ముగ్గు ముచ్చట్లు | special story to Rangoli | Sakshi
Sakshi News home page

ముగ్గు ముచ్చట్లు

Published Mon, Dec 21 2015 10:38 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

ముగ్గు ముచ్చట్లు

ముగ్గు ముచ్చట్లు

చక్కగా ఆవుపేడతో అలికిన ఇంటి ముందు గుల్లముగ్గులు అంటే బియ్యప్పిండిలో సున్నం పొడి కలిపిన ముగ్గులు పెట్టడం వల్ల క్రిమికీటకాలు ప్రవేశించవని, బ్యాక్టీరియా సోకదని అప్పుడెప్పుడో గడ్డాలు పెంచిన శాస్త్రవేత్తలే తేల్చి చెప్పేశారు.
 
ఓసారి ఆకాశంలో నుంచి కిందికి చూసిన ఓ అనుమానపు తారకకు తమలో కొందరు జారి కిందపడ్డారేమో అనే అనుమానం వచ్చిందట. కంగారు కంగారుగా ఆ విషయం అందరి చెవిలోనూ ఊదేసిందట. తారకలందరూ ఆందోళనగా ఒకరినొకరు లెక్కబెట్టుకుంటే అందరి లెక్కా సరిపోయిందట. దాంతో ‘అసలు నీకెందుకొచ్చిందీ అనుమానం?’ అని నిలదీశారట. ‘అనవసరంగా నన్నాడిపోసుకుంటారేం, మీరోసారి కిందకి చూడండి’అంటూ చికాకుపడిందట ఆ చుక్క. తారామణులందరూ నేలమీద తేరిపార చూస్తే... అందమైన అమ్మాయిలు,  పద్ధతి గల గృహిణులు ఎంతో శ్రద్ధాసక్తులతో ఇంటి ముంగిళ్లలో రకరకాల ఆకారాలలో చుక్కలు పెడుతూ, ఆ చుక్కలను కలుపుతూ రంగు రంగుల ముగ్గులు పెడుతూ కనిపించారట. ‘ఇది ధనుర్మాసం కదా... ఈ నెలంతా భూలోకంలో అందరూ ముగ్గులు పెడతారు, ఆ మాత్రం తెలియదా?’ అని దెప్పిపొడిచారట. అప్పుడా తార ‘ఇన్నాళ్లూ మనం ఆకాశంలో ఉన్నామని విర్రవీగుతున్నాం కదా, మనల్ని నేలమీదకు దించేవాళ్లు కూడా ఉన్నారు చూశారా?’ అని ఎదురు పోటు పొడిచిందట. అప్పుడు అందరూ కలసి హాయిగా నవ్వుకున్నారట.
 వినడానికి సరదాగా ఉన్నా, ముగ్గులు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. ధనుర్మాసంలో అయితే మరీనూ! ఒకప్పుడు సంక్రాంతి సీజన్‌లో కార్టూనిస్టులందరూ ముగ్గుల మీదనే తమ కుంచెను ఆనించేవారు. చుక్కల్ని కలుపుకుంటూ పక్కూరి పొలిమేర లు దాటేసిన వాళ్ల గురించి, ముగ్గులు పెడుతూ పెడుతూ చుక్కల పేట వరకూ షికారుకెళ్లిన వాళ్లను, ఎంతో కష్టపడి వేసిన తమ ముత్యాల ముగ్గు తొక్కారని పైటకొంగు బొడ్లో దోపి మరీ చావచితక్కొట్టిన వీరనారులను, ముగ్గు తొక్కకుండా లోనికొచ్చి జాబులందించడం కోసం పోస్ట్‌మెన్లు పడే పాట్ల దాకా కార్టూనిస్టులు దేనినీ వదిలిపెట్టలేదు.

చిన్న పిల్లల చేతిని తమ చేతిలోకి తీసుకుని ఇల్లు అలికి ముగ్గుపెట్టి... అని ఆటాడించడం, ఆ తర్వాత అదే ఆటను మనమూ పిల్లల చేత ఆడించడాలు చాలా మంది బుర్రల్లో ఇప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలే. అంతేనా! పిడికిట్లో ఇమిడిపోయే నడుమును విల్లంబులా వంచి, పైటచెంగును బొడ్డులో దోపి, నల్లతాచు లాంటి జడను నాట్యం చేయిస్తూ, పైనున్న చుక్కలతో పోటీ పడుతూ ముగ్గులు పెట్టే ముగ్గుగుమ్మలను ఆరాధనగా చూస్తూ, మనసు పారేసుకోని కుర్రాళ్లుండేవారా, వారి ముగ్గులో పడని పడతులుంటారా? గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి!

ముగ్గులు పెట్టడం వల్ల ముంగిలి ముచ్చటగా ఉంటుంది. అందంగా ముగ్గులు తీర్చిదిద్ది ఉన్న ఇంట శుభకార్యం ఏదో జరుగుతోందని అర్థం. ఎవరి వాకిళ్లలో అయినా అసలు ముగ్గుగీతే పడలేదంటే ఆ ఇంట అశుభం అయి ఉండొచ్చేమో అని అర్థం చేసుకుంటారు. అందుకే ఇల్లాళ్లందరూ ముగ్గు వెయ్యడం విధిగా, అదే తమకు నిధిగా భావిస్తుంటారు.ముగ్గులు పెట్టడంలో మీ కారణాలు మీకుంటే ఉండచ్చు గాక చక్కగా ఆవుపేడతో అలికిన ఇంటి ముందు గుల్లముగ్గులు అంటే బియ్యప్పిండిలో సున్నం పొడి కలిపిన ముగ్గులు పెట్టడం వల్ల క్రిమికీటకాలు ప్రవేశించవని, బ్యాక్టీరియా సోకదని అప్పుడెప్పుడో గడ్డాలు పెంచిన శాస్త్రవేత్తలే తేల్చి చెప్పేశారు.

పూర్వం ఇల్లు అలికి ముగ్గుపెట్టనిదే వంట చేసేవారు కాదు. అగ్నిని ఆరాధించే వారు కూడా ముందుగా ముగ్గు పెట్టిన తర్వాతనే అగ్న్యారాధన చేసేవారు. అలాగే ఓ యజ్ఞం చెయ్యాలన్నా, హోమగుండం తవ్వాలన్నా, పాలు పొంగించాలన్నా, పూజకు కలశం పెట్టాలన్నా ముత్యాల్లాంటి ముగ్గులు పడాల్సిందే! అందరి లోగిళ్లూ ముగ్గుమందారాలయినప్పుడు ఊరంతా సంక్రాంతే మరి!
 - డి.వి.ఆర్. భాస్కర్
 
అతివల అనాది కళ
కోడికూతతోనే నిద్రలేచి, వాకిలి చిమ్మి, పేడనీటితో కళ్లాపి చల్లి ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్దడం తెలుగిళ్లలోనే కాదు, దేశవ్యాప్తంగా భారతీయుల ఇళ్లలో ఇదొక అనుదినచర్య. అభివృద్ధి వేగానికి పట్టణీకరణ పెరిగాక, వాకిళ్లు కుంచించుకుపోయాయి. కళ్లాపి చల్లడానికి వీల్లేని సిమెంటు గచ్చులు వచ్చిపడ్డాయి. నయా జమానాలో నగరాల దుస్థితి చెప్పనే అక్కర్లేదు... మనుషుల్లో అనివార్యంగా అపార్ట్‌మెంటాలిటీ పెరిగింది. అపార్ట్‌మెంట్లలో ఎవరి గూడు వాళ్లదే! ఎవరి గుమ్మం వాళ్లదే! గుమ్మం ముందు ఉండే ఖాళీ జాగా దోసెడంతే! అనివార్య అధునాతన పరిణామాల ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు కళ్లాపి కనుమరుగైనా, ముగ్గులింకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకు చాలామంది రాతిపిండితో రంగవల్లికలను తీర్చిదిద్దేవాళ్లు. కొందరు నేరుగా ముగ్గురాతితోనూ , ఇంకొందరు చీమల వంటి చిరుజీవులకు ఆహారంగా కూడా ఉపయోగపడాలనే భూతదయతో వరిపిండితోనూ ముగ్గులు వేసేవాళ్లు. ఇప్పుడు జమానా బదల్‌గయా! పండుగల సీజన్‌లలో తప్ప మిగిలిన రోజుల్లో చాక్‌పీసులతో హడావుడి ముగ్గులు గీసి పారేస్తున్నారు. ఎలా గీసినా వాకిళ్లలో ముగ్గులు గీయడాన్ని ముదితలింకా మరచిపోలేదు.
   
ముగ్గూ- దాని పుట్టుపూర్వోత్తరాలు గ్రంథస్థం కాలేదు గానీ, ముగ్గులు పురాణాల కంటే ముందే పుట్టి ఉంటాయనే అంచనా ఉంది. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లికల ప్రస్తావన ఉంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణగాథ ఉంది. ఎప్పుడో సత్యకాలంలో ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు దగ్గర ఒక రాజగురువు ఉండేవాడు. విధివశాన ఆ రాజగురువు కొడుకు అకాల మరణం చెందాడు. పుత్రశోకంతో ఆ రాజగురువు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమంటే, చనిపోయిన తన కొడుకును బతికించమంటాడు రాజగురువు. అప్పుడు బ్రహ్మదేవుడు... నేలను శుభ్రం చేసి, అక్కడ మనిషి ఆకారంలో ముగ్గు వేయించమని ఆదేశిస్తాడు. అలాగే ముగ్గు వేయడంతో, చనిపోయిన రాజగురువు కొడుకును బతికిస్తాడు. అప్పటి నుంచి ముంగిళ్లలో ముగ్గులు వేయడం ఆచారంగా మారిందని చెబుతారు.
   
ముగ్గులు ఎందుకు వేస్తారంటే, కారణాలను కచ్చితంగా చెప్పలేం. అష్టలక్ష్ములను ఆహ్వానించడానికే కాదు, అతిథులను స్వాగతించడానికి కూడా ముంగిళ్లను ముగ్గులతో అలంకరించడం మన సంప్రదాయం. అతిథులను సాక్షాత్ భగవత్ స్వరూపులుగా గౌరవించే సంప్రదాయం మన దేశంలోనే ఉంది. అందుకే ‘అతిథి దేవో భవ’ అంటారు. తిథి వారాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా వచ్చేవాళ్లే అతిథులు. అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చిన వారిని గుమ్మంలోనే నిలబెట్టి, అప్పుడు స్వాగత సన్నాహాల కోసం తత్తరపడటం సరికాదు. బహుశ ఆ ఉద్దేశంతోనే మనవాళ్లు ముంగిళ్లలో ముగ్గులు వేయడాన్ని దినచర్యగా మార్చుకొని ఉంటారు.
 - పన్యాల జగన్నాథ దాసు
 
 
ముగ్గులేసిన

 ‘మగా’నుభావుడు  భారతీయ చిత్రకారుల్లో పురుష పుంగవులెవరూ ముగ్గులు వేయలేదు గానీ, ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సీ మాత్రం ముచ్చటగా ముగ్గులేశాడు. ఇండియన్ ముగ్గుల తీరుతెన్నులు ఈ ఇటాలియన్ చిత్రకారుడికి ఎలా పట్టుబడ్డాయనేది ఆశ్చర్యకరమే! మనవాళ్లు వేసే మెలికల ముగ్గుల్లాంటి డిజైన్లను డావిన్సీ చాలానే వేశాడు. తాను చిత్రించిన చాలా పోర్టరైట్స్‌లో కూడా దుస్తులపై ముగ్గుల డిజైన్లు వేశాడు. ముగ్గులేసిన
 ‘మగా’నుభావుడు చరిత్రలో డావిన్సీ ఒక్కడేనేమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement