాంకు ఖాతాలో జమ చేశామని చెబుతున్నా.. డబ్బులు మాత్రం రాలేదు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. పాలెం యూబీఐ పరిధిలో బంగారు తల్లి పథకం లబ్ధిదారులకు ఏ ఒక్కరికీ డబ్బులు రాలేదు. - గన్నోజు సుమతి, పాలెం