25 ఏళ్ల దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే | Shah Rukh Khan-Kajol statue to be unveiled at London Scenes In The Square | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే

Published Tue, Oct 20 2020 12:10 AM | Last Updated on Tue, Oct 20 2020 7:48 AM

Shah Rukh Khan-Kajol statue to be unveiled at London Scenes In The Square - Sakshi

‘నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో’ అంటుంది ఈ సినిమాలోని సిమ్రన్‌ పాత్ర పోషించిన కాజోల్‌ పసుప్పచ్చటి చేలలో.
‘అలా నిన్ను తీసుకెళ్లాలంటే ఇంత కష్టపడటం ఎందుకూ?’ అంటాడు రాజ్‌ పాత్రలో ఉన్న షారుక్‌ ఖాన్‌.. అప్పటికే ఆమె కోసం లండన్‌ వదిలి పంజాబ్‌లోని పల్లెకు చేరుకుని ఆమె కుటుంబం ఆదరణ పొందే ప్రయత్నంలో ఉంటూ.
కాజోల్‌ తండ్రి అమ్రిష్‌ పురికి తన కుమార్తెను తన ప్రాంతంలో తన బంధువర్గంలో ఇచ్చి చేయాలని కోరిక.
కాని ఆమె షారుక్‌ను ప్రేమించింది. షారుక్‌ కుటుంబం ఏమిటో అమ్రిష్‌ పురికి తెలియదు. వాళ్లు ఎలాంటివాళ్లో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే కాజోల్‌ ప్రేమకు నో చెబుతాడు.
నో చెప్పిన వెంటనే కాజోల్‌ షారుక్‌ పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటే కథే లేదు.
‘మనకు మంచీ చెడు తెలుసు. మనకు ఏది సంతోషమో దానిని ఎంచుకోగలం. ఆ ఎంచుకున్నదానిని కుటుంబంలో భాగం చేయగలం. అంతవరకు ఓపికగా ఉండగలం’ అని రాజ్, సిమ్రన్‌ నమ్మడం వల్లే ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ భారతీయులకు అంతగా నచ్చింది. అక్టోబర్‌ 20, 1995లో రిలీజయ్యింది ఆ సినిమా. ఆ తర్వాత అది సృష్టించిందంతా చరిత్రే.

కథ కొత్తది
కాజోల్‌ లండన్‌లో ఉంటుంది. షారుక్‌ కూడా లండన్‌లోనే ఉంటాడు. కాజోల్‌ తండ్రి చాటు బిడ్డ. షారుక్‌ తండ్రిని స్నేహితుడుగా భావించే కుర్రవాడు. ఒకరికొకరు పరిచయం లేని వీళ్లిద్దరూ తమ గ్రాడ్యుయేషన్‌ అయిపోయాక విడివిడిగా విహారం కోసం యూరప్‌ యాత్రకు బయలుదేరి ట్రైన్‌లో పరిచయం అవుతారు. అప్పటికే కాజోల్‌కు పెళ్లి మాట నడిచి ఉంటుంది. పంజాబ్‌లో కుర్రాడున్నాడని తండ్రి చెప్పేసి ఉంటాడు. కాని ఆమె షారుక్‌తో ప్రేమలో పడుతుంది. షారుక్‌ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కాని తండ్రి దీనిని అంగీకరించడు. వెంటనే కుటుంబాన్ని పంజాబ్‌కు మార్చి పెళ్లి పనులు మొదలెడతాడు. ఆమె కోసం షారుక్‌ పెళ్లికొడుకు స్నేహితుడిగా విడిది ఇంట్లో అడుగుపెట్టి కాజోల్‌ తల్లిదండ్రులను ఒప్పించి కాజోల్‌ను తనతో పాటు తీసుకువెళ్లడమే కథ. దీనికి ముందు హిందీలో వచ్చిన ‘ఏక్‌ దూజే కే లియే’, ‘కయామత్‌ సే కయామత్‌ తక్‌’ లాంటి ప్రేమ కథలు విషాదంతాలు. కాని ఇది సుఖాంతం. కుటుంబంతో పాటు సుఖాంతం.

తారలు పుట్టిన వేళ
బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయం ఆమిర్, సల్మాన్, షారుక్‌ ఎస్టాబ్లిష్‌ అవుతున్న కాలం అది. షారుక్‌– కాజోల్‌ కలిసి అప్పటికే ‘బాజీగర్‌’, ‘కరణ్‌–అర్జున్‌’లలో నటించారు. కాని ఇంకా స్టార్‌డమ్‌ రాలేదు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పగ్గాలు యశ్‌ చోప్రా నుంచి అతని కుమారుడు ఆదిత్యా చోప్రా అందుకుంటూ మొదటిసారిగా ఒక కథ రాసి తండ్రికి వినిపించి డైరెక్ట్‌ చేయమన్నాడు. ‘కథ బాగుంది. నువ్వే చెయ్‌’ అని తండ్రి ప్రోత్సహించాడు. ఆ కథే ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమాకు హీరోగా షారుక్‌ను అడిగితే అప్పటికి ‘డిఫరెంట్‌ రోల్స్‌’ చేయాలని కోరుకుంటున్న షారుక్‌ కాదన్నాడు. ‘నువ్వు స్టార్‌వి కావాలంటే ప్రతి స్త్రీ మనసు దోచే, ప్రతి తల్లి హర్షించే ఇలాంటి రోల్‌ చేయాలి. ఆలోచించుకో’ అని ఆదిత్య చెప్పాక ఒప్పుకున్నాడు. సినిమా సూపర్‌హిట్‌ అయ్యాక షారుక్‌ పదే పదే యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు ఈ సినిమా ఇచ్చినందుకు. కాజోల్‌ కథ విన్నాక వెంటనే ఒప్పుకుంది. సినిమా రిలీజయ్యాక వీరి జోడి ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన జోడీగా నిలిచింది.

అందరూ తలో చేయి
‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ కథను ఆదిత్యా చోప్రా మూడేళ్లు రాశాడు. మొదట ఇది ఒక అమెరికన్, ఒక ఇండియన్‌ ప్రేమ కథ అనుకున్నాడు. కాని యశ్‌ చోప్రా సూచనతో హీరో హీరోయిన్లను ఎన్‌ఆర్‌ఐలుగా మార్చాడు. ఈ కథా తయారీలో ఆదిత్య దగ్గరి బంధువు, ఇప్పటి ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహర్‌ పాల్గొన్నాడు. సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. సంగీత దర్శకులుగా జతిన్‌–లలిత్‌ సూపర్‌హిట్‌ పాటలు ఇచ్చారు. ఆనంద్‌ బక్షీ వాటిని రాశాడు. కెమెరా మన్‌మోహన్‌ సింగ్‌. కాస్ట్యూమ్స్‌ మనీష్‌ మల్హోత్రా. సినిమాకు టైటిల్‌ని కిరణ్‌ ఖేర్‌ సూచించింది. ‘చోర్‌ మచాయేంగే షోర్‌’ సినిమాలోని ‘లేజాయేంగే లేజాయేంగే’ పాటలోని లైన్‌ ఇది. టైటిల్‌ సూచించినందుకు ఆమె పేరును టైటిల్స్‌లో వేశారు కూడా.

రిలీజయ్యాక..
ఈ సినిమా బడ్జెట్‌ ఆ రోజుల్లో 4 కోట్లు. కాని ఎంత కలెక్ట్‌ చేసిందో తెలుసా? 250 కోట్లు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్‌ హౌస్‌గా నిలిచి ఉంది. ‘అందరూ పదే పదే చూసే సినిమాగా తీయాలి’ అనుకుని దర్శకుడు తీయడం వల్లే ఇది సాధ్యమైంది. ‘షోలే’ ముంబైలోని మినర్వా థియేటర్‌లో ఐదేళ్లే ఆడింది. కాని ఈ సినిమా లాక్‌డౌన్‌ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్‌ షోగా ఆడుతూనే ఉంది. 25 వారాలంటే సిల్వర్‌ జూబ్లీ. కాని ఈ సినిమా 2014లో వేయి వారాలు దాటింది.

పాటలు.. సన్నివేశాలు
కాజోల్‌ మీద తీసిన ‘మేరే ఖ్వాబోమే జో ఆయే’, షారుక్‌–కాజోల్‌ల మీద ఆవాల చేలలో తీసిన ‘తుజే దేఖాహై’, ఖవాలీ స్టైల్‌లో తీసిన ‘మెహందీ లాగా కే రఖ్‌నా’... ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. క్లయిమాక్స్‌లో కాజోల్‌ తండ్రి చేయి వదిలి షారుక్‌ను అందుకోవడానికి ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తే సీన్‌ అనేక సినిమాలలో సీరియస్‌గా, స్పూఫ్‌గా రిపీట్‌ అయ్యింది. ఈ సినిమాతోనే విదేశాలలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు కథల్లో భాగం కావడం మొదలైంది. ఇవాళ్టికీ టీవీలో కోట్లాది మహిళా ప్రేక్షకుల, యవతీ యువకుల ప్రియమైన సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’.

అరుదైన గౌరవం
‘దిల్‌వాలే....’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఎన్నో  అరుదైన రికార్డులు సృష్టిస్తూనే వస్తోంది. అయితే
25 ఏళ్ల సందర్భంగా ఓ కొత్త గౌరవం దక్కించుకుంది. లండన్‌లోని ‘సీన్స్‌ ఇన్‌ ది స్క్వేర్‌’లో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’లో షారుక్, కాజోల్‌ పాత్రల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ యానివర్సరీని పురస్కరించుకుని ప్రకటించారు. బాలీవుడ్‌కి సంబంధించి లండన్‌లోని ‘సీన్స్‌ ఇన్‌ ది స్క్వేర్‌’లో ఏర్పాటు చేయనున్న తొలి విగ్రహాలు ఈ సినిమాకు సంబంధించినవే కావడం విశేషం. ‘ఇది ఈ సినిమాకు దక్కిన గౌరవం’ అని చిత్రబృందం తెలిపింది. పలు ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాల బొమ్మల చెంత మన ‘దిల్‌వాలే..’ చేరనుండడం భారతీయ సినిమాకు దక్కిన మంచి గౌరవం.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement