ముంబై: చమురు నుంచి రిటైల్, టెలికం దాకా వివిధ రంగాల్లో విస్తరించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వ్యాపార వృద్ధికి ఊతమిచ్చే కొత్త ఇంధనాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గురువారం జరిగిన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) భారీ ప్రణాళికలు ఆవిష్కరించింది. వీటి ప్రకారం పర్యావరణ అనుకూల ఇంధనాలపై వచ్చే మూడేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
సోలార్ సెల్స్ తయారీ ప్లాంట్లు, విద్యుత్ నిల్వ చేసే బ్యాటరీల ఫ్యాక్టరీ, ఫ్యుయెల్ సెల్ తయారీ ప్లాంటు, హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎలక్ట్రోలైజర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఏజీఎంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 2030 నాటికి 100 గిగావాట్ల (జీడబ్ల్యూ) సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను, కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయాల్లో దాదాపు 60 శాతం .. హైడ్రోకార్బన్ ఆధారిత ఇంధనాల కార్యకలాపాల ద్వారానే వస్తోంది.
‘2035 నాటికి పూర్తిగా కర్బన ఉద్గారాల రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్ గతేడాది లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా వ్యూహాలు, మార్గదర్శక ప్రణాళికలను నేడు మీ ముందు ఉంచుతున్నాను. ఈ ప్రణాళికల అమలుపై వచ్చే మూడేళ్లలో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం. నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నాం‘ అని ముకేశ్ అంబానీ వెల్లడించారు. నాలుగు గిగా ఫ్యాక్టరీలకు అవసరమైన పరికరాల తయారీకి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ. 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అమలు ఇలా ..: రిలయన్స్ 2030 నాటికి కనీసం 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు అంబానీ చెప్పారు. ఇందులో సింహభాగం రూఫ్‌టాప్ సోలార్, గ్రామాల్లో సౌర విద్యుత్ మౌలిక సదుపాయాల ఏర్పాటు రూపంలో ఉండనుంది. ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను నిల్వ చేసేందుకు అత్యాధునిక బ్యాటరీల తయారీ కోసం ప్రత్యేకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విద్యుత్‌తో పాటు వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించగలిగే హరిత హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీలో అంతర్గతంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ నిర్వహణ.. నిర్మాణం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ ఫైనాన్స్ పేరిట రెండు విభాగాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
5జీ ముందుగా మేమే తెస్తాం..
దేశీయంగా పూర్తి స్థాయిలో 5జీ సర్వీసులను తమ కంపెనీయే ముందుగా అందుబాటులోకి తెస్తుం దని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ఇతర భాగస్వాములతో కలిసి దేశీయంగా రూపొందించిన 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలిపారు. ఇవి 1 జీబీపీఎస్ పైగా స్పీడ్‌తో పనిచేసినట్లు చెప్పా రు. దేశవ్యాప్తంగా తమ డేటా సెంటర్లలో, నవీ ముంబైలోని ట్రయల్ సైట్లలో 5జీ నెట్‌వర్క్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు అంబానీ పేర్కొన్నారు.
ఏజీఎం నేపథ్యంలో గురువారం షేరు బీఎస్‌ఈలో 2.35% తగ్గి రూ. 2,153 వద్ద క్లోజయ్యింది.
సెప్టెంబర్‌లో జియో–గూగుల్ ఫోన్..
టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి రూపొందించిన చౌక 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ముకేశ్ అంబానీ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 10 నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జియోఫోన్ నెక్ట్స్ పేరిట దీన్ని ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ కాగలదని ఆయన పేర్కొన్నారు.
‘భారత్‌ను 2జీ విముక్త దేశంగా మార్చాలంటే అత్యంత చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్ అవసరం. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం జియో, గూగుల్ కలిసి జియోఫోన్ నెక్ట్స్ రూపొందించాయి‘ అని అంబానీ తెలిపారు. దీనికోసమే ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినట్లు ఏజీఎంలో వర్చువల్‌గా పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. 5జీకి సంబంధించి కూడా గూగుల్ క్లౌడ్, జియో జట్టు కట్టాయని ఆయన వివరించారు.
ఫోన్ ధర కీలకం..
దాదాపు 30 కోట్ల మంది యూజర్లకు చేరువయ్యేందుకు చౌక స్మార్ట్‌ఫోన్ రిలయన్స్‌కి ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, అంతిమంగా ధర, పనితీరు కీలకంగా ఉంటుందని పేర్కొన్నాయి. కరోనా వైరస్‌కు పూర్వం భారత మార్కెట్లో రూ. 5,000 పైగా రేటున్న స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్ వాటా అయిదు శాతమేనని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. రూ. 5,000 లోపు సెగ్మెంట్‌పై ఏ సంస్థా పెద్దగా ఆధిపత్యం సాధించలేకపోయిందని పేర్కొన్నారు.
రిలయన్స్ రిటైల్‌తో 10 లక్షల ఉద్యోగాలు..
వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్ మూడు రెట్లు వృద్ధి చెందగలదని ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న రిలయన్స్ రిటైల్‌ను.. ప్రపంచ టాప్ 10లో ఒకటిగా చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. వచ్చే మూడేళ్లలో రిలయన్స్ రిటైల్‌తో 10 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, మరెంతో మందికి జీవనోపాధి కల్పించగలదని అంబానీ తెలిపారు. పరిశోధన, డిజైన్, ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకోవడంపై రిలయన్స్ రిటైల్ గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో ఈ–కామర్స్ విభాగం జియోమార్ట్‌లో ఒక కోటి పైగా వ్యాపారులను భాగస్వాములుగా చేసుకోవాలనే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
రేటింగ్ అప్‌గ్రేడ్: ఫిచ్
భారీ ప్రణాళికలతో ముందుకెడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను ‘బీబీబీ’కు అప్‌గ్రేడ్ చేసినట్లు ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వివిధ వ్యాపార విభాగాల నుంచి వచ్చే నగదు ప్రవాహం, రుణభారాన్ని తగ్గించుకునేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిచ్ తెలిపింది. ఇది భారత సార్వభౌమత్వ రేటింగ్ కన్నా ఒక అంచె ఎక్కువ కావడం గమనార్హం.
బోర్డులోకి ఆరామ్‌కో చైర్మన్..
సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కోతో ప్రతిపాదిత 15 బిలియన్ డాలర్ల డీల్ ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంబానీ తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా చమురు, రసాయనాల (ఓ2సీ) వ్యాపార విభాగంలో ఆరామ్‌కో 20 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి 2020 మార్చి నాటికి ఇది పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరిగింది. తాజాగా సౌదీ ఆరామ్‌కో చైర్మన్, సావరీన్ వెల్త్‌ఫండ్ పీఐఎఫ్ చీఫ్ యాసిర్ ఆథ్మాన్ అల్–రుమయ్యాన్ (51) .. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరనున్నట్లు అంబానీ తెలిపారు. బోర్డు సభ్యుడైన యోగేంద్ర పి త్రివేది (92) రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారని, ఆయన స్థానాన్ని యాసిర్ భర్తీ చేస్తారని అంబానీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment