న్యూఢిల్లీ: ఎప్పుడో పాతికేళ్ల క్రితం ప్రారంభించిన 2జీ టెలిఫోనీ సర్వీసులను ఇక నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా తొలి మొబైల్ ఫోన్ కాల్ చేసి పాతికేళ్లయిన సందర్భంగా (సిల్వర్ జూబ్లీ) నిర్వహించిన కార్యక్రమంలో అంబానీ పాల్గొన్నారు.
‘ఒకవైపు భారత్‌తో పాటు మిగతా ప్రపంచం 5జీ టెలిఫోనీ ముంగిట్లో ఉండగా, దేశీయంగా ఇంకా 30 కోట్ల మంది 2జీ శకంలోనే చిక్కుబడి ఉండిపోయారు. వారు వాడుతున్న ఫీచర్ ఫోన్ల కారణంగా ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీసులు కూడా పొందలేకపోతున్నారు. కాబట్టి 2జీని చరిత్రలో కలిపేసే దిశగా ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన విధానపరంగా తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను‘ అని ఆయన చెప్పారు.
ఫిక్సిడ్ లైన్ టెలిఫోన్ సర్వీసులతో కాల్పనిక అంశం వాస్తవ రూపం దాల్చిందని, అయితే కమ్యూనికేషన్‌కు సంబంధించి పాక్షిక స్వాతంత్య్రం మాత్రమే వచ్చిందని అంబానీ పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో మొబైల్ సేవల రాకతో భారత్ ఉజ్వల భవిష్యత్ దిశగా ప్రయాణం ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం రిలయన్స్ జియో 4జీ సేవలు మాత్రమే అందిస్తుండగా భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా 2జీ టెక్నాలజీతో సర్వీసులు అందిస్తున్నాయి.
ప్రస్తుతం చౌకగా మొబైల్ సేవలు..
ప్రస్తుతం మొబైల్ ఫోన్ సర్వీసులు అత్యంత చౌకగా మారాయని అంబానీ తెలిపారు. ‘1995లో సెల్‌ఫోన్ నుంచి కాల్ చేస్తే నిమిషానికి రూ. 24 చార్జీ అయ్యేది. ఇందులో కాల్ చేసిన వారికి రూ. 16, అందుకున్నవారికి రూ. 8 వర్తించేది. ఇప్పుడు ఎలాంటి పరిమితులూ లేకుండా వాయిస్ కాల్స్ పూర్తి ఉచితంగా లభిస్తున్నాయి. గతంలోలాగా మొబైల్ సేవలు కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కావు.
సంపన్నులు, పేదల మధ్య తారతమ్యాలను మొబైల్ టెలిఫోనీ సేవలు చెరిపేసినంతగా బహుశా చరిత్రలో మరొక టెక్నాలజీ సాధనం లేకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు తమ ఫోన్ల ద్వారానే వార్తలు తెలుసుకోవడంతో పాటు వీడియోలు చూడటం, వీడియోలు తయారు చేయడం తదితర పనులన్నీ చేయగలుగుతున్నారని అంబానీ వివరించారు. పాతికేళ్ల క్రితం మొబిలిటీ విషయంలో సంపన్న దేశాలను భారత్ అనుసరించాల్సి వచ్చేదని, కీలక టెక్నాలజీలో ప్ర పంచ దేశాలకన్నా భారత్‌ను ముందు నిల పాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మెరుగుపడాలి: అన్షు ప్రకాశ్
గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నందున.. కనెక్టివిటీని మెరుగుపర్చడంపై టెలికం పరిశ్రమ దృష్టి పెట్టాలని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సూచించారు. టెలికం సేవలు ప్రస్తుతం ప్రాథమిక అవసరంగా మారాయని ఆయన చెప్పారు. అయితే, భారీ పెట్టుబడులు అవసరమయ్యే రంగం అయినందున రానున్న రోజుల్లో పరిశ్రమ పెను సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రకాష్ తెలిపారు. భారత్‌కి భారీ స్థాయిలో వైర్‌లైన్ కమ్యూనికేషన్, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ అవసరమని ఆయన చెప్పారు. 5జీ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
భారత్ .. జియోపై ఫేస్‌బుక్, గూగుల్ ఆశలు
జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల ద్వారా భారత మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకోవాలని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్, గూగుల్ భావిస్తున్నాయి. ఇన్వెస్టర్లతో సమావేశంలో ఈ రెండు కంపెనీలు భారత మార్కెట్ ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇందుకు నిదర్శనం. ‘భారత్‌లో భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. జియోతో భాగస్వామ్యంతో వేల సంఖ్యలో కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలను వాట్సాప్‌లో భాగం చేయదల్చుకున్నాం. వాట్సాప్ ద్వారా క్రయవిక్రయాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. దీన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
ముందుగా చెల్లింపుల సేవలతో దీనికి శ్రీకారం చుడతాం. తద్వారా వ్యాపారం మరింతగా పుంజుకోగలదు‘ అని జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులపై స్పందిస్తూ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. రిలయన్స్‌కి చెందిన డిజిటల్ వ్యాపారాల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సుమారు రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారత్‌లో డిజిటైజేషన్‌కు ఊతమిచ్చేలా వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో దాదాపు 10 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment