yashraj films
-
నేడే చూడండి టికెట్ కేవలం 50 రూపాయిలే
కోవిడ్ వల్ల థియేటర్స్ వైపుకు రావట్లేదు ప్రేక్షకులు. వాళ్లందరూ మళ్లీ థియేటర్స్ బాట పట్టాలంటే ఏదో బలమైన ఆకర్షణ ఉండాలి. మంచి సినిమా ఉండాలి. బంఫర్ ఆఫర్ ఉండాలి. వీటన్నింటినీ కలిపి ఇవ్వడానికి ప్లాన్ సిద్ధం చేశాయి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్, పలు మల్టీప్లెక్స్ చైన్లు. ఆ విశేషాలు. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణంలోకి వచ్చి 50 ఏళ్లయింది. యాభై ఏళ్లుగా ఎన్నో విజయవంతమైన, సంచలనమైన సినిమాలను అందిస్తూ వస్తోంది. 50ఏళ్ల ప్రయాణం సందర్భంగా పలు భారీ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఓ కొత్త ఆలోచనతో యశ్‌రాజ్ ముందుకు వచ్చింది. ఇన్నేళ్లుగా తమ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ఏదైనా ఇవ్వాలనుకుంది. తమ సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ఆనందించేలా చేయాలనుకుంది. కోవిడ్ వల్ల మర్చిపోయిన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను తిరిగి రుచి చూపించాలనుకుంది. అది కూడా తక్కువ ధరకే. యశ్‌రాజ్ సంస్థ నిర్మించిన సూపర్ హిట్ సినిమాల్లో కొన్నింటిని దీపావళి సందర్భంగా మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 12 నుంచి 19 వరకూ ఈ సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్ ధర జస్ట్ 50 రూపాయిలే. మరి.. ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కు తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలం అవుతుందో చూడాలి. రండీ.. ఆనందించండీ ‘సినిమా విడుదలకు మంచి సీజన్ దీపావళి. పండగకి సినిమాను ఆనందించడం సినీ ప్రేమికులకు ఇష్టమైన ఆనవాయితీ. యశ్‌రాజ్ సంస్థ ప్రేక్షకుల ఫేవరెట్ సినిమాలను మళ్లీ పెద్ద స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే వీలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్ ప్రతినిధులు. ప్రదర్శితం కానున్న చిత్రాలు యశ్‌రాజ్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్. ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో పాటు కభీ కభీ, సిల్సిలా, దిల్ తో పాగల్ హై, వీర్ జరా, బంటీ ఔర్ బబ్లీ, రబ్నే బనాదీ జోడీ, ఏక్‌థా టైగర్, బ్యాండ్ బాజా భారాత్, సుల్తాన్, వార్, మర్దానీ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. -
'అన్నీ మారిపోయాయి.. ఆ ఒక్కటి తప్పా'
భారత చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాసిన దిల్వాలే దుల్హానియా లే జయేంగే సినిమా నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా షారూఖ్ ఖాన్, కాజోల్లకి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. 4 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డుల సునామీలు సృష్టించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఈ సినిమా ఆడుతూనే ఉంది. (25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ) నేటితో దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ చోప్రా, ప్రీతి సింగ్ పాత్రలో నటించిన మందిరా బేడీలు సినిమాతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలలో చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని మందిరా అన్నారు. జీవితం చాలా మరిపోయింది. అన్నీ మారిపోయాయి. కానీ ప్రేమకు గుర్తుగా నిలిచే ఎరుపు రంగు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అంటూ ఈ సినిమాపై తన ప్రేమను తెలియజేశారు. View this post on Instagram #25yearchallenge !!! 🤟🏽❣️ It’s wonderful to have been a part of a film that has made cinema history on many counts. 👊🏽💥I have changed a lot, life has changed a lot. But Red is still the color of LOVE ! #25yearsofddlj I want to see some Then & Nows from all of you.. @karanjohar @kajol @anaitashroffadajania @iamsrk @yrf A post shared by Mandira Bedi (@mandirabedi) on Oct 20, 2020 at 1:04am PDT A picture of me from the sets of DDLJ. It’s been 25 years!!! Was a truly special and fun experience. The memories will last for ever... #DDLJ25 @yrf pic.twitter.com/jPohN6YdFV — Uday Chopra (@udaychopra) October 20, 2020 -
25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
‘నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో’ అంటుంది ఈ సినిమాలోని సిమ్రన్ పాత్ర పోషించిన కాజోల్ పసుప్పచ్చటి చేలలో. ‘అలా నిన్ను తీసుకెళ్లాలంటే ఇంత కష్టపడటం ఎందుకూ?’ అంటాడు రాజ్ పాత్రలో ఉన్న షారుక్ ఖాన్.. అప్పటికే ఆమె కోసం లండన్ వదిలి పంజాబ్‌లోని పల్లెకు చేరుకుని ఆమె కుటుంబం ఆదరణ పొందే ప్రయత్నంలో ఉంటూ. కాజోల్ తండ్రి అమ్రిష్ పురికి తన కుమార్తెను తన ప్రాంతంలో తన బంధువర్గంలో ఇచ్చి చేయాలని కోరిక. కాని ఆమె షారుక్‌ను ప్రేమించింది. షారుక్ కుటుంబం ఏమిటో అమ్రిష్ పురికి తెలియదు. వాళ్లు ఎలాంటివాళ్లో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే కాజోల్ ప్రేమకు నో చెబుతాడు. నో చెప్పిన వెంటనే కాజోల్ షారుక్ పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటే కథే లేదు. ‘మనకు మంచీ చెడు తెలుసు. మనకు ఏది సంతోషమో దానిని ఎంచుకోగలం. ఆ ఎంచుకున్నదానిని కుటుంబంలో భాగం చేయగలం. అంతవరకు ఓపికగా ఉండగలం’ అని రాజ్, సిమ్రన్ నమ్మడం వల్లే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ భారతీయులకు అంతగా నచ్చింది. అక్టోబర్ 20, 1995లో రిలీజయ్యింది ఆ సినిమా. ఆ తర్వాత అది సృష్టించిందంతా చరిత్రే. కథ కొత్తది కాజోల్ లండన్‌లో ఉంటుంది. షారుక్ కూడా లండన్‌లోనే ఉంటాడు. కాజోల్ తండ్రి చాటు బిడ్డ. షారుక్ తండ్రిని స్నేహితుడుగా భావించే కుర్రవాడు. ఒకరికొకరు పరిచయం లేని వీళ్లిద్దరూ తమ గ్రాడ్యుయేషన్ అయిపోయాక విడివిడిగా విహారం కోసం యూరప్ యాత్రకు బయలుదేరి ట్రైన్లో పరిచయం అవుతారు. అప్పటికే కాజోల్కు పెళ్లి మాట నడిచి ఉంటుంది. పంజాబ్‌లో కుర్రాడున్నాడని తండ్రి చెప్పేసి ఉంటాడు. కాని ఆమె షారుక్‌తో ప్రేమలో పడుతుంది. షారుక్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కాని తండ్రి దీనిని అంగీకరించడు. వెంటనే కుటుంబాన్ని పంజాబ్‌కు మార్చి పెళ్లి పనులు మొదలెడతాడు. ఆమె కోసం షారుక్ పెళ్లికొడుకు స్నేహితుడిగా విడిది ఇంట్లో అడుగుపెట్టి కాజోల్ తల్లిదండ్రులను ఒప్పించి కాజోల్‌ను తనతో పాటు తీసుకువెళ్లడమే కథ. దీనికి ముందు హిందీలో వచ్చిన ‘ఏక్ దూజే కే లియే’, ‘కయామత్ సే కయామత్ తక్’ లాంటి ప్రేమ కథలు విషాదంతాలు. కాని ఇది సుఖాంతం. కుటుంబంతో పాటు సుఖాంతం. తారలు పుట్టిన వేళ బాలీవుడ్లో ఖాన్ త్రయం ఆమిర్, సల్మాన్, షారుక్ ఎస్టాబ్లిష్ అవుతున్న కాలం అది. షారుక్– కాజోల్ కలిసి అప్పటికే ‘బాజీగర్’, ‘కరణ్–అర్జున్’లలో నటించారు. కాని ఇంకా స్టార్డమ్ రాలేదు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పగ్గాలు యశ్ చోప్రా నుంచి అతని కుమారుడు ఆదిత్యా చోప్రా అందుకుంటూ మొదటిసారిగా ఒక కథ రాసి తండ్రికి వినిపించి డైరెక్ట్ చేయమన్నాడు. ‘కథ బాగుంది. నువ్వే చెయ్’ అని తండ్రి ప్రోత్సహించాడు. ఆ కథే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమాకు హీరోగా షారుక్‌ను అడిగితే అప్పటికి ‘డిఫరెంట్ రోల్స్’ చేయాలని కోరుకుంటున్న షారుక్ కాదన్నాడు. ‘నువ్వు స్టార్‌వి కావాలంటే ప్రతి స్త్రీ మనసు దోచే, ప్రతి తల్లి హర్షించే ఇలాంటి రోల్ చేయాలి. ఆలోచించుకో’ అని ఆదిత్య చెప్పాక ఒప్పుకున్నాడు. సినిమా సూపర్‌హిట్ అయ్యాక షారుక్ పదే పదే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు ఈ సినిమా ఇచ్చినందుకు. కాజోల్ కథ విన్నాక వెంటనే ఒప్పుకుంది. సినిమా రిలీజయ్యాక వీరి జోడి ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన జోడీగా నిలిచింది. అందరూ తలో చేయి ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ కథను ఆదిత్యా చోప్రా మూడేళ్లు రాశాడు. మొదట ఇది ఒక అమెరికన్, ఒక ఇండియన్ ప్రేమ కథ అనుకున్నాడు. కాని యశ్ చోప్రా సూచనతో హీరో హీరోయిన్లను ఎన్ఆర్ఐలుగా మార్చాడు. ఈ కథా తయారీలో ఆదిత్య దగ్గరి బంధువు, ఇప్పటి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పాల్గొన్నాడు. సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంగీత దర్శకులుగా జతిన్–లలిత్ సూపర్‌హిట్ పాటలు ఇచ్చారు. ఆనంద్ బక్షీ వాటిని రాశాడు. కెమెరా మన్మోహన్ సింగ్. కాస్ట్యూమ్స్ మనీష్ మల్హోత్రా. సినిమాకు టైటిల్‌ని కిరణ్ ఖేర్ సూచించింది. ‘చోర్ మచాయేంగే షోర్’ సినిమాలోని ‘లేజాయేంగే లేజాయేంగే’ పాటలోని లైన్ ఇది. టైటిల్ సూచించినందుకు ఆమె పేరును టైటిల్స్‌లో వేశారు కూడా. రిలీజయ్యాక.. ఈ సినిమా బడ్జెట్ ఆ రోజుల్లో 4 కోట్లు. కాని ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 250 కోట్లు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. ‘అందరూ పదే పదే చూసే సినిమాగా తీయాలి’ అనుకుని దర్శకుడు తీయడం వల్లే ఇది సాధ్యమైంది. ‘షోలే’ ముంబైలోని మినర్వా థియేటర్లో ఐదేళ్లే ఆడింది. కాని ఈ సినిమా లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఆడుతూనే ఉంది. 25 వారాలంటే సిల్వర్ జూబ్లీ. కాని ఈ సినిమా 2014లో వేయి వారాలు దాటింది. పాటలు.. సన్నివేశాలు కాజోల్ మీద తీసిన ‘మేరే ఖ్వాబోమే జో ఆయే’, షారుక్–కాజోల్‌ల మీద ఆవాల చేలలో తీసిన ‘తుజే దేఖాహై’, ఖవాలీ స్టైల్లో తీసిన ‘మెహందీ లాగా కే రఖ్నా’... ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. క్లయిమాక్స్‌లో కాజోల్ తండ్రి చేయి వదిలి షారుక్‌ను అందుకోవడానికి ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తే సీన్ అనేక సినిమాలలో సీరియస్‌గా, స్పూఫ్గా రిపీట్ అయ్యింది. ఈ సినిమాతోనే విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కథల్లో భాగం కావడం మొదలైంది. ఇవాళ్టికీ టీవీలో కోట్లాది మహిళా ప్రేక్షకుల, యవతీ యువకుల ప్రియమైన సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. అరుదైన గౌరవం ‘దిల్వాలే....’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూనే వస్తోంది. అయితే 25 ఏళ్ల సందర్భంగా ఓ కొత్త గౌరవం దక్కించుకుంది. లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో షారుక్, కాజోల్ పాత్రల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ యానివర్సరీని పురస్కరించుకుని ప్రకటించారు. బాలీవుడ్‌కి సంబంధించి లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ఏర్పాటు చేయనున్న తొలి విగ్రహాలు ఈ సినిమాకు సంబంధించినవే కావడం విశేషం. ‘ఇది ఈ సినిమాకు దక్కిన గౌరవం’ అని చిత్రబృందం తెలిపింది. పలు ప్రముఖ హాలీవుడ్ చిత్రాల బొమ్మల చెంత మన ‘దిల్వాలే..’ చేరనుండడం భారతీయ సినిమాకు దక్కిన మంచి గౌరవం. – సాక్షి ఫ్యామిలీ -
బెల్లంకొండపై..అరెస్ట్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తమకు చెల్లించాల్సిన రూ.3.5 కోట్లను తిరిగి ఇవ్వటంలో విఫలమయ్యారని ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2010లో యష్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ సినిమా హిందీలో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2013 బెల్లకొండ సురేష్ సిద్ధార్థ్, సమంత హీరో హీరోయిన్లుగా జబర్దస్ అనే సినిమాను నిర్మించారు. అందులో 19 సీన్లు కాపీ చేశారని ఆరోపిస్తూ యష్‌రాజ్ ఫిలింస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సినిమా ప్రదర్శనను నిలిపేసింది. అయితే జబర్దస్త్ సినిమా నిర్మాణంలో ఉండగానే టెలివిజన్ శాటిలైట్ టెలీకాస్ట్ రైట్స్‌ను రూ.3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ విక్రయించారు. యష్‌రాజ్ ఫిలింస్ ఫిర్యాదు మేరకు సినిమా ప్రదర్శన నిలిపేయటంతో పాటు టెలివిజన్‌లోనూ టెలికాస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సదరు టీవీ ఛానెల్‌కు ఆ మొత్తాన్ని బెల్లంకొండ సురేష్ తిరిగి చెల్లించాల్సి ఉన్నప్పటికి ఆరేళ్లుగా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో ఛానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. అయితే బెల్లంకొండ తీసుకున్న రూ.3.5 కోట్ల మొత్తం ప్రస్తుతం రూ.11.75 కోట్లకు చేరింది. ఈ మేరకు కోర్టు బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. -
ఉత్కంఠ భరితంగా ‘వార్’ టీజర్
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్స్ హృతిక్‌రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న ‘వార్’ చిత్రం టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో వాణికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. టీజర్ చూస్తుంటే సినిమా ప్రేమికులకు ఓ భారీ కానుకలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ టీజర్లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ఒకరికొకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వీరోచితంగా కనిపిస్తున్నారు. ఈ దృష్యాలు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎవరికి ఎవరు తీసిపోకుండా ఇద్దరు సమవుజ్జీవులుగా పోరాడుతూ కనిపిస్తున్నారు. చిత్ర డైరెక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాకు వార్ అనే టైటిల్ సరిగా ప్రతిబింభిస్తుందని, ఇద్దరు స్టార్లను ఒకే సినిమాలో విలన్‌లాగా చూపించాలంటే ఈ టైటిల్ మాత్రమే సరిపోతుందని అనిపించిందన్నారు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకులకు ముందుకు రానుంది. -
నా భర్తను ప్రతిరోజూ తిడతాను..
సాక్షి, ముంబై: ‘ఔను నా భర్తను ప్రతిరోజూ తిడతాను. దూషిస్తాను. కానీ ద్వేషంతో కాదు. ప్రేమతో. అతను ప్రేమతో చేసే విషయాలు చూసి తిడతాను. అందులో ప్రేమ తప్ప ద్వేషం లేదు. నేను ఎవరినైనా తిట్టానంటే.. వారిని నిజంగా ప్రేమించినట్టు’ అంటోంది బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ప్రముఖ నిర్మాత, యశ్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యచోప్రాను నాలుగేళ్ల కిందట రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారికి అధీర అనే రెండేళ్ల కూతురు ఉంది. పెళ్లి, సంతానం నేపథ్యంలో సినిమాల నుంచి విరామం తీసుకున్న రాణి ఇప్పుడు ‘హిచ్కీ’ అనే వినూత్న సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలుకరించబోతోంది. మాట్లాడుతున్నప్పుడు ‘హిచ్క్క్’ అంటూ వింత శబ్దం చేసే ఓ స్కూల్ టీచర్ ఏవిధంగా తన విద్యార్థులను తీర్చిదిద్దిందనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా రాణి ముఖర్జీ తాజాగా నేహా ధూపియా చాట్‌లో ముచ్చటించింది. సెలబ్రిటీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, వైవాహిక జీవితం, తమ అనుబంధం గురించి వివరించింది. ‘ముఝ్సే దోస్తీ కరోగీ’ సినిమా సమయంలో తొలిసారి ఆదిత్య చోప్రాతో పరిచయం అయిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని రాణి తెలిపింది. తనకు, ఆదిత్యకు పెద్దగా ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలు ఇష్టం ఉండవవని, అందుకే కేవలం 12మంది సమక్షంలో నిరాడంబరంగా తమ పెళ్లి జరిగిందని రాణి వెల్లడించింది. అందరూ సెలబ్రిటీ కిడ్స్ తరహాలో తమ చిన్నారి అధిరా ఫొటోలు మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించడం తమకు నచ్చదని, అందుకే తనను ఎక్కువగా ఫొటోలు తీసేందుకు ఇష్టపడమని చెప్పింది. -
హిచ్కీ టీచర్.. రాణి ఈజ్ బ్యాక్!
‘‘నాకు తెలిసి మాట్లాడడంలో ఇబ్బంది పడేవారు టీచర్లు అయినట్టు ఎక్కడా లేదు’’ అంటాడు ప్రిన్సిపాల్, తమ స్కూల్లో టీచర్ ఉద్యోగం కోసం వచ్చిన హీరోయిన్‌తో! ‘‘కానీ నాకు టీచర్ అవ్వాలన్నదే డ్రీమ్’’ అంటుంది హీరోయిన్. హీరోయిన్కేమో మాట్లాడడం సరిగ్గా రాదు. మాట్లాడలేదు. టోరెట్ సిండ్రోమ్ ఆమెకు. నత్తిలాంటి ఒకరకం లోపం. ఎక్కిళ్లు వచ్చినట్టుగా ఉంటూ, మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. అలాంటి ఒక టీచర్ పాఠాలు చెప్తే విద్యార్థులు ఎలా ఉంటారు? అసలు ఆమె మాటను పట్టించుకుంటారా? ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఈ కథతో హిచ్కి (ఎక్కిళ్లు అని..) అనే ఓ సినిమా వస్తోంది. ఆ హీరోయిన్ పాత్రలో కనిపిస్తోంది ఎవరో కాదు.. మన రాణి ముఖర్జీ. కెరీర్ రెండో దశలో థ్రిల్లర్స్‌తో మెప్పించిన ఆమె, కూతురు పుట్టాక సినిమాలకు దూరమయింది. ఇక ఇప్పుడు మళ్లీ అన్నీ సెట్ చేస్కొని, ఒక కొత్త కథాంశంతో హిచ్కీ అంటూ వచ్చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకుడు. నటనలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న రాణి, ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంటూ, ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 23, 2018న ఈ చిత్రం విడుదల కానుంది. -
'బాహుబలి-2' హిందీ హక్కులకు భారీ ఆఫర్!
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి-2' షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది. మండే ఎండల మధ్య షూటింగ్ స్పాట్లో కూలర్లు, ఏసీలు ప్రోడక్షన్ టీమ్ చిత్రీకరణను కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. ముందుగా అనుకున్నట్టే వచ్చే ఏడాది ఏప్రిల్ 14న 'బాహుబలి: ద కన్‌క్లూజన్'ను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కృతనిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ నాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ మండే ఎండల్లోనూ షూటింగ్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి మధ్య హై యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బాహుబలి-2' చిత్రయూనిట్‌కు రాజమౌళి ఒక నెల సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ సెలవు ముగిసిన వెంటనే సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ బ్రేక్ తర్వాతనే సినిమాలో ప్రధాన యాక్షన్ ఘట్టమైన మహాయుద్దాన్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. రూ. 150 కోట్లకు హిందీ రైట్స్? 'బాహుబలి-2' హిందీ వెర్షన్ రైట్స్ పూర్తిగా ప్రఖ్యాత బాలీవుడ్ చిత్రనిర్మాణ యష్‌రాజ్ ఫిలిమ్స్‌కు అమ్మాలని ఆర్కా మీడియా భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులు, హిందీ వెర్షన్ హక్కులు, శాటిలైట్ హక్కుల కోసం మొత్తంగా రూ. 150 కోట్లు చెల్లించడానికి యష్‌రాజ్ ఫిలిమ్స్ ముందుకొచ్చినట్టు చెప్తున్నారు. 'బాహుబలి: ద బిగినింగ్' హిందీ వెర్షన్ రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి పలు రికార్డులను బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. -
దుమ్మురేపుతోన్న 'సుల్తాన్' ట్రైలర్
'Wrestling is not a sport. Its about fighting what lies within' అంటూ తన తాజా చిత్రం 'సుల్తాన్' తో దూసుకొస్తున్నాడు బాలీవుడ్ 'బాక్సాఫీస్ కిల్లర్' సల్మాన్ ఖాన్. ఈద్ ను పురస్కరించుకుని జులై 6న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. అయి, సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. రిలీజ్ అయిన ఏడు గంటల్లోనే 'సుల్తాన్' ట్రైలర్ కు దాదాపు ఏడు లక్షల హిట్లు వచ్చాయి. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉందికాబట్టి అత్యధిక హిట్లు సాధించే ట్రైలర్ గా రికార్డుకొట్టే అవకాశమూ ఉంది. సుల్తాన్.. హరియాణాకు చెందిన ఓ రెజ్లర్ నిజజీవితగాథ. ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సుల్తాన్ అలీ ఖాన్ గా 'కండల' విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సల్మాన్ ఖాన్(ట్రైలర్ ను బట్టి). తొలిసారిగా అనుష్క శర్మ సల్లూతో జోడీకడుతోంది. రణదీప్ హుడా, అమిత్ సాథ్ ఇతర ముఖ్యనటులు. సంగీతం విశాల్ శేఖర్.