నాకు నచ్చిన ఐదు పుస్తకాలు | Tenneti Shyama Krishna's favorite five books | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన ఐదు పుస్తకాలు

Published Mon, Nov 20 2017 12:56 AM | Last Updated on Mon, Nov 20 2017 12:56 AM

Tenneti Shyama Krishna's favorite five books - Sakshi

చంఘిజ్‌ఖాన్‌ (తెన్నేటి సూరి)

నా హైస్కూల్‌ జీవితంలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన రచన. చరిత్రకారులు అత్యంత క్రూరుడిగా చిత్రించిన విజేత చంఘిజ్‌ఖాన్‌ జీవితాన్ని మరోకోణంలో చూపే నవల. నాటి కుటిల రాజకీయాల మధ్య తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చంఘిజ్‌ఖాన్‌ సాగించిన పోరాటాన్ని తనదైన శైలిలో రచించి ఆలోచింపజేశారు రచయిత.

Notes from the Gallows (జూలియస్‌ ప్యుషిక్‌)
రెండవ ప్రపంచయుద్ధ కాలంలో వెలువడిన చెరసాల–సాహిత్యం కోవకు చెందినది. నాజీల ఆక్రమణకు గురైన జెకొస్లవేకియా ప్రజల తిరుగుబాటు యుద్ధంలో పాలుపంచుకున్న కమ్యూనిస్ట్‌ నాయకుడు, పాత్రికేయుడు ప్యుషిక్‌ జైలులో తను, తన సహచరులు అనుభవించిన నరకయాతనను తన నోట్స్‌గా వ్రాసుకున్నారు. ఈ నోట్స్‌ వెలుగుచూడకముందే ఆయన జైలులో మరణించాడు. ఆయన ముగింపు వాక్యాలు: ‘నా ప్రజలూ, ఫాసిజాన్ని నిరసించే ప్రపంచ పౌరులందరూ ఈ రచనకు శుభమైన ముగింపు పలుకుతారు’.

లజ్జ (తస్లిమా నస్రీన్‌)
బాబ్రీ మసీదు కూల్చివేత తరవాత ముస్లిం మత ఛాందసులు బంగ్లాదేశ్‌లోని హిందువులను ఒక ప్రణాళిక ప్రకారం చంపడం, ఆస్తులను హరించడం, భయభ్రాంతులకు గురిచేయడాన్ని తస్లిమా ఈ నవలలో కళ్లకు కట్టినట్టు చూపారు. ఫలితంగా ఫత్వా జారీౖయె ప్రాణభయంతో భారతదేశంలో తలదాచుకున్నారు. నిప్పులాంటి నిజాన్ని బట్టబయలు చేయడానికి ఒక స్త్రీగా ఆమె చేసిన సాహసం అరుదైనదీ, అమోఘమైనదీను.

The Pelican Brief (జాన్‌ గ్రిశామ్‌)
ఇద్దరు అమెరికన్‌ సుప్రీంకోర్టు న్యాయాధికారుల హత్య వెనక ఎంత పెద్ద కుట్ర దాగివుందో తన ‘లా’ పరిజ్ఞానంతో ఊహించి వ్రాసుకున్న నోట్స్‌ చేరవలసిన వాళ్లకు చేరి, ఒక శాపంలా మారి, డర్బీ షా జీవితాన్ని వెంటాడి వేటాడుతుంది. ఆమె చివరకు ఎలా నెగ్గుకొస్తుందో అనే ఊత్కంఠరేపుతుంది.

మ్యూజింగ్స్‌ (చలం)
సమాజంలోని వివిధ విషయాలపై చలం అంతర్మథనం ఈ మ్యూజింగ్స్‌. తనకు కనిపించిన లొసుగులపై ఆయన సంధించిన వ్యంగ్యబాణాలు మనని నవ్విస్తాయి. కానీ, అవి రుచించని వాళ్లు ఆయనకు కల్పించిన ఖేదాన్ని చూసి మేధావి కావడం కూడా ఒక శాపమా? అనిపించక మానదు.  Sense of humour, how dangerous అంటాడాయన ఒకచోట.


- తెన్నేటి శ్యామకృష్ణ

9490995015

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement